సంపాదకీయం

శాసన సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగు రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోను త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలు సుదీర్ఘమైన మరో ప్రజాస్వామ్య ప్రక్రియ. ఏప్రిల్ నాలుగవ తేదీనుంచి మే పదహారవ తేదీ వరకు ఇలా నలబయి నాలుగు రోజులపాటు పోలింగ్ విస్తరించడానికి ప్రధాన కారణం బెంగాల్ అస్సాం రాష్ట్రాలలో క్షీణించిన ప్రశాంతి...2014 మే 26న భాజపా నాయకత్వంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం పాలన బాధ్యతను స్వీకరించిన తరువాత ఇంత విస్తృతంగా శాసనసభ సమరం జరగడం ఇదే మొదటిసారి! ఎన్నికలు జరుగుతున్న ఐదు ప్రాంతాలలోను భాజపాకు గత వైభవం లేదు! కాంగ్రెస్ వైభవం కేరళ, పుదుచ్చేరి, అస్సాంలకు పరిమితం కావడం దశాబ్దుల ప్రహసనం! తమిళనాడులో 1967లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఆ తరువాత క్రమంగా అడుగంటిపోయింది! 1971 నుంచి కూడ రెండు ప్రధాన ద్రవిడ పార్టీలలో ఏదో ఒకదాని తోకను పట్టుకుని కాంగ్రె స్ రాజకీయ కావేరిని ఈదుతుండడం తమిళనాడు ఎన్నికల ప్రధాన ఇతివృత్తం! 1988 నాటి శాసనసభ ఎన్నికలలోను 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలోను ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో ధరావత్తులను గల్లంతు చేసుకుంది! 1977లో బెంగాల్ పరాజయ పరాభవాన్ని మూటకట్టుకున్న కాంగ్రెస్ ఆ తరువాత అక్కడ కూడ నానాటికీ తీసికట్టుగా మారింది! కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ మాతృసంస్థనుండి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించడం బెంగాల్ రాజకీయం గతిని మార్చిన పరిణామం! ఆ తరువాత కాంగ్రెస్ కొన్నిసార్లు తృణమూల్‌తో కలిసి మరికొన్నిసార్లు ఒంటరిగాను పోరాడడం చరిత్ర! ఒకప్పటి ప్రబల ప్రత్యర్థి అయిన వామపక్ష కూటమిలో ఇమిడిపోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధంగా ఉండడం శాసన సమరానికి విచిత్ర నేపథ్యం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా భాజపా అవతరించనున్నదన్న భయం ఈ విచిత్ర నేపథ్యానికి కార ణం! కేరళలో ప్రతి ఐదేళ్లకు వోటర్లు అధికార పార్టీని మార్చుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇది ప్రతికూలమైన రాజ కీయ వాస్తవం! అస్సాంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఈసారి వోటర్లు తిరస్కరించే అవకాశం ఉందన్నది భాజపా పాలిట ఆశాకిరణం! భాజపా, అస్సాం గణపరిషత్-ఏజిపి, బోడోప్రజాసమాఖ్య-బిపిఎఫ్ కూట మి వాస్తవమైతే కాంగ్రెస్ పరాజయంపాలు ఖాయనమన్నది జరుగుతున్న ప్రచారం..
భాజపా ఈ ఐదు రాష్ట్రాలలోను గతంలో బలం లేదు. కనుక ఏ మేరకు బలం పెరిగినప్పటికీ అది ఆ పార్టీకి విజయం కాగలదు! లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రస్ఫుటించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం ఈ అన్ని ప్రాంతాలలోను భాజపాను గణనీయమైన శక్తిగా నిలబెట్టింది! గత నవంబర్‌లో కేరళలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పదునాలుగు గ్రామాలను భాజపా కైవసం చేసుకోవడం ఆ పార్టీవారు ఘనంగా ప్రచారం చేస్తున్న అంశం! అలాగే తిరువనంతపురం నగర పాలిక ఎన్నికలలో ముప్పయి ఐదు స్థానాలలో భాజపా విజయం సాధించింది! తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత నాయకత్వంలోని అన్నాడిఎంకెతోకాని, మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిధితో కాని పొత్తులేకుండానే 2014 నాటి ఎన్నికలలో భాజపా కూటమి రెండు లోక్‌సభ స్థానాలను గెలిచింది. తమిళనాడులో సైతం భాజపా ఎదుగుతున్నదని ఆ తరువాత జరిగిన ప్రచారం! పశ్చిమ బెంగాల్ మాత్రం లోక్‌సభ ఎన్నికల తరవాత భాజపా ప్రభావం విస్తరించడం లేదు. పంచాయతీలకు, పట్టణ నగర పాలికలకు జరిగిన ఎన్నికలు ఇందుకు నిదర్శనం! భాజపా ఈ ఎన్నికలలో కాంగ్రెస్, వామకూటమి వోట్లను గణనీయంగా చీల్చివేస్తుందన్నది జరుగుతున్న ప్రచారం! తద్వారా తృణమూల్ కాంగ్రెస్ మరోసారి విజయం సాధించే అవకాశం ఉంది. అందువల్ల భాజపాకు అస్సాం ఒక్కటే ఆశాకిరణం. లోక్‌సభ ఎన్నికలలో ఏడుచోట్ల విజయం వరించడం ఈ ఆశకు ప్రాతి పదిక!
ఇలా ఐదు శాసనసభలకు జరుగనున్న ఎన్నికలలో దాదాపు 17 కోట్ల మంది వోటర్లు భాగస్వాములవుతుండడం బృహత్ ప్రజాస్వామ్య ప్రక్రియ! 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమరం ముగిసిన తరువాత ఇంత పెద్ద సంఖ్యలో వోటర్లు పాల్గొంటున్న పోలింగ్ జరగడం ఇదే మొదటిసారి. నూట పదహారు లోక్‌సభ స్థానాలు విస్తరించి వున్న ఈ ఐదు రాష్ట్రాలలో 824 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇపుడు వోట్లు వేయనున్న వారి సంఖ్య మొత్తం వోటర్లలో దాదాపు ఐదవ వంతు మాత్రమే! అయినప్పటికీ అనేక ప్రజాస్వామ్య దేశాలలోని మొత్తం వోటర్ల సంఖ్య కంటె ఇది చాలా ఎక్కువ! నవంబర్‌లో ఎన్నికలు జరుగనున్న అమెరికాలో మొత్తం వోటర్ల సంఖ్య దాదాపు ఇరవై కోట్లు. అమెరికా రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం! మన దేశపు ప్రజాస్వామ్య బృహత్ స్వరూపానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలలో తమిళనాడులోని శాసనసభ స్థానం అతి పెద్దది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోను ఆరు శాసనసభ స్థానాలున్నాయి. 39 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 234 శాసనసభ స్థానాలు విస్తరించి ఉన్నాయి. అతి చిన్న శాసనసభ స్థానం తమిళనాడుకు ఆనుకుని ఉన్న పుదుచ్చేరిలో ఉంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ఉన్నది ఒక్క లోక్‌సభ స్థానం. అయినప్పటికీ 30 శాసనసభ స్థానాలకు ఈ లోక్‌సభ స్థానం విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న యానాం, కేరళ పక్కగా వున్న మాహే వంటి ప్రాంతాలు పుదుచ్చేరికి చెందినవే! కేరళలోను బెంగాల్‌లోను ఒక్కో లోక్‌సభ స్థానంలో ఏడు శాసనసభ స్థానాలు విస్తరించి ఉండగా అస్సాంలో ఒక లోక్‌సభ స్థానంలో ఎనిమిది శాసనసభ స్థానాలున్నాయి. 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో ఇలా 294, ఇరవై లోక్‌సభ స్థానాలున్న కేరళలో 140, పదునాలుగు లోక్‌సభ స్థానాలున్న అస్సాం రాష్ట్రంలో 126 శాసనసభ స్థానాలున్నాయి! అందువల్ల వివిధ రాష్ట్రాల శాసనసభ స్థానాలలో జనాభా సంఖ్య వోటర్ల సంఖ్య సమానంగా ఉండదు. తమిళనాడులోని శాసనసభ నియోజకవర్గ అతి ఎక్కువ సంఖ్యలో వోటర్లు ఉండగా పుదుచ్చేరి శాసనసభ నియోజకవర్గంలో వోటర్ల సంఖ్య అతి తక్కువ...దేశంలోనే అతి పెద్ద శాసనసభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క లోక్‌సభ స్థానంలో కేవలం ఐదు శాసనసభ స్థానాలున్నాయి! ఇదంతా మన సమాఖ్య రాజ్యాంగ వ్యవస్థలోని వైవిధ్యాలకు దర్పణం...
వైవిధ్యవంతమైన పరిణతి చెందిన మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ధ్వనిస్తున్న ఏకైక అపశ్రుతి శాంతి భద్రతలు క్షీణించడం! ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జిహాదీలు, మావోయిస్టులు, ఇతరేతర అసాంఘిక శక్తులు, కిరాయిగూండాలు హింసాకాండకు పాల్పడగలరన్న భయం వోటర్లను ఆవహించి ఉంది! ఈ భయంలేని చోట ఎన్నికల పోలింగ్ ఒకే రోజున ఒకే దశలో పూర్తి అవుతుండగా భయం ఉన్న చోట పోలింగ్ ప్రక్రియ వివిధ దశలకు విస్తరించిపోతోంది! పశ్చిమ బెంగాల్‌లో 2011లో ఆరు దశలలో పోలింగ్ జరగ్గా ఈసారి ఏడు దశలకు విస్తరించింది! ఇందుకు కారణం ఆ రాష్ట్రంలో హింసాకాండ చెలరేగే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషనర్ భయపడుతుండడమే! ఐదు ప్రాంతాలలో పోలీసులకు సహాయంగా దాదాపు ఎనబయి వేలమంది కేంద్ర అనుబంధ సైనికులు భద్రతా విధులకు హాజరవుతున్నారట! ఏమయినప్పటికీ మన దేశంలో ఒకేరోజున పోలింగ్ జరగకపోవడం మన ప్రజాస్వామ్య ఘనతకు తీరని లోపం! ఒకేరోజున పోలింగ్ జరిగే విధంగా భద్రతను కల్పించడం సాధ్యం కాదా?