సంపాదకీయం

‘మాధ్యమ’ వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది కేవలం తెలుగుభాష మనుగడకు సంబంధించిన సంక్షోభం కాదు. ఇది భారతీయ భాషల సమష్టి అస్తిత్వ పరిరక్షణకు సంబంధించిన వ్యవహారం. ప్రాథమిక, మాధ్యమిక విద్యాబోధన మాధ్యమ భాషను మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న విచిత్ర విన్యాసాలను ఈ ప్రాతిపదికపై నిర్ధారణ చేయవలసి ఉంది. ఈ విచిత్ర విన్యాసాలు ఇప్పటివి కావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సైతం ప్రదర్శించినవి. మాతృభాషను, భారతీయ మాతృభాషలను పరిరక్షించి పెంపొందించాలన్న వౌలిక సూత్రాన్ని వ్యతిరేకిస్తున్న వారు లేరు. మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమ నిర్వాహకులు, ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, ప్రతిపక్ష రాజకీయ వేత్తలు అందరూ ముక్తకంఠంతో తెలుగుభాషను అవిరళంగా, శాశ్వతంగా బతికించుకోవడానికై కృషి జరగాలని ఘోషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు సైతం ఇవే మాటలను ఇపుడు కూడ వల్లెవేస్తున్నారు. కానీ ప్రభుత్వ కృషి మాత్రం వ్యతిరేక దిశలో జరుగుతోంది. బడిపిల్లలకు తెలుగు వ్రాయడం, చదవడం వీలుకాని పరిస్థితిని ఏర్పాటు చేస్తోంది. ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో బోధనకు గురయ్యే విద్యార్థులు ఆ తర్వాత స్నాతకోత్తర తరగతుల వరకూ ఆంగ్ల మాధ్యమంలోనే చదవడం ఖాయం. ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకూ తెలుగును కేవలం ఒక ‘పాఠ్యాంశం’-సబ్జెక్ట్-గా బోధించడం వల్ల, మిగిలిన పాఠ్యాంశాలను ఆంగ్లంలో బోధించడం వల్ల బాలబాలికలకు తెలుగు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. పెరిగి పెద్దయిన తర్వాత వారికి తెలుగు అక్షరాలు గుర్తుండవు, గుణింతాలు, ఒత్తుల పట్ల వారికి ధ్యాస ఉండదు. ప్రభుత్వేతర పాఠశాలల్లో ‘కేజీ నుంచి పీజీ వరకూ’ ఆంగ్ల మాధ్యమంలో చదివిన వారికి తెలుగు వ్రాయడం, చదవడం రాని పరిస్థితి తెలుగు ప్రాంతంలోను, భారతీయ మాతృభాషలను చదవడం, వ్రాయడం రాని దుస్థితి దేశంలోని అన్ని ప్రాంతాల్లోను ఇప్పటికే నెలకొని ఉంది. వివిధ ప్రాంతాల్లో భారతీయ భాషల మాధ్యమంగా, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి మాత్రమే ఈ భాషలలో వ్రాయడం, చదవడం వీలవుతుంది. ఇంతవరకూ భారతీయ భాషలు ఇంకా బతికి ఉండడానికి కారణం ఈ భాషల మాధ్యమంగా కొన్ని పాఠశాలల్లోనైనా ఇప్పటికీ బోధన జరుగుతుండడం. అందువల్ల కనీసం ఎనిమిదవ తరగతి వరకైనా దేశమంతటా అన్ని పాఠశాలల్లోను భారతీయ భాషల మాధ్యమంగా మాత్రమే బోధన జరగాలి. అలా జరిగినపుడు మాత్రమే తెలుగు, ఇతర భారతీయ భాషలు భవిష్యత్‌లో బతికి బట్టకట్టడానికి వీలుంది! ఆంగ్లభాషను ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకూ కేవలం ఒక పాఠ్యాంశం-సబ్జెక్ట్-గా మాత్రమే బోధించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బోధన’ మాధ్యమ ప్రణాళిక దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఎనిమిదవ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమంలో చదివినవారు ఆ తర్వాత కూడ ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతారు, భారతీయ భాషల మాధ్యమంగా వారు చదవబోరు. ఆరవ తరగతి వరకూ మాత్రమే ఆంగ్ల మాధ్యమ బోధనకు గురైనప్పటికీ తరువాతి తరగతులను వారు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే చదువుతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నిర్ణయం వల్ల ఒకటవ తరగతి నుంచి స్నాతకోత్తర- పోస్ట్ గ్రాడ్యుయేషన్- స్థాయి వరకూ ఆంగ్ల మాధ్యమ బోధన శాశ్వతంగా వ్యవస్థీకృతం అవుతుంది. ప్రభుత్వేతర, ‘వాణిజ్య’- కార్పొరేట్ పాఠశాలల్లో ఇదివరకే తెలుగు మాట్లాడే పిల్లలను కఠినంగా శిక్షించారు, శిక్షిస్తున్నారు. తెలుగు మాత్రమే కాదు, ఏ భారతీయ భాషను కూడ పాఠశాల ప్రాంగణంలో మాట్లాడరాదన్నది వాణిజ్య పాఠశాలల్లో విధిస్తున్న నిబంధన. కేంద్ర స్థాయిలో హిందీభాష, ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ భాషలు వ్యవహార భాషలు కావాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. అంటే పాఠశాలల్లో సైతం బోధన మాధ్యమ భాష ఏదైనప్పటికీ తెలుగు ప్రాంతాల్లో తెలుగు, వివిధ ప్రాంతాల్లో ఆయా ప్రాంతీయ మాతృభాషలు వ్యవహార భాషలు! అంటే ‘పాలన’ భాషలు. సమాజ సమష్టి వ్యవహారం ‘పాలన’! అందువల్ల ఆంగ్ల మాధ్యమ బోధన జరుగుతున్న ‘దోచుకునే’ వాణిజ్య పాఠశాలల్లో సైతం ఆంగ్లం బోధన వరకే పరిమితం కావాలి. ఆ పాఠశాలల పాలన, నిర్వహణ వ్యవహారాలు తెలుగులోను, భారతీయ భాషల్లోను జరగాలి. ‘సెలవు చీటీ’ని ఆంగ్లంలో కాక, భారతీయ భాషల్లో వ్రాయాలి, వ్రాయించాలి. సంతకాలు భారతీయ భాషల్లో చేయాలి, ఆంగ్లంలో కాదు. దీనికి భయంకరమైన విఘాతం కలిగిస్తున్న వాణిజ్య పాఠశాలల యజమానుల, నిర్వాహకుల బౌద్ధిక బీభత్సకాండను ప్రభుత్వాలు అరికట్టడం లేదు. అందువల్ల ఈ రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులు పాఠశాల నిర్వహణలో వ్యవస్థీకృతమయ్యాయి. తెలుగు మాట్లాడడం ఈ పాఠశాలల ప్రాంగణంలో ఘోరమైన నేరమట. మాతృభాషలో మాట్లాడిన పిల్లలను ఎండలో నిలబెడుతున్నారు, శరీరంపై బొబ్బలు, వాతలు తేలేలాగా పదేళ్ల లోపు పిల్లలను కొడుతున్నారు. ‘నేను తెలుగు మాట్లాడను’- ‘ఐ డోంట్ స్పీక్ టెలుగూ’- అని వందసార్లు పిల్లల చేత వ్రాయించడం బీభత్సకాండకు పరాకాష్ఠ. ఇదంతా నిజానికి దేశద్రోహం. కానీ, దేశద్రోహమన్న ధ్యాస కూడ లేదు!
రాజ్యాంగంలో ‘హీందీ కేంద్ర ప్రభుత్వ అధికార భాష’ అని స్పష్టంగా నిర్దేశించారు. ప్రాంతీయ స్థాయిలో ఆయా ప్రాంతీయ భారతీయ భాషలు ప్రభుత్వాల పాలన భాషలు. ఈ పద్ధతి వ్యవస్థీకృతమయ్యే వరకూ మాత్రమే ఆంగ్లభాష ఆయా స్థాయిలలో కొనసాగాలన్నది రాజ్యాంగ నిర్దేశం. రాజ్యాంగ నిర్దేశాన్ని పనికట్టుకొని డెబ్బయి ఏళ్లుగా చెఱచిన వారు ఎవరు? భారతీయ మాతృభాషల ద్వారా భారతీయ సంస్కృతి ప్రస్ఫుటిస్తోంది, భారత జాతీయత వికసిస్తోంది. ఈ పద్ధతిని నిర్మూలించి, భారత దేశంలో బ్రిటన్ దుష్ట నాగరికత, బ్రిటన్ దురహంకార జాతీయత ప్రస్ఫుటింపచేయడానికి, వికసింపచేయడానికి మాత్రమే బ్రిటన్ దురాక్రమణదారులు సంస్కృత భాషను అధికార, అనుసంధాన, ఉన్నత విద్యాబోధన మాధ్యమ భాష స్థానం నుంచి తొలగించారు. ఆ స్థానంలో తమ మాతృభాష ఆంగ్లాన్ని ప్రతిష్ఠించిపోయారు. బ్రిటన్ వారు హంతక జాతి.. అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను అనాది జాతులను నిర్మూలించి తమ ‘తెల్లబొల్లి’ సంకరజాతిని ప్రతిష్ఠించిన దుర్మార్గ స్వభావం బ్రిటన్ వారిది, ఐరోపా వారిది!
బ్రిటన్ వారు నిష్క్రమించాక మన ప్రభుత్వాలు సంస్కృత భాషను, భారతీయ భాషలను పునరుద్ధరించి ఉండాలి. ఈ డెబ్బయి ఏళ్లలో అది జరుగకపోవడం వల్ల మాత్రమే ‘ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది’ అన్న ఆత్మన్యూనతకు దేశవ్యాప్తంగా అధికాధిక ప్రజలు గురై ఉన్నారు. అందువల్ల కేవలం ఒక ప్రాంతంలోనో, కొన్ని పాఠశాలల్లోనో కాక దేశమంతటా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర బడుల్లో పదవ తరగతి వరకు, కనీసం ఎనిమిదవ తరగతి వరకు భారతీయ మాతృభాషా మాధ్యమ బోధనను నిర్బంధం చేస్తూ కేంద్రం చట్టాన్ని రూపొందించాలి. ఉన్నత విద్యను ఒకే ఒక భారతీయ భాషా మాధ్యమంగా దేశమంతటా మప్పాలి.. కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో.. ఈ వ్యవస్థను ఏర్పరచడానికి అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలి. రష్యాలోను, చైనాలోను స్నాతకోత్తర స్థాయి వరకు స్వదేశీయ భాషల మాధ్యమంగా బోధన జరుగుతోంది. ‘చైనాను చూసి నేర్చుకోవాలి’ అని చైనాకు వెళ్లి వచ్చిన రాజకీయ వేత్తలలో అధికులు వాక్రుచ్చుతున్నారు. మాతృభాషా మమకారాన్ని మాత్రం చైనాను చూసి నేర్చుకొనడం లేదు. కేంద్ర ప్రభుత్వం విద్యాబోధన పద్ధతిని వ్యవస్థీకరించినట్టయితే ‘మేము వారి కంటె వెనుకబడిపోతున్నాము..’ అన్న కృత్రిమ భ్రాంతి విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు తొలగిపోతుంది.