మెయన్ ఫీచర్

తెలంగాణ గుండెపై జిల్లాల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనందానికి విషాదం ఎప్పుడు విలోమంగా వుంటూనే వుంది. ఒకరి అవసరాలు మరొకరికి అనవసరాలుగా వుం టాయి. అనవసరం అనే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి నిరోధకులుగానే కనబడతారు. ఓ సమస్యను పరిష్కరించడానికై మరో సమస్యను ముందుకు తేవడం పాలక నీతి. ఒక రాజెప్పుడూ పక్క రాజును నిద్రపోనీయనట్లే పాలకులెప్పుడు పాలితుల దృష్టిని మళ్ళించడం ఓ కౌటిల్య నీతే! ఇలాంటి వ్యవస్థలో రాజ్యాంగం ఉనికిలో మాత్రమే వుంటుందని, అదెప్పుడు పనిచేయదని, కాని రాజకీయాలెప్పుడు అది పనిచేస్తున్నట్లు భ్రమింపచేస్తారని గ్రానివిల్లే ఆస్టిన్ అన్న చరిత్రకారుడి మాటలు నిజంగా అక్షర సత్యాలే!
ఇల్లుకాలి ఒకడేడిస్తే, ఒళ్ళు బలిసి మరొకడు ఏడిసినట్లుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాల్లో కనపడుతున్న దృశ్యం ఇదే! చిన్న రాష్ట్రాలతోపాటుగా, చిన్న జిల్లాల నినాదం తెలంగాణ ఉద్యమ అజండా కాదు. ప్రాంతీయ అసమానతలను తొలగించడం ద్వారా ఆంధ్ర ప్రాంతంతో సహా అన్ని ప్రాంతాలు, బాగుపడుతాయని, ఆవిధంగా బాగుపడాలనేది తెలంగాణ ఉద్యమ నినాదం. తెలంగాణ సాకారమైతే సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి, రైతు ఆత్మహత్యలుండవని, నిరుద్యోగ సమస్య సమసిపోతుందని, ప్రాంతీయులకే ఉద్యోగాలు దక్కుతాయని, ప్రజారోగ్యం, ప్రభుత్వ విద్య బాగుపడుతుందని, బాగుపడాలని భావించాం. రెండు సంవత్సరాలు గడిచాయి. మరో రెండు సంవత్సరాలు పోతే, ఆవలి సంవత్సరం ఎన్నికల సంవత్సరమే. ఏదైనా జరగాలంటే ఈ రెండు సంవత్సరాల్లోనే జరగాలి. గత రెండు సంవత్సరాల అభివృద్ధిని సమీక్షిస్తే, బహుశా సంతోషపడేది పాలకపక్షంలోని లబ్దిదారులే కావచ్చు! సాధారణ ప్రజలు, విద్యార్థులు, యువకులు ఎలా స్పందిస్తారో వారిని పలకరిస్తేగాని తెలియదు. పలకరించాలనే ఆలోచననే లేకపోవడం మన నిద్రావస్థకు నిదర్శనం. ప్రతి ఇంటా విద్యారంగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వ్యవసాయ రంగ సమస్యలు, కుల వృత్తుల సమస్యలు, అన్నింటికీ మించి ఆరోగ్య సమస్యలు గతానికి భిన్నంగా మారలేదు. ఆసరా పథకాలు వీటికి సమాధానం కాలేదు. ఈ దిశగా ఆలోచించని ప్రభుత్వాలు కొత్త పథకాలకు ఊపిరిపోసి, ప్రజల దృష్టిని మళ్ళిస్తున్నాయి. ఈ కోవలోనివే కొత్త జిల్లాల పథకం.
భౌగోళికంగా అసమంగా వున్న ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల చర్చ అప్పుడప్పుడు వచ్చినమాట వాస్తవమే! కాని ప్రజలకు ఇదో జీవన్మరణ సమస్యకాదు. చిన్న జిల్లాలైతేనే ప్రజల సమస్యలన్నీంటికి పరిష్కారం అంతకన్నా కాదు. ఈ మూడు జిల్లాల్లోకూడా జిల్లా కేంద్రాలు జిల్లా నడిబొడ్డునకాక, ఓ మూలన వుండడంతో ఇబ్బందులు కనపడుతున్నాయి. మిగతా జిల్లాల పరిస్థితి ఈ విధంగా లేదు. తెలంగాణ సాధనకై పురికొల్పిన సమస్యలన్నీ సర్దుకున్న తర్వాత, జిల్లాల్ని విభజిస్తే పెద్దగా ఇబ్బంది వుండేది కాదు. అది అన్ని జిల్లాల్ని విభజించాల్సిన అవసరం అంతకన్నా లేదు. జిల్లా చిన్నదా, పెద్దదా అనేది కాకుండా పాలన సౌలభ్యాల్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తే, పెద్ద జిల్లాలలో ఏర్పడే సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి. వీటిపట్ల దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, ముందుగా జిల్లాల విభజనను ముందుకు తెచ్చిందంటే ప్రజల వౌలిక సమస్యల్ని పక్కదారి పట్టించడానికే!
అయినా, కొత్త జిల్లాల అవసరం లేదా...? అంటే, కాదనే వారు ఎవరు వుం డరు. కాకపోతే విభజిస్తున్న తీరు, విభజిస్తున్న కాలం సందేహంగా వుంటున్నాయి. ఉన్నపళంగా 14-15 కొత్త జిల్లాల్ని ఏర్పాటుచేయడంకన్నా, ప్రయోగాత్మకంగా, పైన పేర్కొన్న మూడు జిల్లాల్ని ముందుగా విభజించి, వాటి ద్వారా ఒనగూడే ప్రయోజనాల్ని ప్రజలకు చూపాల్సింది. ఎలాగో మళ్ళీ గెలిచే అవకాశం వున్న తెరాస ప్రభుత్వం, రెండో దశగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. అది కూడా స్థానిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా జరగాలి. తెలంగాణలో నిజానికి నిజామాబాద్ జిల్లా చిన్న జిల్లా. అత్యధిక దూరాన్ని జుక్కల్, మద్దూర్ కేంద్రాలు కలిగి వున్నాయి. వీటిని తీసుకొచ్చి కొత్తగా ఏర్పడబోయే కామారెడ్డిలో కలపాలనుకోవడం, ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందే! అలాంటప్పుడు బాన్స్‌వాడ లేదా బిచ్‌కుంద కేంద్రంగా ఓ జిల్లానో, లేదా రెవెన్యూ డివిజన్‌నో ప్రకటించాలి. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో వున్న జగిత్యాలను, సిరిసిల్లను ప్రకటించి మంథని, మహాదేవ్‌పూర్ ప్రాంతాల్ని పట్టించుకోకపోవడం ఓ అనాలోచిత విధానం. ఇలాంటి పరిస్థితే మహబూబ్‌నగర్‌లో ఏర్పడింది. అందుకే వరంగల్‌లో జనగామ, ఇక్కడ గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజలు ఉద్యమాల్ని మొదలుపెట్టారు. ఎట్లాగో తెలంగాణను సాధించుకున్న ప్రజలకు ఇదో కొత్త సమస్యగా ముందుకు రావ డం బాధాకరం. ఇక్కడ ఎవరి వాదన వారికి వుంది.
ఉద్యమ కాలపు అజండా అంశాలు పూర్తికాకముందే, అర్థం పర్థంలేని ప్రాజెక్టులను ముందేసుకొని, భూసేకరణ చేస్తుంటే, పెరుగుతున్న ప్రజల నిరసనను ప్రక్కదారి పట్టించే ప్రయోగమే కొత్త జిల్లాల పథకం. నిజానికి ఎన్‌టిఆర్ హయాంలో ఏర్పాటైన మండల వ్యవస్థ పాలన వికేంద్రీకరణలో భాగమే! ఇప్పుడు మండలాలకు మరికొన్ని మండలాల్ని ముందుగా ఏర్పాటుచేసి, గత ప్రభుత్వాలలో అందని పాలనకు తెరాస ప్రభుత్వం అందించితే ప్రజలు సంతోషించేవారు. విధిగా ఇది జరగాల్సిన చర్యనే! మండల, పాత తాలూకా స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిదాకా ప్రజలకు అందే సేవలు ఎలా వున్నాయో గత రెండు సంవత్సరాలలో ఏ స్థాయిలోను ఓ సమీక్ష జరగలేదు. ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో ఈ ఊసే లేదు. పాలకులు మారారు తప్ప, పాలనలో మార్పు లేనప్పుడు, మరింత అందుబాటులోకి ప్రభుత్వ యంత్రాంగం వచ్చినా ప్రయోజనం శూన్యం. ఓ ఎంఆర్‌వో, ఎంపిడివో, ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో, వార్డెన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ లాంటి వారిని సరిగా పనిచేయించని వ్యవస్థ ప్రతినిధులైన జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్, పోలీసు బాసులు మరికొంతమంది పెరిగితే ప్రజలకు ఒరిగేది ఏమి వుండదు.
వస్తే, వౌలిక సదుపాయాలు రావచ్చు, జిల్లా యంత్రాంగం మరింత దగ్గర కావచ్చు! అయితే, అందరు వూహించినట్లుగా ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం చాలా తక్కువ. భౌగోళికంగా, జనాభా పరంగా జిల్లాలు చిన్నవిగా మారినప్పుడు, ఇప్పుడున్న జిల్లాస్థాయి సిబ్బందినే పంపకాలు చేస్తారు. తెలంగాణ ఏర్పడగానే సెక్రటేరియేట్ ఉద్యోగుల సంఖ్య అమాంతంగా పెరిగిందేమి లేదు. పెరిగే అవకాశం లేదు. పోతే, పైస్థాయి ఉన్నతాధికార్ల సంఖ్యతోపాటు, ఐఎఎస్, ఐపిఎస్ అధికార్ల అవసరం పెరుగుతుంది. మొత్తంగా లెక్కిస్తే ఈ సంఖ్య వంద దాటరు. అయినా కొన్నైనా ఉద్యోగాలు రాకపోతాయంటే, ఇప్పటికి నింపబడిన ఖాళీలెన్నో బేరీజు వేసుకోవాలి. జిల్లాలు ఎన్నైనా, ఉపాధ్యాయుల పోస్టులు పెరగవుగాక పెరగవు. పైగా ఉన్న ఉద్యోగాలుంటే నిజంగా బంగారమే!
ఇలాంటి పరిస్థితిలో కొత్త జిల్లాల పథకం అమాంతంగా ఎందుకు ముందుకు వచ్చిందో, వస్తున్నదో బుద్ధిజీవులకు రాజకీయంగా చైతన్యంగల వారికి అర్థమయ్యే వుంటుంది. ఆలస్యంగానైనా ప్రజలకు అర్థమయ్యే వుంటుంది. ఇప్పటికే బీడు భూములుగా మారిన వ్యవసాయ భూముల్ని రియలెస్టేటుగా మార్చాలంటే, పాలకుల అనుంగులకు కాంట్రాక్టులు కావాలంటే, భూదందాలు జరగాల్సిందే! ఇప్పటికే వైఎస్‌ఆర్ హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఉరితాడును బిగించి పోయాడు. కెసిఆర్‌కు మిగిలింది లోపల స్కైవేలు మాత్రమే! దీనికితోడు బయట మరో ప్రాంతీయ రింగ్ రోడ్డును ఏర్పాటుచేస్తేనే, వంద కిలోమీటర్ల పరిధిలోని భూములకు బూమ్ వస్తుంది. అలాగే కొత్త జిల్లాలకు రూపకల్పన చేస్తే భూమి ధరలు మరింతగా కొండెక్కి కూర్చుంటాయి. అందుకే కొత్త జిల్లాల కేంద్రాలన్నీ భూదందాలతో ఉడుకుతున్నవే కావడం గమనార్హం! ఇప్పటికే ఈ కేంద్రాల చుట్టూగల వందలాది చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఈ కొత్త జిల్లాల పథకం వీటికి మరణ శాసనం రాయడానికే!
ఇప్పటికే వున్న నిజాం చక్కెర కర్మాగారం మూడు యూనిట్లను తెరిపించని ప్రభుత్వం మిషన్ కాకతీయతో ఏ ప్రాంతాలను పారిస్తుందో తెలియదు. సిరిపూర్ కాగజ్‌నగర్ పరిస్థితి ఇదే! అయినా, ఫార్మాసిటీతో, టీహబ్‌తో లక్షలాది ఉద్యోగాలు వచ్చినట్లు ప్రకటనలు., ఓ ప్రాంత రైతుల ఉపయోగాలంటూ, మరో ప్రాంత రైతుల్ని ముంచే వ్యవస్థవద్దనే తెలంగాణ కావాలంటిమి. తెలంగాణలో ఇదే పరిస్థితి వుంటే, ప్రజల గతి ఏంటి? వీటికి సమాధానాలు కాదు- ముందు ఈ దిశగా ఆలోచిస్తున్నామా అనేది ప్రశ్న.......?

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162