సంపాదకీయం

గాయానికి న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి విధించిన శిక్షను తగ్గించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ అధికార దుర్వినియోగానికి మరో అభిశంసన. భయంకర బీభత్సకారుల పట్ల ‘దయ’ చూపించడం ‘అపాత్రమని’ సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నిర్ణయించడం అధికార రాజకీయ వేత్తల పాలిట మరో అంకుశం. రాజకీయ లబ్దికోసం, ఎన్నికల్లో అక్రమ ప్రయోజనాలను పొందడం కోసం భాషా మత ప్రాంతీయ ఉన్మాదాలను రెచ్చగొట్టడంలో భాగంగా కరడుగట్టిన హంతకులను క్షమించి వదలిపెట్టడం అనేక రాష్ట్రాల ప్రభుత్వాల నిర్వాహకులు దశాబ్దులుగా కొనసాగిస్తున్న దుశ్చర్య. ఘోర నేరాలకు పాల్పడినట్టు ఋజువైన తరువాత కారాగృహవాసంలో ఉన్నవారికి తాత్కాలిక నిర్బంధ విముక్తి-పేరోల్-ని మంజూరు చేయడం కూడ చట్టాల దుర్వినియోగానికి నిదర్శనం. ఇలాంటి న్యాయ వైపరీత్యాలు ఇకపై జరగకుండా బుధవారం నాటి సర్వోన్నత న్యాయ నిర్ణయం నిరోధించగలదు. ఈ నిర్ణయం కేవలం రాజీవ్ గాంధీ హంతకుల విడుదల వ్యవహారానికి మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడో అప్పుడు జైలు నుంచి విముక్తి లభించగలదన్న అత్యాశతో కటకటాల వెనుక పొంచివున్న వందలాది వేలాది నేరస్థులకు సంబంధించినది. నేరస్థులు ఇలా పొంచి ఉండడానకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు పెట్టినపేరు ‘ఆశాకిరణం’...‘రే ఆఫ్ హౌజ్’! అయితే కరుడు కట్టిన నేరస్థులకు ఈ ఆశాకిరణ సిద్ధాంతం వర్తింప చేయడం ఘోరమైన సామాజిక వైపరీత్యమన్నది ధర్మాసనం న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాజీవ్ గాంధీని హత్య చేసి నందున ఆజీవ కారాగారవాస శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు నేరస్థులు ఎప్పటికీ విడుదలయ్యే ప్రమాదం తప్పింది. ఈ నేరస్థులను విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రయత్నం వమ్మయింది. పదునాలుగేళ్లపాటు జైలుశిక్షను అనుభవించిన యావజ్జీవ బం ధితులను విడుదల చేసే దుష్ట సంప్రదాయం దాదాపు అన్ని రాష్ట్రాలలో నెలకొని ఉంది. కానీ ఇలా పదునాలుగేళ్ల శిక్షను అనుభవించిన జీవిత నిర్బంధితులను జైలు నుంచి విడుదల చేయడం సరికాదని, అలా విడుదల చేయాలన్న న్యాయ నిబంధనలు లేవని సుప్రీంకోర్టు గతంలో కూడ స్పష్టం చేసింది. యావజ్జీవ కారాగారం అని అంటే నేరస్థుడు సహజంగా మరణించే వరకు నిర్బంధంలో ఉండాలన్న అర్థాన్ని న్యాయస్థానం ధ్రువీకరించి ఉంది. అయినప్పటికీ వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు యావజ్జీవిత నిర్బంధమంటే పదునాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమేనన్న వక్ర భాష్యం చెప్పడంలో భాగంగానే తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడుగురు ఎల్‌టిటిఇ ఉగ్రవాదులను విడుదల చేయడానికి ప్రయత్నించింది.
సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం బుధవారం చెప్పిన తీర్పులో ఈ ప్రయత్నం విఫలమైంది. సమాజంపై జాలి చూపని మానవ పిశాచాల పట్ల సమాజం జాలి చూపడం అపాత్రమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు, న్యాయమూర్తులు, ఎఫ్‌ఎమ్‌ఎల్ కలీఫుల్లా, పిసి ఘోష్ స్పష్టం చేయడం మానవీయ విచక్షణకు మరో గెలుపు. నేరస్థులకు ప్రధానం తలలను తెగ నరకడానికి, బాంబులు పేల్చి మానవ మేధం జరపడానికి వెనుదీయని భయంకర బీభత్సకారులు ఆశాకిరణాన్ని ప్రసరింపచేయడం మరో సామాజిక నేరం మాత్రమే కాగలదు. అనేక రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులకు ఇలాంటి సమాజ వ్యతిరేక నేరాలకు ఒడిగట్టినట్టు ఇప్పుడు స్పష్టమైపోయింది. కేంద్ర నేర పరిశోధన విభాగం-సిబిఐ- తదితర కేంద్ర సంస్థలు బృందాలు దర్యాప్తు చేసి నేరాలను న్యాయస్థానంలో నిరూపిస్తున్నాయి. ఇలాంటి అభియోగాలకు సంబంధించిన నేరస్థుల జీవిత ఖైదు కాల వ్యవధిని సైతం రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన సందర్భాలు, రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి శిక్షల కాల వ్యవధిని కూడా ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడానికి వీలులేదు, రద్దు చేయడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైన మరో న్యాయ నిబంధన ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత పోలీసు అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఆయన కారు డ్రైవర్‌ను 1992లో కాల్చిచంపిన జిహాదీ దుండగుడు ముజిబ్ అహ్మద్‌ను 2004 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బీభత్సకారుడు విడుదలైన తరువాత ఆశాకిరణం వాస్తవంగా ప్రసరించిందని భావించి మంచివాడుగా మారలేదు. పాకిస్తాన్ జిహాదీ ముఠాలతో కలిసి మళ్లీ పేలుళ్లు జరపడానికి యత్నించి పట్టుబడినాడు. ఆశాకిరణం, సిద్ధాంతం దేశవ్యాప్తంగా ఇలా ఘోర వైపరీత్యాలకు దారితీయడం బుధవారం నాటి సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయానికి నేపథ్యం. ధర్మాసనంలో మరో ఇద్దరు న్యాయమూర్తులు ఎఎమ్ సప్రే, యుయు లలిత్ విభేదించినప్పటికీ, ముగ్గురు న్యాయమూర్తులు చెప్పిన తీర్పు న్యాయపాలనలో విప్లవాత్మక పరిణామం.
తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ సమీపంలో 1991 మే నెలలో-తమిళ ఈలం లిబరేషన్ టైగర్లు- ఎల్‌టిటిఇ- జరిపిన పేలుళ్లకు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ బలైపోయారు. ఈ అభియోగంలో మరణశిక్షకు గురైన మురుగన్, సంతానం, అరివు అన్న నేరస్థులకు ఆ దండన నుండి విముక్తిని కలిగించడానకి తమిళనాడు ప్రభు త్వం గొప్ప ప్రహసనాన్ని నడిపింది. వీరికి మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షను విధించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ 2011 ఆగస్టు 30న తీర్మానాన్ని ఆమోదించడం న్యాయానికి జరిగిన ఘోరమైన అపచారం. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. నేరస్థులకు మరణశిక్షను అమలు జరపడంతో ప్రభుత్వాలు చేసిన తీవ్రమైన జాప్యాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వారు రాష్టప్రతిని క్షమా యాచన కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వం ఏళ్లతరబడి నిరాకరించలేదు... ఫలితంగా మరణశిక్ష అమలు జరగలేదు. ఇలా జాప్యం జరుగడం నేరస్థులకు జరిగిన అన్యాయమని ఇంత విలంబనం జరిగిన తరువాత వారి మరణశిక్షను అమలు జరపరాదని 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల వారిని ఆజీవనం కారాగారంలో ఉంచాలన్నది నేడు సర్వోన్నత న్యాయ నిర్ధారణ...
ఈ సర్వోన్నత న్యాయ నిర్ధారణను సైతం వమ్ము చేసి ఆ ముగ్గురినీ, ఈ అభియోగంలో జీవిత నిర్బంధ శిక్షను అనుభవిస్తున్న మరో నలుగురిని పూర్తిగా జైలునుంచి విడుదల చేయడానికి తమిళనాడు ప్రభుత్వం యత్నించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విడుదలను అంగీకరించకపోవడం వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించవలసి వచ్చింది. ఈ ఏడుగురూ జీవితాంతం నిర్బంధంలో ఉండాలన్నది తుది తీర్పు. మరణశిక్షను యావజ్జీవ శిక్షలుగా మార్చడం, ఆ తరువాత వారిని అర్థాంతరంగా విడుదల చేయడం..ఇలాంటి ‘నాటకాలు’ ఇక జరగవు. యవజ్జీవం కారాగృహవాసంలో ఉండదగిన నేరస్థులలో కొనే్నళ్ల తరువాత పశ్చాత్తాపం కలిగి పరివర్తన వస్తుందన్న ప్రయోగాలు విఫలమయ్యాయని కూడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తిగత కారణాలపై హత్యలు చేసే నేరస్థులలోనే పరివర్తన రావడం అసాధ్యమైనప్పుడు, దేశాల పట్ల మతాల పట్ల విరోధంతోను, ఇతరేతర సమష్టి శత్రుత్వాల ప్రాతిపదిక గాను, హత్యలు చేసే టెర్రరిస్టులకు పశ్చాత్తాపం కలుగుతుందా? పరివర్తన వస్తుందా?