మెయన్ ఫీచర్

కెటిఆర్‌కు వారసత్వ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు ఎలా అయినా ఉండవచ్చు, ఎన్నికలు జరగకముందే ఒక కీలకమైన విషయంలో మాత్రం ఈ ఎన్నికలు స్పష్టత నిచ్చాయి. కెసిఆర్ రాజకీయ వారసుడు ఎవరు? అనే ప్రశ్న ఉదయించక ముందే కెసిఆర్ వారసుడు కెటిఆర్ అని తేల్చేశాయి. ఎన్నికలు జరుగుతాయా? లేదా? జరిగితే ఎప్పుడు అని విపక్షాలు ఆయోమయంలో ఉన్న కాలంలోనే కెటిఆర్ హైదరాబాద్‌ను చుట్టు ముట్టేశారు. వారసుడు సరే వారసునికి పట్ట్భాషేకం ఎప్పుడు? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చాలా బలంగా జరుగుతున్నా వారి అంచనాలను పటాపంచలు చేస్తూ కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో సైతం తన నాయకత్వంలోనే విపక్షాలకు భంగపాటు తప్పదనే దోరణిలో దూసుకుపోతున్నారు.
పనె్నండు గంటల క్యాబినెట్.. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఇదో రికార్డు. ఉదయం పదకొండు గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం అయితే రాత్రి 11 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనపై సుదీర్ఘంగా వివరించారు. అంత సమయం పాటు క్యాబినెట్ సమావేశం జరిగిందని రెండు వారాల తరువాత ప్రత్యేకంగా చెప్పుకోవడంలో ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ ఆ సమయంలో ఇటు మీడియాలో, అటు మంత్రుల మధ్య ఒకే సమయంలో భిన్నంగా సాగిన ఆలోచనలే ఇక్కడ కీలకం.
2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు టిఆర్‌ఎస్ ఉనికిని కెసిఆర్ నాయకత్వాన్ని సీమాంధ్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకోలేదు. కరీంనగర్ బహిరంగ సభ తరువాత ఇది ఆషామాషి వ్యవహారం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఆ తరువాత సిద్దిపేట ఉప ఎన్నికల్లో కెసిఆర్ విజయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కెసిఆర్ ఉనికి చాటుకోవడం. దాదాపు అదే సమయం నుంచి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై చాలా బలంగా ప్రచారం ప్రారంభమైంది. మాట్లాడేది మీడియానే, ప్రచారం చేసేది మీడియానే అయితే నేరుగా ఏ మీడియా కూడా ఆరోగ్యంపై వార్తలను ప్రసారం చేయదు. కానీ ప్రచారం చేస్తుంది. ఈ ప్రచార ప్రభావం తోటి మీడియా మిత్రులపై కూడా పడుతుంది. మార్చిలో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు కదా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీట్‌ది ప్రెస్‌లో ఒక జర్నలిస్టు కె తారక రామారావును అడిగిన ప్రశ్న. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై పుట్టిన పుకారుకు మర్యాదకరమైన రూపం ఇస్తే పుట్టిన ప్రశ్న ఇది.
ఇక మళ్లీ క్యాబినెట్ సమావేశం విష యానికి వస్తే ఉదయం పదకొండుకు క్యాబినెట్ సమావేశం ప్రారంభం అయ్యాక. క్యాబినెట్ ముగియగానే బ్రీఫింగ్ ఉంటుంది అని మీడియాకు సమాచారం పంపారు. మహా అయితే ఒంటిగంట వరకు అయిపోతుందని భావించారు. ఎంతకూ ముగియకపోవడంతో అప్పటికే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఇద్దరు ముగ్గురు విలేఖరులు మారిపోయారు. అర్ధరాత్రి వరకైనా సరే అని సిద్ధపడిన చివరి విలేఖరుల బృందం మిగిలింది. ఆ బృందం సైతం దాదాపు నాలుగు గంటల పాటు ఎదురు చూస్తూ విసిగిపోయి ఉంది. రెండు రోజుల్లో గవర్నర్ మార్పు అని ఏడాది నుంచి ప్రచారం చేస్తున్న మీడియాకు చెందిన విలేఖరి ఒకరు కెసిఆర్ ఆరోగ్యం బాగాలేదట కదా? కిడ్ని మార్పుకోసం అమెరికా వెళతారట కదా? అంటూ చర్చ మొదలు పెట్టగానే పక్కనున్న మరో జర్నలిస్టు... ఈవయసులో మనం నాలుగు గంటల పాటు వేచి చూసి అపసోపాలు పడుతున్నాం, సిఎం పనె్నండు గంటల పాటు క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకులం నాలుగు గంటల పాటు వేచి చూడలేకపోతుంటే ఆ వయసులో ముఖ్యమంత్రి పనె్నండు గంటల పాటు సమావేశం నిర్వహిస్తున్నారంటే ఆరోగ్యంగా ఉన్నట్టా లేనట్టా? అని చిరాకు పడుతూ ప్రశ్నించాడు. కొద్ది సేపటికే సిఎం కన్నా ముందు విలేఖరుల వద్దకు వచ్చిన మంత్రులు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు మీలో ఎంత మంది స్పృహతప్పి పడిపోయారో అనుకుంటున్నాం అని చమత్కరించారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలు చివరకు కెసిఆర్ ఆరోగ్యంపై సైతం ఉద్యమ కాలం నుంచే భయంకరంగా ప్రచారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఈ ప్రచారం మరింత పెంచారు. చివరకు కిడ్ని మార్పిడి కోసం అమెరికా వెళుతున్నారనే ప్రచారం సాగింది. ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే చైనా వాల్ ఎక్కేందుకు అనుమతి ఇస్తారు. కెసిఆర్ చైనా వాల్ ఎక్కి వచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే కెటిఆర్‌కు గ్రేటర్ బాధ్యతలు అప్పగించారు. శంకుస్థాపనల పేరుతో చుట్టేశారు. టిడిపి, టిఆర్‌ఎస్ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కావచ్చు, పొలిట్ బ్యూరో, ఎన్నికల కమిటీలు, కార్యవర్గాలు అన్నీ ఉత్తుత్తివి. అధినేత ఒక నిర్ణయం తీసుకుని వ్యూహాన్ని ఆచరణలో పెట్టిన తరువాతనే కమిటీల ఏర్పాటు తతంగం సాగుతుంది. కెటిఆర్ గ్రేటర్ ఎన్నికల కోసం హైదరాబాద్‌ను చుట్టేయడంతో వారసత్వంపైన, కెసిఆర్ ఆరోగ్యంపైన మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టపోయినట్టుగా ఉన్న విపక్షాలకు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వర్గాలకు కెసిఆర్ అనారోగ్యం అనే పుకారు కాసింత ఉపశమనం కలిగించవచ్చు.... కానీ కెసిఆర్‌కు అనారోగ్యం అని నమ్మిన నాయకులు రాజకీయాల్లో చావుదెబ్బతిని రాజకీయ విశ్రాంతి తీసుకుంటుంటే, కెసిఆర్ మాత్రం మరో పదేళ్ల తరువాత చేతికి అంది వచ్చే వారసునికి రాజకీయ శిక్షణ ఇవ్వడంలో చురుగ్గా ఉన్నారు. తాను పదేళ్లు పాలించడమే కాకుండా తన వారసునిగా కెటిఆర్‌ను తీర్చిదిద్దడానికి పూనుకుని కెటిఆర్‌కు తొలి అసైన్‌మెంట్‌గా గ్రేటర్ హైదరాబాద్ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్ మేయర్ పీఠం టిఆర్‌ఎస్‌ది కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణ జనాభాలో 30శాతం మంది గ్రేటర్ పరిధిలోనే ఉంటారు. ఉద్యమ కాలంలో తెలంగాణలో టిఆర్‌ఎస్ జెండా ఎగురవేసినా గ్రేటర్ పరిధిలోకి వచ్చే సరికి అంతగా ప్రభావం చూపలేకపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ ప్రభావం బలంగా కనిపిస్తోంది. మేయర్ పీఠం దక్కించుకోక పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేసినా విపక్షాలు స్వీకరించలేనంత బలంగా టిఆర్‌ఎస్ గ్రేటర్‌లో కనిపిస్తోంది. సాధారణంగా అధికార పక్షానికి నెగిటివ్ ఉంటుంది. కానీ 18 నెలల్లో టిఆర్‌ఎస్ సానుకూల వాతావరణం ఏర్పడేట్టు చేయడంలో కెసిఆర్ విజయం సాధించారు.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలోనే కెసిఆర్ వారసుడు ఎవరు? అనేది తేలిపోయింది. కెసిఆర్ వారసుడు ఎవరు? అనే దానిలో పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ స్పష్టత ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో వారసుడు ఎవరు అనేది ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైంది. బలం లేకపోవడం వల్లనే గత ఎన్నికల్లో అసలు పోటీ చేయని గ్రేటర్‌లో కెటిఆర్ నాయకత్వంలో విజయం సాధిస్తే, వారసత్వానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభిస్తుందనే వ్యూహంతోనే గ్రేటర్ బాధ్యతలు కెటిఆర్‌కు అప్పగించి ఉండవచ్చు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పుట్టిన టిడిపినే మూడవ తరం వారసుడిని సిద్ధం చేసుకుంటోంది. ప్రాంతీయ పార్టీలకు ఔనన్నా కాదన్నా కుటుంబ సభ్యులే వారసులవుతారు.
ఎన్టీఆర్ తన వారుసుడిని తాను నిర్ణయించలేకపోయారు. చాలా కాలం క్రితం బాలకృష్ణ తన వారసుడు అని ప్రకటిస్తే, ఆ ప్రకటన ఉపసంహరించుకునే విధంగా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి విజయం సాధించారు. లక్ష్మీపార్వతి తన వారసురాలు అని ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ ఆమెను సాకుగా చూపించి దించేసిన సమయంలో హరికృష్ణను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపాదించారు. టిడిపికి ఎన్టీఆర్ కోరుకున్నట్టుగా కుమారుడు వారసుడు కాలేదు. బలవంతంగా అల్లుడు వారసుడయ్యారు. బాబు మాత్రం పగడ్బందీగా తన కుమారుడిని వారసుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్టీఆర్ అల్లుడి రాజకీయాన్ని అర్ధం చేసుకోలేదు, కుమారులకు రాజకీయ పరిజ్ఞానం లేదు. దాంతో ఎన్టీఆర్ కోరుకున్న విధంగా టిడిపికి వారసుడు రాలేదు. కానీ కెసిఆర్ విషయం అలా కాదు. రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈ కాలానికి తగిన నాయకుడి లక్షణాలున్న తెలివైన కుమారుడు ఉన్నారు. సహజంగా ఎవరైనా తన వారసత్వం తన కుమారుడికే దక్కాలని కోరుకుంటారు. కుమారులకు తెలివితేటలు లేకపోతేనే వారసత్వం దక్కకుండా పోతుంది. కెసిఆర్ సైతం అంతే బయటి వారికి అనుమానాలు ఉండవచ్చు కానీ హరీశ్‌రావుకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది.
సమర్ధుడైన కుమారుడు ఉన్నప్పుడు తారక రామారావే వారసుడు అవుతాడు కానీ మేనల్లుడినైనా తానెలా అవుతాననే అవగాహన హరీశ్‌రావుకు ఉంది. చదువుకునే రోజుల నుంచే కెసిఆర్ వెంట ఉన్న హరీశ్‌రావు రాజకీయాల్లో ఆ మాత్రం అవగాహన లేని వారేమీ కాదు. తనకు అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసుకుని రావడమే తప్ప మీడియా కోరుకుంటున్నట్టు తిరుగుబాటు చేసే రకం కాదు. విపక్షాలు ఆశిస్తున్నట్టు పార్టీని చీల్చే రకం కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించే నాయకుడు కాబట్టే వారసుడు ఎవరు? అనే దానిపై హరీశ్‌రావుకు స్పష్టత ఉంది. వారసత్వం విషయంలో కుటుంబం నుంచి కెటిఆర్‌కు ఎలాంటి ఆటంకాలు ఉండవు. గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ గెలిస్తే భవిష్యత్తు వారసుడు కెటిఆర్ అని జనం నుంచి ఆమోద ముద్ర పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కెటిఆర్‌కు వారసత్వ పరీక్ష. పరీక్షలో నెగ్గినా ఫలితం కోసం కెటిఆర్ చెప్పినట్టే మరో పదేళ్లు నిరీక్షించాలి. ఎందుకంటే కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి విపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా, తెలంగాణ వ్యతిరేక మీడియా కోరుకుంటున్నట్టుగా లేదు. చైనా వాల్ ఎక్కేంత, రోజుల తరబడి పనె్నండు గంటల పాటు సమీక్షలు జరిపేంత ఆరోగ్యంగా ఉన్నారు.

- బుద్దా మురళి