సంపాదకీయం

వాణిజ్య సాహసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్నేయ ఆసియా దేశాల కూటమితోను, చైనా తదితర సంపన్న దేశాలతోను ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ ఒప్పందం కుదుర్చుకొనడానికి మన ప్రభుత్వం నిరాకరించడం జాతీయ ప్రయోజన పరిరక్షణకు అనుగుణమైన పరిణామం! వ్యూహాత్మకంగాను దౌత్యపరంగాను దక్షిణ, పూర్వ ఆసియా దేశాల మధ్య మన దేశం ‘ఒంటరి’ కావడానికి ఈ నిర్ణయం దోహదం చేయడం సమాంతర విపరిణామం! ఇలా ‘ఒంటరి’ కాగల ప్రమాదం ఉన్నప్పటికీ చైనావారి నాసిరకం, అవసరం లేని వస్తువులు మన దేశాన్ని ముంచెత్తకుండా నిరోధించడానికై మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ప్రపంచంలోని వివిధ ప్రముఖ దేశాలు తమ జాతీయ వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించుకొనడానికి చర్యలకు పూనుకొని ఉండడం సోమవారం నాటి మన ప్రభుత్వ నిర్ణయానికి నేపథ్యం. మన ప్రధాని నరేంద్ర మోదీ మూడురోజుల పాటు థాయ్‌ల్యాండ్‌లో జరిపిన పర్యటనకు పరాకాష్ఠ సోమవారం నాటి నిర్ణయం. ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’- రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్- ర్సెప్- శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య వ్యవస్థ- స్వేచ్ఛా వాణిజ్యపు ఒప్పందం- ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్-లో మన దేశం చేరినట్టయితే అది మన దేశంలోని వ్యవసాయదారుల, వ్యాపారుల, వృత్తి నిపుణుల, పారిశ్రామికుల, వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కాగలదన్నది మోదీ చెప్పిన మాట. ఈ భాగస్వామ్యం వ్యవస్థీకృతం అయినట్టయితే సభ్య దేశాలన్నీ వాణిజ్యపరంగా ఒకే సమీకృత విభాగంగా ఏర్పడుతాయి. ఫలితంగా పదహారు సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యంలో దిగుమతి పన్నులు రద్దయిపోతాయి. అంటే మిగిలిన పదహారు ఆసియా దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువులపై మన ప్రభుత్వం ఎలాంటి పన్నులు కాని విధించజాలదు. ఫలితంగా ఈ దేశాల నుంచి ప్రధానంగా చైనా నుంచి వెల్లువెత్తుతున్న వస్తువుల ధరలు మన దేశంలో మరింతగా తగ్గిపోతాయి. ఫలితంగా మన దేశీయ పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తుల కంటె తక్కువ ధరలకు చైనీయ ఉత్పత్తులు మన దేశపు విపణివీధుల్లో లభిస్తాయి. అందువల్ల జనం స్వదేశీయ ఉత్పత్తులను కాక చైనీయ ఉత్పత్తులను అధికంగా కొనే ప్రమాదం సంభవిస్తుంది. ఫలితంగా మన వ్యవసాయం, పరిశ్రమలు తీవ్ర నష్టాలకు గురవుతాయి. క్రమంగా అవి మూతపడే ప్రమాదం ఉంది. ఇలా మూతపడిన తరువాత చైనా సంస్థలు తమ వస్తువుల ధరలను విపరీతంగా పెంచగలవు. స్వదేశీయ ఉత్పత్తులు లభించవు గనుక మన ప్రజలు విధి లేక చైనీయ ఉత్పత్తులను కొనుగోలు చేయవలసి ఉంటుంది- భయంకరమైన ధరలకు! ఇదంతా దశాబ్దుల కాలవ్యవధిలో జరుగగల ‘విపణి’ విపరిణామ క్రమం. ఇదే సూత్రం జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల వస్తువులు మన దేశాన్ని ముంచెత్తడానికి దోహదం చేయగలదు..
అందువల్ల ఈ ప్రాంతీయ వాణిజ్య ఒప్పందానికి దూరంగా ఉండడానికి నిర్ణయించినట్టు మోదీ థాయ్‌ల్యాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ప్రకటించడం దౌత్య సాహసం. మన దేశ ప్రజలు ప్రశంసించదగిన పరిణామం. చైనా ‘విస్తరణ’ను నిరోధించడం లక్ష్యంగా 1967లో ఏర్పడిన ఆరుదేశాల ‘ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి’- అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్- ‘ఆసియాన్’ ఈ ప్రాంతంలోని పదిదేశాలకు విస్తరించడం తరువాతి చరిత్ర. చైనా పట్ల గల సైద్ధాంతిక వ్యతిరేకత ఈ ‘కూటమి’ ఏర్పాటుకు ప్రాతిపదిక. ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థకు చైనా ప్రతీక. బహుళపక్ష ప్రజాస్వామ్య వైవిధ్య సమాజాలుగా సభ్య దేశాలు ఏర్పడాలన్నది ‘కూటమి’ లక్ష్యం. అందువల్లనే ‘పాల్‌పాట్ హెంగ్ సామరిగ్’ కమ్యూనిస్టు నియంతృత్వం కొనసాగిన 1970వ, 1980వ దశకాలలో కంబోడియా ఈ కూటమి నుంచి బయటకు వెళ్లింది. వియత్నాంలో బహుళపక్ష ప్రజాస్వామ్యం వికసించనప్పటికీ చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వియత్నాం సమాజంలో నిహితమై ఉంది. వియత్నాంకు తూర్పుగాను చైనాకు దక్షిణంగాను విస్తరించిన ఉన్న సముద్ర జలాల గురించి ప్రత్యేక సముద్ర జల వాణిజ్య మండలాల- ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్స్-ను ఏర్పాటు చేసుకొనడం గురించి వియత్నాంకు చైనాకు మధ్య వివాదం కొనసాగుతోంది. మన దేశంతో ‘సైనిక సహకారపు’ ఒప్పందం కుదుర్చుకొనడానికి సైతం వియత్నాం యత్నించడం చరిత్ర. ఇతర దేశాలతో కలసి ‘సైనిక కూటమి’ ఏర్పాటు చేయడం మన దేశపు వౌలిక స్వభావానికి విరుద్ధం. అందువల్ల ఈ కూటమి ఏర్పడలేదు. ఆగ్నేయ ఆసియా ప్రాంతంలోని థాయ్‌ల్యాండ్, బర్మా, మలేసియా, సింగపూర్, ఇండోనేసియా, బ్రూనీ, కంబోడియా, లావోస్, వియత్నాం దేశాలకు ‘ఆసియాన్’లో భాగస్వాములు.
‘ఆసియాన్’, మన దేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’- స్వేచ్ఛా వాణిజ్యం- ఒప్పందం కోసం గత ఏడు సంవత్సరాలుగా చర్చలను కొనసాగిస్తున్నాయి. ఇపుడు మన దేశం తప్ప మిగిలిన పదహైదు దక్షిణ, పూర్వ ఈశాన్య ఆసియా దేశాలు ఈ భాగస్వామ్య ఒప్పందాన్ని అంగీకరించాయన్నది జరుగుతున్న ప్రచారం. ఇది కార్యాచరణకు వచ్చినట్టయితే పరస్పర రాజకీయ, దౌత్య, సైద్ధాంతిక, చారిత్రక వైరుధ్యాలున్న చైనా, జపాన్‌లు ఈ సమీకృత వాణిజ్య మండలంలో భాగస్వాములు అవుతాయి. అలాగే దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకూ చైనాకు మధ్య దశాబ్దులుగా వాణిజ్య ఆధిపత్య సమరం, దౌత్య యుద్ధం నడుస్తున్నాయి. ఈ కూటమిలోని అనేక దేశాలతో చైనాకు సముద్రస్థ ద్వీపాల గురించి సార్వభౌమ అధికార వివాదాలు నడుస్తున్నాయి. చైనాకు జపాన్‌కు మధ్య ‘శంకాకూ’ ద్వీప సముదాయం గురించి దశాబ్దుల తరబడి దౌత్య యుద్ధం నడుస్తోంది. అనేకసార్లు ఉభయ దేశాల నౌకాదళాలు పరస్పరం తలపడడానికి రంగం సిద్ధం కావడం కూడ చరిత్ర. చైనాకు తూర్పుగాను, జపాన్‌కు దక్షిణంగాను విస్తరించిన సముద్ర ప్రాంతంలో చైనా ‘రక్షణ గగనాన్ని’ ఏర్పాటు చేయడం కూడ చైనాకు జపాన్ తదితర తూర్పు ఆసియా దేశాలకు మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఈ ‘రక్షణ గగనం’లోకి తమ అనుమతి లేకుండా ఇతర దేశాల యుద్ధ విమానాలు ప్రవేశించరాదన్నది చైనా విధించిన నిబంధన.. ఈ నిబంధనను ప్రాంతీయ దేశాలు మాత్రమే కాక అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు సైతం ఉల్లంఘించాయి. ఇలా పదిహేను దేశాల మధ్య వైరుధ్యాలు నిహితమై ఉన్నాయి. ఇలాంటి దేశాలు ఒకే సమీకృత వాణిజ్య మండలంగా ఎలా కొనసాగుతాయన్నది ఉత్కంఠకు ప్రాతిపదిక!
ఏమైనప్పటికీ మన దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక మైత్రిని ‘ఆసియాన్’లోని దాదాపు అన్ని దేశాలూ కొనసాగిస్తున్నాయి. జపాన్‌తో కూడ మనకు సన్నిహిత మైత్రి కొనసాగుతోంది. జపాన్, దక్షిణ కొరియాలు వాణిజ్య పారిశ్రామిక కలాపాలు సాగిస్తున్నాయి కూడ! ‘పూర్వ దిశా వీక్షణం’ లుక్ ఈస్ట్- అన్న మన విధానం ‘పూర్వ దిశా కార్యాచరణ’- యాక్ట్ ఈస్ట్-గా పరిణతి చెందడం గత ఐదేళ్ల చరిత్ర. కానీ ఈ మన కార్యాచరణను నిరోధించడానికి చైనా ప్రక్రియను ఆరంభించిదన్నది కూడ బ్యాంకాక్ సమావేశం ద్వారా మరోసారి ధ్రువపడింది. అందువల్ల మన దౌత్యం కూడ మరింత పదునెక్క వలసి ఉంది. ‘ర్సెప్’లో చేరకపోవడం ఈ ‘పదునెక్కడం’లో సగం మాత్రమే! చైనా వస్తువుల దిగుమతులను సర్వ సమగ్రంగా నిషేధించడం మిగిలిన ‘సగం’ కాగలదు! ఇలా నిషేధించడానికి ఇప్పుడైన మన ప్రభుత్వం పూనుకోవాలి...