సబ్ ఫీచర్

దాయాదుల మధ్య కొలిక్కిరాని చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాజ్‌షరీఫ్ ఎప్పుడు ప్రధానమంత్రి అయినా భారత్‌తో స్నేహ సంబంధాలకు ద్వారాలు తెరచి ఉంచుతారు. ఆయన మొదటిసారి ప్రధాని అయిన ఆరు మాసాలకు అంటే 1991 మేలో భారత పత్రికా రచయితకు యిచ్చిన ఒక ఇంటర్వ్యూలో- ‘కాశ్మీర్‌ను మినహాయిస్తే మిగిలినవన్ని చాలా చిన్న సమస్యలు. పాకిస్తాన్- ఇరాన్ దేశాలే స్నేహసంబంధాలను కొనసాగిస్తున్నప్పుడు భారత్- పాకిస్తాన్ దేశాలమధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పడం సమస్యేమి కాదు. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు జర్మనీతోను, అమెరికా అదే విధంగా కెనెడాతోను మైత్రి పాటించినప్పుడు భారత-పాకిస్తాన్ దేశాలు సన్నిహితంగా ఉండకపోవడమేమిటి?’ అని అన్నారు. పాకిస్తాన్ అధినేతల మనోభావాలను అర్థంచేసుకోవడం కష్టం. బేనజీర్‌భుట్టో స్థానంలో నవాజ్‌షరీఫ్ ప్రధానమంత్రి అయినప్పుడు భారత్‌లో సైతం వి.పి.సింగ్ సర్కారు కుప్పకూలి చంద్రశేఖర్ అధికారంలోకి వచ్చారు. భారత్-పాకిస్తాన్‌లు 1971సంవత్సరంలో యుద్ధం చేశాక ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. 1990 చివరినాటికి మ ళ్ళీ సన్నిహితత్వం పుంజుకున్న దాఖలాలు కనిపించాయి. షరీఫ్-శేఖర్‌లు నవంబరులోనే మాల్దీవుల రాజధాని మాలేలో సార్క్ సమావేశంలో కలుసుకుని చర్చలు జరుపుకున్నారు. తదనంతరం విదేశాంగ కార్యదర్శులు కూడా భేటీ అయ్యారు.
ఒకవైపు ఇరుదేశాల మధ్య ఘర్షణలు జరుగుతూ వచ్చినా ప్రధానమంత్రులు సంభాషణ ప్రక్రియ ఆగిపోలేదు. 1972లో సిమ్లా ఒడంబడిక పేరిట ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకొని సంబంధాలను మామూలు స్థాయికి పునరుద్ధరించే పనికి నాంది పలికారు. కాశ్మీర్ హోదాను అడ్డంకిగా చూడదలచుకోలేదు. పాకిస్తాన్‌లో జనరల్ జియా లాంటి సైనిక నియంత దశాబ్దంపాటు అధికారంలో ఉన్నప్పుడుకూడా సంబంధాల పునరుద్ధరణ దశగా పయనం సాగింది. పంజాబ్‌లో తీవ్రవాదులకు చేయూతనిస్తున్నందుకో, అణ్వస్తత్రయారీలో నిమగ్నమైనందుకు నిరసనగానో, భారత్ తన అభ్యంతరాలను మాత్రం పాకిస్తాన్‌కు తెలియచేస్తూ వచ్చింది. ఎదురులేని నియంతగా పాకిస్తాన్‌ను పదకొండు సంవత్సరాలు పరిపాలించిన జనరల్ జియాఉల్‌హక్ వివాదాస్పదమైన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ఇండియాతో స్నేహం కోరుతూ, మరొకవైపు ఇండియాకు ముప్పుకలిగించే రీతిలో వ్యవహరిస్తున్నాడనే విమర్శకు గురిఅయ్యాడు. శ్రీమతి బేనజీర్ భుట్టో 1988 డిసెంబరు 2న ప్రధాని పదవీ బాధ్యతలను స్వీకరించారు.
బేనజీర్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ప్రజల దృష్టిని ఆవేశపూరితమైన కాశ్మీర్ తదితర సమస్యలపైకి మళ్ళించడానికే ప్రయత్నించిందే కానీ ప్రజలకు యిబ్బందిపెడుతున్న సమస్యల పరిష్కారానికి ఆమె ప్రయత్నించలేదు. కాశ్మీర్ సమస్యపై ఆమె భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం సృష్టించగలిగారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లినా, ఇతర చర్యలుతీసుకున్న ఫలితం కన్పించలేదు. కాశ్మీర్ సమస్యమీద ఇస్లామిక్ దేశాల సమావేశంలో అండ సంపాదించడానికి ఆమె ముస్లిం దేశాలన్ని పర్యటించారు. ఈ ప్రయత్నంలో ఆమె కొంతవరకు విజయం సాధించగలిగారు.
1994 ఫిబ్రవరి 1వ తేదీన జెనీవాలో జరిగిన మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాక్ ప్రధాని బేనజీర్ భుట్టో కాశ్మీర్‌లో కారు చీకట్లు కమ్ముకున్నాయని, అక్కడ మానవ హక్కులను కాలరాచివేస్తున్నారని భారతదేశంపై ధ్వజమెత్తారు. భారతదేశంనుండి విడిపోవడానికి, స్వేచ్ఛ ను పొందడానికి జమ్ము-కాశ్మీర్ ప్రజలు తహతహలాడుతున్నారు. మానవ హక్కులను భారత ప్రభుత్వం కాలరాచి వేస్తున్నది. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని గ్రహించి కాశ్మీర్ ప్రజలను ఆదుకోవాలని బేనజీర్ పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యపై బేనజీర్ మాట్లాడినది తరువాత భారతదేశం తరఫున ఫరూఖ్‌అబ్దుల్లా సమాధానం చెబుతూ పాకిస్తాన్‌లో అత్యంత దయనీయంగా, దీనంగా బతుకీడుస్తూన్న అహ్మదీయులు, షియాలు, ఇతర మైనారిటీ వర్గాల ప్రజల సంగతేమిటని నిలదీశారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. కాశ్మీర్ విషయంలో మీరు విజయం సాధించలేదు. ఈ సంగతి గుర్తించుకోండని విస్పష్టంగా ప్రకటించారు.
వి.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జమ్ముకాశ్మీర్‌లో మతోన్మాది ఇస్లామిక్ టెర్రరిజమ్ జిహాది నినాదంతో బుసలుకొట్టసాగింది. వి.పి.సింగ్ ప్రభుత్వంలో కీలకమైన దేశ వ్యవహారాలశాఖామంత్రి ముఫ్తీమహమ్మద్ సరుూద్ కూతురు రుబియా సరుూద్‌ను ఇస్లామిక్ టెర్రరిస్టులు కాశ్మీర్‌లో కిడ్నాప్ చేసి దిగ్భ్రాంతి కలిగించారు. రుబియాని చెరనుండి విడిపించడానికి వి.పి.సింగ్ ప్రభుత్వం టెర్రరిస్టులతో చర్చలు జరిపింది. టెర్రరిస్టుల షరతులను అంగీకరించి జైలులోవున్న అయిదుగురు ముఖ్యులైన టెర్రరిస్టులను విడుదలచేసిన తరువాతనే రుబియాకు విముక్తిలభించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బేనజీర్ భుట్టోను తీవ్రవాద ముష్కరులు 2007 డిసెంబర్ 27వ తేదీన హత్యచేసారు. 1999లో భారత ప్రధాని వాజ్‌పేయి లాహోర్ బస్సులో వాఘా సరిహద్దులు దాటి వెళ్ళినా, కొద్ది రోజుల తర్వాత పాకిస్తాన్ కార్గిల్ పర్వతాలపై దురాక్రమణ జరిపింది. అయితే ఈ దుస్సాహసానికి నవాజ్ షరీఫ్ తన పదవిని మూల్యంగా చెల్లించుకోవలసి వచ్చింది. గత ఆరు దశాబ్దాలలో 174 విడతలకు పైగా జరిగిన చర్చలు సాధించిన ఫలితాలు చాలా తక్కువ. ప్రస్తుతం తీవ్రవాదం పడగవిప్పిన నేపధ్యంలో పరిష్కరింపవలసిన అంశాలపై చర్చలు సాగవలసి ఉంది.

- జి.వెంకట రామారావు ఫోన్ : 040-24380707