రచ్చ బండ

పొగడ్తలు-విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు చతికిలపడ్డాయి. బిజెపికి మిత్రపక్షమైన తెలుగు దేశం పార్టీ బలంగా నిలిచినప్పటికీ మూడో స్థానంలోనే నిలిచింది. జాతీయ పార్టీలకు ఒక విధానం ఉంటుంది. జాతీయ నాయకులు ఇతర రాష్ట్రాల్లో సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తారు. అక్కడి రాష్ట్ర పార్టీ నేతలకు ఇబ్బంది లేకుండా అవతలి పార్టీపై విసుర్లు విసరడం సహజం. కానీ తెలంగాణ బిజెపి నేతలకు మాత్రం ఇటీవల విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనపై కేంద్ర మంత్రుల పొగడ్తలతో బిజెపి రాష్ట్ర నాయకుల దిమ్మతిరిగింది. అది కూడా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలకు ముందు. ఒకవైపు కేంద్ర మంత్రుల పొగడ్తలు, మరోవైపు పార్టీ రాష్ట్ర నేతల విమర్శలతో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు విస్తుపోయారు. ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్ ఉన్న నాయకుడని, కొత్త రాష్టమ్రైన తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు నిరంతరం కష్టపడుతున్నారని ఇటీవల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా పొగిడేసి పార్టీ రాష్ట్ర నాయకులకు కంగు తినిపించారు. అకాలీదళ్‌కు చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మరో అడుగు ముందుకేసి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన అద్భుతంగా ఉందని పొగిడారు. చివరకు తెలంగాణకు చెందిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కూడా తానేమీ తీసిపోనన్నట్లు కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ఐడిహెచ్ కాలనీలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణం చాలా బాగుందని అన్నారు. గత నెల ముఖ్యమంత్రి కెసిఆర్‌ను సిబిఐ అధికారులు ఒక అంశంపై విచారణ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ అంశాన్ని విలేఖరులు దత్తాత్రేయను ప్రశ్నించగా, తన దృష్టికి రాలేదని చెప్పారు. మరోవైపు వరంగల్‌లో ప్రచారం చేసేందుకు వెళ్ళిన దత్తాత్రేయ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్ల ద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని విమర్శించారు.
ప్రతి రోజూ టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహారిస్తున్న తీరు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబడుతూ ఈ ప్రశ్నలకు బదులేదీ? అంటూ ఆయన ముఖ్యమంత్రికి 32 ప్రశ్నలు సంధించారు. కాకతీయ విశ్వవిద్యాలయానికి 18 నెలలుగా వైస్-్ఛన్సలర్‌ను నియమించలేదని, హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మిస్తామన్న హామీ ఏమైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా దళితునే్న చేస్తామన్న హామీ ఏమైందని, గిరిజన తండాలను, గూడెంలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని హామీ ఏమైందని, మహిళా విశ్వవిద్యాలయం ఏమైందని ఇలా 32 ప్రశ్నలు సంధించారు.
మరోవైపు తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఎంపి కవిత, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు చేస్తున్న విమర్శలపై కిషన్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇళ్ల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇళ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన మేరకు కేటాయించడం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం బిజెపి పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బిజెపియేతర రాష్ట్రాల పట్ల మరో న్యాయం చేస్తున్నదని, విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ఎంపి కవిత కేంద్రాన్ని నిలదీయడంపై కిషన్ రెడ్డి ప్రతిస్పందిస్తూ కవిత నోటికి ఏదీ వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు గృహాలు కేటాయించింది. ప్రతి ఇంటి నిర్మాణానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. అయితే 18న సమీక్ష ఉన్నప్పటికీ, సకాలంలో ప్రతిపాదనలు పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై కేంద్రంపై ఏడుస్తున్నదని బిజెపి గరమైంది. చివరకు 17వ తేదీ సాయం త్రం ప్రతిపాదనలు పంపించిందని, అప్పటికే సమావేశం అజెండా సిద్ధమైనప్పటికీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు జోక్యంతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు అజెండాలో చేర్చి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేర కు 10,290 ఇళ్లకు నిధుల కేటాయించిందని బిజెపి రాష్ట్ర నాయకుల వాదన. ఇంత చేసినా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కేంద్రం వివక్ష చూపిస్తున్నదని విమర్శించడం భావ్యం కాదని మండిపడుతున్నారు.
టిఆర్‌ఎస్ విపక్షాలను దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నదని బిజెపి రాష్ట్ర నేతలు గుర్రుగా ఉన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరితేనే నిధులు విడుదల చేస్తామని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను భయపెడుతున్నట్లు విమర్శిస్తున్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు ఒక రకంగా, విపక్షాల ఎమ్మెల్యేలకు మరో రకంగా నిధులు కేటాయిస్తూ వివక్ష చూపిస్తున్నదని బిజెపి నేతల ఆరోపణ.
ఇలా కేంద్ర మంత్రుల పొగడ్తలు, రాష్ట్ర నేతల విమర్శలతో పార్టీ శ్రేణులకు చిర్రెత్తిందని, ప్రజల్లో అయోమయం కలిగి చివరకు వరంగల్ ఉప ఎన్నికల్లో మొదటి స్థానం కాదు కదా, మూడో స్థానానికి నెట్టివేయబడ్డామని బిజెపి నేతల్లో కొందరి బాధ. ఇదీ ఒక సాకేనేమో!.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి