సంపాదకీయం

నెత్తురొలకని దారులు..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారి భద్రత, రాకపోకల నియంత్రణ వ్యవహారాల జాతీయ మండలిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మన ప్రజాస్వామ్య వైచిత్రికి మరో ఉదాహరణ. జాతీయ ప్రయోజనకరమైన పరిష్కారాల పట్ల అధికార, ప్రతిపక్షాలు ఏకాభిప్రాయం కలిగి ఉండడం ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనమన్నది నిరాకరించజాలని వాస్తవం. మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అతి పెద్దది. పరిణతికి ప్రతిరూపంగా మన రాజ్యాంగ వ్యవస్థ ప్రసిద్ధి కెక్కింది. ఇవి కూడ నిరాకరింపజాలని నిజాలు. కానీ గత రెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అనేక బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందడంలేదు. అధికార పక్షానికి కాని అధికార కూటమికి కాని రాజ్యసభలో మెజారిటీ స్థానాలు లేకపోవడం ఇందుకు ఏకైక కారణం. పరిణతి చెందిన ప్రజాస్వామ్య ప్రక్రియ అధికార పక్షానికీ విపక్షానికి మధ్య ఏకాభిప్రాయం సాధించడం లేదు. జాతీయ హితం గురించి కూడ ప్రతినిధుల మధ్య రాజకీయ విభేదాలకు అతీతమైన ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందువల్లనే రహదారి రాకపోకల మంత్రిత్వ శాఖ వారు నిరుడు ప్రతిపాదించిన రహదారుల భద్రత బిల్లు రాజ్యసభలో గట్టెక్కలేదు. ఇలా తమ బిల్లులు గట్టెక్కవని తెలిసినప్పుడల్లా ప్రభుత్వం వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆర్థికపరమైన బిల్లుల రూపంలో తమ ప్రతిపాదనలను సభల ముందు ఉంచడం ప్రభుత్వం కనిపెట్టిన ప్రత్యామ్నాయం. ఆర్థికపరమైన బిల్లులను లోక్‌సభ ఆమోదిస్తే చాలు. రాజ్యసభ ఆమోదం లాంఛనప్రాయం అవుతోంది. రాజ్యసభ బిల్లును చర్చించి మళ్లీ లోక్‌సభకు పంపిస్తే చాలు.. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందుతుంది! కేంద్ర ప్రభుత్వం కనిపెట్టిన రెండవ ప్రత్యామ్నాయం బిల్లులతో పార్లమెంటు ఆమోదంతో పనిలేకుండా పాలనా ఆదేశం (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్) ద్వారా తన ప్రతిపాదనలను అమలు జరుపడం. అందువల్ల రహదారి భద్రత బిల్లు రాజ్యసభలో గట్టెక్కదన్నది స్పష్టమైన తరువాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా రహదారి భద్రత, రాకపోకల నిర్వహణ మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందట! శనివారం వెలువడిన ద్వైవార్షిక ఎన్నికల ఫలితాల వల్ల రాజ్యసభ బలాలలో పెద్ద మార్పు రాలేదు. భాజాపా నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటన (ఎన్‌డిఏ) బలం కొద్దిగా పెరిగినప్పటికీ మెజారిటీ మరో రెండేళ్ల తరువాత కూడ లభించే అవకాశం లేదు. భాజపా కూటమికన్నా, కాంగ్రెస్ కూటమికన్నా ఇతర పార్టీలకు రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఏర్పడి ఉన్నాయి. అందువల్ల నిరంతరం ప్రమాదాలకు నిలయమై ఉన్న రహదారుల భద్రతను పర్యవేక్షించగల జాతీయ మండలిని కేంద్రం కేవలం ఉత్తరువు ద్వారా ఏర్పాటు చేస్తోంది. అందువల్ల ఈ మండలికి శాసకీయ ప్రతిపత్తి (స్టాట్యుటరీ స్టేటస్) ఉండదు. రహదారి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక విభాగంగా ఈ మండలి పని చేయవలసి ఉంది!
ప్రమాదాలకు పేరుమోసిన మన రహదారులపై ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఈ కొత్త మండలి దోహదం చేయగలిగితే ప్రయాణీకులకు భద్రతా భావం ద్విగుణీకృతం త్రిగుణీకృతం కావచ్చు. 2014వ సంవత్సరంలో కంటె 2015లో రహదారుల ప్రమాదాల మృతుల సంఖ్య ఐదు శాతం పెరిగిందని అధికార గణాంక వివరాల వల్ల వెల్లడైంది. 2015లో జరిగిన దాదాపు ఐదు లక్షల రహదారి ప్రమాదాల ఫలితంగా దాదాపు లక్షా 46వేల మంది అకాల మృత్యువు పాలయ్యారు. అకాల మృత్యు కరాళ దంష్టల్రు కరకరమని నములుతున్న వికృత ధ్వనులు ప్రతి రోజు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉన్నాయి. ఈ విషాద కాండకు దేశంలో సగటున ప్రతి రోజు 400 మంది బలైపోతున్నారట! నగరాల వెలుపల పట్టణాల వెలుపల మాత్రమే కాక జన సమ్మర్దం అడుగడుగునా నిలదీస్తున్న నగరాల పట్టణాల రహదారులపై సైతం ప్రమాదాలు భయంకరంగా విరుచుకొని పడుతున్నాయి. ప్రమాద మృతులలో అధికాధికులు 15-35 సంవత్సరాల మధ్య వయస్సు కల యువకులు! అమిత దురుసుగా వాహనాలను నడపడం ప్రమాదాలకు ఒక ప్రధాన కారణం. మద్యం మత్తెక్కిన వారు, మాదక ద్రవ్యాలను మింగి మతి చెడి ఉన్నవారు వాహనాలను నడపడం ప్రమాదాలకు మరో ప్రధాన కారణం. రోడ్ల మధ్యలో సహజంగా ఏర్పడిపోతున్న గతుకులు, గుంతలు (పాట్‌హోల్స్) వేరొక ప్రధాన కారణం. జాతీయ రహదారులపైన సైతం ఈ గతుకులు, గుంటలు భారీగా ఏర్పడి ఉండడానికి కారణం అవినీతి. అధికారులు, రాజకీయవేత్తలు, నిపుణులు, వాణిజ్యవేత్తలు కలసికట్టుగా ముఠాలుగా ఏర్పడి నాణ్యత ప్రమాణాలు లేని రహదారులను నిర్మిస్తున్నారు. రోడ్లు కుంగిపోవడానికి, వంతెనలు కూలిపోవడానికి కారణం అవినీతి నిర్మాణవేత్తలు మాత్రమే.
దురుసుగా వాహనాలను నడపడం ద్వారా ఢీకొట్టి చిన్న పిల్లల మృతికి దోహదం చేసే చోదకులకు ఏడేళ్ల వరకు జైలు శిక్షను విధించడానికి నిరుడు ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లులో వీలు కల్పించారు. భారతీయ శిక్షాస్మృతిలోని 304 ఏ నిబంధన కింద దురుసుగా వాహనాలను నడిపి ప్రమాదాలను కలిగించేవారికి రెండేళ్ల వరకు మాత్రమే జైలు శిక్ష విధించడానికి వీలుంది. అందువల్ల నిర్బంధ శిక్షాకాలాన్ని పెంచడం అభిలషణీయం. కానీ ప్రభుత్వం ఆ తరువాత ఈ ముసాయిదా బిల్లులోని నియమావళిని నీరుకార్చింది. ఇలా బాలహంతకులకు ఏడేళ్ల వరకు కారాగృహ నిర్బంధం విధించడం వల్ల వాహన చోదకులకు కొంత భయం పెరిగే అవకాశం ఉంది. తద్వారా జాగ్రత్తగా వాహనాలను నడపాలన్న ప్రవృత్తి పెరుగుతుంది. కానీ ఆ తరువాత ఈ బాల హంతకులకు విధించే శిక్షను సంవత్సర నిర్బంధానికి కుదించారు. ఈ శిక్ష భారతీయ శిక్షాస్మృతి నిర్దేశిస్తున్న రెండేళ్ల శిక్ష కంటె కూడ తక్కువ. ఇలాంటి ప్రత్యేక చట్టాల వల్ల ప్రయోజనం ఏమిటి? బిల్లు చట్టంగా మారకపోవడం వేరే సంగతి. ఇప్పుడు ఏర్పడిన భద్రతా మండలి వల్ల శిక్షలను పెంచడానికి తగ్గించడానికి వీలుండదు. ఎందుకంటె ఈ మండలి శాసకీయ సంస్థ కాదు. కేవలం రహదారి భద్రతను మెరుగు పరిచే కార్యక్రమాలను పథకాలను రూపొందించవచ్చు! భద్రతను భంగపరుస్తున్న ప్రధాన వైపరీత్యాలలో మితిమీరిన వేగం అగ్రగణ్యమైంది. వేగం, దురుసుతనం, తాగుబోతుతనం, నియమాలను పాటించని నిర్లక్ష్యం ఒక్కొక్కటీ ప్రమాదాలకు ఒక కారణం. అన్నీ ఒకే డ్రైవర్‌లో ఉన్నప్పుడు ప్రయాణ భద్రత స్థాయి ఎలా ఉంటుందన్నది ఊహించుకోవచ్చు! అనేక నగరాలలోను పట్టణాలలోను పబ్బులలోను, క్లబ్బులలోను, బార్లలోను, రెస్టారెంట్లలోను అర్ధరాత్రి వరకు మద్యం సేవించడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వాలు ఆలోచించాలి! ఈ తాగుబోతులు ఇళ్ళకు వాహనాలను నడుపుకుంటూ తిరిగి వెడుతున్నారు. ఏ పబ్బులలోను, క్లబ్బులలోను, రెస్టారెంట్‌లలోను, బార్‌లలోను మద్యం సరఫరా చేయరాదని నిరుడు కేరళ ప్రభుత్వం నిబంధనలను విధించింది. తాగుబోతులు మద్యాన్ని అంగళ్లలో కొని ఇళ్లకు వెళ్లి తాగవలసిందే.
ఇలా రోడ్డు ప్రమాదాలు, తాగుబోతులు పరస్పరం ముడివడి ఉన్నారు. కేరళ తరహా నిబంధనలను దేశమంతటా అన్ని ప్రభుత్వాలు అమలు జరపాలి. తాగుబోతులను వాహనాలపై ఇళ్లకు తరలించడానికి వీలుగా తాగనివారు మత్తెక్కని వారు వెంట ఉండడంలేదు మరి! విదేశాలనుంచి దిగుమతి అవుతున్న వోల్వో వంటి ఖరీదైన బస్సుల వల్ల కూడ రహదారి ప్రమాదాలు పెరుగుతున్నట్టు ధ్రువపడింది. ఈ విదేశీయ వాహనాల దిగుమతిని, వినియోగాన్ని తక్షణం నిషేధించాలి. యుద్ధ విమాన వాహక నౌకలను స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించుకోవడం తరువాతి కథ. కనీసం బస్సులను కూడ నిర్మించుకోలేమా..?