మెయన్ ఫీచర్

‘బహుళ’ దోపిడీని ఆపని పాలకులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసిలస్ తురింజెనిసిస్-బిటి- జీవరసాయన విషం నిండిన పత్తిపంట వ్యవసాయ భూమిని బీడు చేస్తోంది, రైతుల బతుకులను పాడు చేస్తోంది. పరిసరాలను ప్రకృతిని గాయపరుస్తోంది. ప్రజలను వ్యాధిగ్రస్థులను చేస్తోంది. ప్రపంచీకరణ ప్రాంగణంగా మనదేశం ఏర్పడిన నాటినుంచి, మన వ్యవసాయ నందనం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలనే మారీచ మృగాలకు స్వేచ్ఛావిహార భూమిగా మారిపోయింది. బిటి పత్తివిత్తనాలు అమ్ముతున్న మొన్‌సాంటో అనే విదేశీయ సంస్థ భయంకరమైన ధరలను రైతుల వద్ద వసూలు చేసింది. చేస్తోంది! గొప్ప దిగుబడినిచ్చి పత్తిరైతులను సంపన్నులను చేయగలదన్న ప్రచారం పొందిన బిటి పత్తి చిత్రవిచిత్రమైన క్రిమి కీటకాలను మాత్రమే సృష్టించింది. రకరకాల రంగులలోని ఈ రాక్షసి ఈగలు, దోమలు పత్తిపంటను నమిలి మింగేసి లేచిపోతున్నాయి. ఫలితంగా రైతులు తీవ్రమైన నష్టాలకు, తీర్చలేని ఋణాలకు గురి అయిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కాని, రాష్ట్ర ప్రభుత్వాలు కాని ఈ బిటి పత్తిని సంపూర్ణంగా నిషేధించకపోవడం ప్రపంచీకరణ మాయాజాలం. విషం నిండిన శీతల పానీయాలను ముఖ్యమంత్రులు, రాజకీయవేత్తలు సుధామధుర రసాలుగా భ్రమించడం ఈ మాయాజాలంలోని ఒక అంశం మాత్రమే. బిటి విత్తనాలను నిషేధించని ప్రభుత్వాలు రైతులకు భారీ నష్టం వాటిల్లినప్పుడు మొన్‌సాంటో వంటి విత్తన విక్రేతలను కనీసం నిలదీయడం లేదు. గొప్ప మొహమాటం, మన ప్రభుత్వాలను ఆవహించి ఉండడం మొన్‌సాంటో వంటి సంస్థలకు మన రాజకీయ వ్యవస్థపై గల పట్టునకు నిదర్శనం. ఇలా ప్రనుత్వం మొన్‌సాంటోను నిలదీయని దృశ్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తాండవిస్తోంది. గులాబీరంగు, గుండ్రటి పురుగులు బిటి పత్తి పంటను ధ్వంసం చేస్తున్న దృశ్యమిది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో ఈ గుండ్రటి గులాబీ పురుగు పత్తిపంటను పాడుచేశాయి. మొన్‌సాంటో దోపిడీ ముఠా వారు రైతులను మోసం చేసి అమ్ముతున్న బిటి పత్తి విత్తనాలు ఈ విచిత్ర క్రిములను సృష్టించాయి. అందువల్ల కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు మొన్‌సాంటో సంస్థకు ఇదివరకే సంజాయిషీని కోరుతూ తాఖీదులను జారీ చేశాయట. ఆ రాష్ట్రాలలో కూడ ఈ గుండుమూతి పురుగులు బిటి పత్తిపంటలో పుట్టి పెరిగి పంటను ధ్వంసం చేశాయి. బిటి పత్తి ఇలా ఆధునిక భస్మాసురునివలె వికృత తాండవం చేస్తోంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకూ మొన్‌సాంటో ముష్కరుల నుంచి ఎలాం టి సంజాయిషీని నిరోధించకపోవడం విచిత్రమైన విషాదం.
గుండ్రటి పురుగులు పుట్టుకొని రావడానికి బిటి పత్తివిత్తనాలు కారణం కాకపోవచ్చునని రైతులు పాటిస్తున్న వ్యవసాయ పద్ధతులు కారణం కావచ్చునని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు భావిస్తుండడం మరో వైపరీత్యం. నష్టపోయిన రైతుల తరపున మాట్లాడవలసిన ప్రభుత్వం విత్తనాలను అమ్మించిన బహుళ జాతీయ సంస్థను వెనకేసుకొని రావడంలోని అంతరార్థం ఏమిటి? బిటి పత్తిని ఒకే పంటగా కాక మిశ్రమ పద్ధతిలో రెండు పంటలతో కలిపి పండించాలని కూడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఉచిత సలహాలిస్తున్నట్టు మాధ్యమాలలో ప్రచారమైంది. కానీ బిటి పత్తితోపాటు మరే ఇతరమైన పంట కూడ పండదట. రైతులు చెప్పిన నిజమిది. అంతేకాదు బిటి పత్తిని కొనే్నళ్లపాటు వరుసగా పండించిన వ్యవసాయ భూమిలో ఏ ఇతరమైన పంట కూడ పండదని అనేక గ్రామాలలో రైతులు స్వయంగా చెప్పిన మాటలు..పత్తిని పండించడం మాని ఇతర పంటలు పండించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహా కూడ ఇప్పుడు పనిచేయదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో పండిస్తున్న పత్తిపంటలో తొంబయి ఎనిమిది శాతం బిటి పత్తి. మొన్‌సాంటో సంస్థవారి మారీచ జాలంలో ఏళ్ల తరబడి వ్యవసాయ భూమి ఇరుక్కొని పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మొన్‌సాంటో సంస్థకు లభిస్తున్న వాణిజ్య రాజస్వం-రాయల్టీ- శాతాన్ని తగ్గించింది. ఇది హర్షణీయమైన తాత్కాలిక పరిణామం. కానీ మొన్‌సాంటో సంస్థవారు ఉన్నత న్యాయస్థానంలో ఈ విషయమై వివాదాన్ని దాఖలు చేయగలిగారు. ఉన్నత న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై ఆధారపడి మొన్‌సాంటో వారి బిటి విత్తనాల ధరలు ఆ విదేశీయ సంస్థకు లభించే రాజస్వం నిర్ధారణ కావచ్చు. కానీ మొన్‌సాంటో విత్తనాల ధరలు కాదు ప్రధాన సమస్య. ఆ సంస్థను మనదేశంలో కొనసాగిస్తున్న మన ప్రభుత్వ విధాన వైపరీత్యం మన రైతులకు ప్రధాన శత్రువు. జన్యు పరివర్తన-జిఎమ్- జీవరసాయన ప్రక్రియ ద్వారా రూపొందుతున్న బిటి పంటలను పండించడం మరింత విస్తృత ప్రమాదం. ప్రవర్థమాన దేశాలలో రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం జిఎం ద్వారా తయారవుతున్న బిటి పంటలు. బ్రిటన్ యువరాజు ఛార్లెస్‌తో సహా అనేకమంది నిపుణులు, సంస్థలు ఈ సంగతిని పదేపదే ప్రచారం చేశారు.
బిటి పత్తి తెల్లటి విషం. దీన్ని జనం తినడం లేదు కనుక దుష్ట ప్రభావ తీవ్రత తక్కువగా ఉంది. కానీ బిటి ఆవాలు, బిటి వంకాయలు మన కడుపులలో చేరి మన ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి రంగం సిద్ధమైంది. క్షేత్ర ప్రయోగాల పేరిట పదేళ్ల క్రితమే బిటి వంకాయలను మన నెత్తికెత్తే ప్రయత్నం జరిగింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వాటి భారతీయ ప్రతినిధులు, నిర్వహించిన క్షేత్ర ప్రయోగాలు వంచనకు పరాకాష్ఠ అని స్పష్టమైంది. న్యాయస్థానాల జోక్యం తో బిటి వంకాయలు అధికారికంగా ఆవిష్కరణ కాలేదు. కానీ బహుళ జాతీయ సంస్థలు రహస్యంగా ఈ వంకాయలను విస్తరింపజేసి ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా జిఎమ్ పంటలను నిరాకరించకపోవడానికి ప్రధాన కారణం బహుళ జాతీయ సంస్థలకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోను ఏర్పడి ఉన్న అక్రమ వాణిజ్య బంధం. ఈ బంధం బిగిసి పోవడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వారు విరాళాల రూపంలో రాజకీయ పక్షాలకు, ఉన్నతోన్నత ప్రభుత్వ అధికారులకు పంచిపెడుతున్న లంచాలని, అనేక ఏళ్లుగా ప్రచారమవుతున్నది. ఇప్పుడు జిఎమ్ ఆవాలను కూడ క్షేత్రాలలో పరీక్షించడానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్వదేశీయ వ్యవసాయ నిపుణులు, ఉద్యమకారులు ఇందుకు వ్యతిరేకత తెలుపుతున్నారట. కేంద్ర ప్రభుత్వం మాత్రం జీవభద్రతకు భంగం కలగనట్టయితే జన్యువుల మార్పిడి ద్వారా తయారవుతున్న బిటి పంటలను పండించడానికి తనకు అభ్యంతరం లేదంటోందట. ఇలా అభ్యంతరం లేకపోవడం పదేళ్లపాటు 2014 మే 25 వరకు మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానం. ఈ విధానాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ దేశ ప్రజలకు దిక్కెవరు?
పదేళ్ల క్రితం వరంగల్లు జిల్లాలో లేత దశలోని బిటి పత్తి ఆకులను నమిలిన అనేక పశువులు మరణించాయి. అది దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ఘటన. కానీ పశువులు మరణించడానికి కారణం బిటి రసాయనం కాదని నిరూపించడానికి బహుళ జాతీయ సంస్థలు మితిమీరిన ఆర్భాటం చేశాయి. చివరికి పశువుల మరణానికి, ఆ పత్తి ఆకులు కారణమని ధ్రువపడింది. మామిడి పండ్లు దిగుమతి అయిన పెట్టెలలో పురుగులు కనిపించిన కార ణంగా ఐరోపా సమాఖ్య వారు మన మామిడి పండ్లను నిషేధించారు. పెట్టెలలోని క్రిములకు మామిడి పండ్లకు సంబంధం లేదు. అయినప్పటికీ ఐరోపావారి దురహంకారం మన రైతులపై మంటలను కక్కింది. కానీ మన ప్రభుత్వం మాత్రం పశువుల మరణం తరువాత బిటి పత్తిని నిషేధించలేదు. ఇటీవలి కాలంలో వరంగల్లు జిల్లాలో అనేకసార్లు బిటి పత్తిని రకరకాల క్రిములు, ఈగలు ధ్వంసం చేశాయి. గత ఏడాది గులాబిరంగు పురుగులు వరంగల్లు జిల్లాలో బిటి పత్తి పంటను పాడు చేశాయి. పంజాబ్‌లో గత ఖరీఫ్ ఋతువులో పనె్నండు లక్షల ఎకరాలలో బిటి పత్తిని విత్తారు. పంట కాయ దశలో ఉన్న సమయంలో చెలరేగిన తెల్ల ఈగలు మూడింట రెండువంతుల పంటను- ఎనిమిది లక్షల ఎకరాలలోని పంటను- ధ్వంసం చేశాయి. రూ.4,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందట. పదిహేను మంది పత్తి రైతులు ప్రాణాలు తీసుకున్నారు.
ఇలా విదేశీయ వాణిజ్య సంస్థలు మన దేశంలో కొనసాగిస్తున్న ఆగడాలను మన ప్రభుత్వాలు పట్టించుకొనడం లేదు. మన వాణిజ్య ప్రయోజనాలకు విదేశీయ ప్రభుత్వాలు అక్రమంగా హాని కలిగిస్తున్నాయి. ప్రపంచీకరణ నియమాలు మనదేశానికి వ్యతిరేకంగా సృష్టిస్తున్న ఆర్థిక బీభత్సకాండలో ఈ తేడా భాగం. ఐరోపా దేశాలు నిష్కారణంగా మన ఉత్పత్తులను బహిష్కరించగలవు. మన ప్రభుత్వం నిరోధించలేదు. మాల్ దీవుల వంటి చిట్టి దేశాలు సైతం సక్రమంగా పారిశ్రామిక కలాపాలను సాగిస్తున్న భారతీయ వాణిజ్య సంస్థలను వెళ్లగొట్టగలవు...మన ప్రభుత్వం గట్టిగా నిరసన తెలపడానికి సైతం సాహసించదు. కల్తీ ఆహార పదార్థాలను, విషాలు నిండిన శీతల పానీయాలను నకిలీ విత్తనాలను నిర్భయంగా అమ్మగలుగుతున్న విదేశీయ సంస్థలను మన ప్రభుత్వం మాత్రం వెళ్లగొట్టలేదు. పెప్సీకోలా సంస్థల శీతల పానీయాలలో క్యాన్సర్ వ్యాధిని కలిగించే కార్సినోజెన్ అన్న రుచికరమైన రసాయన విషం కలిసి ఉన్నట్టు దశాబ్దికి పైగా ప్రచారమైంది. అయినప్పటికీ మన ప్రభుత్వాలు ఈ శీతల పానీయాలను ఇంతవరకు నిషేధించలేదు. తమ పానీయాలలో క్యాన్సన్‌ను కలిగించే రసాయనాలు ఉన్నట్టు ఈ బహుళ జాతీయ సంస్థలు 2012 మార్చిలో అంగీకరించాయి. అయితే ఇలా అంగీకరించిన ఘటన మనదేశంలో జరగలేదు. అమెరికాలో జరిగింది. కార్సినోజెన్ రసాయనాన్ని బాగా తగ్గించి వేయాలని లేదా ‘‘ఈ పానీయం తాగ డం వల్ల క్యాన్సర్ వ్యాధి వస్తుంది..’’ అన్న హెచ్చరికను పానీయ పాత్రల- సీసాలు-పై ముద్రించాలని కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ దగా మెగా సంస్థలకు నోటీసులు ఇచ్చాయి. కార్సినోజిన్ పరిమాణాన్ని తగ్గించడానికి ఈ సంస్థలు హామీ ఇచ్చాయట. ఈ హామీ మనదేశంలో అమ్ముతున్న పెప్సీ, కోలా పానీయాల విషయంలో అమలు జరుగుతోందా? మన ప్రభుత్వాలు దర్యాప్తు చేసిన దాఖలాలు లేవు. మన ప్రభుత్వాల అండదండలతో మనల్ని దోచేస్తున్న, మన ఆరోగ్యానికి హానికలిగిస్తున్న, మరో విదేశీయ సంస్థ నెస్లే-నెజెల్.!
మనదేశంలోని చిల్లర వ్యాపారంలోకి, పచ్చని పంటలలోకి చొరబడిన తెల్లని పందివలె చొచ్చుకొని వచ్చిన వాల్‌మార్ట్ సంస్థ మనదేశంలోని ఎందరికో కోట్లాది రూపాయాల లాభాలుగా ఇచ్చినట్టు అమెరికా ప్రభుత్వం నిర్ధారించింది. అందువల్ల నెస్లే, కోకాకొలా, పెప్సీ, మొన్‌సాంటో వంటి సంస్థలు కూడ మన ప్రభుత్వాల నిర్వాహకులైన వారిలో అత్యధికులకు లంచాలు ఇచ్చి ఉంటాయని విశ్వసించడం అతార్కికం కాదు..

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352