మెయన్ ఫీచర్

అక్షయ ‘ధృతి’..అక్షర ద్యుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలు అజామర
భావానికి రూపాలు..
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు...
అక్షరాలు ఎద విరిసిన
సుమనముల పరిమళాలు
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధన స్వరాలు
ఆంగ్లభాషా ప్రాధాన్యం మరింతగా పెరిగిపోతుండడం ఫిబ్రవరి 21వ తేదీ నాటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి నేపథ్య వైపరీత్యం. తెలుగునాట మాతృభాషా దినోత్సవాల ధ్యాస మరుగున పడిపోతుండడం మరోసారి ధ్రువపడిన వాస్తవం. ఈ నేపథ్యంలో ‘‘పాన్ హిందూ రైటర్స్ ఫోరం’’ అన్న సంస్థవారు తెలుగు రాష్ట్రాల తాత్కాలిక ఉమ్మడి రాజధానిలో భారతీయ మాతృభాషల సమ్మేళనాన్ని నిర్వహించడం వైవిధ్య భాషల అద్వితీయ జాతీయతకు నిదర్శనం. ఒక జాతికి ఒకే భాష కాక అనేక భాషలుండడం అనాదిగా హైందవజాతి విశిష్టత. మన దేశంలో వలె ఇన్ని ప్రధాన జాతీయ మాతృభాషలున్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. అనేక మతాలు పరస్పరం సహజీవనం చేస్తున్న మనదేశంలో అనేక భాషలు పరస్పరం పరిపోషకాలుగా పనిచేస్తున్నాయి. మత సమభావం, భాషా సమభావం మన సంస్కృతిలో భాగం. అందువల్లనే మనది సాంస్కృతిక జాతి-కల్చరల్ నేషన్‌గా వికసించింది. కానీ భాషా దినోత్సవాల పేరుతో ఒకే భారతీయ మాతృభాషాభిమానులు ఒకచోట గుమికూడడం నడచిపోతున్న ప్రహసనం. ఇందుకు అపవాదంగా ఒకే వేదికపై అనేక భారతీయ మాతృభాషల సమ్మేళనం జరపడం పాన్ హిందూ రైటర్స్‌ఫోరం వారు దర్శించిన వైవిధ్య స్వరూపాల మధ్య కల అద్వితీయ స్వభావం. ఈ స్వభావం భారత జాతీయత...హైందవ జాతీయత! కానీ భారతీయ మాతృభాషలను దిగమింగిన, దిగమింగుతున్న హంతక భాష ప్రభావం ప్రాధాన్యం ప్రతి ఏటా విస్తరిస్తోంది. కర్నాటక వంటి చోట్ల ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంలో మాత్రమే బధించాలన్న ఆదర్శాన్ని ఆచరించి చూపడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దులుగా సంఘర్షణ సాగిస్తోంది. కానీ అనేక ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వపు బడులలో సైతం మాతృభాషా మాధ్యమాన్ని మట్టుబెట్టి హంతక భాషలోనే బుడతలకు విద్యలను మప్పడానికి విపరీతమైన కృషి జరుగుతోంది. ఈ కిల్లర్ లాంగ్వేజ్ ఇంగ్లీషు...మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో స్వజాతీయ భాషలను మట్టుపెడుతున్న హంతక భాష ఆంగ్లం...మనకు తెలియకుండా మ నం ఆంగ్లభాష పరిధిలో మరింతగా కూరుకుపోతున్నాము.
ఐదవ తరగతి వరకు తెలుగులోనే బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వేతర పాఠశాలలో సైతం ఈ విధానం అమలు జరుపడానికి విశేష కృషి చేయనున్నదని జనవరిలో ప్రచారమైంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సైతం ఆంగ్ల మాధ్యమ విద్యను బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రచారమైంది. ఏది తుది నిర్ణయం?
వర్షం కురిసినప్పుడు పప్పులు ఉప్పులు నానితే అవి పాడయిపోతాయి. కొబ్బరికాయలు, వర్షంలో నానినప్పటికీ చెడిపోవట. అందువల్ల సంతలలో వర్షం కురిసినప్పుడు ఏడవ వలసింది ఉప్పు అమ్మేవాడు, పప్పులమ్మేవాడు. ‘‘ఉప్పోడు ఏడవలేదు, పప్పో డు ఏడవలేదు, టెంకాయల ఆసామి పొర్లిపొర్లి ఏడ్చాడట..’’ అన్న సామెత పుట్టడానికి ఇదీ ప్రాతిపదిక. బ్రిటిష్ వారు తమ ఆంగ్లభాష అడుగంటి పోతుందని రోదనను అభినయించడం కూడ వానొచ్చినప్పుడు టెంకాయల వర్తకులు పొర్లి ఏడ్చినట్టుంది. ప్రపంచంలోని ప్రజలంతా ఎత్తివచ్చి తమ దేశంలోని మాతృభాష ఇంగ్లీషును తొలగిస్తారన్న భయం బ్రిటన్ పాలకులకు పట్టుకుంది. అందువల్ల తమ దేశంలోకి వలస వచ్చే వివిధ దేశాలవారు విధిగా ఇంగ్లీషు నేర్చుకొని రావాలని బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. తమ దేశంలో స్థిర నివాసం ఏర్పరచుకొనడానికి వస్తున్న విదేశీయుల సంఖ్యను బాగా తగ్గించి వేయాలన్నది 2014లో బ్రిటన్ ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన విధానం. క్రీస్తుశకం 2070 నాటికి బ్రిటన్‌లో తెల్ల జాతీయులు అల్పసంఖ్యాకులుగా మారిపోయే ప్రమాదం ఉందట. ఇదంతా భాషా ప్రాతిపదికగా జాతిని ఏర్పాటు చేస్తున్న ఐరోపా దేశాల భయానికి ఒక ప్రతీక మాత్రమే.
కేవలం భాషా ప్రాతిపదికగా జాతి ఏర్పడుతుందని, కేవలం మతం ప్రాతిపదికగా జాతి ఏర్పడుతుందని సిద్ధాంతాలను ఏర్పాటు చేసిన కృత్రిమ నాగరిక వాదులు నాలుకలను కరచుకొంటుండడం, ఆవిష్కృతవౌతున్న అంతర్జాతీయ దృశ్యం. ఒక భాషకు ఒక జాతి అన్న సంకుచిత భావం ఉక్రెయిన్ దేశం నుండి క్రిమియా అన్న ప్రాంతం విడిపోవడానికి కారణం. బ్రిటన్ నుండి స్కాట్‌లాండ్ 2014లో దాదాపు విడిపోయినంత పని కావడానికి కారణం కూడ భాషా జాతీయ వాదం. కెనడా నుండి విడిపోవడానికి క్యూబెక్ ప్రాంతవాసులు ఉద్యమించడానికి కూడ ఒకటి కంటె ఎక్కువ భాషల వారు ఒకేదేశంలో సహజీవనం చేయలేకపోతుండడం. ఇప్పుడు బ్రిటన్ ఐరోపా సమాఖ్య నుండి తప్పుకోవాలా? వద్దా అన్న మీమాంసలో పడింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగబోతోంది. ఈ మీమాంసకు కారణం కూడ భాషా వైరుధ్యాలు మాత్రమే.
ఈ వైపరీత్యానికి పూర్తి భిన్నం ఒకే భారత దేశంలో అనాదిగా అనేక మాతృభాషలు కలసి మెలసి ఉండడానికి కా రణం. ఇది భాషా జాతి కాకపోవడం. సర్వభాషల సంపుటమైన అద్వితీయ సంస్కృతి ఈ దేశపు అనాది జాతీయతకు ప్రాతిపదిక. అన్ని భారతీయ మాతృభాషలనూ సమన్వయం చేస్తున్న మూల సూత్రం సంస్కృత భాష. మొత్తం దేశానికి మాతృభాష సంస్కృతం.. ఈ ఇతివృత్తం ప్రాతిపదికగా ‘‘పాన్ హిందూ రైటర్స్ ఫోరం’’ వారు భారతీయ మాతృభాషల దినోత్సవం జరపడం సమన్వయ తత్వానికి చిహ్నం.
ఈ సమన్వయ తత్వాన్ని భంగపరచిన విపరిణామ ప్రక్రియకు శతాబ్దుల తరబడి సాగిన విదేశీయుల దురాక్రమణ కారణం. ఉన్నత విద్యాబోధనకు మాధ్యమంగాను, వివిధ ప్రాంతాల భాషలకు అనుసంధానంగాను కొనసాగిన సంస్కృత భాషను, ఆంగ్లభాష తొలగించింది. సంస్కృత భాషలో అనాదిగా జరిగిన జాతీయ కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులో జరగడం ఆరంభం కావడం బ్రిటిష్ పాలన ఫలితం. సంస్కృత భాషకు అనుసంధానమైన భారతీయ భాషల ద్వారా వికసించిన సంస్కారాలు భారతీయుడిని భారతీయుడిగా నిలబెట్టాయి. ఆంగ్ల భాషా మాధ్యమంగా వికసించిన సంస్కారాలు భారతీయుడిని బ్రిటిష్ వానిగా పరివర్తనం చేశాయి. ఇంగ్లీషును హంతక భాష అని అంతర్జాతీయ సమాజం కూడ ఇప్పుడు గుర్తించడానికి ఇదీ కారణం. హామ్లెట్ నాటకంలో పోలోనిమస్ అన్నవాడు తన కుమారుడికి చేసిన బోధనలను గురించి తెలుసుకోవడం గొప్ప. మహాభారతంలో ధర్మవ్యాధుడు కౌశికునికి చేసిన బోధనల ధ్యాస లేకపోవడం తప్పు కాదు. ఇంగ్లీషు అనివార్యం అయిపోయింది మరి. ఇంగ్లీషు మాటలను కనీసం సభలో ప్రసంగించే వక్తలైనా వాడవద్దని భారతీయ భాషల సమ్మేళనం అధ్యక్షుడు సలహా ఇచ్చాడు. ఆయన హిందీలో ప్రసంగించాడు. కానీ వ్యక్తులందరూ ధారాళంగా ఆంగ్ల పదాలతో భారతీయ భాషలను సంకరం చేశారు. ఇంగ్లీషులో మాట్లాడుతున్నవారు, వ్రాస్తున్నప్పుడు మధ్యలో భారతీయ భాషల పదాలను వాడడం లేదు. సంకరం చేయడం లేదు. ఆంగ్ల భాషా స్వచ్ఛతను అసిధారావ్రతంలాగ నిలబెడుతున్నాము. ఇదే సూత్రాన్ని భారతీయ భాషలకు వర్తింపజేయడం న్యాయం. తార్కికం.
ఇంగ్లీషు పత్రికలలో తెలుగు శీర్షికలను పెట్టడం లేదు. కానీ తెలుగు పత్రికలలో ప్రతి పుటలోను కనీసం ఒక ఇంగ్లీషు హెడ్డింగ్ ఎందుకని దర్శనమిస్తోంది? ఈ సిగ్గులేని తనానికి ప్రాతిపదిక ఇంగ్లీషు భాష భారత జాతీయ ఆత్మను ఆవహించి ఉండడం. కిల్లర్ లాంగ్వేజ్ అని అంటే ఇదీ. మాతృభాషల పట్ల భారతీయుని మమకారం కృత్రిమం, కుహనా పారవశ్యం, నకి లీ అనుభూతి...ఇలా భారతీయభాషల సమ్మేళనం జరిపిన సంస్థ పేరు ఇంగ్లీషులో ఉంది. ‘‘పాన్ హిందూ రైటర్స్ ఫోరం’’ భారతీయ భాషలలో పేరు దొరకలేదా? ‘విస్తృత హిందూ రచయితల సంఘం’ అనో ‘విశ్వ హిందూ రచయితల సమితి’ అనో పేరు ఎందుకని పెట్టుకోలేదు?
ఒక మహారాజ సభకు పూర్వం ఎప్పుడో ఒక కవి వెళ్లాడట. ఈ నూతన కవికీ సభలోని పాత కవి పండితులకు మధ్య ఇష్టాగోష్ఠి జరిగింది. నూతన కవి పండితుడు సభలోని పాతవారికి ఒక ప్రశ్న వేశాడు...‘‘గతంలో, వర్తమానంలో భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని భాషలలో రూపొందిన రూపొందుతున్న రూపొందగల పుస్తకాలన్నింటిలోను ఉన్నది ఏమిటి?’’ రాజుగారి ఆస్థానంలోని మేధావులు అనేక సమాధానాలు చెప్పారు. ఏ సమాధానం కూడ సరియైనది కాలేదు. చివరికి ఆస్థాన విద్వాంసులందరూ తమ ఓటమిని ఒప్పుకున్నారు. సరైన సమాధానాన్ని చెప్పమని కొత్త పండితులు కోరారు. ‘‘అయ్యాలారా! సమాధానం చాలా సులభమైంది, నేను అక్కరలేదు, నాకో ఆరేళ్ల మేనకోడలుంది. ఆ బాలిక సమాధానం చెబుతుంది..’’ అని కొత్త పండితుడు ప్రకటించాడు. మరుసటి రోజు అతగాడు తన ఆరేళ్ల మేనకోడలిని వెంటపెట్టుకొని రాజసభకు వెళ్లాడు. ‘‘చెప్పమ్మా చెప్పు’’ అని ఆ పాపను పురమాయించాడు. ఆ పాప సమాధానం ఇలా చెప్పింది. ‘‘అ,ఆ, ఇ, ఈ, ఉ, ఊ..’’ అని ‘ఱ’ వరకు అక్షరమాలను ఆ పాప అప్పగించింది. అంతే మరి సర్వకాలాలలోని సర్వ భాషా గ్రంథాలలో ఉండేది అక్షర మాల మాత్రమే. అక్షరం భావానికి విగ్రహ రూపం. అమ్మ అన్న అక్షర విగ్రహం ద్వారా ఎక్కడో ఉన్న అమ్మ సాక్షాత్కరిస్తోంది. అక్షరాలు భాషకు అంగాలు. ఒక్కొక్క అక్షరాన్ని రక్షించడం వల్లనే భాష సకలాంగ అవుతుంది. ఒక్క అక్షరం నష్టమైనప్పటికీ భాష ‘వికలాంగ’ అవుతుంది. ‘శకలాంగ’ అవుతుంది. మన తెలుగు భాషలో అన్ని అక్షరాలూ ఇలా రక్షణకు నోచుకోవడం లేదు. సంస్కరణల పేరుతో కొన్ని అక్షరాలను భక్షించారు.
‘‘తెలుగు భాషకక్షరాలు ఏబది ఆరు..’’ అన్న పల్లవిలోని ఒక రచయిత ఈ భారతీయ భాషల సమ్మేళనంలో తెలుగు స్వరూపాన్ని వివరించే గీతాన్ని పాడాడు. మన భాషలో పదహారు అచ్చులు, మూడు ఉభయాక్షరాలు, ముప్పయి ఏడు హల్లులు ఉన్నాయన్న వాస్తవాన్ని ఆయన గుర్తు చేశాడు. కానీ అచ్చులలో నాలుగు, ఒక ఉభయాక్షరం, మూడు హల్లులు, కొన ఊపిరితో కొట్టుకుంటున్నాయి. బతికించడానికి చికిత్స ఎవరు చేస్తున్నారు?

- హెబ్బార్ నాగేశ్వరరావు email: 2013hebbar@gmail.com