ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అడ్డూ అదుపూ లేని రాజకీయ అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చండీపై అవినీతి ఆరోపణలు రావటం పెద్దగా ఆశ్చర్యపడవలసిన విషయం కానేకాదు. ఎందుకంటే మన దేశంలో అవినీతికి పాల్పడని ముఖ్యమంత్రులు లేరంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. మీకు అబ్దుల్ రహామాన్ అంతూలే జ్ఞాపకం ఉండే ఉంటారు. అవినీతి ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి అబ్దుల్ రహమాన్ అంతూలే. అంతూలే చేసిన ఆవినీతితో పోలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రులు చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు. కానీ ఏ ఒక్కరు కూడా చట్టం చేతికి చిక్కరు. ముఖ్యమంత్రులు చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం.
పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అత్యంత తెలివిగా అవినీతికి పాల్పడటం మూలంగా చట్టం చేతికి చిక్కటం లేదు. అధికార వ్యవస్థ రాజకీయ నాయకులకు వంత పాడటంతో అవినీతికి కళ్లెం వేయటం బ్రహ్మకు కూడా తరం కావటం లేదు. అవినీతి ఆరోపణలను ఎదుర్కొనని ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర రెడ్డి లాంటి వారు ఒకరిద్దరు ఉండవచ్చు కానీ మిగతా వారిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రులపై సైతం అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అత్యంత నిజాయితీపరురాలు, సాధారణంగా జీవిస్తుందని ముద్ర పడిన ఒక ప్రస్తుత మహిళా ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. మరో మహిళా ముఖ్యమంత్రిపై రాష్ట్ర హైకోర్టులతోపాటు సుప్రీం కోర్టులో సైతం కేసులు నడుస్తున్నాయి. ఒక దశలో ఈ సదరు మహిళా ముఖ్యమంత్రి జైలు కూడా వెళ్లటం అందరికి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును అమలు చేయటం అసలు ఉద్దేశ్యం అవినీతి అని మాజీ ఎం.పి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించినా ప్రభుత్వాధినేతలు ఖండించారు తప్ప తప్పుడు ఆరోపణలు చేసిన అరుణ్‌కుమార్‌పై పరువు నష్టం దావా వేయలేదు, అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశించలేదు. పట్టిసీమలో అవినీతి లేకపోతే విచారణకు ఆదేశించాలి లేదా అరుణ్‌కుమార్‌పై పరువు నష్టం దావా వేయాలి కానీ అదేదీ జరగలేదంటే అర్థం ఏమిటి? కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చండీ, ఆయన కుమారుడు సౌర విద్యుత్ పథకంలో డబ్బు తిన్నారన్నది ఆరోపణ. సోలార్ విద్యుత్తుకు సంబంధించి కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు అమలు చేసిన పథకాలన్నీ అవినీతి మయమనేది అధికారంలో ఉన్న చాలా మంది తెలుసు. రాజస్థాన్‌లో సోలార్ విద్యుత్తుకు సంబంధించే ఏడు వేల కోట్ల ప్రాజెక్టు పూర్తిగా అవినీతి మయమనేది అందరికి తెలిసిందే. సోలార్ విద్యుత్తు కంటే నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతికి అంతూపొంతూ లేదు. వేలకు వేల కోట్లు తినేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన ప్రతి వ్యక్తి అవినీతికి పాల్పడమనేది ఒక వ్యవస్థగా మారిపోయింది. కోట్లాది రూపాయలు ముట్టచెప్పి ముఖ్యమంత్రి పదవి చేపట్టే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తరువాత మడిగట్టుకు కూర్చుంటాడని భావించలేం. ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పెట్టిన ఖర్చుకంటే వందలాది రెట్లు ఎక్కువ సంపాదించుకోవటం అనేది మన నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.
ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాయకుడు పార్టీ అధినాయకత్వానికి ప్రతి నెలా కప్పం కట్టే విధానం అమలవుతోందంటే ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఇది పచ్చి నిజం. అధినాయకత్వానికి ప్రతినెలా కప్పం కట్టటంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నిధులు పం పించటం రాజకీయ వ్యవస్థతో పరిచయం ఉన్న వారందరికి తెలిసిన నిజం. చాలా మంది మంత్రులు ముడుపులు చెల్లించి పదవులు చేపడతాము, మంత్రి పదవి చేపట్టిన అనంతర పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ అధినాయకులు ములాయం సింగ్ యాదవ్ గత వారం ఒక ప్రకటన చేస్తూ మంత్రులు ఇలా దోచుకోవటం అపకపోతే 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవటం ఖాయమని బాహాటంగా హెచ్చరించవలసి వచ్చిందంటే అవినీతి ఏ విధంగా సామ్రాజ్యం ఏలుతోందనేది అర్థం అవుతుంది. అధికారులు ముఖ్యంగా సీనియర్ అధికారులు నియమ,నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తే ఏ ముఖ్యమంత్రి, మంత్రి, ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడలేరు. అయితే రాజకీయ నాయకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అడ్డుఅదుపు లేకుండాపోయింది.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన కొందరు నాయకులు అవినీతికి దూరంగా ఉన్నారు. నీతి,నిజాయితీతో తమ రాష్ట్భ్రావృద్ధికి కృషి చేశారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ది కోసం అహర్నిశలు పని చేశారు. అయితే ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులందరు నీతి, నిజాయితీ గురించి ఉపాన్యాసలు ఇవ్వటం వరకే పరిమితమై పోయారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లు అధికారంలో ఉన్నప్పుడే పది తరాల వారి సరిపోయేటంత సంపాదించుకోవటాన్నికి అలవాటుపడ్డారు. అక్రమ సంపాదన కోసం తొక్కని అడ్డదారి లేదు. ఒక దశలో తన ఇంటిని తనఖా పెట్టి రాజకీయం చేసిన ఒక నాయకుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత వందలు కాదు వేల కోట్లకు పడగెత్తారు. మరో కేంద్ర మంత్రి డబుల్ బెడ్ రూం నుండి రాజకీయం ప్రారంభించి ఆ తరువాత వందలు వేల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడు. ఒక గల్లీ నాయకుడి ప్రస్తుత ఆస్తి కనీసం ఐదారు వేల కోట్లు. అవినీతికి అరికట్టేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్ వ్యవస్థ సైతం అవినీతి మయంగా మారిపోయింది. కర్నాటక మాజీ లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలు తెలియందెవరికి? కర్నాటక మాజీ లోకాయక్త కుమారుడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి చివరకు జైలు పాలు కావటం ఇటీవల జరిగిన సంఘటన. ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిలదీయనంత వరకు ఈ అవినీతి సామ్రాజ్యం ఇలాగే కొనసాగుతుంది.