మెయన్ ఫీచర్

ప్రచారం కోసం కాంగ్రెస్ తప్పటడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ నీటి పథకాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటెషన్‌ను కాంగ్రెస్ వారు బహిష్కరించడాన్ని చూసినప్పుడు, తెలంగాణలో కొన్ని రోజులుగా ఈ పవర్ పాయిం ట్ ప్రజంటేషన్ గురించి విస్తృతంగా జరుగతున్న చర్చలో, కాంగ్రెస్ వైఖరికి సంబంధించిన ప్రశ్న అనివార్యంగా ముందుకు వస్తున్నది. మనకు తెలుస్తున్నదానిని బట్టి నగరాల నుంచి గ్రామాల వరకు ఇదే పరిస్థితి ఉంది. తాము ఎందుకు బహిష్కరించారో కాంగ్రెస్ శాసనసభాపక్షం వారు కొన్ని కారణాలు చెప్పారు. కాని వాటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఆమోదించగల విధంగా లేదు. బహిష్కరించడం టిడిపి కూడా చేసింది. కానీ ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. యధాతథంగానే అది ఇక్కడ ముగిసిపోతున్న పార్టీ కావడం, వారి నాయకులకు వ్యక్తిగతమైన విలువ కూడా లేకపోవడం అందుకు కారణాలు. కాంగ్రెస్ పరిస్థితి అటువంటిది కాదు. అది ప్రధాన ప్రతిపక్షం. జాతీయపార్టీ. రాష్టమ్రంతటా ఏదో ఒకస్థాయిలో ఓటర్లున్నారు. టిఆర్‌ఎస్‌కు అది మినహా మరొక ప్రత్యామ్నాయంలేదు. మిగిలిన వారెవరూ ఆ స్థాయికి ఎదగడం కనుచూపుమేరలో లేదు. స్వయంగా కెసిఆర్ ఇటీవల, తెలంగాణలో చివరకు మిగిలే పార్టీలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు మాత్రమే అన్నారు.
అటువంటి స్థితిలో కాంగ్రెస్ శాసనసభా పక్షం కాని, పార్టీ కాని ఎంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి? తమ ప్రతి చిన్నమాటను, చేతను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికలలో దారుణంగా ఓడి ఉండవచ్చుగాక. తర్వాత ప్రతి ఎన్నికలలో పరాజయం పాలవుతుండవచ్చుగాక. కాని పార్టీ పట్ల ప్రజల దృష్టి మాత్రం తగ్గలేదు. అందువల్లనే, ముఖ్యమంత్రి ప్రజంటేషన్‌కు తాము హాజరు కాకపోవచ్చునంటూ గురువారానికి ముందు రోజులలో సూచనప్రాయంగా అన్నప్పుడు, గురువారం గైర్‌హాజరు అయినప్పటినుంచి వారి తీరు గురించి ఇంతగా చర్చ జరుగుతున్నది. పైన అన్నట్లు ఒక్క ప్రశ్నకైనా జవాబు లభించడం లేదు.
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగలనని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన రోజున అన్న మాటలివి: 1. ముందుగా రెండు మూడు గంటల పాటు ప్రజంటేషన్ ఉంటుంది, 2. అన్ని వివరాలు గల పెన్ డ్రైవ్‌లను, అందులోని అంశాల పాఠం కాపీలను వెంటనే సభ్యులకు అందజేస్తారు. 3. ప్రజంటేషన్ అనంతరం రెండు మూడు గంటల విరామం ఉంటుంది. ఆ సమయంలో సభ్యులు ఆలోచించవచ్చు. తమలో తాము చర్చించుకోవచ్చు. బయటి నిపుణులను సంప్రదించవచ్చు. 4. సభ తిరిగి సమావేశమైనప్పుడు ఏ చర్చ అయి నా చేయవచ్చు. సందేహాలు అడగవచ్చు. అన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 5. సభ ఆరోజు రాత్రి పదకొండు గంటలవరకైనా కూర్చోవచ్చు. అవసరమైతే మరునాడు కూడా సభ జరుపుకోవచ్చునని ఆన్నారాయన. అంతేకాదు, ప్రభుత్వం పరిస్థితులను, ఆలోచనలను సభముందు పారదర్శకంగా ఉంచుతుందని, దైనిపైనా ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, ఇంకా ఏ నిర్ణయం జరగలేదు కూడా అని, సభాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే రాష్ట్రానికి ఏది మేలని సభ్యులు భావిస్తారో ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకుందామని చెప్పారు. ఈ మాటలలోని మంచి చెడుల గురించి వేరే వ్యాఖ్యానాలు అక్కరలేదు. ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు.
ఇందుకు ప్రతిగా కాంగ్రెస్ శాసనసభా పక్షం చేసిందేమిటి? తాము ప్రజంటేషన్‌కు వెళ్ళబోమని, అది సభా నిబంధనలకు, సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. తర్వాత బిజినెస్ అడ్వయిరీ కమిటీ సమావేశంలో అదే మాట చెప్పారు. ప్రజంటేషన్ అసెంబ్లీలో కాకుండా కమిటీ హాల్‌లోనో, మరొక చోటునో జరిగితే వస్తామన్నారు. కాని తుది నిర్ణయాన్ని బిఎసిలో స్పీకర్‌కు వదలివేసారు. తమ అభ్యంతరాలతో స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి, వారి అభ్యంతరాలు. రెండు, నిర్ణయాన్ని స్పీకర్‌కు వదలివేయడం. ఈ రెండింటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి?
ఒక విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను సభలో చేయవచ్చునా లేదా అనేది వాటిలో ఒకటి. అంతవరకు కాంగ్రెస్ వాదనను ఆక్షేపించలేము. కాని భిన్నాభిప్రాయాలు ఉండి నిర్ణయాన్ని స్పీకర్‌కు వదలివేసిన తర్వాత, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడాలి. భిన్నాభిప్రాయం ప్రజాస్వామికం, బిఎసిలో చర్చ ప్రజాస్వామికం, నిర్ణయాన్ని స్పీకర్‌కు వదలడం ప్రజాస్వామికం అయనప్పుడు, ఆయన నిర్ణయానికి కట్టుబడడం అంతిమ ప్రజాస్వామ్యం అవుతుంది. సభలో ప్రజంటేషన్ వల్ల ఉల్లంఘనలేమీ జరగలేదని మధుసూదనాచారి నిర్ణయించిన వెనుక, అందుకు కట్టుబడ దలచుకోకపోయినట్లయితే, నిర్ణయాన్ని ఆయనకు వదలడంలోని విలువేంటి? అనగా తాము ప్రతిపాదించిన విలువను, ప్రమాణాన్ని తామే ఉల్లంఘించారన్నమాట. అది తమ విలువను విశ్వసనీయతను తగ్గిస్తుందని వారు గ్రహించలేదా?
సభా నిబంధనలు, సంప్రదాయాలు అనే రెండవ విషయం చూద్దాం. సరిగా గుర్తులేదు కాని ఎవరో రాజ్యాంగ విరుద్ధమని కూడా అన్నట్లున్నారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సభలో చేయడం సభా నిబంధనలకు విరుద్ధమన్న మాట పదేపదే అన్నవారు, నిర్దిష్టంగా ఏ నిబంధనకు విరుద్ధమో ఒక్కసారి చెప్పలేదు. సభా నిబంధనలు లిఖిత రూపంలో, పుస్తక రూపంలో ఉన్నాయి. అటువంటప్పుడు, సదరు నిబంధనను పేర్కొనాలి. కాని ఆ పని జరగలేదు. విషయం ఏమిటంటే ఇటువంటి ప్రజంటేషన్లు చేయకూడదనే నిబంధన ఏదీ ప్రత్యక్ష సూచన రూపంలోనైనా రూల్స్‌బుక్‌లో లేదు. పైగా, సభా కార్యక్రమాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చుననే వెసులుబాటుంది. మరి సమస్య ఏమిటి? చివరగా గుర్తించవలసిన విషయం మరొకటి ఉంది. రూల్స్‌బుక్‌లో లిఖిత రూపంలో లేనివి అవశేష అధికారాల రూపంలో సభాపతికి ఉంటాయి. పార్లమెంటులో అయినా, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగం విషయంలోనైనా అంతే. వాటికి సంబంధించి సభాపతిదే తుది నిర్ణయం. దాన్ని సభ్యులు కాని, కోర్టులు గాని ప్రశ్నించే వీలులేదు. భిన్నాభిప్రాయం గల అంశంపై నిర్ణయాన్ని స్పీకర్‌కు వదులుతున్నామనడం మర్యాదతో కూడుకున్నది మాత్రమే కాదు. అందుకు సంబంధించి నిబంధనలు ఏమీ చెప్పనప్పుడు బిఎసిలో ఏకాభిప్రాయం రానప్పుడు, అంతకన్నా మార్గాంతరం కూడా లేదు. అటువంటప్పుడు కాంగ్రెస్ వారు ఆవిధంగా ఎందుకు వ్యవహరించినట్టు? మరొకటి జరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధం, సంప్రదాయాలకు విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం అనే మాటలు తరచు వినవస్తుంటాయి. కాని ఆ నిబంధనలు, సంప్రదాయాలు, రాజ్యాంగ విధివిధానాలు ఏమిటో సర్వసాధారణంగా ఎవరూ చెప్పరు. ఆ వివరం వారికి తెలిసే అవకాశం తక్కువ. తమ మాటను ప్రజలు అమాయకంగా నమ్మి నిజమనుకోవాలని వారి అభిప్రాయం. బహుశా అది ఒక్కోసారి జరుగుతుంది కూడా. కాని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇదీ నేటి రాజకీయం.
సంప్రదాయాల విషయానికి వస్తే, పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సంప్రదాయం తెలంగాణ అసెంబ్లీలో కాదుగదా పార్లమెంట్ సహా దేశంలోని ఏ చట్టసభలోనూ లేని మాట నిజం. కాని ఇక్కడ అర్థం చేసుకోవలసినవి కొన్నున్నాయి. నిబంధన వేరు, సంప్రదాయం వేరు. నిబంధన తప్పక పాటించవలసింది. దానిని సభ ‘సవరిస్తే’ తప్ప మారదు. అంతవరకు దానికి సభాపతి అయినా సరే బద్ధుడు కావలసిందే. సంప్రదాయాలు అట్లా కాదు. వాటిలో మంచి ఉంటుంది. సరైనదని సభ్యులు, సభాపతి అనుకున్నట్లయితే క్రమంగా సంప్రదాయాలుగా మారతాయి. అనుసరణీయమవుతాయి. వాటిని సర్వసాధారణంగా పాటిస్తారు కూడా. అదే సమయంలో అవి నిబంధనల తరహాలో ‘తప్పనిసరి’ అయినవేమీ కావు. కొన్ని పరిస్థితులలో సంప్రదాయాలుగా మారినవి కొత్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, నిబంధనల తరహాలో చట్టబద్ధమైన సవరణలు అవసరం లేకుండానే, మారుతుంటాయి. ఆ మార్పు స్పీకర్ వ్యక్తిగత విచక్షణ మేరకు కూడా జరగవచ్చు. పైగా అందుకు అవకాశం ఉండటం కూడా చట్టసభలో గల సంప్రదాయమే. కొత్త మార్పు ఒక కొత్త సంప్రదాయమవుతుంది. అది చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘించదు. గత సంప్రదాయాలకు భిన్నం మాత్రం అవుతుంది. భిన్నం కావటంలో ఒక్కోసారి సరికొత్త భిన్నత్వం కావచ్చు. ఒక్కోసారి గత సంప్రదాయానికి విరుద్ధమైన భిన్నత్వం కావచ్చు. కాని కొత్త పరిస్థితులు అవసరమైన భిన్నత్వమా కాదా అనేదే గీటురాయి కావాలి. ఆ విధంగా పరిశీలించినప్పుడు సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఒక భిన్నమైన, అవసరమైన, కొత్త సంప్రదాయమవుతున్నది. అది నిబంధనలకు గాని, గత సప్రదాయాలకు గాని ‘విరుద్ధమైనది’ ఎంతమాత్రం కాదు. అది ఆహ్వానించదగిన భిన్నత్వం. మారుతున్న పరిస్థితుల, మారుతున్న అవసరాలకు ఉపయోగపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేసినందుకు, దేశంలో కొత్త సంప్రదాయాన్ని ఆరంభించినందుకు, కెసిఆర్‌ను అభినందించాలి.
ప్రజంటేషన్ ప్రతిపక్షాలలోని రెండు పార్టీలకు మాత్రం నిబంధనలకు, సంప్రదాయాలకు విరుద్ధమైందని తోచగా, అయిదు పార్టీలకు అభ్యంతరమేమీ కనిపించలేదు. వారు విని, చర్చించి, తెలంగాణకు, తమకు తోచిన మేలు చేసేందుకు యత్నించారు. ప్రజంటేషన్ తర్వాత కాంగ్రెస్ వారు బయట కొన్ని విమర్శలు చేశారు. వాటిలోని వాస్తవాలేమిటన్నది అట్లుంచుదాం. కాని అవే విమర్శలు, సూచనలు సభలో చేసినట్లయితే అందుకు ముఖ్యమంత్రి వివరణ ఏమిటో వారికి, ప్రజలకు తెలిసేవి. ఆ విధమైన సంవాదం జరిగినప్పుడు అందులోని మంచి చెడులను బట్టి అందరూ తమ అభిప్రాయానికి వచ్చేవారు. లోపం ప్రభుత్వానిదని తోస్తే అదే అనుకునేవారు. కాంగ్రెస్ వారు మంచి చెప్పినా ఒప్పుకోనట్లయితే ప్రభుత్వాన్ని నిందించేవారు. మంచి విమర్శలు, సూచనలు చేసిన పేరు కాంగ్రెస్‌కు వచ్చి ఉండేది. కాని కాంగ్రెస్ శాసనసభా పక్షం తన వైఖరితో ఈ అవకాశాన్ని చేజేతులారా పోగొట్టుకుంది.
ఆవిధంగా ఈ ఉదంతం అంతా ముగిసే సరికి ఏర్పడిన అభిప్రాయం ముఖ్యమంత్రి కెసిఆర్ పాజిటివ్‌గా ఉండి, పారదర్శకత చూపు తూ, రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రతిపక్షాల సహకారాన్ని కోరుతుండగా, కాంగ్రెస్, టిడిపి, నాయకత్వాలు, నెగెటివ్‌గా వ్యవహరిస్తున్నాయని, తమ రాజకీయం కోసం రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని. అటువంటప్పుడు, లోగడ అధికారంలో ఉండిన ఈ రెండు పార్టీలు తమ వైఫల్యాలను, అవినీతిని దాచిపెట్టుకునేందుకే ఇట్లా వ్యవహరిస్తున్నాయన్న అధికార పక్షం విమర్శలను ప్రజలు నమ్ముతారా? నమ్మరా?

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)