సంపాదకీయం

ఆర్భాటపు అతిథి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో గత ఏడాది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన జరిగిన ‘‘మోదీ కుశలమా?’’- హౌడీ మోడీ- అన్న సమావేశానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యాడు. సోమవారంనాడు మన గుజరాత్‌లోని కర్ణావతి- అహమ్మదాబాద్-లో జరుగనున్న ‘‘నమస్తే ట్రంప్’’ సమ్మేళనానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నాడు. ఈ ఉభయ ‘సభ’లలోను మన ప్రభుత్వ అధినేత, అమెరికా ప్రభుత్వ అధినేత ఉమ్మడిగా పాల్గొనడం ఉభయ దేశాలు సంతరించి పెడుతున్న చారిత్రక పునరావృత్తి! హూస్టన్‌లో జరిగిన సభలో కరతాళ ధ్వనులు చేసినవారు భారతీయ సంతతికి చెందిన అమెరికా పౌరులు. దాదాపు యాబయి వేల మంది భారతీయ సంతతి అమెరికా పౌరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అహమ్మదాబాద్ సభలో కరతాళ ధ్వనులు చేయనున్నది భారతదేశంలోని భారతీయులు... ఇదీ ఈ చారిత్రక ‘పునరావృత్తి’ క్రమంలో ప్రస్ఫుటిస్తున్న అంతరం! ‘‘సెనగ పప్పు నీవు తీసుకొని రా, సెనగ పొట్టు నేను తెస్తాను... ఇద్దరం ‘ఊదుకొని’తిందాము...’’అన్నది ధ్వని! ఈ ‘్ధ్వని’ వచ్చే నవంబర్‌లో జరుగనున్న అమెరికా అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియలో ప్రతిధ్వనించాలన్నది ట్రంప్ సలహాదారుల వ్యూహం! అమెరికాలోని మత ప్రదాతలలో భారతీయ సంతతి వారు ‘ఒక్క శాతం’మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ 2016లో ప్రజల తీర్పులో ఓడి, ‘వరణ సమితి’- ఎలక్టరల్ కాలేజి- తీర్పుద్వారా గెలిచిన డొనాల్డ్ ట్రంపుకు ఇప్పుడు ప్రతి ‘వోటు’ విలువైనది. అందువల్లనే గత ఏడాది గణతంత్ర దినోత్సవ అతిథిగా రావడానికి నిరాకరించిన ట్రంప్ ఇప్పుడు ఆర్భాటంగా అరుదెంచుతున్నాడు. గతంలో అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వచ్చినప్పుడు- జార్జిబుష్ వచ్చినప్పుడు, బరాక్ హుస్సేన్ ఒబామా వచ్చినప్పుడు- రక్షణకోసం అమెరికా నుంచి కుక్కలను కూడ విమానంలో వెంట పెట్టుకొని వచ్చినట్టు చరిత్ర... ఇప్పుడు ‘కుక్కలు’ వస్తున్నాయా?- అన్నది ఇంకా ప్రచారం కాలేదు! 2015 సెప్టెంబర్‌లో నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించాడు. ఈ పర్యటనకు పూర్వరంగంగా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల ఆయుధాలను, రక్షణోత్పత్తులను అమెరికానుంచి మన దేశం కోనుగోలు చేసింది. మన ప్రధాని ఇలా అమెరికాకు వెళ్లివచ్చినప్పుడల్లా అమెరికానుంచి కొత్తగా ఆయుధాలు రక్షణ సామగ్రి కొనుగోళ్లకు ఒప్పందాలు కుదురుతూనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మన దేశానికి వస్తున్నాడు. మన దేశం అమెరికానుంచి కొత్తగా ఇరవై నాలుగు సమర గగన శకటాలను కొనుగోలుచేసే అవకాశం ఉందన్నది కొనసాగుతున్న ప్రచారం! ‘‘మా ఇంటికి మీరువస్తే మాకేమి తెస్తారు? మీ ఇంటికి మేము వస్తే మాకేమి ఇస్తారు?’’- అన్న మాటలు అమెరికా నోట వినబడుతున్నాయి! వారు అమ్మాలి, మనం కొనాలి...
ఇలా మనం ఆయుధాలను కొంటున్నప్పటికీ అమెరికా అధ్యక్షులకు తృప్తి లేదు. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థవల్ల మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలను సులభంగా దోచుకోవచ్చునన్నది క్రీస్తుశకం 1990వ దశకంలో అమెరికా, ఐరోపా దేశాల పన్నాగం! ఈ వ్యూహంలో భాగంగానే మన దేశంలోని వివిధ ఉత్పాదక, వినిమయ రంగాలలోకి అమెరికా సంస్థలు చొఱబడిపోయాయి! బర్రాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడుగా ఉండిన సమయంలో 2012లో మన చిల్లర వ్యాపారంలోకి విదేశీయ వాణిజ్య సంస్థలు చొఱబడడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. ఫలితంగా అమెరికావారి ‘వాల్‌మార్ట్’, ‘అమెజాన్’ సంస్థలు మన దేశంలో పంపిణీ రంగంపై ప్రస్తుతం ఆధిపత్యం వహిస్తున్నాయి. భారతీయ సంస్థ ‘ప్లిప్‌కార్ట్’ను ‘వాల్‌మార్ట్’ దిగమింగింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! కానీ అంతర్జాతీయంగా చైనావారి వాణిజ్య ఆధిపత్య సామ్రాజ్యం ఏర్పడడంతో అమెరికా, ఐరోపాల ప్రపంచీకరణ వ్యూహం బెడిసికొట్టింది. చైనావారి నాసిరకం వస్తువులు అత్యధిక దేశాలను ముంచెత్తుతున్నాయి. నాసిరకం అయినప్పటికీ చౌకగా దొరుకుతున్నాయట! మనకు శత్రు దేశమైన చైనా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏర్పడడం ‘ప్రపంచీకరణ’ మారీచ వాణిజ్య మృగ మాయాజాలం! ‘్భరత అమెరికా’ వార్షిక వాణిజ్య పరిమాణంకంటె ‘్భరత చైనా’ వాణిజ్య పరిమాణం ఐదు రెట్లు ఎక్కువగా ఉంది! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశానికి వ్యతిరేకంగా నిన్న, మొన్న, నేడు కూడ వాణిజ్య వ్యాఖ్యలు గుప్పించడానికి ఇదీ కారణం...
అమెరికానుంచి వస్తున్న వస్తువులపై మన ప్రభుత్వం దిగుమతి సుంకాలను భారీగా తగ్గించాలట! అమెరికాలోని వ్యవసాయ ఉత్పత్తులను, జున్ను, వెన్న వంటి వ్యవసాయ పారిశ్రామిక ఉత్పత్తులను మనం భారీగా దిగుమతి చేసుకోవాలట! ఈ ఉత్పత్తులు మనకు అవసరం లేదు! నెలల తరబడి ‘్భరత అమెరికా’ వాణిజ్య అవగాహన చర్చలు స్తంభించి ఉండడానికి ఇదీ నేపథ్యం... గతంలో 2007వరకు పదేళ్లు అమెరికా ప్రభుత్వం మన మామిడి పండ్లను బహిష్కరించింది. మన దేశంలోని మామిడి పండ్లు రసాయన విష ప్రభావానికి గురిఅయి ఉన్నాయన్నది చెప్పిన సాకు. కానీ తమ దేశంలో తయారయిన, మనకు అక్కరలేని నాసిరకం ‘మోటర్ సైకిళ్ల’ను మనకు తగలకట్టడానికి వీలుగా అమెరికా మన మామిపండ్ల దిగుమతిపై నిషేధాన్ని తొలగించింది! మన దేశం వస్తువులు తమ దేశాన్ని ముంచెత్తుతున్నాయన్నది ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. అందువల్లనే మన వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచాడు. మన ప్రభుత్వం కూడ అమెరికా వస్తువులపై సుంకాలను పెంచాలని నిర్ణయించడంతో వాణిజ్య వివాదం మొదలైంది. అమెరికా వాణిజ్య ఆర్థిక వ్యవస్థలు 2008లో దివాలా తీయడం అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించిన విపరిణామం. ఈ విపరిణామం అమెరికాకు వ్యతిరేకంగా బెడిసికొట్టిన ఫలితం... అప్పటినుంచి అమెరికా మాత్రమేకాదు, బ్రిటన్ వంటి ఐరోపా దేశాలు సైతం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థనుంచి, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’- వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- పరిధి నుంచి బయటపడడానికి యత్నిస్తున్నాయి. బ్రిటన్ ‘ఐరోపా సమాఖ్య’నుంచి తప్పుకోవడం ఇందుకు నిదర్శనం. ‘‘సమాఖ్య’’కు విస్తృతి ప్రపంచీకరణ!! శతాబ్దుల తరబడి ప్రపంచ దేశాలను దోచుకొని ‘బలసిన’ బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్, నెదర్‌లాండ్స్ వంటి ఐరోపా దేశాలు ప్రస్తుతం చైనా దోపిడీకి గురిఅవుతుండడం అమెరికా దృష్టిలో ప్రపంచీకరణ వైఫల్యం... భవిష్యత్తు జాతీయతత్త్వ నిష్ఠుల- పేట్రియాట్స్-దే, ప్రపంచీకరణ శక్తుల- గ్లోబలిస్టులు-ది కాదు అని గత ఏడు సెప్టెంబర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ‘‘చారిత్రక’’ ప్రకటన అమెరికా అంతరంగానికి అద్దం... అందువల్లనే ఇప్పుడు ట్రంప్ వస్తున్న సందర్భంగా ‘‘పెట్టుబడుల’’ ఆర్భాటం జరగడం లేదు...
నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించడం దశాబ్దులుగా అమెరికా ప్రభుత్వ నైజం! ఇప్పుడు మరోసారి అమెరికా ఈ ‘‘ద్వంద్వ’’ ప్రవృత్తిని ఆవిష్కరించింది. ట్రంపు ఒకవైపున మన ప్రధానిని ప్రశంసిస్తున్నాడు! నిజానికి ట్రంప్ వంటి ‘‘తలతిక్కవాని’’ ప్రశంసలు మన ప్రధానికి సమ్మానకరం కాదు! అయినప్పటికీ అతగాడు అమెరికా అధ్యక్షుడు... కానీ మన ప్రభుత్వం ఆమోదించిన ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిఏఏ- మన దేశంలోని ఇస్లాం మతస్థులకు వ్యతిరేకమన్న ‘‘పిచ్చి వాగుడు’’ను కూడ గురువారం ట్రంప్ ప్రభుత్వం ఆవిష్కరించింది, వాస్తవాలను వక్రీకరించడానికి యత్నిస్తోంది... ‘‘తొడ గిల్లడం, తొట్టెల ఊపడం’’- ఇలా అమెరికా విధానమైపోయి ఉంది! అయినా అమెరికా మనకు మిత్ర దేశం!!