సబ్ ఫీచర్

పేదలకు న్యాయసహాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని ప్రజలందరికీ సత్వర న్యాయం అందించాలన్నదే మన న్యాయశాస్త్రం యొక్క ప్రథమ లక్ష్యం. అందుకే ‘న్యాయం అందించడంలో ఆలస్యం అయితే, న్యాయం నిరాకరించబడినట్లే’అనే సూక్తి మన న్యాయవ్యవస్థ నినాదంగా స్వీకరించింది. ‘మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడపదాటవు’అన్న చందాన మన దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు ఉంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టునుంచి మేజిస్ట్రేట్ కోర్టువరకు గుట్టగుట్టలుగా పేరుకుపోయి ఉన్న కేసులే. మన దేశంలో పేదవారికి న్యాయం అనేది గగన కుసుమంగా మారింది. ఎందరో సులభంగా బెయిల్ పొందటానికి అవకాశం ఉన్నప్పటికీ, ఆర్థిక పరిస్థితుల కారణంగా బెయిల్‌కు నోచుకోక జైళ్ళలో మగ్గిపోతున్నారు. దీనికి కారణం న్యాయవాదుల ఫీజులు, కోర్టుకు షూరిటీ కింద డబ్బుచెల్లించాల్సి రావడమే. చిన్న చిన్న కేసులలో అరెస్టుఅయి, బెయిల్ పొందటానికి తగిన డబ్బులేక జైళ్ళలో మగ్గుతున్న వారికి అటు న్యాయపరమైన ఇటు ఆర్థికపరమైన సహాయం అందించి, పలువురు పేదల జీవితాలలో వెనె్నల కురిపించడానికి సన్నద్ధం అవుతున్నారు సునీల్ భారతి మిట్టల్.
దేశంలో ప్రముఖ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ అయిన ఎయిర్‌టెల్‌కు అధినేత ఆయన. 2013లో 2-జీ స్ప్రెక్టమ్ కేసులో ఆయన పలుమార్లు పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బెయిల్ పొందటానికి కేవలం పదివేల రూపాయలు లేక జైళ్ళలో పలువురు మగ్గిపోతున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. దేశంలో పేదలకు న్యాయంకోసం ఆర్థిక సహాయం అందించే సంస్థలు ఏమిలేవనే విషయం ఆయన దృష్టికి వచ్చింది. పేదలు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంవలన, బెయిల్ లభించడం లేదన్న విషయాన్ని ఆయన గుర్తించారు.
భారతి ఫౌండేషన్ తరఫున చిన్న, చిన్న కేసులలో బెయిల్‌కోసం డబ్బు లేక జైళ్ళలో మగ్గుతున్న వారికి సహాయం అందించడానికి సునీల్ భారతి మిట్టల్ నిర్ణయించారు. అందుకోసం ఆయన ప్రాథమికంగా ఐదు కోట్ల రూపాయలు మూల నిధిని తన వేతనం నుంచి ఏర్పాటుచేశారు. కేసులు ఎంపిక చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ అధ్యక్షుడిగా, ప్రముఖ న్యాయవాదులు హరీష్‌సాల్వే, మణీందర్‌సింగ్‌లతో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. కేసుల వివరాలను ఈ కమిటీ పరిశీలించి, వాటిలో ఆమోదయోగ్యమైన వారికి భారతి ఫౌండేషన్ తరఫున అటు న్యాయ ఇటు ఆర్థిక సహాయం అందచేస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారమే, దేశవ్యాప్తంగా 2.8 లక్షల మంది అండర్ ట్రయల్ ఖైదీలు 1367 జైళ్ళలో ఉన్నారు. దేశంలోని జైళ్ళలో ఉన్న మొత్తం ఖైదీలలో అండర్ ట్రయిల్ ఖైదీల శాతం 68. వచ్చే ఏప్రిల్ నుంచి భారతి ఫౌండేషన్ తరఫున పేదవారికి న్యాయ సహాయం అందనుంది. తొలి విడతగా ఢిల్లీ, పంజాబు, జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యా నా రాష్ట్రాలకు చెందిన వారికి సహాయం అందిస్తారు. క్రమక్రమంగా భారతి ఫౌండేషన్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరింపచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారతి ఫౌండేషన్ తరఫున న్యాయ సహాయం అందటం ప్రారంభం అయితే, ఆర్థిక స్థోమత లేక బెయిల్ పొందలేక ఎందరో పేదవారికి బెయిల్ లభించే అవకాశాలు ఉన్నాయి. సునీల్ భారతి మిట్టల్ స్ఫూర్తితో మరికొందరు ఇటువంటి సంస్థలను ప్రారంభించే అవకాశం ఉంది. నిరుపేదలకు న్యాయ సహాయం అందించడం నిజంగా ఎంతో మంచి నిర్ణయం. చిన్న నేరాల్లో జైళ్లలో మగ్గుతున్న వారికి ఇదెంతో ఉపయోగకరం. సునీల్ భారతి మిట్టల్ ప్రయత్నం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

- పి.మస్తాన్‌రావు