సంపాదకీయం

వెళ్లగొట్టిన మెక్సికో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికోలో నివసిస్తుండిన మూడువందల పదకొండు మంది మన దేశస్థులను బలవంతంగా మన దేశానికి తరలించడం విచిత్రమైన వ్యవహారం. ఈ భారతీయులందరూ అక్రమంగా తమ దేశంలో ‘చొఱబడి’ గత కొన్ని నెలలుగా తిష్ఠవేసి ఉన్నట్టు మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. ఇంతమంది భారతీయులు ఇలా అక్రమంగా మెక్సికోలోకి ప్రవేశించడం అవమానకరమైన విపరిణామం. ఈ చొఱబాటుదారులు ‘మెక్సికో-అమెరికా’ సరిహద్దును దాటి అమెరికాలోకి వెళ్లి స్థిరపడిపోవడానికి ప్రయత్నించారని మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. వీరందరినీ విమానం ఎక్కించి ఢిల్లీకి తిప్పిపంపినట్టు మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. ‘తొలుక’ నగరంలో విమానమెక్కిన ఈ మూడు వందల పదకొండు మంది వెంట, వీరిని మనదేశంలో దించడానికి వీలుగా అరవై మంది మెక్సికో ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడ విమానం ఎక్కారట. మెక్సికో ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారం అనేక జాతీయ అంతర్జాతీయ వైపరీత్యాలను స్ఫురింప చేస్తోంది. ఇలా అమెరికాలోకి ప్రవేశించి అక్కడే స్థిరపడిపోవాలని భావించిన ఈ భారతీయులు ఒక్కొక్కరు దాదాపు ఇరవై అయిదు లక్షల రూపాయలను ఖర్చుచేశారన్నది విస్మయం కలిగించవలసిన వాస్తవం. కొంతమంది ముప్పయి లక్షల రూపాయలు కూడ ఖర్చుచేశారట. ఈ డబ్బును ఈ ‘అక్రమ అమెరికా ప్రయాణీకులు’ తమను మన దేశం నుంచి తరలించుకొనిపోయిన ‘దళారీ’లకు చెల్లించారట. మెక్సికోలోకి చేరిన తరువాత కొన్ని వారాలలోగా లేదా నెలలలోగా ఈ ‘యాత్రికుల’ను అమెరికాలోకి ప్రవేశపెట్టగలమన్నది ‘దళారీ’లు ఇచ్చిన హామీ! అమెరికా ప్రభుత్వం చేస్తున్న దౌత్య దౌర్జన్యానికి భయపడి మెక్సికో ప్రభుత్వం ఈ భారతీయులను పట్టుకొని మన దేశానికి తిప్పి పంపింది. పట్టుబడని ‘అమెరికా నివాస వ్యామోహగ్రస్తులైన’ భారతీయులు మెక్సికోలో ఇంకా ఎన్ని వేల మంది ఉన్నారో? ఎవరికి తెలుసు! ఇలా ముప్పయి లక్షల రూపాయలను ఖర్చుపెట్టి అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడ దలచిన మన దేశపు ‘చెడబుట్టిన’ పౌరుల వికృత మనస్తత్వం ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన వైపరీత్యం. ఈ ‘అక్రమ ప్రస్థానకర్తలు’ ఇక్కడే ఉండి ఈ ముప్పయి లక్షల రూపాయలతో వ్యాపారం చేసుకొని ఉండవచ్చు, ఉత్పత్తిని చేసి ఉండవచ్చు! ఏమీ చేయకపోయినా ఆ డబ్బుతో హాయిగా జీవించి ఉండవచ్చు. కానీ ఈ అత్యాశాపరులు, దుర్వాంభాగ్రస్తులు ముప్పయి లక్షల రూపాయలు వెచ్చించి అమెరికాకు వెళ్లిపోవాలని భావించారు, అక్కడికి వెడితే ముప్పయి కోట్ల లేదా మూడువందల కోట్ల రూపాయలను సంపాదించడం బహుశా వీరి అక్రమ లక్ష్యం కావచ్చు! కొనే్నళ్ల తరువాత తిరిగి వచ్చే లక్ష్యంతోకాని, అక్కడే ఉండిపోయి మాతృభూమి ముఖం మళ్లీ చూడరాదన్న లక్ష్యంతో కాని అమెరికా, ఇతర విదేశాలకు వెళ్లవచ్చు. కానీ ‘వలస’-ఇమ్మిగ్రేషన్- నియమాలను ‘నిష్క్రమణ’- ఎమ్మిగ్రేషన్- నిబంధనలను పాటించి అలా తరలిపోవాలి. ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి సక్రమ పద్ధతిలో ‘ప్రవేశ అనుమతి పత్రాల’- ‘వీసా’ల-ను పొందాలి! ఇలా దొంగచాటుగా దేశం నుంచి జారుకొని ఇతర దేశాలలోకి చొఱబడేందుకు యత్నిస్తున్నవారు మన దేశానికి అపకీర్తి తెస్తున్నారు. వీరందరూ శిక్షార్హులు...
దళారీలకు డబ్బు చెల్లింపుల గురించి జరిగిన ప్రచారం నిజమైతే ఈ ‘మూడువందల చిల్లర’ మంది తొంబయి కోట్ల రూపాయల దాకా ఖర్చుపెట్టారు. ఇదంతా ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ-గా మారి విదేశాలకు చేరుతోంది. సాలీనా ఎన్ని వేల కోట్లు లేదా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇలా దేశం నుంచి అక్రమంగా నిష్క్రమిస్తోందన్నది ఆందోళన కలిగించవలసిన వ్యవహారం. ఇలా అక్రమంగా దేశం నుంచి వెళ్లిపోతున్నవారిని, డబ్బును, దళారీలను, నేర ప్రక్రియను సకాలంలో పసికట్టి నిరోధించలేకపోవడం మన ‘నిఘా వ్యవస్థ’లో నిహితమై ఉన్న ‘చేతకానితనం’కావచ్చు! కాకనూ పోవచ్చు! కానీ విదేశాలనుంచి మన ప్రభుత్వాలు ‘కొండలను తవ్వి, పర్వతాలను పెకలించి’, ఆర్భాటపు కోలాహల విన్యాసాలను ప్రదర్శించి తరలించుకొని వస్తున్న ‘పెట్టుబడుల’- ఎఫ్‌డిఐ- కంటె పది రెట్లుగా ఇంకా ఎక్కువగా నల్ల డబ్బు దేశంనుండి బయటికి వెళ్లిపోతోందన్న ప్రచారం మాత్రం అతార్కికం కాదు! ఈ ‘సొమ్ము’ను దేశం బయటికిపోకుండా నిరోధించగలిగితే, దాన్ని ‘పెట్టుబడి’గా వినియోగించవచ్చు, దేశీయ వాణిజ్య సంస్థలను పెట్టుబడులకోసం ‘‘దేబిరించ’’వలసిన అవసరమే ఉండదు. మన దేశంనుంచి ఇతర దేశాలలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నవారిని ఆయా దేశాల ప్రభుత్వాలు పసికట్టి పట్టుకొని మన దేశానికి తిప్పిపంపుతుండడం నడుస్తున్న చరిత్ర. ఈ మన దేశపు ‘పౌరుల’ను ఆయా విదేశాల ప్రభుత్వాలు నిర్బంధించి కఠినంగా శిక్షిస్తున్నాయి. కానీ మన దేశంలోకి చొఱబడిన దాదాపు రెండు కోట్ల మంది అక్రమ ప్రవేశకులను మాత్రం మన ప్రభుత్వం ఇలా మన దేశంనుంచి వెళ్లగొట్టలేకపోతోంది. దశాబ్దుల తరబడి వారందరూ ఇక్కడే తిష్ఠవేసి ఉన్నారు! ఇదంతా మన దేశపు మెతకతనమన్నది దశాబ్దుల తరబడి జరుగుతున్న అంతర్జాతీయ ప్రచారం...
అమెరికా భూభాగం మన దేశపు భూభాగంకంటె మూడు రెట్లు పెద్దది. అమెరికా జనాభా మన జనాభాలో నాలుగవ వంతుకంటె తక్కువ. అందువల్ల ఎంతమంది విదేశీయులు వచ్చి అమెరికాలో స్థిరపడినప్పటికీ అమెరికాకు ‘జనాభా ఉల్బణం’ సమస్య ఉండబోదు. నిజానికి రెండు శతాబ్దుల తరబడి ఐరోపానుంచి అమెరికాలో చొఱబడిన స్వదేశీయులను హత్యచేసి సామూహికంగా నిర్మూలించినవారు అమెరికాలో స్వదేశీయులుగా స్థిరపడడం క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దివరకు నడచిన చరిత్ర. ఇలా అమెరికాలోని ‘స్వజాతి’ని- రెడ్ ఇండియన్ తదితర ‘తెగల’ను- హత్యచేసిన ఐరోపావారి వారసులే ప్రస్తుతం అమెరికాలోని అత్యధికులు. అందువల్ల ‘చొఱబడి’శతాబ్దుల తరబడి అమెరికాలో తిష్ఠవేసి ఉన్న ఐరోపా సంతతి వారికి చొఱబాటుదారులను నిరోధించే నైతిక అధికారం లేదు. అయినప్పటికీ చొఱబాటుదారులవల్ల తమ దేశ భద్రతకు భంగం కలిగిపోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్భాటంగా ఆందోళన చేస్తున్నాడు. అమెరికానుంచి మెక్సికోకి, మెక్సికోనుంచి అమెరికాలోకి ఇటీవలి కాలం వరకూ నిర్నిరోధంగా రాకపోకలు జరిగాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గత రెండున్నర ఏళ్లుగా ఈ రాకపోకలను నియంత్రిస్తోంది. మెక్సికో వైపునుంచి వచ్చిపడుతున్న అక్రమ ప్రవేశకులను నిర్బంధిస్తోంది. ఇలా నిర్బంధ గృహాలలోని కుటుంబాలకు చెందిన భార్యాభర్తలను వేఱువేఱు జైళ్లలో ఉంచుతున్నారు. చిన్నపిల్లలను తల్లిదండ్రులనుంచి విడదీసి ఇతర జైళ్లలో ఉంచడం ద్వారా ట్రంప్ ప్రభుత్వం అక్రమ ప్రవేశకుల కుటుంబాలకు ‘గొప్ప’ గుణపాఠం చెప్పింది. ఈ విచిత్ర నిర్బంధానికి రెండువేల మంది భారతీయులు కూడ గురి అయిఉన్నట్టు ప్రచారమైంది. మెక్సికో ఉత్తరపు సరిహద్దును, అమెరికా దక్షిణ, నైరృతి సరిహద్దును కలుపుతూ అరిజోనా ఎడారి వ్యాపించి ఉంది. గత జూన్‌లో ఈ ఎడారిగుండా అమెరికాలోని ‘అరిజోనా’ ప్రాంతంలోకి చొఱబడిన ఒక పంజాబీ భారతీయ మహిళను భద్రతాదళాలు పసికట్టి తరిమాయట. తప్పించుకొని ఆరేళ్ల కుమార్తెతో కలసి పారిపోయిన ఆ పంజాబీ మహిళ, ఆ పాప దప్పి తీర్చడంకోసం నీరు దొరకక కడగండ్లకు గురైందట. గురుప్రీతికౌర్ అన్న ఆ పసిపాప దప్పితోను వడదెబ్బతోను తల్లడిల్లి మరణించడం అప్పుడు ప్రకంపనాలను సృష్టించింది! మెక్సికో- అమెరికా సరిహద్దు పొడవునా ఉక్కు గోడ- స్టీల్ వాల్-ను నిర్మించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది...
దేశాల సరిహద్దులు చెఱగిపోవాలని, ‘గోడలు’కూలిపోవాలని ప్రపంచమంతా ‘పుడమిపల్లె’గా మారిపోవాలని, వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్-దళారీలు గత పాతికేళ్లుగా ప్రచారం చేశారు. కానీ అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రస్తుతం తమ దేశాల చుట్టూ కొత్త గోడలను నిర్మించుకుంటున్నాయి. వాణిజ్య ప్రపంచీకరణ వైఫల్యానికి వైపరీత్యానికి ఇదంతా ఒక సాక్ష్యం మాత్రమే! సహస్రాబ్దులపాటు ప్రపంచంలోని వివిధ దేశాల శరణార్థులకు మన దేశం ఆశ్రయం ఇచ్చింది. మన దేశం ఇలా సాంస్కృతిక ప్రపంచీకరణకు ఆధ్వర్యవం వహించడం చరిత్ర. ఈ హైందవ జాతీయ సంస్కారం పుడమిని ‘పల్లె చేయలేదు’ పుడమిని ఇల్లుచేసింది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం-వసుధైక కుటుంబమ్-అని చాటింది. అందువల్లనే భారత్ ‘దురహంకార విశ్వవిజేత’కావాలని కలలు కనలేదు. మానవీయ విశ్వగురువు అయింది!