సంపాదకీయం

తెలుగు వెలగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని ప్రాంతీయ మాతృభాషల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. అయితే ఆ చర్యల స్వరూప స్వభావాల గురించి వెల్లడి కావలసి ఉంది. తెలుగు భాషను అభివృద్ధి చేయడంలో భాగంగానే కర్నాటకలోని మైసూరులో నెలకొని ఉండిన ‘శాస్ర్తియ తెలుగు సంస్థ’- క్లాసికల్ తెలుగు ఇన్‌స్టిట్యూట్-ను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరునకు తరలించిన సంగతిని సోమవారం లోక్‌సభలో జనశక్తి వనరుల- హ్యూమన్ రిసోర్సెస్-శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ గుర్తుచేశారు. ‘ భాషల పరిరక్షణ’అన్న విధానం వెనుకనుంచి ‘అంతరించిపోతున్న భాషల’ వ్యథ తొంగి చూస్తుండడం నడుస్తున్న చరిత్ర!! అంతరించిపోతున్న జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని, కళారీతులను, సంప్రదాయాలను పరిరక్షించడానికి ఉద్యమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి, చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఈ ‘పరిరక్షణ’ ఎక్కడో అక్కడ ఒకటి రెండు ప్రదర్శనశాలలలో, పరిరక్షక ప్రాంగణాలలో మాత్రమే ప్రస్ఫుటం అవుతోంది. భారతీయ భాషలకు సైతం అలాంటి ‘‘పరిరక్షణ’’మాత్రమే ఏర్పడే దుస్థితి ఎంతో దూరం లేదన్నది విజ్ఞత వికసిస్తున్న వారికి స్ఫురిస్తున్న వాస్తవం! భాషా కేంద్రాలను నెలకొల్పడంవల్ల, విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధన విభాగాన్ని, భారతీయ భాషల బోధన విభాగాన్ని ఏర్పాటుచేయడంవల్ల, మహాసమ్మేళనాలను నిర్వహించడంవల్ల ఈ భాషలు తప్పనిసరిగా కొన ఊపిరితో మిగిలి ఉంటాయి! కానీ అలాంటి ‘‘పరిరక్షణ’’ కేవలం ఆత్మవంచన, భారత జాతీయ ఆత్మవంచన! ప్రజలు తెలుగును మాట్లాడాలి, భారతీయ భాషలను మాట్లాడాలి. జనం నాలుకల యందు భాష జీవించడం అదీ! ఇలా మాట్లాడే వారందరూ తెలుగు లిపిలో, భారతీయ భాషల లిపిలో తెలుగును, ఆయా భారతీయ భాషలను వ్రాయగలగాలి, చదవగలగాలి. ఇతర భాషల పదాలతో తెలుగును కాని, భారతీయ భాషలను కాని సంకరం చేయకుండా భారతీయులు వ్రాయగలిగినప్పుడు మాత్రమే ఈ భాషలకు నిజమైన స్వరూప పరిరక్షణ! తెలుగు భాష ద్వారా తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయగలగాలి. ఆ సాహిత్యం ద్వారా ప్రస్ఫుటిస్తున్న భారతీయ సంస్కార సమాహారాన్ని జీవన వ్యవహారంగా మలచుకోగలగాలి. ఇది స్వభావ పరిరక్షణ!! తెలుగు భాషకు అన్వయించే ఈ స్వరూప స్వభావ పరిరక్షణ సూత్రం అన్ని భారతీయ భాషలకూ అన్వయిస్తోంది. అందువల్ల తెలుగు భాష కాని మరో భారతీయ భాష కాని దేశంలోని ఆయా ప్రాంతాలలో పాలనా భాషగా, బోధన మాధ్యమ భాషగా, వాణిజ్య భాషగా, జనజీవన వ్యవహార మాధ్యమంగా పునరుద్ధరణకు నోచుకోవాలి! ఇలాంటి జాతీయ జీవన వ్యవస్థ అనాదిగా ఈ దేశంలో కొనసాగింది. బ్రిటన్ దురాక్రమణదారులు ఈ భారతీయ భాషా వ్యవస్థను ధ్వంసం చేశారు. అందువల్ల ‘పునరుద్ధరణ’జరగాలి! డెబ్బయి ఏళ్లుగా ఈ పునరుద్ధరణ జరుగలేదు. భారతీయ భాషలు ‘ఆంగ్ల పదజాలం’తో చిత్ర విచిత్రంగా సంకరం అయిపోయాయి. ఆంగ్ల భాషను మాత్రమే మనం అమిత స్వచ్ఛంగా పరిరక్షించుకుంటున్నాము. భారతీయ భాషలో స్వచ్ఛత మాత్రం ఆంగ్ల పద సాంకర్యంతో చెడిపోయింది.
లోక్‌సభలో రమేశ్ పోక్రియాల్ ‘ భారతీయ భాషా పరిరక్షణ’గురించి ప్రస్తావించిన సమయంలో ఈ చారిత్రక భాషా సాంకర్యం స్ఫురించడం సహజం! ఆంగ్ల భాషను మాట్లాడే సమయంలోను, వ్రాసే సమయంలోను ఒక్క తెలుగు పదాన్ని కూడ, ఒక్క భారతీయ భాషా పదాన్ని కూడ వాడడం లేదు, ఆంగ్ల భాషను సంకరం చేయడం. కానీ తెలుగు మాట్లాడినా, వ్రాసినా ఆ తెలుగులో తెలుగు పదాల కంటె ఆంగ్ల పదాలు ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘మమ్మి కిచెన్‌లో బిజీగా ఉంది’’అన్నది ఒక ఉదాహరణ మాత్రమే! దీనికి ప్రధాన కారణం ‘పూర్వ శిశు- ఎల్‌కెజి- స్థాయినుంచి, ‘శిశు’- యుకెజి- స్థాయినుంచి తెలుగు పిల్లలకు, భారతీయ భాషా సముదాయాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యలను మప్పుతుండడం. ఆంగ్ల భాషను మాత్రమేకాదు, ఆ భాషతోపాటు ఐరోపా భావజాలాన్ని మప్పుతుండడం. భారతీయ భాషలను కాని, భారతీయ భావజాలాన్ని కానీ నేర్పించక పోవడం! ‘‘వానలు కురవాలి వరుణదేవుడా! వరిచేలు పండాలి వానదేవుడా!’’అని గతంలో పలికిన శిశువులు పెద్దయిన తరువాత తెలుగును వ్రాయగలిగారు, చదవగలిగారు. కానీ ‘‘రెయిన్ రెయిన్ గో అవే...’’అంటూ శిశువుల చేత వల్లెవేయించడం మొదలైంది. ‘‘వానా వానా రావద్దు..’’అన్నది భావజాలంలో కలిగిన పరివర్తనకు చిహ్నం. ఇది ఒక ఉదాహరణ... అసంఖ్యాక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా ‘‘రెయిన్ రెయిన్ గో అవే!’’అని వల్లించినవారు, వల్లిస్తున్నవారు తెలుగును వ్రాయలేకపోతున్నారు, చదవలేక పోతున్నారు. అన్ని భారతీయ మాతృభాషలకూ దాదాపు ఇదే దుస్థితి దాపురించి ఉంది...
ఇలా కొన ఊపిరితోనైనా కుంటుతూ ఉన్న భారతీయ మాతృభాషలను పూర్తిగా నిర్మూలించడానికి ఒకటి తరువాత ఒకటిగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుములను బిగిస్తున్నాయి. ‘కెజి’స్థాయినుంచి కూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టాలన్న దురాలోచన ఈ ‘నిర్మూలన’కార్యక్రమం. ఇప్పటికే ప్రభుత్వేతర, వాణిజ్య పాఠశాలల- కార్పొరేట్ స్కూల్స్-లో ‘కెజి’స్థాయినుంచి ఆంగ్ల మాధ్యమ బోధన కొనసాగుతోంది. దీనివల్ల భారతీయ భాషలు ఆంగ్ల పదజాలంతో సంకరం అయిపోయి కొన ఊపిరితో మాత్రం మిగిలి ఉన్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలలో సైతం ఆంగ్ల మాధ్యమ బోధన మొదలయినట్టయితే తెలుగు, భారతీయ భాషలు ‘పరిరక్షక కేంద్రాల’కు ‘‘పురాతత్త్వ నిలయాల’’కు మాత్రమే పరిమితం అయిపోతాయి, జనానికి దూరమయిపోతాయి. ఉపయోగించడంవల్ల మాత్రమే భాషలు బతికి ఉంటాయి. ఆంగ్ల మాధ్యమ బోధనవల్ల తెలుగు, భారతీయ భాషలు నిరుపయోగం అయిపోతాయి. భాష మాధ్యమం, ‘‘మాతృభాష ద్వారా మాతృ జాతీయ సంస్కృతిని’’ రక్షించుకొని పెంపొందించుకోవడం లక్ష్యం!’’- ఇదీ ఐక్యరాజ్యసమితి నిర్దేశిస్తున్న మాతృభాషా దినోత్సవ విధానం... మన దేశంలోని వివిధ ప్రాంతీయ మాతృభాషల ద్వారాను, ఈ అన్ని భాషలకు మాతృభాష అయిన సంస్కృత భాష ద్వారాను అనాదిగా ఒకే సంస్కృతి, ఒకే సంస్కారాల సమాహారం, ఒకే జాతీయ స్వభావం వికసించాయి. ఆంగ్ల భాష ద్వారాను ఇతర విదేశీయ భాషల ద్వారాను వికసిస్తున్నవి ‘‘్భరతీయమైనవి కావు....’’ ఇదీ వౌలికమైన అంశం! అందువల్ల ఆంగ్ల భాషను ఒక భాషగా అభ్యసించవచ్చు కాని అది బోధనా మాధ్యమ భాష కారాదు. అందువల్ల భారతీయులు భారత జాతీయ స్వభావ నిబద్ధులుగా జీవించాలని భావిస్తున్న ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు విద్యాబోధనను ఇప్పుడైన ఆంగ్లమాధ్యమంనుంచి విముక్తం చేయాలి! భారతీయ భాషల మాధ్యమంగా మాత్రమే విద్యాబోధన జరగాలి. భారతీయులు బ్రిటన్ జాతీయ స్వభావ నిష్ఠులుగా జీవించాలని భావిస్తున్న ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మాత్రమే ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనను సమర్ధించగలరు. భారతీయులు భారత జాతీయ భావనిష్ఠులు కారాదని, ‘‘బ్రిటన్ లేదా ఐరోపా లేదా అమెరికా జాతీయ భావ ప్రభావితులు కావాల’’ని భావించడం దేశ వ్యతిరేకం, దేశద్రోహం...
ఇది కేవలం తెలుగు భాష మనుగడ వ్యవహారం కాదు, మొత్తం భారతీయ భాషల అస్తిత్వ పరిరక్షణ వ్యవహారం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి! దేశమంతటా కనీసం ‘కెజి’నుంచి ఎనిమిదవ తరగతి వరకు అన్ని పాఠశాలలలోను కేవలం భారతీయ మాతృభాషల మాధ్యమంగా మాత్రమే బోధన జరగాలని, ‘‘ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగకూడదని’’నిర్దేశిస్తూ పార్లమెంటులో ‘బిల్లు’ను ఆమోదింపచేయాలి...