సంపాదకీయం

భాగ్యనగరంలో ‘భద్రత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో జన జీవనాన్ని ఆవహించి ఉన్న అభద్రత నిరంతరం తీవ్రతరవౌతోంది. అంతర్గత సంఘ విద్రోహ శక్తులు చెలరేగుతుండడం, విదేశీయ నేరస్థులు చొరబడిపోతుండడం పునరావృత్తమవుతున్న భద్రతా రాహిత్యతకు ప్రధాన ప్రాతిపదికలు! పాలనా యంత్రాంగంలో గూడుకట్టుకుని ఉన్న నిర్లక్ష్యం ఈ అభద్రతను పెంచుతోంది. పాలనా యంత్రాంగంలోను ప్రత్యేకించి నేర నిరోధక యంత్రాంగంలోను నేర ప్రవృత్తి పెరుగుతుండడం ప్రజలను భయంకర ప్రమాదాలకు గురి చేస్తున్న మరో సమకాలీన వికృతి! దాదాపు అన్ని ఖండాలనుండి భాగ్యనగరంలోకి వచ్చి చేరుతున్న విదేశీయులు భౌతిక బీభత్సకాండకు ఆర్థిక నేరాలకు పాల్పడుతుండడం నడుస్తున్న వైపరీత్యం. ఆఫ్రికా ఖండంలోని ‘ఘనా’ దేశం గురించి మన దేశంలో ఎక్కువమందికి పరిచయం లేదు! కానీ ఘనాలోని నేరస్థులకు మనదేశం గురించి బాగా తెలుసు... తెలుసునన్న సంగతి మాదక ద్రవ్యాలను దొంగరవాణా చేస్తున్న ఒక నేరస్థుడిని హైదరాబాద్‌లో పోలీసులు శుక్రవారం నిర్బంధించడం వల్ల ధ్రువపడింది. గతంలో నైజీరియా తదితర ఆఫ్రికా దేశాలకు చెందిన దొంగరవాణా ముఠాలు ఇతర రకాల ఆర్థిక బీభత్సకారులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. బర్మా-మ్యాన్‌మార్-నుండి శరణార్థులుగా వచ్చిపడిన ‘రోహింగియా’ తెగవారిలో ఎందరు నేరస్థులు చేరి ఉన్నారన్నది నిర్ధారణ కాని వాస్త వం! పాకిస్తాన్‌నుంచి, బంగ్లాదేశ్‌నుంచి యాత్రికుల రూపంలో వచ్చిపడిన నేరస్థులు ప్రవేశ అనుమతి పత్రం-వీసా-గడువుముగిసిన తరువాత స్వదేశాలకు తిరిగి వెళ్లకుండా మన దేశంలోనే అదృశ్యంగా ఉండిపోతున్నారు. ఈ అదృశ్య హంతక స్వభావులలో వందలాదిమంది జంటనగరాలలో తిష్ఠవేసి ఉన్నారన్నది పోలీసులే పలుసార్లు చెప్పిన మాట! ఇలాంటి పాకిస్తానీ బీభత్సకారులు హైదరాబాద్ పోలీసులకు దొరికిపోతూనే ఉన్నారు. దొరకనివారు ఎందరన్నది, వారు చాపకింద విషంలాగా విస్తరించి ఏమి చేస్తున్నారన్నది భద్రత కుడ్యంలోని కన్నాలు..సెప్టెంబర్‌లో పట్టుబడిన ఆఫ్‌షా జబీన్ వంటి బీభత్స కారుణులు ఈ కన్నాల గుండా విదేశాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తునే ఉన్నారు. ఐఎస్‌ఎస్ ఉగ్రవాదులు హైదరాబాద్‌లో తిష్ఠవేసి ఉన్నారన్నది ఇప్పుడు ధ్రువపడిన వాస్తవం. దేశవిదేశాలలోని భారత వ్యతిరేక ముఠాలను అనుసంధానం చేస్తున్నది నిజానికి ఐఎస్‌ఐ అన్న పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభా గం! అందువల్ల బోకొహరామ్ వంటి ఆఫ్రికాలోని ఉగ్రవాద ముఠాలవారు వారి దళారీలు కూడ హైదరాబాద్‌లో తిష్ఠ వేసి ఉండినట్టయితే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇప్పుడు పట్టుబడిన ఘనా జాతీయుడైన అదేపులే మిఛాయిల్ అనే వాడు 2012లోనే మన దేశంలోకి వచ్చాడట! బట్టలు కొని ఘనాకు ఎగుమతి చేయడానికై వర్తక ప్రవేశ పత్రం-బిజినెస్ వీసా ఇతగాడికి లభించింది. కానీ చేస్తున్నది మాదక ద్రవ్యాల దొంగరవాణా! మాదక ద్రవ్యాలను మరిగిన యువజనులు ప్రధానంగా విద్యార్థులు మతులను చివరికి బతుకులను పోగొట్టుకుంటున్నారు! ఈ ఘనా నేరస్థుని వలలో చిక్కుకున్న హైదరాబాద్ విద్యార్థులు రకరకాల మాదక విషాలను అమ్ముతున్నారు, కొని తిని కూలబడిపోతున్నారు!
ఇలాంటి మాదక విషాల ముఠాలకు జిహాదీ ఉగ్రవాదులతో సత్ సంబంధాలను ఏర్పాటు చేస్తున్నది కూడ పాకిస్తానీ ఐఎస్‌ఐ వారే! అందువల్ల మాదక ద్రవ్యాలను అమ్ముతున్నవారు, మహిళల బంగారు గొలుసులను లాక్కుపోతున్నవారు, నకిలీ మందులను అమ్ముతున్నవారు, నకిలీ వైద్యులు వంటి అసాంఘిక శక్తులు క్రమంగా విస్తృత జిహాదీ బీభత్స వ్యూహంలో భాగస్వాములవుతున్నారు. ముంబయిలో, గోవాలో ఇంకా ఇతర చోట్లవిస్తరించిన ఈ విస్తృత నేరజాలం ఇప్పుడు తెలుగు రాజధానిలో కూడ పరుచుకునిపోయింది! లైంగిక బీభత్సకాండ నిర్నిరోధంగా కొనసాగుతునే ఉంది. అనేకమంది పట్టుబడినప్పటికీ ఉమ్మడి రాజధాని ప్రాంగణంలో, శివారులలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మహిళల సౌశీల్యం మంటగలసిపోతూనే ఉండడం అసాంఘిక బీభత్స విస్తృతికి నిదర్శనం. హైదరాబాద్‌కు చెందిన అమాయక బాలికలను పర్షియా సింధుశాఖ దేశాలకు, ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు తరలిస్తున్న ముఠాలు భద్రతా కుడ్యంలోని కన్నాల గుండా రాకపోకలు సాగిస్తునే ఉన్నాయి. గత ఆగస్టులో దక్షిణాఫ్రికాకు చెందిన ఒక మహిళ వద్ద పెద్దఎత్తున మాద క ద్రవ్యాలు పట్టుబడినాయి. ఇలాంటి విదేశీయ బీభత్సకారుణులకు హైదరాబాద్‌లోని బాలికలను తరలించే ముఠాలతో కూడ సంబంధాలున్నాయి. సింధుశాఖ దేశాలలో ఉద్యోగాలు లభిస్తాయని, సింధు శాఖ దేశాలలోని పురుషులతో వివాహాలు జరిపిస్తామని అమాయక యువతులను నమ్మించి వారిని దేశం నుండి తరలించుకునిపోతున్నారు, ఇలా తరలిపోతున్నవారు ఆయా దేశాలలో భయంకర లైంగిక అత్యాచారాలకు బలైపోతున్నారు. జంటనగరాలలోని భద్రతా రాహిత్యం దీనికి ప్రాతిపదిక!
అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా వీధులలో నిర్భయంగా నడిచి వెళ్లగలిగినప్పుడు మాత్రమే దేశానికి స్వాతంత్య్రం నిజంగా వచ్చినట్టన్న ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం వేరే సంగతి...పట్టపగలే మహిళలు వీధులలో వెళ్లలేని పరిస్థితి దాపురిస్తోంది. ఈ పరిస్థితి వాహనాల రాకపోకలతో వాణిజ్య కలాపాలతో గందరగోళంగా ఉండే వాణిజ్య వాటికలలో మాత్రమే కాదు, ప్రశాంత జనావాసాలుగా పేరుగాంచిన కాలనీలలో సైతం ఏర్పడి ఉంది. మహిళల మెడలోని మంగళ సూత్రానికి, బంగారు గొలుసులకు భద్రత లేదు. గొలుసులను లాక్కుపోతున్న దొంగల యథేచ్ఛా విహారం నిర్నిరోధంగా సాగిపోతోంది. గొలుసుపోతే పో యింది, గొంతెక్కడ తెగిపోతుందోనన్న భయం మహిళలను ఆవహించి ఉంది. ఈ గొలుసు దొంగలు నవంబర్ రెండవ తేదీన పట్టపగలు రాజధానిలోని వనస్థలిపురంలో సృష్టించిన బీభత్సం నగర జీవితాన్ని భయ విభ్రాంతికి గురి చేసింది. ఈ దొంగలను వెన్నంటి తరిమి పట్టుకునే ప్రయత్నంలో ఒక పోలీసు వీరుడు అత్యుత్సాహంగా కాల్పులు జరిపేయడం జనానికి మరింత ఆందోళన కలిగించిన విపరిణామం. తుపాకీ గుండ్లు జనానికి తగలలేదు కాబట్టి సరిపోయింది! కానీ సరిపోని సంగతి మరొకటి బయటపడింది. దొంగలు పోలీసుల వేషంలో కూడ ఉన్నారన్నది ఈ వికృత వాస్తవం. నేర నిరోధక పరిశోధక ప్రత్యేక బృందానికి చెందిన ఓ పోలీసాయన గొలుసుదొంగల ముఠాను నిర్వహిస్తున్నాడట, గొలుసు దొంగలను ఉసిగొల్పుతున్నాడట...పంతొమ్మిదవ తేదీన ఇతగాడు పట్టుబడినాడు. పట్టుబడని వారు ఎందరో మరి! ఒక మహిళను లైంగికమైన వేధింపులకు గురి చేసిన అభియోగంపై ఒక హోమ్‌గార్డుపై ఇటీవల కేసు నమోదైందట! నిర్బంధిత మహిళలకు పోలీసు స్టేషన్‌లలో భద్రత లేకపోవడం దశాబ్దుల కథ! వీధులలో సైతం మహిళకు పోలీసులనుండి ప్రమాదం ఏర్పడిందన్నది ఈ హోమ్‌గార్డ్ కథ చెప్పిన గుణపాఠం!
మద్యం తాగి ఊగుతున్న యువజనులు అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేసి నాగరికుల బతుకులను బలిగొంటుండడం రహదారులను రక్తసిక్తం చేస్తుండడం అభద్రతకు మరో వికృత భంగిమం! యువతులు, వృద్ధులు సైతం తప్ప తాగి రాత్రిపూట వాహనాలు నడిపిన ఉదంతాలు సైతం బయటపడినాయి! రాత్రిపూట క్లబ్బులలో రెస్టారెంటులలో, పబ్బులలో తప్పతాగినవారు వాహనాలను నడుపుకుంటునే ఇళ్లకు పోతున్నారు! తాగి వాహనాలు నడపరాదన్న నిబంధన ఉన్నది కేవలం ఉల్లంఘనకు గురి అవడానికి మాత్రమేనా? ఇదంతా చాలదన్నట్టు అర్ధరాత్రి వరకు మద్యపాన కేంద్రాలను తెరిచి ఉంచడం ఎవరి భద్రత కోసం?