రచ్చ బండ

అది అన్నదమ్ముల వ్యూహం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరంలో ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్టు చేయడం తో కలకలం చెలరేగింది. విధ్వంసానికి జరిగిన కుట్రను ఎన్‌ఐఎ ఛేదించడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో మార్మోగేదేమో. ఏదైతేనేం, ఎన్‌ఐఎ పుణ్యమాని బయటపడింది. కానీ అరెస్టు అయిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ నేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే్న లేపాయి. దీనిపై బిజెపి నేతలు తీవ్ర స్థాయలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసద్‌ను దేశద్రోహం చట్టం కింద అరెస్టు చేయాలని, మజ్లిస్ పార్టీని నిషేధించాలన్న డిమాండ్‌నూ ఆ పార్టీ నేతలు ముందుకు తెచ్చారు. కాంగ్రెస్‌లో కొంత మంది నాయకులు కూడా అసద్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అసద్‌కు కావాల్సింది కూడా అదే. అసద్ వ్యాఖ్యల్లో మర్మం ఏదైనా ఉందా? అని లోతుగా అధ్యయనం చేస్తే, చాలానే ఉంది. తన సారధ్యంలోని మజ్లిస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఇదివరకే చర్యలు చేపట్టారు. రాజకీయాల్లో సాదా-సీదాగా వెళితే వెంటనే గుర్తింపు రాదన్న భావన చాలా మందికి ఉంటుంది. అసద్ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ (టి.అసెంబ్లీలో పార్టీ పక్షం నాయకుడు)ల లక్ష్యం ఒక్కటే. తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రాంతీయ, జాతీయ మీడియాను తమ వైపు ఆకర్షించడం. అటువంటి సంచలన వ్యాఖ్యల ద్వారా జాతీయ స్థాయలో ప్రచారం పొందా లన్నది వారి వ్యూహం. పట్టుబడిన తీవ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తారా? అంటూ అనేక మంది మండిపడుతున్నా, అసద్ మాత్రం తాపీగా ఉన్నారు. పైగా తాను తప్పేమి మాట్లాడలేదే అని అన్నారు. మేము తీవ్రవాదానికి వ్యతిరేకం, ఇస్లాం ఇటువంటి వాటిని తీవ్రంగా ఆక్షేపిస్తుంది, దేశం అభివృద్ధి చెందాలంటే శాంతి-సామరస్యత అత్యవసరం అని అసద్ పేర్కొన్నారు. లోగడ ఎన్నో ఘటనలు జరిగినప్పుడు బిజెపి ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మరి న్యాయ సహాయం ఎలా అందిస్తారంటే, అమాయకులను అరెస్టు చేశారు కాబట్టే న్యాయ సహాయం అన్నానంటూ ఆయన సమర్థించుకున్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగుడా ప్రెస్ క్లబ్‌లో బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు రెచ్చిపోవడం వివాదాస్పదమైంది. ఒక సందర్భంలో అసద్ మాట్లాడుతూ, ‘కారు’ కెసిఆర్‌దే అయనా, ‘స్టీరింగ్’ తన చేతిలో ఉన్నదనడం మరో విచిత్రం!
అసద్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ (సాలార్) మజ్లిస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ పార్టీ పాతనగరానికే పరిమితమైంది. అసద్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త నగరానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీ శాఖలను విస్తరించే వ్యూహాన్ని పన్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బోణి కొట్టారు. బిజెపి ప్రభంజనంతో అస్సాం, బీహార్‌లో ఎదురు దెబ్బ తగిలినా, మొక్కవోని ధైర్యంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించారు. దేశంలోని మైనారిటీలకు పెద్ద దిక్కుగా మజ్లిస్ పార్టీ నిలవాలన్నది అన్నదమ్ముల భావన. ముస్లిం, మైనారిటీలకు ఒకటి, రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఉన్నా, ఆ పార్టీలు ఆ రాష్ట్రాలను దాటి బయటకు రావడం లేదు. ఉదాహరణకు కేరళలో ఐయుఎంఎల్, అస్సాంలో ఎఐడిఎఫ్, కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్నా అవి ఆ రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడింది కాబట్టి వివిధ రాష్ట్రాల్లో అక్కడ బలంగా ఉండే పార్టీలతో ‘జత’ కట్టి మజ్లిస్ పార్టీని విస్తరించాలన్నది అసద్ అసలైన ప్రణాళిక. బిజెపి కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. బిజెపి ఎక్కువగా హిందుత్వంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, ముస్లిం, మైనారిటీలకు పెద్ద దిక్కుగా మజ్లిస్‌ను నిలపడానికి అసద్ వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. భారత్ మాతాకీ జై అనే నినాదం చేయమన్నప్పుడు, ఈ దేశంలోని పౌరులుగా చేస్తామని అసద్ ప్రకటించకుండా, ‘నో’ అన్నారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్ర సమితితో దోస్తీ ఉన్నందుకే, ఆ అండతో అసద్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఎంతో వివాదం చెలరేగిన తర్వాత, జాతీయ స్థాయి మీడియాలో రచ్చ, రచ్చ అయిన తర్వాత తీరిగ్గా ‘హిందుస్థాన్ జిందాబాద్’ పేరిట అసద్, అక్బర్‌ల ఫొటోలతో ఫ్లెక్సీలు, భారీ కటౌట్లు వెలిసాయి. భారత్ మాతాకీ జై అనకుండా పంతం నెగ్గించుకున్నారు అన్నదమ్ములు. అదేమిటంటే, తాము అల్లాను తప్ప మరొకరిని ఆరాధించమని తేల్చి చెప్పారు. అంతకు ముందు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆదిలాబాద్‌లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రంజాన్ మాసం వస్తే ‘హలీం’ ముస్లింల కంటే ఎక్కువ ఎవరు తింటారు? అంటూ ప్రశ్నించి, సమాధానాన్ని సభికులతో చెప్పించారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయడంలో అన్నదమ్ములు సిద్ధహస్తులు.
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలను, అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించిన విధానానే్న భవిష్యత్తులోనూ టిఆర్‌ఎస్‌తో అనుసరిస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని, ఫలితంగా ఇప్పుడు ఉన్న సీట్లను రెట్టింపు చేసుకోవాలని అన్నదమ్ముల (అసద్- అక్బర్) తపన. తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బాగా బలహీనపడింది కాబట్టి ఆ పార్టీని వదులుకుని టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలవాలని బిజెపి ఎత్తుగడ. కాంగ్రెస్ కూడా ఇంకా కోలుకోలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బిజెపి నేతల భావన. వైకాపా, వామపక్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సమయంలో మజ్లిస్ నేతలు అసద్, అక్బర్‌లు, బిజెపి నాయకులు పరస్పరం విమర్శించుకుంటుండడంతో రాజకీయాలు రంజుగా మారాయి. రాజకీయ లబ్ది కోసం వారు ఏమని విమర్శించుకున్నా సరే కానీ సమాజంలో విద్వేషాలు చెలరేగకుంటే చాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి