మెయన్ ఫీచర్

ఇంకెప్పుడు పాఠాలు నేర్చుకుంటాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి సందర్భంగా మరోసారి మన భద్రతావ్యవస్థలో లొసుగులు బయటపడ్డాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ, కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంజాబ్ ప్రభు త్వం పంపిన నివేదిక, భారత వైమానిక దళానికి చెందిన కోర్టు చేసిన విచారణ.. ఇవన్నీ భద్రతా లోపాలనే ఎత్తిచూపాయి. అంతేకాదు నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో రెండు మిస్టరీలకు సమాధానం లభించాల్సి ఉంది. ఉగ్రవాదులు చొరబడ్డారన్న సంగతి వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మొద్దునిద్ర వదలని పంజాబ్ పోలీసులు తీరిగ్గా రంగంలోకి దిగడం మొదటిది కాగా, ఏరివేత చర్య ప్రారంభమైన తర్వాత సైన్యం ఎందుకు మార్గదర్శనం చేయలేదన్నది రెండవది. ఇక మొత్తం ఉగ్రవాద ఏరివేత చర్యను అంతా తానై నడిపిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి.
పంజాబ్‌లో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో పఠాన్‌కోట్‌పై జరిగిన దాడి రెండవది. ఈ రెండు సందర్భాల్లోనూ పంజాబ్ పోలీసులు తమ ధైర్య సాహసాలు వెల్లడయ్యే రీతిలో వ్యవహరించకపోవడం విచారకరం. 1999లో క్రిస్‌మస్ పర్వదినాన ఖాట్మండు నుంచి వస్తున్న ఐసి-0184వ నెంబరు విమానం హైజాక్‌కు గురై, అమృత్‌సర్‌లో దిగింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖందహార్‌కు వెళ్లేముందు అక్కడ 50 నిముషాల సేపు నిలిచింది. ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన మాజీ పంజాప్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కేపీఎస్ గిల్, సి-814 విమానాన్ని నిలువరించడంలో విఫలమైన మన దళాలను అప్పట్లో తీవ్రంగా తప్పుపట్టారు. విమానంలోని ప్రయాణికులను విడిపించడానికి నాటి ఎన్‌డిఎ ప్రభుత్వం, జైళ్లలో ఉన్న ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టాల్సి వచ్చింది.
విచిత్రమేమంటే అప్పట్లో చర్చలకు కాందహార్‌కు పంపిన వారిలో అజిత్ దోవల్ కూడా ఉన్నారు. నాడు విడిచిపెట్టిన ముగ్గురు ఉగ్రవాదుల్లో వౌలానా మసూద్ అజహర్ కూడా ఉన్నాడు. విడుదలైన తర్వాత జైషే మహమ్మద్ సంస్థను స్థాపించాడు. ప్రస్తుత పఠాన్‌కోట్ దాడి వెనుక ఇతగాడే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన తర్వాత అప్పటి పంజాబ్ డీజీపి సర్బజిత్ సింగ్ ప్రైవేటు సంభాషణల్లో.. గిల్ మాదిరిగా తాను ధైర్యంగా చర్య తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని అంగీకరించారు. అప్పుడు కూడా నేడు పంజాబ్‌ను పాలిస్తున్న బాదల్ కుటుంబమే అధికారంలో ఉంది. ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేవరకు వేచి ఉండమని సర్బజిత్ సింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సూచించిందట! ఇక ఢిల్లీలోని క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూపుకు కూడా సలహాలు ఇచ్చారు. విమానం టైర్లను తొలగించాలని ఇంటెలిజెన్స్ బ్యూరో సలహా ఇచ్చింది. ఇక జాతీయ భద్రతా దళం-ఎన్‌ఎస్‌జి-కమెండోలు అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు రావడం చాలా ఆలస్యకావడం మరో ప్రహసనం. ఏతావాతా జరగాల్సిన దారుణం జరిగిపోయాక ఎవరిపై వేలెత్తి చూపినా ఏం ప్రయోజనం?
ఇక 2016 సంవత్సరానికి వద్దాం. పంజాబ్ పోలీసుల్లో అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా? అని ప్రశ్నిస్తే కించిత్‌మాత్రం కూడా రాలేదన్నదే స్పష్టమైన సమాధానం. గురుదాస్‌పూర్ ఎస్‌పి సల్వీందర్ సింగ్‌ను ఉగ్రవాదులు అపహరించారు. ఆయనగారి ఎస్‌యువి (నీలిరంగు లైటు కలిగినది) కారు, నూతన సంవత్సరం అర్థరాత్రి పోయాక అపహరణకు గురైంది. కారులో ‘‘నలుగురైదుగురు’’ వ్యక్తులు ఎకె-47 రైఫిళ్ళు ధరించి ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఇక వారి బారినుంచి ఏదోవిధంగా బయటపడి తన ఆధీనంలోని పోలీసు బలగాల్ని హెచ్చరించినా ఫలితం లేదు! కారులో ఆయనతో పాటు ఉన్న సహాయకుడు మాట్లాడుతూ తాను చెప్పిన విషయాలను పోలీసులు నమ్మలేదని చెప్పాడు. మరి డిసెంబర్ 30 నుంచి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి మరి! తమ తప్పిదం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మాట అట్లా ఉంచి, సల్వీందర్ సింగ్ అపహరణ వాస్తవమని నిర్ధారణ అయిన తర్వాత, దేశాన్ని అప్రమత్తం చేసింది తామేనని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. ఇంతకంటె దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా?
నమ్మశక్యం కాని హాస్యాస్పదమైన మాటలను పంజాబ్ పోలీసులనుంచి వింటు న్నాం. పఠాన్‌కోట్‌ను రక్షించడానికి, అక్కడ తనిఖీలు నిర్వహించడానికి వారు సిద్ధంగా ఉన్నారట!! కానీ దట్టమైన చీకటి కారణంగా వారాపని చేయలేకపోయారట!! చర్యకు తక్షణమే దిగాల్సి ఉన్నప్పటికీ పంజాబ్ పోలీసులు దాదాపు నాలుగు గంటపాటు కాలయాపన చేశారు. జనవరి 2 తెల్లవారుజామున ఉగ్రవాదులు దాడి మొదలుపెట్టారు. ఇక పంజాబ్ ఉప- ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కేంద్ర దళాల నిఘా వైఫల్యమంటూ తప్పంతా వారిపై నెట్టి తమ రాష్ట్ర పోలీసు బలగాలను వెనకేసుకురావడం వింతల్లోకెల్లా వింత!! సరిహద్దు వద్ద సరైన నిఘా లేకపోవడం వల్లనే ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారంటూ ఆరోపణలు. ఇందులో నిజముండవచ్చు. కాదనలేం. కానీ ఒక్కసారి ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించారంటే ఇక వారి పనిపట్టాల్సిన బాధ్యత పంజాబ్ పోలీసులది మాత్రమే!!
ఇక వైమానిక స్థావరం లోపల చేపట్టిన ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కూడా విమర్శలకు కారణమైంది. బహుశా భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఈ విమర్శలకు కారణమై ఉండవచ్చు. కానీ సైనిక చర్య ముగించడంలో చాలా ఆలస్యం జరగడం క్షేత్రస్థాయిలో నెలకొన్న గందరగోళాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యను ఒకే అధికార వ్యవస్థ నిర్వహించకపోవడం పెద్ద లోపం. కొందరు ఆరోపించిన విధంగా క్షేత్రస్థాయిలో కమాండింగ్ అధికారాన్ని అత్యుత్సాహంతో ఎన్‌ఎస్‌ఎ తీసుకోవడం మరో విచిత్రం. 1988లో సిక్కుల స్వర్ణ దేవాలయంలో దాక్కున్న మిలిటెంట్లను ‘‘ఆపరేషన్ బ్లాక్ థండర్’’ పేరుతో నిర్వహించిన సైనిక చర్యలో ఎన్‌ఎస్‌ఏ విజయవంతంగా ఏరివేయగలిగింది. బహుశా ఆ ఆత్మవిశ్వాసం తోనే ఎన్‌ఎస్‌ఏ ఈ ఆపరేషన్ చేపట్టడానికి ఉత్సాహం చూపి ఉండవచ్చు. ఇదిలావుండగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ‘‘వైమానిక స్థావరం సరిహద్దు మొత్తం 24 కిలోమీటర్ల దూరం, మొత్తం ఎగుడుదిగుడు ప్రాంతాలతో కూడి ఉంటుంది. ఇక్కడ జరిగిన ఆలస్యం, ప్రాణ నష్టానికి కారణం కాకపోవచ్చు’’ నన్నారు. ఇక జనవరి రెండున ఉగ్రవాదులను ఏరివేసే చర్య ముగిసిందంటూ రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో ప్రకటించడం మరో దురదృష్టకర పరిణామం.
ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని సైన్యానికి అప్పగించి ఉండాల్సిందని కొందరు వ్యాఖ్యాతలు పేర్కొనడం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం. పర్వతాలు, కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులను సైన్యం సమర్ధవంతంగా ఏరివేసిన ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. అందువల్ల సైన్యానికి ఈ బాధ్యత అప్పగించకపోవడం తెలివితక్కువతనమే. ఉగ్రవాదులను ఏరివేయడం, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపలు మొత్తం, చొరబాట్ల నిరోధక వ్యూహంలో భాగమే. ఉగ్రవాదుల దాడిని లేదా ముట్టడిని నిరోధించే చర్యలు మొత్తం ‘లక్షిత వ్యవహారం’ మాత్రమే కాదు అది ఉగ్రవాద వ్యతిరేక చర్య ప్రవృత్తిని కలిగివుంది. ఇక రెండవది 1984లో వినాశకర ఆపరేషన్ బ్లూస్టార్ ఆపరేషన్ తర్వాత, చాలా ఏళ్లుగా ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సైన్యం సముఖంగా లేదు. కాకపోతే అటువంటి కార్యకలాపాలకు మద్దతునిస్తోంది. ఇక నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్-ఎన్‌ఎస్‌జి-కి ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. 26/11 సంఘటన ఎన్‌ఎస్‌జికి నిజంగా మరణ శాసనంగానే మిగిలింది. ఈ నేపథ్యంలో దోవల్ ఎన్‌ఎస్‌జిని రంగంలోకి దించడం ద్వారా సరైనవిధంగానే వ్యవహరించారని చెప్పాలి.
ఎన్‌ఎస్‌ఎను విమర్శించడానికి సైన్యం సిద్ధంగానే ఉంటుంది. ఇదే సమయంలో దోవల్‌ను సమర్ధించేవారు తక్షణమే రంగంలోకి దిగడం కూడా ఖాయమే. కాకపోతే ప్రస్తుత సంఘటనపై ఆత్మశోధనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తన పరిధిలోకి కలుగజేసుకున్నాడంటూ విదేశాంగశాఖ దోవల్‌పై ఆరోపణలు చేయవచ్చు. సంస్థాగతమైన స్మృతిని విస్మరించడం అదీ పాకిస్తాన్‌తో నెరపే సంబంధాల విషయంలో తమ ను పక్కన పెట్టడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పఠాన్‌కోట్ దాడి సంఘటనలో ఎవరూ పట్టించుకోని దోవల్ సాధించిన ఒక సంక్లిష్ట విజయం ఉంది. ఈ దాడిలో పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ ‘ఐఎస్‌ఐ’ హస్తమున్నదనడంలో రహస్యమేం లేదు. చర్చలు కొనసాగించడంలో మన నిబద్ధతను వారు ఈవిధంగా పరీక్షిస్తున్నారు. శాంతి సాధనలో పాక్ నిబద్ధతను మనం ఆశ్చర్యంతో పరిశీలిస్తున్నట్టు! దాడి జరిగిన తర్వాత వివిధ దినపత్రికలు తమ సంపాదకీయాల్లో..రెండు దేశాల మధ్య చర్చలు నిలిచిపోవడానికి వీల్లేదని చాలా స్పష్టంగా రాశాయి. ఈ విషయంలో ఎక్కడా భిన్నాభిప్రాయం వ్యక్తం కాలేదు. మీడియా మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించలేకపోయిందని, దాడికి ముందు పరిస్థితి, తీవ్రవాదుల నిరోధక చర్యల్లో చోటు చేసుకున్న జాప్యంపై ప్రభుత్వం నుంచి తక్షణ సమాధానం లేదన్న విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా ఉగ్రవాదం విషయంలో దోవల్ ఒక లక్ష్యాన్ని సాధించగలిగారనే చెప్పాలి. పఠాన్‌కోట్ పర్యవసానం ఎట్లా ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌తో చర్చలు కొనసాగించాల్సిందేనన్న ఐక్య ప్రజాభిప్రాయాన్ని దోవల్ సాధించారన్నది మాత్రం ఖండించలేని వాస్తవం.

- ఆదిత్య సిన్హా