మెయన్ ఫీచర్

బీభత్స స్వభావం...పాకిస్తాన్ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమి ‘తక్కు నాలగీ?’-టెక్నాలజీ- ఎంత అద్భుతం అని గ్రామీణులు ముక్కుల మీద వేళ్లు వేసుకొని ఉండేవారు. ఈ ‘టెక్కునాలజీ’ గురించి నగరాలలోని కాలనీలలో సాయంత్రంపూట వీధుల చివర ఆసీనులైపోయే విశ్రాంత మేధావులు సైతం పెద్ద గొంతులతో ప్రచారం చేసి ఉండేవారు. ఇరవై ఐదేళ్ల క్రితం డేవిడ్ కాలెమన్ హెడ్లీ అనేవాడు అమెరికా నుంచి దృశ్యమాధ్యమ అనుసంధానం-వీడియో కాన్ఫరెన్స్-ద్వారా ముంబయి ప్రత్యేక న్యాయస్థానంలో ప్రత్యక్షమై ఉండినట్టయితే ఇలాంటి సంభ్రమాశ్చర్యాలను ప్రచా ర మాధ్యమాల ప్రతినిధులు సైతం ఆవిష్కరించి ఉండేవారు. ఒకరు న్యూయార్క్‌లో మరొకరు లండన్‌లో ఇంకొకరు న్యూఢిల్లీలో వేరొకరు జపాన్‌లోని క్యోటోలో కూర్చుండి ఒకే చోట కూర్చున్న భ్రాంతిని కల్పించే ‘టెక్కునాలజీ’-టెక్నాలజీ-అప్పుడు అద్భుత విషయం. కానీ ఇప్పుడు దావూద్ జిలానీ అనే కాలెమన్ హెడ్లీ చెప్పిన వీడియో సాక్ష్యం అలాంటి ఉత్కంఠకు సైతం గురికాలేదు. పాతికేళ్ల క్రితం ఈ జిహాదీ బీభత్సకారుడు ఇలా వీడియో సాక్ష్యం చెప్పి ఉంటే అసలు విషయం సంగతి ఎలాగున్నప్పటికీ అంత దూరం నుంచీ అతగాడు మనదేశపు న్యాయస్థానాలకు నివేదించడమన్నది కొంత వింతగా ఉండేది. ఇప్పుడది లేదు. వీడియో అనుసంధానం వింత కాదు. అసలు విషయం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావం.
పాకిస్తాన్ ప్రభుత్వం బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్- అన్నది ఎప్పుడో దశాబ్దుల క్రితమే నిర్ధారణ అయిపోయిన నిజం. పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ తోడేళ్లను ఉసిగొలిపి క్రీస్తుశకం 2008 నవంబర్ 26వ తేదీన ముంబయిలో నూట అరవై అరుగురిని చంపించింది. ఈ సంగతి మనదేశంలో మాత్రమే కాదు విదేశాలలో సైతం సామాన్య ప్రజలకు తెలిసిపోయిన వాస్తవం. డేవిడ్ కాలెమన్ హెడ్లీ కొత్తగా చెప్పిందేమిటి? ఊరందరికీ తెలిసిన రహస్యాన్ని ఊలప్ప చెవిలో ఊదినట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం ముంబయిపై దాడులను జరిపించిందని, అప్రూవర్‌గా మారిన కాలెమన్ హెడ్లీ న్యాయస్థానానికి నివేదించాడు. నేరాన్ని అంగీకరించి తాను శిక్షనుండి మినహాయింపు పొంది ఇతర దోషులను శిక్షించడానికి దోహద పడేవాడు అప్రూవర్. డేవిడ్ హెడ్లీని మన భద్రతా దళాలు పట్టుకొని మన న్యాస్థానాలలో నిలబెట్టి ఉండినట్లయితే అతగాడికి తగిన శిక్షను మన న్యాయస్థానం విధించి ఉండేది. హెడ్లీని అమెరికావారు పట్టుకున్నారు. అమెరికా న్యాయస్థానాలు శిక్షించాయి. అమెరికాలో అతగాడు శిక్షను అనుభవిస్తాడు. అందువల్ల హెడ్లీ సాక్ష్యం వల్ల మనదేశంలో పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలను శిక్షించే కార్యక్రమానికి కొత్తగా చేకూరే బలం లేదు.
పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం పేరుతో చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ ముఠా నిజానికి జిహాదీ ఉగవాదులను ఉసిగొల్పి బీభత్సకాండను జరిపిస్తున్న తండా. ఈ ఐఎస్‌ఐ పాకిస్తాన్ సైనిక దళానికి చెందిన ఒక విభాగం. నిజానికి పాకిస్తాన్ సైనిక దళాలు ప్రచ్ఛన్న జిహాదీ ఉగ్రవాద దళాలు. ఇదంతా జగమెరిగిన సత్యం, ధ్రువపడిన వాస్తవం. 2008 నవంబర్ నాటి ముంబయి దాడులను మాత్రమే కాదు, అంతకు పూర్వం ఆ తరువాత జరిగిన భారత వ్యతిరేక బీభత్సఘటనల వ్యూహకర్తలు పాకిస్తాన్ సైనిక దళాలవారు. ఇదంతా స్పష్టంగా తెలిసిన మన ప్రభుత్వం 1993 నాటి బీభత్సకాండ జరిగిన వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థగా ప్రకటించి ఉండాలి. భారత్‌ను బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో బీభత్సకాండను కొనసాగించినంతకాలం పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరుపబోమని, ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని మన ప్రభుత్వం 1993లోనే స్పష్టం చేసి ఉండాలి. అలా జరుగకపోవడం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వం దృష్టిలో మన ప్రభుత్వం తేలికై పోయింది. పాతికేళ్లకు పైగా పాకిస్తాన్‌తో ఇలా తెగదెంపులు చేసుకొనడానికి, రాకపోకలను రవాణాను దౌత్య సంబంధాలను రద్దు చేసుకొనడానికి దోహదం చేయగల వందలాది బీభత్స ఘటనలు జరిగిపోయాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం తెగతెంపులు చేసుకోలేదు.
ఈ మన విధానం ప్రపంచ దేశాలకు పరిహాస పాత్రమైంది. ఎందుకంటె మనం పాకిస్తాన్ పట్ల ప్రదర్శిస్తున్న వైఖరిలో ‘తాలిక’-కన్‌సిస్టెన్సీ-లేదు. రెండేళ్ల పాటు మన ప్రభుత్వం ఒకే విధానానికి కట్టుబడి ఉన్న చరిత్ర క్రీస్తుశకం 1993 నుంచీ లేదు. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఏ పక్షం వారైనప్పటికీ, ఏ కూటమి వారైనప్పటికీ ఒకటే తీరు..ఒకే విధాన వైపరీత్యం. ఈ విధాన వైపరీత్యం పదే పదే పునరావృత్తికి గురైంది. అందువల్ల ప్రపంచ దేశాల వారు మన మాటలను పట్టించుకోవడం లేదు. ఆరు నెలల కింద పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన మన ప్రభుత్వ ప్రతినిధుల నోళ్లు ఆరునెలల తరువాత పాకిస్తానీ విందులను ఆరిగించడం వల్ల మొత్తం పాకిస్తానీ దుశ్చర్యలు ప్రాధాన్యం కోల్పోతున్నాయి.
బీభత్సకాండ జరిగిన వెంటనే మన ప్రభుత్వం పిరికి పందల చర్యగా ఆ హత్యాకాండను అభివర్ణించడం మొదటి ఘట్టం. పాకిస్తాన్‌తో చర్చలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం రెండవ ఘట్టం. బీభత్స కలాపాలను విడనాడనంతవరకూ పాకిస్తాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోబోమని, క్రికెట్ క్రీడను పాకిస్తాన్‌తో కలసి ఆడబోమని, గట్టిగా హెచ్చరించడం తదుపరి పరిణామం. నేరస్థులను పట్టి మనదేశానికి తరలించవలసిందిగా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడం మరో చారిత్రక ఘట్టం. మూడు నెలల తరువాత నేరస్థులను మాకు అప్పగించకపోతే పోనీ, మీ దేశంలోని న్యాయస్థానాలలోనే వారిని విచారించి శిక్షించండి..అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం ప్రాధేయపడుతున్నదృశ్యం ఆవిష్కృతమవుతోంది. మరో రెండు నెలలు గడిచిన తరువాత మన ప్రభుత్వం వౌనం వహిస్తుంది. ఆరు నెలలకు పూర్వం నాటి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను మన ప్రభుత్వం మరచిపోయిందా? అన్న ప్రశ్నలకు సమాధానం రాదు. ఆ తరువాత వెంటవెంటనే చర్చల పునరుద్ధరణ గురించి మన ప్రభుత్వమే మొదట ప్రస్తావిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కొంత బెట్టు చేసి మన కేదో ‘మెహర్భానీ’ చేస్తున్న భంగిమలను ప్రదర్శించి ఆ తరువాత చర్చలకు అంగీకరిస్తోంది. ఉభయ దేశాల కార్యదర్శులు, ఆ తరువాత విదేశీయ మాధ్యమ వ్యవహారాల మంత్రులు సమావేశమై పోవడంతో కథ పునరారంభం అవుతుంది. ఈ మధ్యలో కశ్మీర్‌లోని హురియత్ వంటి విద్రోహపు ముఠా ముందరి మనుషులు ఢిల్లీకి వచ్చి పాకిస్తాన్ రాయబారితో చర్చలు జరిపి సంచలనం సృష్టించి వెడుతుంటారు. అప్పుడు మళ్లీ కొంత అంతర్జాతీయ వినోదం ప్రదర్శితవౌతోంది. చర్చలు మొదలైన తరువాత ఒకటి రెండు నెలలు జరుగక ముందే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు మరోసారి విరుచుకొని పడి మన ప్రజలను హత్య చేశారు. 1993 నాటి ముంబయి పేలుళ్ల నుంచి ఇటీవల పఠాన్‌కోటపై జరిగిన దాడి వరకు, మొత్తం పాతిక సార్లకు పైగా మన ప్రభుత్వం ఈ విధాన వైపరీత్యాన్ని పునరావృత్తం చేసింది. సంవత్సరాల పేర్లు, ఊర్ల పేర్లు మాత్రం మారుతున్నాయి. అవే బీభత్స ఘటనలు అవే ప్రకటనలు పునరావృత్తం కావడం, పఠాన్‌కోట వరకూ నడిచిన చరిత్ర. అందువల్ల మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చేసిన చేస్తున్న ఫిర్యాదులను ప్రపంచ దేశాలు పట్టించుకోవడం మానేశాయి. ఫలానా దేశం అధ్యక్షుడు పాకిస్తాన్‌ను పేరుపెట్టి మొదటిసారిగా దుయ్యబట్టాడు. మరో ఫలానా దేశం ప్రధాన మంత్రి పాకిస్తాను పేరు పెట్టకుండా విమర్శించాడు-అంటూ వెలువడుతున్న వార్తలు దౌత్య వినోదం కలిగిస్తున్న అపహాస్యపు ప్రహసనాలు.
ఈ వినోదం వెనుకనుంచి భయంకరమైన విషాదం తొంగిచూస్తోంది. దశాబ్దుల తరబడి పాకిస్తాన్ జిహాదీ తోడేళ్ల రక్తదాహానికి బలైపోయిన యాబయి ఐదువేల మంది మృతుల కుటుంబాలది ఈ విషాదం. వారి గుండెలలో చల్లారని శోక దావానల జ్వాలలు, మన నాయకులు పాకిస్తానీ ప్రభుత్వ ప్రతినిధులుగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న బీభత్స కారులతో కరచాలనాలు చేసి చిరునవ్వులు చిందించిన సందర్భాలలో మరింతగా ఎగసిపడ్డాయి. 2008 నాటి ముంబయి దాడుల గాయాలు మానకపూర్వమే 2009 జూన్‌లో అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ పాకిస్తాన్ అధ్యక్షుడు అసఫ్ అలీ జర్దారీతో కరచాలనం చేశాడు. ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధానిగా చెలామణి అవుతున్న జిహాదీ మతోన్మాది నవాజ్ షరీఫ్‌ను ‘గ్రీటించి’ రావడం మన్‌మోహనీయ విధాన వైపరీత్యానికి ఘోరమైన పునరావృత్తి.
మనకు ప్రపంచ దేశాలకు తెలిసిన సంగతులనే ఇప్పుడు డేవిడ్ హెడ్లీ ధ్రువీకరించాడు. అయినప్పటికీ ప్రపంచ దేశాలకు మరింత విశ్వాసం కలిగించడానకి హెడ్లీ చేసిన ‘వెల్లడులు’ దోహదం చేయగలవు. అందువల్ల ఇప్పుడైనా మన ప్రభుత్వం పాకిస్తాన్‌తో సకలవిధ సంబంధాలను రద్దు చేసుకోవడం వల్ల మాత్రమే అంతర్జాతీయంగా మన మాటలకు విశ్వసనీయత ఏర్పడుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం వారి ఐఎస్‌ఐ భారత వ్యతిరేక జిహాదీ ముఠాలను మాత్రమే కాదు, బోకోహరామ్, ఐఎస్‌ఐఎస్, హిజ్‌బొల్లా, హక్కానీ, తాలిబన్ వంటి తండాలను సైతం నడిపిస్తోంది. ఐఎస్‌ఐఎస్ బీభత్సకాండకు గురి అవుతున్న ఐరోపా దేశాలు ఇప్పుడు పాకిస్తాన్ పట్ల కినుక వహించి ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్‌ను బీభత్స వ్యవస్థగా ప్రకటింప జేయడానికి ఐక్యరాజ్య సమితిలో మన ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి...అలా జరిగినట్టయితే ఐరోపా దేశాల మద్దతు మనకు లభిస్తుంది. ఇందుకు పూర్వరంగంగా మొదట మనదేశం పాకిస్తాన్‌తో సకలవిధ సంబంధాలను రద్దు చేసుకోవడం అనివార్యం... నడుం విరిగి కూలబడే వరకు తోడేలు దూకుతూనే ఉంటుంది. ఆవుల గొంతుకలు కొరుకుతూనే ఉంటుంది. పాకిస్తాన్ అలాంటి తోడేలు.

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352