సంపాదకీయం

జయించిన జాధవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెదర్‌లాండ్స్ రాజధాని హేగ్ నగరంలోని ‘శాంతి భవనం’లో నెలకొని ఉన్న ప్రపంచ న్యాయస్థానంలో మానవత్వం మరోసారి విజయం సాధించింది. కులభూషణ్ జాధవ్ నిర్దోషి అన్న వాస్తవం ప్రపంచ సమాజం గుర్తించింది. గురువారం అంతర్జాతీయ న్యాయస్థానానికి చెందిన పదకొండుమంది నిర్ణేతలు ఏకగ్రీవంగా ‘కులభూషణ జాధవ్ మరణ శిక్ష అమలు జరుపరాదని’ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిర్దేశించడం మన దేశానికి గొప్ప ఊరట కలిగించిన పరిణామం! ఇరాన్ నుంచి పాకిస్తాన్ సైన్యం అపహరించుకొనిపోయిన మన నౌకాదళం మాజీ అధికారి కులభూషణ్ సురక్షితంగా మనదేశానికి తిరిగి రాగలడన్న విశ్వాసానికి అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పిన తీర్పువల్ల తార్కికమైన ప్రాతిపదిక ఏర్పడింది! గురువారం నాటి తీర్పు తాత్కాలికమైనది.. కానీ న్యాయస్థానం ప్రస్తావించిన రెండు ప్రధాన అంశాల ప్రాతిపదికగా తుది తీర్పు మన దేశానికి, అంతర్జాతీయ ప్రజాస్వామ్య నిబంధనలకు, వౌలిక మానవీయ సంస్కారానికి అనుకూలంగా ఉండడం ఖాయమన్నది బలపడిన విశ్వాసం! కులభూషణ్ జాధవ్ నిర్బంధం విషయంలో అనేక అనుమానాలు ఏర్పడి ఉన్నాయన్నది అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తావించిన మొదటి అంశం. కులభూషణ్ జాధవ్‌కు దౌత్య సదుపాయాలు కల్పించకపోవడం రెండవది! ఈ రెండు అంశాలూ జాధవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. మనదేశానికి అనుకూలంగా ఉ న్నాయి! జాధవ్ తమ దేశంలో చొరబడి ‘గూఢచర్య విద్రోహ బీభత్స కలాపాలు’ జరుపుతుండగా పట్టుకున్నామని పాకిస్తాన్ ప్రభుత్వం వారు చెబుతున్న అబద్ధం తుది విచారణ సందర్భంగా బద్దలు కా వడం ఖాయం! ఎందుకంటే జాధవ్ చట్టబద్ధమైన ‘ప్రయాణ అనుమతి ప త్రం’-పాస్‌పోర్ట్-కలిగి ఉ న్నాడు, చట్టబద్ధమైన ‘ప్ర వేశ అనుమతి పత్రం’ -వీసా పొంది ఇరాన్‌లో నివసించాడు! ఆయన వద్ద ఆయన పాస్‌పోర్ట్ ఉందని పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇరాన్‌లోనుంచి కాని మన దేశంలోనుంచి కాని జాధవ్ పాకిస్తాన్‌లోకి అక్రమంగా రహస్యంగా చొరబడి ఉన్నట్టయితే తన ‘పాస్‌పోర్ట్’ను తన వెంట తీసుకుపోడు! విద్రోహ కలాపాలు సాగించేవారు, గూఢచారులు మారుపేర్లతో చెలామణి కావడం జగమెరిగిన సత్యం! జాధవ్‌ను పాకిస్తాన్ సైనికులు ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి అపహరించుకుని పోయారన్న వాస్తవం అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగే తుది విచారణ సందర్భంగా ధ్రువపడడం ఖాయం. ఇలా అపహరించడం ‘ప్రభుత్వ బీభ త్సం-స్టేట్ టెర్రరిజమ్-!! ఇంతవరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పుతోందన్న సత్యం మాత్రమే ప్రధానంగా ప్రచారమైంది. ఇలా ఉసిగొల్పడం ‘ప్రభుత్వ ప్రేరిత ఉగ్రవాదం’-స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమ్!! కానీ జాధవ్‌ను అపహరించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వమే స్వయంగా బీభత్సకాండకు పాల్పడింది! ఈ వాస్తవం అంతర్జాతీయ న్యాయస్థానం జరిపే తుది విచారణ సందర్భంగా ధ్రువపడడం ఖాయం! జాధవ్ ‘పాస్‌పోర్ట్’ దీనికి తిరుగులేని సాక్ష్యం!
తమ దేశంలోని మన రాయబార, దౌత్య కార్యాలయాలకు, నిర్బంధంలో ఉన్న జాదవ్ తరఫున కలుగ చేసుకునే హక్కు లేదన్నది పాకిస్తాన్ చేసిన వాదం! తమ దేశపు చట్టాల ప్రకారం జాధవ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి కానీ, ఆయనకు సహాయం అందించడానికి కాని మన దేశపు దౌత్యవేత్తలకు అవకాశం లేదని పాకిస్తాన్ ప్రకటించింది! కానీ ‘వియెన్నా ఒప్పందం’ ప్రకారం నిర్బంధంలో ఉన్న జాధవ్‌ను కలుసుకొనడానికి ఆయన తరఫున న్యాయవాదిని నియమించడానికి మన దేశానికి హక్కు ఉన్నట్టు గురువారం అంతర్జాతీయ న్యాయస్థానం స్పష్టం చేసింది! ఈ దౌత్య నియమానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం జాధవ్‌ను ‘విచారించి’నట్టు స్పష్టమైంది. జాధవ్‌ను పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం అతి రహస్యంగా అమిత వేగంగా విచారించి తీర్పు చెప్పేసింది! కేవలం పదమూడు నెలలలో ‘న్యాయ ప్రక్రియ’ పూర్తయిపోయింది! జాధవ్‌కు ‘దౌత్య సహాయ సదుపాయం’-కాన్సిలర్ యాక్సెస్-కల్పించలేదని పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలా చాటుకుంది. కానీ ‘కాన్సులర్ యాక్సెస్’ను పొందే హక్కు జాధవ్‌కు, సమకూర్చే అధికారం మన ప్రభుత్వానికి ఉన్నాయన్నది అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం చేసిన స్పష్టీకరణ! అందువల్ల ఈ ద్వైపాక్షిక, అంతర్జాతీయ దౌత్య నిబంధనలకు విఘాతకరమైన రీతిలో పాకిస్తాన్ సైనిక న్యాయస్థానంలో రహస్యంగా ఏకపక్షంగా కొనసాగిన ‘విచారణ ప్రక్రియ’ను అంతర్జాతీయ న్యాయస్థానం రద్దు చేయవచ్చు...
ఈ భయంతోనే పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానానికి జాధవ్ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని వాదిస్తోంది! ఓడిపోయిన తరువాత ఇప్పుడిలా ప్రకటించడం మరో ఎత్తుగడ మాత్రమే! అంతర్జాతీయ న్యాయస్థానాలను బహిరంగంగా ఆధికారికంగా ధిక్కరించే దుస్సాహసానికి పాకిస్తాన్ ఒడిగట్టబోదు! అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం నిజంగా భావిస్తున్నట్టయితే న్యాయస్థానంలో తన వాదాన్ని ఎందుకు వినిపించినట్టు? ‘కోర్టు’కు హాజరయి వాదం వినిపించడం ‘కోర్టు’కున్న న్యాయాధికార పరిధిని అంగీకరించడమే! ఒక దేశంలో ‘నిందితు లు’గా విచారణకు గురి అవుతున్న మరో దేశపు పౌరుల హక్కుల గు రించి వియెన్నా ఒప్పందం నిర్దేశిస్తోంది. ఇలాంటి నిందితులకు తమ స్వదేశ ప్రభు త్వం నుండి, దౌత్యవేత్తల నుండి సహాయ సహకారాలను స్వీకరించే హక్కు ఉందని దౌత్య సదుపాయ వ్యవహారాల ‘వియెన్నా’ ఒప్పందం నిర్దేశిస్తోంది. ఆస్ట్రియా రాజధాని వియెన్నాలో కుదిరిన ఈ ‘అంతర్జాతీయ ఒప్పందం’ వ్యవస్థలో పాకిస్తాన్ భాగస్వామి! అయితే ఈ ఒప్పందంలోని సదుపాయాలు ‘గూఢచర్యం నిర్వహించే శత్రుదేశాల’ వారికి వర్తించబోవన్న పాకిస్తాన్ వాదాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం తిరస్కరించింది! ఇలా తీర్పు వెలువడిన తరువాత న్యాయస్థాన అధికార పరిధిని తాము అంగీకరించబోమని పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు ప్రకటించడం తమ దేశంలోని ‘జిహాదీ’లను సంతృప్తి పరచడానికి మాత్రమే!
అంతర్జాతీయ న్యాయస్థానం ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాలన్నింటికీ అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధి వర్తిస్తుందని ‘న్యాయస్థానం’ నియమావళిలో పేర్కొన్నారు. పాకిస్తాన్ ‘సమితి’లో సభ్యదేశం! 1961లో పాకిస్తాన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో మన దేశానికి వ్యతేరకంగా అభియోగాన్ని దాఖలు చేసింది! ఆ అభియోగాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. కృష్ణగంగ నదీ జలాలను వివాదం చేసిన పాకిస్తాన్ అంతర్జాతీయ మథ్యవర్తిత్వ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. ఆ విషయంలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. అందువల్ల జాధవ్ విషయంలో పాకిస్తాన్ గురువారం నాటి తీర్పును అంగీకరించక తప్పదు...