మెయన్ ఫీచర్

''భరతమాత’పై వివాదం ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'భరతమాత’, భారత్ మాతాకీ జై’ అనే మాటలపై వివాదం ఎందువల్లనో నిర్వికారంగా ఎంత ఆలోచించినా బోధపడటం లేదు. భారత్ మాతాకీ జై’ అని తన గొంతుమీద కత్తిపెట్టినా అనబోనని, అట్లా అనాలంటూ రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఎంఐఎం లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు కాని, వైఖరి వెనుక ఆలోచనలు ఏమిటో వివరించలేదు. అట్లా ప్రకటించిన సందర్భంలోనే వివరణకు ఏ కారణం వల్లనైనా వీలుకాకపోయినా కనీసం దానిపై వివాదం మొదలైన తర్వాతనైనా వివరణ ఇచ్చి ఉంటే ఇతరులు ఆలోచించే అవకాశం కలిగేది. తాను చెప్పేదానితో ఇతరులు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ కనీసం ఆయన ఆలోచనలు, తర్కాలు తెలిసేవి. దానిపై భిన్నాభిప్రాయాలు తప్పక చర్చారూపంలో జరుగుతాయి కనుక ఇతరుల ఆలోచనలు ఏమిటో కూడ ఒవైసీకి తెలిసేవి. ఎవరి అభిప్రాయాలు ఏవైనా ఇదంతా ఒక ప్రజాస్వామిక సమాజంలో జరగవలసిన పని. అటువంటి సమాజంలో పౌరుడై, పార్లమెంటులో సభ్యుడు కూడా ఆయిన ఒక నాయకుడు కనీసం ప్రజాస్వామిక పద్ధతి పాటిస్తే బాగుండేది.
బాగుండటమే కాదు ఉపయోగకరమయ్యేది కూడా. దేశంలో అనేకానేక విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని హోరాహోరీగా. వేర్వేరు భావజాలాల వారి మాటలను అట్లుంచి సాధారణ పౌరులకు, కొత్త తరాల వారికి ఈ చర్చల వల్ల తెలుస్తున్న సమాచారాలు, కలుగుతున్న వివేకాలు చాలా ఉన్నాయి. ఏ భావజాలానికి ప్రాతినిధ్యం వహించేవారైనా ఈ సాధారణ పౌరులను తమ వాదనలతో మెప్పించి తమవైపు తిప్పుకొన జూస్తారు. కాని, ఒవైసీ తరహాలో ఒక ప్రకటన చేయటానికి మించి తర్కబద్ధమైన వాదనలు ఏమీ చేయనపుడు ఆయనకు కలిగే ప్రయోజనమైనా ఏమిటి? పైగా, వివరణలకు సంబంధించి శూన్యం ఉన్నపుడు అయోమయం ఏర్పడి, అందులోకి అనుమానాలు ప్రవేశిస్తాయి. అవి వ్యతిరేకతగా పరిణమిస్తాయి. అపుడు ఒవైసీకి గాని, తన ధోరణిని అనుసరించే మరెవరికైనా గాని కలిగేది హాని తప్ప మేలు కాదు. అటువంటి హాని వారికి స్వయంకృతం అవుతుంది.
ఇంతకూ ఆ వైఖరి తీసుకోవడంలో అసదుద్దీన్ ఆలోచనలు ఏవై ఉంటాయి? ఆయన చెప్పని స్థితిలో మనం కొన్ని ఊహాగానాలు మాత్రమే చేయగలం. భరతమాత అనే ఇమేజ్ ఆయన ‘హిందూత్వ’, ‘హిందూవాదం’, ‘హిందూ రాష్ట్రం’ వగైరాలతో ముడిపెట్టి చూసినట్లున్నారు. ఇటీవలి మాసాల్లో ఇతరత్రా జరుగుతున్న చర్చల నేపథ్యంలో తనకు అటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చు. ఆ మేరకు అది సహజమే గాని, విజ్ఞులైన వారు చేయవలసిన పని కాదది. భరతమాత, భారత్ మాతాకీ జై అన్న మాటలకు ముందు ప్రాచీన సాహిత్యంలో భరత ఖండం, భరతవర్షం అనే ప్రయోగాలు గాని, తర్వాత కాలంలో భరతమాత, భారత్‌మాతాకీ జై గాని భౌగోళికమైన, దేశభక్తిపరమైన, వలస పాలనకు వ్యతిరేకంగా జాతీయోద్యమ సంబంధమైనవి. అనగా లౌకిక స్వభావం కలవి. అయితే ఉద్యమాలు జరిగినప్పుడు లౌకికేతరమైన భావజాలాలు గల వారు కూడ అటువంటి వాటిని ఉపయోగించి ఉండవచ్చు. అది సహజం. ఒక వెల్లువ స్థితిలో కొన్నింటికి స్పష్టతలుంటాయి. కొన్నింటికి ఒకమేరకు అస్పష్ట విభజన రేఖలుంటాయి. అంతమాత్రాన వౌలికతలు మారవు. ఉదాహరణకు బాలగంగాధర్ తిలక్, తన సమకాలీన బెంగాల్ విప్లవకారులు, గాంధీ, మోతీలాల్‌ది ఒకతరం, ఆరబిందో ఘోష్, భగత్ సింగ్ వర్గం, సుభాష్ చంద్రబోస్ మొదలైన వారందరిదీ జాతీయవాదమే. కాని వారిమధ్య స్పష్టతలు, అస్పష్టతలు రెండూ ఉన్నాయి. తీవ్రమైన భిన్నత్వాలూ ఉన్నాయి. కాని వౌలికంగా అందరూ జాతీయవాదులే. జాతీయోద్యమ కాలంలో భరతమాత, భారతమాతాకీ జై కూడా అదే పద్ధతిలో వౌలికంగా ఒక లౌకిలమైన దేశ భక్త్భివన.
స్వాతంత్య్రానంతరం కూడా అదే స్థితి కొనసాగింది. ఇది ఇప్పటికీ జీవించి ఉన్న స్వాతం త్య్ర పూర్వపు తరం వారికి, అనంతర తరాలవారికి తెలిసిన విషయమే. ఈ చరిత్రను, ఆ మాటల ఉపయోగాన్ని గమనించిన వారికి అందుకు ‘హిందూ’వాదానికి ఎటువంటి వౌలికమైన సంబంధం లేదన్నది తెలిసిన విషయమే. భరత అనే పదం తొలుత భౌగోళికంగా, విదేశీయుల సంపర్కంలో, వారి దండయాత్రలూ పాలనల కాలంలో ‘హిందూ’, ‘హిందూస్థాన్’ పదాలు ఉపయోగంలోకి వచ్చాయి. బ్రిటిష్ పాలనా దశ నుంచి ఒకప్పటి ‘ఇండికా’ ‘ఇండియా’గా మారి వాడకంలోకి వచ్చింది. జాతీయ వాదులు భారత, భరతమాత, భారత మాతాకీ జై అన్న ఉపయోగాలు తీసుకువచ్చారు. పైన అనుకున్నట్లు వలస కాలంలో ఒక చిన్న వర్గం మతాన్ని, మత జాతీయవాదాన్ని అనుబంధంగా తీసుకువచ్చినా, అతి పెద్దవర్గానికి, వారి ప్రభావం కారణంగా భారతీయ జనబాహుళ్యానికి అవి లౌకికమైన, దేశభక్తి యుతమైన, భౌగోళికత ఆధారంగా గల విషయాలు. అదే అవగాహనతో, దృక్పథంతో, అదే సంప్రదాయం కొనసాగడం అన్నది సాధారణమైన పద్ధతి.
ఒక్కోసారి అసాధారణ పరిస్థితులు తలెత్తుతుంటాయి. మైదానాన్ని ఆక్రమించుకునేందుకు భావపరమైన ఘర్షణ జరుగుతుంటుంది. రాజకీయ ఘర్షణలకు భావపర ఘర్షణలు ఉపకరణాలుగా మారుతుంటాయి. ఇది ఎప్పుడూ ఉన్నదే. పరిస్థితులను బట్టి ఒకసారి ఒకరిది పైచేయి కావచ్చు, మరొకసారి మరొకరిది పైచేయి కావచ్చు. కాని వౌలికతలు మారవు. మారకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత అవి వౌలికమైనవని భావించేవారిదవుతుంది. లేనట్లయితే కాలక్రమాన అనేకం మారుతాయి. అప్పుడు వౌలికార్థాలకు బదులు కొత్త అర్థాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. ‘హిందూ’ అన్న పదమే అందుకు ఒక ప్రముఖ ఉదాహరణ. సప్తసింధుకు తూర్పున, హిమాలయాలకు దక్షిణాన, వింధ్యకు ఉత్తరాన గల ప్రాంతానికి, ప్రజలకు ‘హిందూ’ అనే మాటను మొదట ఉపయోగించిన వారు ఆ భూభాగంలోని వారా? లేక బయటివారా? బయటివారన్నది చరిత్రకారులు చెప్పేమాట. కాని తర్వాత వందలు, వేల సంవత్సరాల కాలంలో అది ఎటువంటి ఉపయోగ పరిణామాలకు లోనవుతూ వచ్చిందో, ఈ రోజున పరిస్థితి ఏమిటో తెలిసిందే. విషయమేమంటే కాలగతిన వౌలికార్థమే మారిపోయింది. ఒకప్పటి అర్ధానికి ప్రస్తుతపు అర్ధానికి పోలిక లేదు.
నిజానికి అర్థం వౌలికంగా మారిన స్థితిలోనూ, పాత అర్థంలో ఉపయోగం ఇంకా విరివిగా ఉంది. స్వాతంత్య్రోద్యమకాలంలోని ముస్లింలలో లౌకికమైన కాంగ్రెస్ పార్టీ వెంటగల వారు ఈ దేశాన్ని ‘హిందూస్థాన్’ అని పిలిచారు. పాకిస్తాన్‌ను కోరుకున్న వారు అదేపేరు ఉపయోగించారు. కవి మహమ్మద్ ఇక్బాల్ ‘హిందూసితా హమారా’ అని ‘హమ్ బుల్ బులేహై ఇస్‌కీ’ అని కీర్తించాడు. ముస్లింలు ‘హిందూస్థాన్ అవామీ పార్టీ’ పెట్టారు. ఆవిధంగా పేరు మొదలయ్యే ముస్లిం పార్టీలు, సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి. మనం హిందూకుష్‌ను దాటి ప్రయాణిస్తే, ఈరోజుకు కూడా ఇండియన్స్ అని పిలిచే వారెందరో సింధూస్ అని గుర్తించేవారు అంతమంది కనిపిస్తారు. వీటన్నింటి మధ్య హిందూ అనే పదంలోని భౌగోళికత ఎంత? మతపరమైన అర్థం ఎంత? అని తేల్చడం ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యం!
‘్భరత’ అనే మూలంతో మొదలయేవి, ‘్భరత్ మాతాకీ జై’ వంటి నినాదాల పరిస్థితి కూడా అదే. ఇన్నాళ్లు ‘‘తప్పనిసరి’’ కాని నినాదం ఇప్పుడెందుకు కావాలన్న ప్రశ్నకు తప్పనిసరి అనేవారు తర్కబద్ధమైన వివరణ ఇవ్వడం అవసరమే. అదేవిధంగా, తప్పనిసరులతో అసలు ఏ నిమిత్తమూ లేకుండా చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటినుంచి మతాలతో సంబం ధం లేకుండా ప్రతి జండా వందన కార్యక్రమంలో అందరూ ‘్భరత్ మాతాకీ జై’ అన్నమాట ఇప్పుడు ఉన్నట్లుండి తప్పనిసరి కావడం ఎందుకో, అది వివాదాస్పదం కావడం ఎందుకో అన్న రెండు ప్రశ్నలు కూడా సామాన్య ప్రజలకు తెలియవలసినవే. ఒకరు గొంతుపై కత్తిపెడతామన్నా, మరొకరు గొంతుపై కత్తిపెట్టినా సరే అన్నా ఇవన్నీ మన జాతీయ జీవనంలోకి, సమాజంలోకి సరికొత్తగా ప్రవేశిస్తున్న పరిస్థితులు. ఇవి కొత్త ప్రశ్నలెందుకు కావాలి, మైదానంలో ఎందుకు ప్రవేశించాలి, ఆ మైదానాన్ని ఆక్రమించుకునేందుకు భావజాలపరమైన ఘర్షణాత్మక అంశాలెందుకు కావాలి?
భరత, భరతమాత, భౌగోళికమైన, లౌకికమైన, దేశభక్తి పరమైన ప్రతీకలా? లేక ఎవరైనా తమ ఆధీనంలోకి తీసుకోగలవా? ఇందుకు సంబంధించి మొదటినుంచి గల పరిస్థితులు ఏమిటి? ఇప్పుడు కొత్త పరిస్థితి ఏమైనా ఉందా? అదేమిటి? ఆది అర్థాలను వౌలికంగా మార్చగలదా? ఇటువంటివి అసదుద్దీన్ ఒవైసీగాని, తనతో ఏకీభవించే ఎవరైనా గాని తమకు తాము వివరించుకుని, ఈదేశ సాధారణ ప్రజలకు అర్థమయ్యేట్లు చెప్పవలసిన విషయాలు. ప్రచారోధృతి కారణంగా ఈ ప్రశ్నలపై తమకు తాము కార్నర్ అయినట్టు భావించవలసింది ఇందులో వారికేమీ లేదు. కావలసింది చర్చ, అవగాహన మాత్రమే. చివరకు ఎవరి వైఖరి వారు తీసుకునే స్వేచ్ఛ ఎట్లాగూ ఉంటుంది. ఫలానాది రాజ్యాంగంలో ఉందా లేదా అన్నది కాదు ప్రశ్న. అది బలహీనమైన ఎదురు వాదన అవుతుంది తప్ప హేతుబద్ధమైన తర్కం కాదు. మరేదో రాజ్యాంగంలో ఉందా అని ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ ప్రశ్నిస్తే ఒవైసీ నిరుత్తరుడు కావడం వంటి పరిస్థితి తలెత్తకూడదు. విషయం ఈ తరహా వాదోపవాదాల పద్ధతిలో కాదు నడవవలసింది. మెడపై కత్తుల వంటి పద్ధతిలోనూ కాదు.
ఇదొక ముఖ్యమైన ప్రశ్న. చర్చకూడా అదే స్థాయిలో ఉండాలి. దీన్ని ఆవరించుకొని అనేక విషయాలున్నాయి. చరిత్ర, వర్తమానం ఉన్నాయి. అందరి దృష్టిలో భవిష్యత్తు ఉంది. వివిధాంశాలు చర్చకు వచ్చినప్పుడు జవాబులివ్వలేని ప్రశ్నలు అందరికీ ఉండవచ్చు. దేశానికి కావలసింది ప్రజాస్వామికమైన చర్చ. కారణాలు ఏవైనా అనేక ప్రశ్నలు ముందుకు వస్తూనే ఉంటాయి. చర్చ అంటేనే అందరూ తమ ఆలోచనలను తక్కినవారికి వివరించడం. ప్రస్తుత సందర్భంలోను అది జరగాలి.
అది ఒక సంప్రదాయంగా మారాలి. రానున్న కాలంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అది ఒక రక్షణ కాగలదు. వ్యవస్థను మెరుగు పరచగలదు. వివిధ పరిణామాలను గమనించినప్పుడు దేశంలో మరిన్ని ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. దేశానికి స్వాతం త్య్రం లభించి ఏడు దశాబ్దాలు కావస్తున్నా మనకొక స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ శక్తులన్నీ కల్లోలానికి గురవుతూనే ఉన్నాయి. ఆర్థికంగా ఒకవైపు వృద్ధి, మరొకవైపు అసమానతలతో అది కూడా స్థిరత్వానికి రావడం లేదు. ఈ రెండు అస్థిరతల ప్రభావాలు సమాజంపై గణనీయంగా కనిపిస్తున్నాయి. యధాతథంగానే మన సమాజం భిన్న ప్రవాహాల కలయిక కాగా, ఈ రాజకీయ-ఆర్థిక అస్థిరతలు అదనపు సమస్యలను సృష్టిస్తున్నాయి. పైన పేర్కొన్న తరహా కొత్త విధానాలను, ప్రశ్నలను ఈ నేపథ్యంలో చూడవలసి ఉంటుంది. దేశం మేలును కోరేవారు విస్మరించలేనివి ఇవన్నీ. అందువల్ల, ఎవరూ కూడా స్వప్రయోజనాలకు పరిమితం కాకుండా విషయాలను ప్రజాస్వామికమైన రీతిలో దేశప్రజల ముందుంచడం మంచిది.