సబ్ ఫీచర్

కఠిన శిక్షలే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిర్భయ చట్టం’ వచ్చి రెండు సంవత్సరాలైనది. ఆ చట్టం వలన సమాజంలో మార్పు వచ్చిందా? అంటే రాలేదనే చెప్పాలి. ‘‘పసిమొగ్గపై కామాంధుని వికృత చేష్టలు, విద్యార్థినిపై అఘాయిత్యం చేసిన కీచక ఉపాధ్యాయుడు, లైంగిక వేధింపులకు తాళలేక ప్రాణం తీసికున్న అభాగ్యురాలు, యువతిని నమ్మించి తీసిక వెళ్లి సామూహిక అత్యాచారం చేసిన మానవ మృగాలు’’ యిలాంటి వేదనా పూరిత విషయాలు అటు బుల్లితెరపై ఇటు దినపత్రికల్లో చూస్తున్నాము. ఏమిటిది? ఎందుకిలా జరుగుతున్నది? ఈ ఘోరాలు ఆపలేరా? మానవత్వం మంట కలిసిందా? ఆడుకునే చిన్నారులు ఈ రాక్షసత్వానికి బలికావలసిందేనా? ఆ ఘోరం జరిగినపుడు రాజకీయ నాయకులు, అధికారుల్లాంటి వారంతా రావడం,ఆ క్రూరత్వాన్ని ఖండించడం, మళ్లీమళ్లీ యిలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసికుంటాం, నేరస్థులను ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ ఆవేశంగా మాట్లాడి వెళ్లడం మనకు తెలియంది కాదు. ఆ పిదప అక్కడ ఉక్కు వుండదు, పాదం వుండదు అని మనకు తెలుసు.
ఎన్ని ఉక్కు పాదాలు మోపినా ప్రతిదినం అలాంటి వార్తలు వింటూనే వున్నాం. కారణం నిర్భయ చట్టానికి పదునులేదనుకోవలసిందే. ‘నిర్భయ చట్టం’ అంటే భయంలేని చట్టమని అచ్చ తెలుగులో అర్ధం. న్యాయ కోవిదులు, సంఘ సంస్కర్తలు, మేధావులు కలసి చర్చించి, చట్టం మంచి చెడ్డల ఊహించి చట్టాలు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. తమకు తాము మేధావులమనుకుని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు చట్టాలు చేయడంతో చట్టం బలహీనంగా తయారౌతుంది. నిజం చెప్పాలంటే మట్టిలో మాణిక్యాల్లా వారికంటే మేధావులు ప్రజలలో వున్నారన్నది అక్షర సత్యం. ఐఎఎస్, ఐపిఎస్, గ్రూప్-1 అలా ఇతర టాలెంట్ పరీక్షలు వ్రాసి విజయం సాధించినంత మాత్రాన వారినంతా మేధావుల్లా పరిగణించజాలం. చట్టాలు ప్రజాభిప్రాయం, సూచనలు, సలహాల నుండి రావాలి. ప్రజల మధ్యనుండి చట్టం రూపాంతరం చెందాలి. ఇతర దేశాలలో ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం చట్టాలు చేస్తుంది. మన దేశం అందుకు విరుద్ధం. అందువల్లే మన దేశంలో ఏ చట్టం కూడ వంద శాతం అమలుకు నోచుకోలేదు. చట్టం చేయడం, గెజిట్‌లో ప్రచురించడం, అందమైన అద్దాల బీరువాలో క్రమపద్ధతిగా పేర్చడం జరుగుతుంది. చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగించే వారెవరు? చట్టముందని ప్రజలకెలా తెలుస్తుంది? వందల వేల చట్టాలు చేస్తున్నారు. అవన్నీ బీరువాలలో విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నాయ.
మన దేశంలో పలానా చట్టం చక్కగా అమలు జరుగుతుందని ఎవరైనా చెప్పగలరా? చట్టాలను చేయడం సులభం, వాటిని అమలు పరచడం కష్టం. ఆ కష్టం- నష్టం లేకుండా చట్టాలు చేయడమే గొప్పతనం. నిర్భయ చట్టం వచ్చాక దేశ రాజధానిలో ఎన్ని ఘోరాలు జరగలేదు? అందువల్లనే లైంగిక వేధింపులకు పాల్పడే మానవ మృగాలను ఎన్‌కౌంటర్ చేయాలి. అది సరియైన నిర్ణయం. చట్టం ఆ స్ర్తికి ఆత్మశాంతి చేకూర్చినట్లు ఔతుంది. ఇలాంటి నిర్ణయాలను మానవ హక్కుల సంఘం హర్షించాలే కాని ప్రశ్నించడం సబబుకాదు. మృగాల్లా వ్యవహరించే వారిని చంపడం నేరం కాదు, అలాంటి ఎన్‌కౌంటర్లను ఆటవిక చర్య అనకూడదు.
2010వ సంవత్సరం లండన్ మహానగరంలో మన భారతీయ వనిత (జ్యోతిర్మయి)పై ప్రేమ నిరాకరించిందని మన భారతీయుడే యాసిడ్ దాడి చేస్తే, ఆరు నెలల్లోపు స్థానిక కోర్టు ‘ముద్దాయికి మరణించేవరకు జైలుశిక్ష వేస్తూ, పెరోల్ యివ్వబడదని, చనిపోయేవరకు ఒంటరి గది (ఖైది గది) అలాట్ చేయమని తీర్పు ప్రకటించింది. ఇరాన్ దేశంలో జరిగిన యాసిడ్ దాడి కేసు తీర్పుచెప్పిన స్థానిక కోర్టు ఆ నీచుని రెండు కళ్లల్లో ఐదు ఐదు (5+5) యాసిడ్ చుక్కలు వేయమని తీర్పు ప్రకటించింది. ఇలాంటి కనువిప్పకలిగే తీర్పులు రావాలి. కళ్లెదురుగా కనిపించే ఇలాంటి ఘోరాలకు, పాశవిక చర్యలకు, హైయమైన సంఘటనలకు కేసులు, పోలీసులు, కోర్టులు, విచారణ, కాలయాపన, శిక్ష అవసరమా? అందువల్లే ప్రభుత్వాలు చట్టం చేసేముందు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే మంచి చట్టాలు రాగలవు. చట్టాలు చేసేవారంతా మేధావులు కారు. కలం పట్టిన ప్రతివారు కవి, రచయిత కాలేరు.

- మురహరి ఆనందరావు