సబ్ ఫీచర్

బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్న రేషన్ బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో రేషన్ బియ్యం వివిధ మార్గాల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. ప్రభుత్వం రైస్ మిల్లర్ల నుండి లెవీ కింద కిలో బియ్యానికి రూ.23 చెల్లిస్తోంది. లబ్దిదారులకు 22 రూపాయల సబ్సిడీ ఇచ్చి కిలో రూపాయికి అందజేస్తోంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న అక్రమార్కులు ‘బ్లాక్’ మార్కెట్‌కు తెర తీశారు. డీలర్లవద్దకు చేరిన బియ్యం లబ్దిదారులకు అందకుండా నేరుగా రైస్ మిల్లులోకి, అక్కడినుండి లెవీగా మళ్లీ ఎఫ్‌సిఐ గోడౌన్‌లకు చేరుతోంది. ఈ దందా భారీఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైస్ మిల్లు వ్యాపారులు, రేషన్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులు సూత్రధారులుగా రేషన్ బియ్యం అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నది.
డీలర్లకు చేరిన బియ్యం రైస్ మిల్లు వ్యాపారులకు, అక్కడనుంచి లేవీ బియ్యంగా మళ్లీ ఎఫ్‌సిఐ గోడౌన్‌లకు బియ్యం చేరడం ఒక విధానమైతే, రేషన్ షాపులకు చేరకుండానే మండల స్థాయి స్టాక్ పాయింట్లనుంచే మిల్లర్ల గూటికి చేరడం మరో విధానం. ఈ అక్రమ వ్యాపారం మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా సాగుతున్నది. కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరాల్సి వుండగా ఆ వేలాది క్వింటాళ్ళ బియ్యం అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్‌కు, లెవీ మార్కెట్‌కు తరలిపోతున్నది. వేలాది క్వింటాళ్ళ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నా గత ఏడాది కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో అధికారులు పట్టుకున్నది కేవలం 1500 క్వింటాళ్ళకు మించకపోవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా రెవిన్యూ, పౌర సరఫరాల అధికారులు గడిచిన ఏడాదిలో సుమారు 60 కేసులు నమోదుచేసి 1500 క్వింటాళ్ళ మేరకు బియ్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో 10,18,415 ఆహార భద్రత కార్డులను, 67,381 అంత్యోదయ కార్డులను 302 అన్నపూర్ణ కార్డులను జారీచేశారు. ఆహార భద్రత కార్డుల ద్వారా 29,34,281 మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డుల ద్వారా కుటుంబానికి 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డుల ద్వారా కుటుంబానికి 10 కిలోల చొప్పున సుమారు 2 లక్షల క్వింటాళ్ళ బియ్యం 2061 చౌక ధరల దుకాణాల ద్వారా పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్నది.
మిల్లర్లు లెవీ క్రింద 23 రూపాయలకు కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి 22 రూపాయల సబ్సిడీలో కిలో ఒక్కింటికి ఒక రూపాయి చొప్పున ప్రజలకు ప్రభుత్వం బియ్యం సమకూరుస్తున్నది. ప్రభుత్వం జారీచేసిన ఆహార భద్రత కార్డుల్లో సుమారు లక్షన్నర కార్డులు బినామీ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా సరఫరా అవుతున్న బియ్యం మొత్తం రేషన్ డీలర్ల ద్వారా రైస్ మిల్లర్లు కిలోకు 8 రూపాయల నుండి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ ఆ బియ్యానే్న ప్రభుత్వానికి 23 రూపాయలకు లెవీ కింద ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలున్నాయి. రేషన్ డీలర్ల బినామీ కార్డుల ద్వారానే కాకుండా రేషన్ తీసుకువెళ్ళని వారి బియ్యాన్ని కూడా అక్రమ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు కూడా రేషన్ బియ్యాన్ని కిలో 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసి వాటిని మహారాష్టక్రు తరలించి అక్కడ 30 నుండి 40 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి, కొలనూర్, రామగుండం తదితర రైల్వేస్టేషన్ల ద్వారా ఈ బియ్యాన్ని మహారాష్టక్రు తరలిస్తున్నారు. డీలర్ల నుండి కొనుగోలు చేసిన బియ్యాన్ని మొత్తంగా లెవీ క్రింద ముట్టజెప్పకుండా కొంత బియ్యాన్ని రైస్ మిల్లర్లు మళ్లీ పాలిష్ చేసి ఓపెన్ మార్కెట్‌కు తరలించి కిలోకు 30 నుండి 35 రూపాయలకు విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం కస్టమ్ మిల్లింగ్‌కోసం ఇచ్చిన వరి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు అక్రమ వ్యాపారానికి వినియోగించుకొంటున్నారు. ఈ ధాన్యాన్ని వెంటనే బియ్యం పట్టి ప్రభుత్వానికి పంపించకుండా బహిరంగ మార్కెట్లో వాటిని విక్రయించుకొని లాభాలు గడించి, అధికారుల నుండి ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే తిరిగి చెల్లిస్తున్నారు. ఉన్నతాధికారులు బియ్యం అవసరమైనప్పుడు దృష్టి సారించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం చెల్లించని మిల్లర్లపై అడపా దడపా కేసులు నమోదుచేస్తున్నా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉన్నది. రేషన్ షాపులకు పంపిణీ చెయ్యాల్సిన బియ్యం మండల లెవల్ స్టాక్ పాయింట్‌లో నిల్వ ఉంటుంది. ఈ స్టాక్ పాయింట్ అధికారులు డీలర్లతో కుమ్మక్కై వారినుండి బియ్యం కొనుగోలుచేసి తిరిగి వాటిని మిల్లర్లకు అమ్ముకొని లారీల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం హుజురాబాద్ ప్రాంతంలో ఇలా బియ్యం తరలిస్తున్న రెండు లారీలను అధికారులు సీజ్ చేశారు. పౌర సరఫరాశాఖ ద్వారా సరఫరాఅవుతున్న బియ్యాన్ని అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని కొనుగోలు చేసిన మిల్లర్లపై 6ఏ కేసులు నమోదుచేసి జైలుకు పంపడంతోపాటు మిల్లుల లైసెన్సులు రద్దుచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టడానికి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నామని చెప్తున్నా జిల్లాలో రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు నమోదుచేసే కేసులు నామమాత్రమేనని, వారి అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం నల్లేరులా నావలా సాగిపోతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా పేద ప్రజలకి అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- గుండు రమణయ్య