సంపాదకీయం

‘జాతీయ’ విక్రయశాల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఆర్థిక క్రియాకలాపాలలో అత్యంత ప్రధానమైనది ‘‘విక్రయించడం’’- అన్న అభిప్రాయం అతార్కికం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరులకు విక్రయించే కార్యక్రమం నిరంతరం వేగవంతం అవుతుండడం ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక! ‘్భరత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్’- బీపీసీఎల్- అన్న ప్రభుత్వరంగ సంస్థ ఇదివరకే సగం ప్రభుత్వేతరమై ఉంది. ఈ సంస్థను పూర్తిగా విక్రయించి పారేయాలన్న నిర్ణయాన్ని బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆవిష్కరించింది. ప్రభుత్వపు ఆస్తులను మొత్తం అమ్మిపారేయాలన్న విధానం గత పాతికేళ్లకు పైగా అమలు జరుగుతోంది. ఈ అమ్మకాలు ఇటీవల మరింతగా పుంజుకొన్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ను ప్రభుత్వేతరులకు అమ్మేస్తారట! ప్రభుత్వేతరులకు ‘రైళ్ల’ను అప్పగించే కార్యక్రమం కూడ జోరుగా నడుస్తోంది. ‘ప్రభుత్వరంగ పారిశ్రామిక వ్యవస్థ’ పూర్తిగా మూతపడిపోవడం అతి త్వరలో సర్వ సమగ్ర వాస్తవంగా సాకారం కానుంది. ‘్భరత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్’లో ప్రభుత్వానికి మిగిలి ఉన్న యాబయి మూడు శాతం వాటాలను పూర్తిగా అమ్మిపారేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ సాకార సాధన పథంలో వర్తమాన ఘట్టం! ‘కమ్యూనిజమ్’ ప్రభుత్వపు పెట్టుబడుల వ్యాపార వ్యవస్థ. ‘కాపటలిజమ్’ ప్రభుత్వేతర సంస్థల పెట్టుబడుల వ్యాపార వ్యవస్థ. పేర్లు వేఱువేఱు.. కానీ ఈ రెండు వ్యవస్థల స్వభావం ఒక్కటే! ‘కేంద్రీకరణ’ ఈ స్వభావం! అధికార కేంద్రీకరణ కాని, వాణిజ్య కేంద్రీకరణ కాని అవినీతికి, దోపిడీకి దోహదం చేయడం చరిత్ర ధ్రువీకరించిన వాస్తవం. అందువల్ల భారత జాతీయ అధికార, వాణిజ్య, వ్యవసాయ వ్యవస్థలు అనాదిగా అవినీతికి, దోపిడీకి ఆస్కారం లేని పద్ధతిలో వికేంద్రీకృతం అయ్యాయి. అట్టడుగు స్థాయిలో ఉత్పాదకత, సేవలు, పంపిణీ, వినియోగం వికేంద్రీకృతం కావడం తరతరాల భారతీయ మానవీయ ఆర్థిక వ్యవస్థ స్వభావం! ఈ మానవీయ ఆర్థిక వ్యవస్థ కాపటలిజమ్ కంటె కమ్యూనిజం కంటె పూర్తి భిన్నమైనది. శ్రామికుడు, యజమాని ఒకడే కావడం ఉత్పాదక శక్తులు, వినియోగశక్తులు ఒకే తరగతికి చెంది ఉండడం, పరస్పర పరిపోషకమైన, పరస్పర ఆధారమైన వృత్తులు వికసించడం ఈ భారతీయ సనాతన ఆర్థిక వ్యవస్థ.. గాంధీ మహాత్ముడు, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, దత్తోపంత్ ఠేంగ్డీ వంటి భారతీయ ఆర్థికవేత్తలు ఇటీవలి కాలంలో పునరావిష్కరించిన ఆర్థిక సిద్ధాంతం ఇది. బ్రిటన్ దురాక్రమణకారులు ఈ సనాతన భారతీయ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు. కాబట్టి పునరావిష్కరణ అవసరమైంది...
కానీ ఈ పునరావిష్కృత ఆర్థిక నీతి, స్వదేశీయ రీతి గత ఏడు దశాబ్దులుగా వాస్తవంగా సాకారం లేదు. 1990వ దశాబ్దివరకూ ‘కమ్యూనిస్టు’తరహా ప్రభుత్వీకరణ జరిగింది. అప్పటి నుంచి ‘కాపటలిస్టు’ తరహా ప్రభుత్వేతర కేంద్రీకరణ మొదలైంది. ప్రభుత్వ సంస్థల అద్వితీయ ఆధిపత్యం- మోనోపలీ- తొలగి ‘ప్రభుత్వేతర సంస్థల’ అద్వితీయ ఆధిపత్యం- మోనోపలీ- వ్యవస్థీకృతం అయిపోయింది. ఒక ‘కేంద్రీకరణ’ తొలగింది, మరో ‘కేంద్రీకరణ’ మొదలైంది.. ఈ కొత్త కేంద్రీకరణ పేరు ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్! ప్రభుత్వ వాణిజ్య ఆధిపత్యం అంతరించిపోతోంది.. ప్రభుత్వేతర సంస్థల, ప్రధానంగా మన దేశం పట్ల మక్కువ లేని విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ఆధిపత్యం మొదలైంది. ఈ విదేశీయ సంస్థలు కేవలం వ్యాపారం చేయడం లేదు, పారిశ్రామిక కలాపాలను సాగించడం లేదు, ఈ జాతి జీవన అస్తిత్వ స్వభావాన్ని చెఱచివేశాయి. ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత ఈ పాతికేళ్లలో మన ప్రజల సమష్టి జీవన స్వభావం వికృతమైపోయింది. వికృతమైపోయిందన్న ధ్యాస కూడ లేకపోవడం ‘ప్రపంచీకరణ’ సృష్టించిన మాయ! ఇది మొదటి వైపరీత్యం. ప్రభుత్వ పాలనకు సమాంతరంగా విదేశీయ వాణిజ్య సంస్థల ఆర్థిక బీభత్సపాలన కొనసాగుతోంది. ఇది రెండవ వైపరీత్యం! విత్తనాల నుంచి మొబైల్ ఫోన్ల వరకు, ‘అంతర్జాల’ సరఫరా నుంచి అప్పడాల ఉత్పత్తి వరకు అన్ని జీవన రంగాలలోను విదేశీయ సంస్థలు మన నిత్యవ్యవహారాన్ని నియంత్రిస్తున్నాయి. ఇదంతా మనకు మళ్లీ సంప్రాప్తించి ఉన్న ఆర్థిక బానిసత్వం, సాంస్కృతిక బానిసత్వం. రెండేళ్ల శిశువు పుట్టినరోజు పండుగను ఇళ్లలో జరపడం లేదు, స్టార్ హోటళ్లలో జరుపుతున్నారు! ‘స్టార్ హోటళ్లు’ ప్రపంచీకరణ పతాకాలు!! ప్రభుత్వపు ఆస్తులను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరుల కబంధ బంధానికి అప్పగిస్తుండడం ‘ప్రపంచీకరణ’లో భాగం! వికేంద్రీకృతం చేయడం లేదు.. ఇంకా ఇంకా కేంద్రీకరణను పెంచుతున్నారు. రెండు, మూడు, నాలుగైదు ప్రభుత్వరంగపు ‘బ్యాంకుల’ను విలీనం చేసి ఒకే పెద్ద బ్యాంకుగా మార్చడం మరింత కేంద్రీకరణకు ఒక ఉదాహరణ మాత్రమే!!
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ఆర్థిక విధానాలను కొనసాగిస్తుండడం జాతీయ వైపరీత్యం. దేశ హితానికి ప్రజల సమష్టి ప్రయోజనానికి దోహదం చేయగల అన్ని అంశాల గురించి ప్రధాన రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయం కలిగి ఉండాలి! ‘‘కలిగి ఉండాలన్నది’’ పరిణత ప్రజాస్వామ్య రాజ్యాంగ సంప్రదాయం! కానీ దేశ హితానికి, ప్రజల సమష్టి ప్రగతికి వ్యితిరేకమైన ఆర్థిక నీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నాటి విధానం పట్ల ప్రస్తుత ‘్భజపా’ ప్రభుత్వం తన అంగీకృతిని గత ఐదేళ్లకు పైగా ఆవిష్కరిస్తోంది. ఇదీ విచిత్రం! ‘ప్రపంచీకరణ’, బహుళ జాతీయ వాణిజ్య సంస్థల చొఱబాటు, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ- వంటివి మన దేశాన్ని ఆర్థికంగా పీల్చిపిప్పిచేస్తున్నాయి. కానీ పాతికేళ్లకు పైగా ఈ వైపరీత్యాలు తొలగక పోవడమేకాక మరింతగా పాతుకొని పోతున్నాయి. ప్రభుత్వపు ఆస్తులను అమ్మిపారేస్తుండడం ఇందుకు ఒక నిదర్శనం మాత్రమే! ఈ అమ్మకాలకు ‘డిస్‌ఇనె్వస్ట్‌మెంట్’ అని ముద్దుపేరు పెట్టారు. ఈ మన్‌మోహనీయ అంతర్జాతీయ ఆర్థిక నీతిని గతంలో అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిత్వంలో ‘్భజపా’ ప్రభుత్వం అమలు జరిపింది, అమ్మకాల మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం కూడ మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం విధానాలనే కొనసాగిస్తోంది. అందువల్లనే ప్రభుత్వానికి చెందిన వాణిజ్య పారిశ్రామిక సంస్థలను, సేవాసంస్థలను అమ్మిపారేస్తున్నారు.. ఇలా అమ్మకాల ద్వారా లభిస్తున్న నిధులను ప్రత్యేకంగా ఉంచి, ఆ ‘పెట్టుబడి’ని వివిధ రంగాలలో ‘అంకుర’ పరిశ్రమలను, ‘్భరత్‌లో నిర్మించండి’ పథకాలను పెంపొందించడానికి వాడవచ్చు! కానీ గతంలో ఈ విక్రయ ధనాన్ని ఆదాయంగా జమకట్టుకోవడం చరిత్ర. దీనివల్లనే మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం దేశాన్ని ‘దివాలా’దిశగా నడిపించింది! మరి ఇప్పుడు ఈ విక్రయ ధనాన్ని ఏమి చేస్తారు??
జాతీయత, దేశ సార్వభౌమ అధికార పరిధులలో ప్రభుత్వేతర సంస్థలు కూడ ప్రగతి ప్రక్రియలో భాగస్వాములు కావచ్చు! కానీ ‘జాతీయత’కు, మన దేశపు సార్వభౌమ అధికార పరిధికి కట్టుబడని, మన దేశం పట్ల మమకారం లేని ‘బహుళ జాతీయ సంస్థల’కు సైతం ప్రభుత్వపు ఆస్తులను విక్రయించడం వల్ల మన ఆర్థిక స్వాతంత్య్రం హరించుకొని పోతోంది. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ భాగస్వామ్యం- పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్‌షిప్- పేరుతో ప్రభుత్వరంగ సంస్థలలోని సగం కంటె తక్కువ భాగస్వామ్యాన్ని ప్రభుత్వేతరులకు గతంలో కట్టబెట్టారు! ఇప్పుడు దివాలా దిశగా మరింత ముందుకు వెడుతున్నారు! ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తంగా ప్రభుత్వేతరులకు కట్టబెడుతున్నారు..