సబ్ ఫీచర్

విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కొంతవరకైనా పోగొట్టాలంటే విశాఖపట్నం కేంద్రంగానే కొత్తగా రైల్వేజోన్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జోన్‌ను ఏర్పాటుచేయడమే అన్నివిధాల సముచితం. విశాఖలోనే జోన్‌ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు గతంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు హామీనిచ్చారు. ఎన్నికల ముందు, అలాగే ఎన్.డి.ఎ. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, రాష్ట్ర విపక్ష నేత వై.ఎస్.జగన్ పలుసార్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. విశాఖ ఎంపీ, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబు విశాఖపట్నానికి రైల్వేజోన్ తథ్యమని పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
గత పదేళ్లుగా విశాఖకు జోన్‌ను మంజూరు చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తునే ఉన్నారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు నిర్వహించాయ. సదస్సులు, సెమినార్లు జరిపారు. ఎవ్వరికీ అవసరం లేని భోగాపురం ఎయిర్‌పోర్టు స్థాపనలో చూపుతున్న శ్రద్ధలో కనీసం పదో వంతైనా మన నాయకులు ప్రదర్శిస్తే ఇప్పటికే రైల్వేజోన్ విశాఖకువచ్చి ఉండేది. విశాఖలో కొత్త రైల్వేజోన్ ఏర్పాటుచేస్తే తూర్పు కోస్తా రైల్వే (ఈస్టుకోస్టు రైల్వే), భువనేశ్వర్ ఆదాయం పడిపోతుందని గత ఏడాది సెప్టెంబర్ 29న న్యూఢిల్లీలో రైల్వేబోర్డు ఛైర్మన్ ఎ.కె. మిట్టల్ సన్నాయినొక్కులు నొక్కారు. ఇక రైల్వే బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి ఇటీవల విజయవాడలో దక్షిణమధ్య రైల్వే (ఎస్.సి.రైల్వే) నిర్వహించిన ఎంపీల సమావేశంలో రైల్వేజోన్‌ను రాజధానిలో ఏర్పాటుచేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరడం విడ్డూరంగా ఉంది. గతంలో విశాఖపట్నంలో హుద్‌హుద్ తుఫానులో విమానాశ్రయం కొట్టుకుపోయిందని, రైల్వేజోన్ కేంద్రాన్ని అక్కడ పెడితే ఎప్పుడు మునుగుతుందో తెలియదని అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీనిపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు స్పందిస్తూ ప్రాంతీయ విభేదాలను సృష్టించొద్దని హెచ్చరిస్తూ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.
అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తప్పనిసరిగా ఉండాలి. అన్ని ప్రధాన కార్యాలయాలను రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటుచేస్తే మిగిలిన ప్రాంతాలు తీవ్రంగా నష్టపోవడం ఖాయం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో కేవలం హైదరాబాద్‌నే అభివృద్ధిచేసి మిగిలిన ప్రాంతాలను విస్మరించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అవశేష ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా తయారైందో వేరేగా చెప్పనక్కరలేదు. ఇక ప్రత్యేక జోన్ ఏర్పాటుపై ఒడిషా ప్రభుత్వం ప్రతిఘటించడం వాస్తవమే అయినప్పటికీ వారి ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేజోన్ లేని దీనస్థితి దాపురించింది. ఫలితంగా రైల్వేశాఖలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి ఉద్యోగ నియామకాల్లో వీరికి అన్యాయం జరుగుతోంది. ఎందుచేతనంటే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే (ఒడిషా) పరిధిలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విశాఖ నుంచి ఇచ్ఛాపురం ప్రాంతం ఉంది. మిగిలిన ఆంధ్ర ప్రాంతమంతా దక్షిణ మధ్యరైల్వే (సికిందరాబాద్) పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వేజోన్ కేంద్రం లేని దుస్థితి కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్.డి.ఏ. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల ముందు కూడా బి.జె.పి నాయకులు ప్రత్యేక హోదా ఇస్తామని బాసలుచేశారు. అవన్నీ యమునా నదిలో కలిసిపోయాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.
ఎన్నో ఉద్యమాలు నిర్వహించినా బధిర శంఖారావమే అయింది. ప్రత్యేక హోదా సంగతి ఎలా ఉన్నా కనీసం ప్రత్యేక కొత్త రైల్వే జోన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు అందునా విశాఖ కేంద్రంగా ఏర్పాటుచేయడం సముచితంగా ఉంటుంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం సమకూరుతుంది. మన రాష్ట్రంనుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు వౌనాన్ని విడనాడి ‘‘విశాఖ హక్కు రైల్వే జోన్’ అనే నినాదాన్ని అందుకొని ముందుకు సాగాలి. అంచేత కేంద్ర మంత్రులు, ఉత్తరాంధ్ర ఎంపీలు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర బి.జె.పి. విభాగం కేంద్ర ప్రభుత్వంపై అందునా రైల్వేమంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకొని రావాలి. ఈ నెలలో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్‌లో విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ప్రవేశపెట్టేలా ఇకనైనా కృషిచేయాలి. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాలి. లేనప్పుడు చరిత్ర క్షమించదనే విషయాన్ని గమనించాలి.

- వాండ్రంగి కొండలరావు