సంపాదకీయం

కుట్రకు నేపథ్యం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ దౌత్య నియమావళిని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి అంతోనియో గుదరెస్ సైతం ఉల్లంఘించడం ‘అక్రమ ప్రమేయ’ చరిత్రలో వర్తమాన ఘట్టం. మన దేశపు అంతర్గత వ్యవహారాలలో ఇలా అంతర్జాతీయ అక్రమ ప్రమేయం పెరుగుతుండడానికి ప్రధాన కారణం మన దేశం ఇప్పటికీ ‘‘మెతక దేశం’’గా ముద్రపడి ఉండడం. గత ఐదేళ్లకు పైగా మన ప్రభుత్వం ఈ ‘ముద్ర’ను వదిలించుకొనడానికి యత్నిస్తున్నప్పటికీ మన ‘కరకుతనం’మాత్రం ఇప్పటికీ అంతర్జాతీయ పరిగణనకు నోచుకోలేదు. అందువల్లనే మన జమ్మూకశ్మీర్‌ను వివాదగ్రస్త భూమిగా చిత్రీకరించడానికి వీలుగా ‘అంతర్జాతీయ షడ్యంత్రం’ అప్రతిహతంగా అమలు జరుగుతోంది. ‘‘జమ్మూకశ్మీర్ వివాద’’ పరిష్కారానికి సహకరించమని కాని, సహాయం చేయమని కాని మన ప్రభుత్వం ‘‘బొట్టుకాటుక పెట్టి’’ ఏ ఇతర దేశపు ప్రభుత్వాన్ని కాని కోరలేదు, ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించలేదు. అసలు జమ్మూకశ్మీర్ గురించి ఎలాంటి వివాదం లేదు... అందువల్ల లేని వివాదాన్ని పరిష్కరించ వలసిన అవసరం కూడ లేదు. జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ దురాక్రమించిన ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల భూభాగం వివాదగ్రస్తం... ఈ వివాదాన్ని ఉభయ దేశాలు ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలని 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం స్పష్టం చేస్తోంది! పశ్చిమ పాకిస్తాన్ బీభత్స దమనకాండనుంచి 1971లో తూర్పు పాకిస్తాన్ విముక్తమైంది, బంగ్లాదేశ్‌గా అవతరించింది. మన దేశం ఈ విముక్తిని కల్పించింది. ఈ నేపథ్యంలో అప్పటి మన ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ పౌర ప్రభుత్వ అధినేత జుల్ఫికర్ అలీ భుట్టో మన ‘సిమ్లా’లో సమావేశమై, ఉభయ దేశాల మధ్యకల అన్ని వివాదాలను- మూడవ దేశం ప్రమేయం లేకుండా- ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించుకోవాలన్న ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు! ఈ ఒప్పందాన్ని అప్పటినుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ ఉల్లంఘిస్తూనే ఉంది. అందువల్ల ఐక్యరాజ్యసమితి కాని, దౌత్య విచక్షణకల సార్వభౌమ దేశాల ప్రభుత్వాలు కాని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి, అభిశంసించాలి! ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న దేశాలలో అత్యధిక శాతం ఈ ద్వైపాక్షిక స్ఫూర్తిని అంగీకరించాయి, అందువల్ల ఆ దేశాలు జమ్మూకశ్మీర్ వ్యవహారంలో కాని, వివాదగ్రస్తమై ఉన్న ‘పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూకశ్మీర్’ సమస్య పరిష్కారం గురించి జోక్యం కల్పించుకోవడం లేదు. కానీ దశాబ్దులుగా మన దేశం పట్ల తమ విధానాలలో వ్యతిరేకత నిహితమై ఉన్న దేశాలు మాత్రం పదే పదే తమ వికృత ముఖాలను దూర్చడానికి యత్నిస్తున్నాయి... ఈ వికృత ముఖాల, విష స్వరాల దేశాల ప్రభుత్వాలు ఐక్యరాజ్యసమితిని, ఇతర అంతర్జాతీయ సంస్థలను నియంత్రిస్తున్నాయి, నిర్దేశిస్తూన్నాయి. అందువల్లనే ఈ దేశాల వికృత వాంఛలను అంతోనియో గుదరెస్ ఆవిష్కరించాడు!!
ఈ భారత వ్యతిరేకత బ్రిటన్ దురాక్రమణ నుంచి మన దేశం విముక్తమైన నాటినుంచి కొనసాగుతోంది! నిజానికి ఇది శతాబ్దుల వారసత్వం... సకల వైవిధ్య పరిరక్షక, పరిపోషకమైన హైందవ జాతీయశక్తికీ వైవిధ్య విధ్వంసకమైన మతోన్మాదానికి మధ్య శతాబ్దులుగా సమరం కొనసాగింది! హైందవ జాతీయశక్తి జయించినప్పుడు మన దేశంలోనేకాక, ప్రపంచంలోని అన్ని దేశాలలోను అన్ని మతాలకు, సకల వైవిధ్యాలకు సమాన రక్షణ, సమాన ఆదరణ లభించింది! ఇందుకు కారణం ‘‘సృష్టిలోని సకల వైవిధ్యాలు ఒకే సమాన స్వభావానికి ఉన్న అసంఖ్యాక రూపాలు’’అన్న సనాతన- శాశ్వతమైన- సత్యాన్ని భారతజాతి అనాదిగా గుర్తించడం. అందువల్లనే హైందవ జాతిలో అనేక మతాలు, అసంఖ్యాక వైవిధ్యాలు అనాదిగా వికసించాయి, వికసిస్తున్నాయి! అందువల్లనే భారతదేశం జయించినప్పుడు ఇతర దేశాల, శత్రు దేశాల వైవిధ్య అస్తిత్వానికి భంగం కలుగలేదు. ‘‘స్వభావ ఏకత్వ స్వరూప వైవిధ్యం సృష్టిక్రమం’’అన్న ఈ వౌలిక సత్యాన్ని గ్రహించని విదేశీయులు మన దేశాన్ని దురాక్రమించి జయించినప్పుడల్లా మన దేశంలోని మతాలను, భాషలను, ఇతర వైవిధ్యాలను ధ్వంసం చేశారు! ఇలా భారతీయ వైవిధ్య పరిరక్షణ ప్రవృత్తికీ, విదేశీయ వైవిధ్య విధ్వంసక చిత్తవృత్తికీ మధ్య నడుస్తున్న సమరానికి కొనసాగింపు ప్రస్తుతం మన దేశపు అంతర్గత వ్యవహారాలలో విదేశాల అక్రమ ప్రమేయం! వెలుగును వ్యతిరేకించడం వెలుగును దిగమింగడానికి యత్నించడం చీకటికి సహజమైన లక్షణం... భారతదేశం అనాదిగా వైవిధ్య కిరణాల వెలుగు...
ఈ శతాబ్దుల సమరంలో మన దేశం ఎక్కువసార్లు ఓడిపోవడం జిహాదీల పైశాచిక బీభత్సకాండకు కారణం! ఇస్లామేతర మతాలను ధ్వంసం చేయడం జిహాదీల ఏకైక లక్ష్యం! ఈ లక్ష్యసాధనలో భాగంగానే క్రీస్తుశకం 1947లో పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో ఇస్లామేతర మతాల విధ్వంసం శతాబ్దులపాటు సాగింది. క్రీస్తుశకం 712 నాటికి ఒక్క ఇస్లాం మతస్థుడు కూడ లేని ‘‘పాకిస్తాన్’’ ప్రాంతంలో 1947నాటికి ఇస్లాం మతస్థులు అత్యధిక సంఖ్యాకులు కావడం ఈ శతాబ్దుల విధ్వంసం... అన్యమతాల ఉనికి సైతం సహించని జిహాదీల ‘విజయం’ పాకిస్తాన్ అవతరణం... 1947 తరువాత కూడ పాకిస్తాన్‌లో జిహాదీలు పైశాచిక కాండను కొనసాగిస్తూనే ఉన్నారు! ఫలితంగా ఇస్లామేతర మతాల నిర్మూలన భయంకర రీతిలో జరిగింది! ఈ అమానవీయ పైశాచిక నిర్మూలనకాండను ఐక్యరాజ్యసమితి కాని, ఇప్పుడు జమ్మూకశ్మీర్‌లో కలుగచేసుకొనడానికి యత్నిస్తున్న దేశాలు కాని నిరసించిన చరిత్ర లేదు! ఫలితంగా 1947నాటికి పాకిస్తాన్ జనాభాలో ఇరవై ఆరు శాతం ఉండిన ఇస్లామేతర మతాలవారి సంఖ్య ప్రస్తుతం రెండు శాతానికి పడిపోయింది. మిగిలిన ఇరవై నాలుగు శాతం ఇస్లామేతరులు దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌లో హత్యలకు, మతం మార్పిడులకు, లైంగిక బీభత్సకాండకు బలయ్యారు. తప్పించుకొని ప్రాణావశిష్టులై, శరణార్థులై మన దేశానికి వచ్చినవారికి నిలువనీడ కల్పించడం మానవత్వం... ఈ మానవీయ దృక్పథంతో ఈ శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పిస్తున్న మన ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నవారు మానవులు కాదు, మానవ రూపంలోని పిశాచాలు, నరరాక్షసులు...
దేశంలోను, విదేశాలలోను ఈ ‘నర పిశాచాలు’ వికృత తాండవం చేస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ఈ పౌరసత్వ ప్రదానాన్ని, జమ్మూకశ్మీర్‌ను ముడివెట్టి వివిధ దేశాల ప్రభుత్వాలవారు మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి! ఒకప్పుడు అతి సంపన్న దేశమైన అతి శక్తివంతమైన మన దేశాన్ని ఐరోపా బీభత్సకారులు ‘‘సింహాన్ని నక్కలు వంచనతో ఓడించినట్టు’’గా క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దినుంచి దురాక్రమించారు. ఈ దురాక్రమణ ఫలితంగా అఖండ భారతదేశం ముక్కలు చెక్కలైంది! ముక్కలన్నీ ఒక్కటిగా ఏర్పడితే భారతదేశం మళ్లీ సంపన్న దేశంగా అగ్రరాజ్యంగా ఏర్పడుతుంది. అందువల్ల ‘విభజన’ను వ్యవస్థీకృతం చేయడానికి బ్రిటన్ బీభత్స ‘పాలకులు’యత్నించారు! ఈ విభజన వ్యవస్థలో భాగం జమ్మూకశ్మీర్ ‘సంస్థానం’గా ఏర్పడడం! అన్ని సంస్థానాలతోపాటు ‘జమ్మూకశ్మీర్’ కూడ ‘అవశేష’ భారత్‌లో విలీనమైంది! కానీ ఈ విభజనను పునరుద్ధరించాలన్నది అంతర్జాతీయ స్థాయి కుట్ర... జమ్మూకశ్మీర్ గురించి ఈ అంతోనియో గుదరెస్ ‘‘అవాకులు చెవాకులు’’ ఆవిష్కరించిన సమయంలోనే ‘గూగుల్’సంస్థవారు మన దేశపు కొత్త చిత్రపటాల- మ్యాప్స్-ను విదేశాలవారు ఉపయోగించే ‘అంతర్జాలం’లో నిక్షిప్తం చేశారట! ఈ పటాలలో మన జమ్మూకశ్మీర్‌ను వివాద ప్రాంతంగా చూపించారట! ఇదీ అంతర్జాతీయ షడ్యంత్రం... ‘గూగుల్’పై మన ప్రభుత్వం ఏం చర్య తీసుకొంటోంది...??