సంపాదకీయం

పాకిస్తాన్ కెళ్లొస్తే..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యవహారాల మంత్రి రాజనాథ్ సింగ్ పాకిస్తాన్‌కు వెళ్లి రావాలన్న ప్రభుత్వ కృతనిశ్చయానికి హఫీజ్ సరుూద్, సలాఉద్దీన్ వంటి జిహాదీలు ఇటీవల జరిపిన బీభత్స యాత్ర లు నేపథ్య వైపరీత్యం! ఇస్లామాబాద్‌నుంచి లాహోర్ వరకు మొదటి యాత్ర జరిపిన ఈ భారత వ్యతిరేక ఉగ్రవాదులు వాఘా వరకు రెండవ యాత్రను జరిపారట! ఈ బహిరంగ ఉగ్రయాత్రలను పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించడం బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్-కు మరో నిదర్శనం మాత్రమే! తమ దేశంలో ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్య వ్యవస్థ-ఐఎస్‌ఐఎస్ జరిపిస్తున్న బీభత్స కలాపాలను హఫీజ్ సరుూద్ పర్యవేక్షిస్తున్నాడన్న జులై 28న అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం చేసిన పునరుద్ఘాటన! హఫీజ్ సరుూద్ లష్కర్ ఎ తయ్యబా, జమాత్ ఉద్ దవా వంటి బీభత్స సంస్థల నిర్వాహకుడు. 2008 నవంబర్‌లో మన ముంబయిపై దాడి చేసి 165 మందిని హత్య చేసిన ఉగ్ర మృగాలను ఉసికొల్పిన వాడు హఫీజ్‌సరుూద్! రాజనాథ్‌సింగ్ తమ దేశానికి రాకూడదని హఫీజ్ సరుూద్ ప్రకటన కూడ చేసాడు! 2008 నాటి ముంబయి హత్యాకాండకు ముందు, ఆ తరువాత ఎనిమిదేళ్లుగా హఫీజ్ సరుూద్ యథేచ్చగా పాకిస్తాన్‌నుండి భారత వ్యతిరేక బీభత్స కలాపాలను నడిపిస్తున్నట్టు అనేకసార్లు ధ్రువపడింది! ఈ వాస్తవం దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సమాఖ్య-సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్-సార్క్-సభ్యదేశాల ప్రభుత్వాలకు తెలుసు, అంతర్జాతీయ సమాజానికి తెలుసు! రాజనాథ్‌సింగ్ పాకిస్తాన్‌కు వెళ్లి సార్క్ వేదికలపై కొత్తగా వినిపించవలసిన అవసరం లేదు. పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానిక దళ స్థావరంపై గత జనవరిలో జరిగిన దాడికి పాకిస్తాన్ ప్రభుత్వం కుట్ర చేసినట్టు నిరూపించే వెయ్యిపేజీల సాక్ష్యాధార పత్రాలను అమెరికా ప్రభుత్వం మన ఫ్రభుత్వానికి అందచేసిందని జూలై 29న ప్రచారమైంది! ఈ బీభత్సకాండను నిర్వహించిన జాయిష్ ఏ మొహమ్మద్ బీభత్స ముఠా ముందరి మనిషి మసూద్ అఝార్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించినట్టు జవవరి 13న ఆర్భాటంగా ప్రచారమైంది. అయితే నిర్బంధించినట్టు పాకిస్తాన్ ధ్రువపరచలేదు, మన ప్రభుత్వానికి సమచారం అందించలేదు. పఠాన్‌కోట బీభత్సకాండ నిర్వహణలో మసూద్ అఝార్ పాత్ర ఉన్నట్టు నిరూపించే ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని మార్చి 30న పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికే మన ప్రభుత్వం ఈ దుర్మార్గునికి వ్యతిరేకంగా నేరనిర్థారణను ధ్రువపరిచే అనేక సాక్ష్యాధారాలను మన ప్రభుత్వం వినమ్రపూర్వకంగా నివేదించి ఉంది! ఇప్పుడు కొత్తగా సార్క్ వేదికనుంచి సాక్ష్యాధారాలను నివేదించవలసిన అవసరం ఏమిటి? గతంలో సమర్పించిన సాక్ష్యాలు సాక్ష్యాలు కాదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఇప్పుడు సార్క్‌వేదికపై రాజనాథ్‌సింగ్ సాక్ష్యాలను పునరుద్ఘాటించడంవల్ల పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని అంగీకరిస్తుందా? సరుూద్, మసూద్ తదితర దుండగులను నిర్బంధించి విచారిస్తుందా?
పాకిస్తాన్‌లోనే పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం-అన్న పదజాలం బాగుంది! ఈ పదజాలం ఆచరణ సాధ్యం కాగలదా? కాకపోతే పదాల గారడీగా మాత్రమే మిగిలిపోతుంది! సార్క్ వేదికపై సాక్ష్యాధారాలను వివరించి మనదేశంలో పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స కాండను జరిపిస్తోందని దక్షిణ ఆసియా దేశాల గృహ మంత్రులను రాజనాథ్‌సింగ్ ఒప్పించనున్నాడట! పాకిస్తాన్‌లోనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మిగిలిన సార్క్ దేశాలనుంచి ఒంటరిని చేయడమంటే ఇదే! కానీ ఈయన సాక్ష్యాధారాలను తిరస్కరిస్తూ పాకిస్తాన్ గృహమంత్రి ప్రసంగిస్తాడు! అప్పుడేమవుతుంది! వందల పేజీల సాక్ష్యాధార పత్రాలను వివరించి విడివిడిగా నిగ్గు తేల్చి పాకిస్తాన్ బీభత్స జిహాదీ వికృత రూపాన్ని బహిర్గతం చేయడం సార్క్ వేదికపై సాధ్యమా? ఈ బహుళ దేశ సమాఖ్య సభ్యదేశాలు ఈ విషయాన్ని-పాకిస్తాన్ ప్రేరిత బీభత్స కాండను-ఇదివరకే ఎఱిగి ఉన్నాయి. కొత్తగా ఎఱుక పరచాలని యత్నించడం కథను మొదటికి తేవడం మాత్రమేకాగలదు! పాకిస్తానేతర సార్క్ దేశాలకు మన మంత్రులు మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ప్రత్యేక దూతలు వెళ్లి పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స జిహాదీ కలాపాలను వివరించడంవల్ల మాత్రమే పాకిస్తాన్‌ను ప్రాంతీయ సమాఖ్యలో ఒంటరి చేయడానికి వీలవుతుంది!
ఆ పని ఇదివరకే జరిగి ఉండాలి! జరిగి ఉండినట్టయితే పాకిస్తాన్‌ను మనం సార్క్ దేశాల మధ్య ఎప్పుడో ఒంటరిని చేసి ఉండేవారం. అలా ఒంటరి అయిన పాకిస్తాన్‌ను తన బీభత్స జిహాదీ కలాపాలను విడనాడవలసిదిగా మిగిలిన సార్క్ దేశాల ప్రభుత్వాలు కోరి ఉండాలి! కోరే విధంగా మన ప్రభుత్వం ఈ ఇరుగుపొరుగు దేశాల మిత్రులను మన ప్రభుత్వం ఒప్పించి ఉండాలి! బీభత్స జిహాదీలను తయారుచేయడం వారిని ఉసిగొలపడం మానుకోవాలి... లేదా సార్క్‌నుంచి మీ దేశాన్ని వెళ్లగొడతాము అని ఇరుగుపొరుగు సార్క్ దేశాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం మన తార్కిక లక్ష్యం. అప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం దారికి రాని పక్షంలో సార్క్‌నుంచి పాకిస్తాన్‌ను వెళ్లగొట్టించడం తార్కికమైన న్యాయమైన మన విధానం. 1993లో పాకిస్తాన్ ప్రభు త్వం దావూద్ ఇబ్రహీం ముఠాను ఉసిగొలిపి ముం బయిలో భయంకర బీభత్సకాండను జరిపించిన నాడే ఈ మన విధానం అమలు జరిగి ఉంటే పాకిస్తాన్ ఒంటరి ఎప్పుడో అయి ఉండేది! జమ్ము కశ్మీర్‌లో పాకిస్తానీ జిహాదీలు, పాకిస్తాన్ ప్రేరిత స్థానిక జిహాదీలు కలిసికట్టుగా అల్పసంఖ్యాక హిందువులను వేలమందిని హత్య చేసిననాడే, లక్షల మందిని వెళ్లగొట్టిన నాడే ఇరుగు పొరుగు దేశాల మధ్య పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒంటరిని చేసే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రారంభించి ఉండాలి! ఇందుకు పూర్వరంగంగా మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని జిహాదీ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ-టెర్రరిస్ట్ రిజీమ్-గా గుర్తించి ఆ దేశంతో సకలవిధ సంబంధాలను రద్దు చేసుకుని ఉండాలి! రాకపోకలను స్తంభింప చేసి ఉండాలి! ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేసాయి. పాకిస్తాన్ బీభత్సకాండకు బలి అవుతున్న మనమే, ఆ దేశ ప్రభుత్వాన్ని టెర్రరిస్ట్ రిజీమ్‌గా గుర్తించి ఒంటరిని చేయనప్పుడు, ఇతర దేశాలకు ఆసక్తి ఎందుకుంటుంది?
కానీ మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండను నిరసించడం, అభిశంసించడం, హెచ్చరించడం,ఆ తరువాత మళ్లీ చర్చలను స్నేహసంబంధాలను పునరుద్ధరించడం ఒకే సంవత్సరం వ్యవధిలో జరిగిపోతుండడం దశాబ్దుల విధాన వైపరీత్యం! పట్టుమని రెండేళ్లపాటు మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్న చరిత్ర లేదు! అందువల్ల పాకిస్తాన్‌ను దారికి తేవాలన్న మన విజ్ఞప్తులు, కోరికలు అంతర్జాతీయ సమాజానికి ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాలకు హాస్యరస గుళికలుగా మారిపోయాయి! ఇప్పుడైనా పాకిస్తాన్‌లో జరిగే సమావేశానికి మేము రాము..అని మన ప్రభుత్వం చెప్పి ఉండాలి! పాకిస్తాన్‌కు వెళ్లి రావడానికే రాజనాథ్‌సింగ్ నిశ్చయించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గత డిసెంబర్‌లో పాకిస్తాన్‌కు వెళ్లి మైత్రి నెరపి వచ్చిన తరువాత పాకిస్తానీ జిహాదీలు వారం తిరగక పూర్వమే పఠాన్‌కోటపైదాడి చేసారు...పాకిస్తాన్ ప్రతిస్పందనకు ఇది అత్యంత సమీపగతంలోని సాక్ష్యం!