సంపాదకీయం

పాకిస్తాన్‌తో స్నేహ భ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాన్య ప్రజలు గొప్ప గందరగోళానికి గురి అవుతున్నారు. మేధావులు, మాధ్యమాలవారు, రాజకీయవేత్తలు, ప్రముఖులు మాత్రమే కాక కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు ఈ గందరగోళం పరిధిలో గింగిర్లు తిరుగుతున్నప్పుడు సామాన్య జనానికి అంతుపట్టకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? నిరంతరం మన దేశం మీదకి ఉగ్రవాదులను ఉసి గొల్పుతున్న పాకిస్తాన్‌కు మనపట్ల ఎలాంటి భావం ఉందన్నది జగద్విదితం! పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రజలను హత్య చేయించిందని, చేయించడానికి ఇప్పటికీ యత్నిస్తూనే ఉందని ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ ఇలా హత్యలు చేయిస్తున్న ఉగ్రవాద మృగాలను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంతో మైత్రిని వాంఛిస్తోందని మన ప్రభుత్వాలు అప్పుడప్పుడు భ్రమిస్తున్నాయి. ఈ ‘భ్రాంతి’ గందరగోళానికి ప్రతీక! మరోసారి ఈ భ్రాంతికి మన ప్రభుత్వం ఇప్పుడు గురి అయి ఉంది! అందువల్లనే విదేశీ వ్యవహారాల మంత్రిణి సుషమా స్వరాజ్ మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లింది, పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులతో ‘మైత్రి మంతనాలు’ జరిపింది! ఈ ‘భ్రాంతి’ కారణంగానే మన ఫ్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్, విదేశాంగ మంత్రిత్వ కార్యదర్శి ఎస్.జయశంకర్ డిసెంబర్ ఆరవ తేదీన అతి రసహ్యంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నగరానికి వెళ్లారు. పాకిస్తాన్ ప్రభుత్వ జాతీయ భద్రతా సలహాదారుడు నసీర్‌ఖాన్ ఝుంఛీవాతోను విదేశాంగ కార్యదర్శి ఐఝాఖ్ అహ్మద్ చౌథురితోను ఈ మన అధికారులు స్నేహ సంభాషణలు జరిపి వచ్చారట! ఈ మైత్రి భ్రాంతి కారణంగానే పర్యావరణ పరిరక్షణ సదస్సునకు హాజరు కావడం కోసం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌కు వెళ్లిన మన ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 31న నవాజ్ షరీఫ్‌తో జనాంతిక సంభాషణ కొనసాగించాడు! పాకిస్తాన్ ప్రధానిగా చెలామణి అవుతున్న కరుడుగట్టిన మతోన్మాది నవాజ్ షరీఫ్. ఈ ప్రచ్ఛన్న బీభత్సకారుడు 1999లో అప్పటి మన ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని వెన్నుపోటు పొడిచాడు! ‘్ఢల్లీ-లాహోర్’ బస్సు యాత్రల దౌత్యం ఒకవైపున నడుపుతూనే మన కార్గిల్‌లోకి కిరాయి హంతకులను, సైనిక దళాలను ఉసిగొలిపిన విశ్వాస ఘాతకుడు నవాజ్ షరీఫ్! అప్పటినుంచి ఇప్పటి వరకు మన ప్రభుత్వ నిర్వాహకులు పదే పదే ఈ ‘మైత్రి భ్రాంతి‘కి గురి అవుతున్నారు! ‘మాడు పగిలినప్పుడల్లా’ గట్టిగా నిరసనలు తెలపడం మళ్లీ పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలో కొనసాగిస్తున్న జిహాదీ హత్యాకాండ గురించి మరిచిపోవడం మన ప్రభుత్వ విధాన వైపరీత్యం! ఈ వైపరీత్యం ప్రతి ఏటా ఒకటి రెండు సార్లు పునరావృతిని పొందడం నడిచిపోతున్న చరిత్ర! పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడానికి రంగం సిద్ధం కావడం మైత్రి భ్రాంతికి మరో నిదర్శనం! గత జూలైలో మన ప్రధాని ‘షాంఘయి సహకార సమాఖ్య’ సమావేశంలో పాల్గొనడానికై రష్యాలోని ఉఫా నగరానికి వెళ్లినప్పుడు పాకిస్తాన్‌తో ఈ ‘మైత్రి భ్రాంతి’ మరోసారి ‘మొగ్గ తొడిగింది’..భ్రాంతి మన ప్రభుత్వానికి మాత్రమే...పాకిస్తాన్ ప్రభుత్వానికి లేదు! అందువల్లనే మన దేశంలో జిహాదీ బీభత్సకాండను జరిపించే కార్యక్రమాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఆపడంలేదు...
జమ్ము కశ్మీర్‌లోని మన సైనిక శిబిరంపై ముగ్గురు ఉగ్రవాదులు నవంబర్ ఇరవై ఐదున దాడి చేయడం పాకిస్తాన్ ప్రభుత్వం వారి ఈ ‘భ్రాంతి రాహిత్యాని’కి ఒక ఉదాహరణ మాత్రమే! పాకిస్తాన్ ప్రభుత్వ విధానంలో దశాబ్దులుగా మార్పులేదు! జమ్ముకశ్మీర్‌లోని లోయ ప్రాంతంలో హిందువులను నిర్మూలించే వరకు పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ హంతకులు వారిపై దాడులు చేసారు! హిందూ నిర్మూలన జరిగిపోయిది, అందువల్ల భారత ప్రభుత్వ ప్రతినిధులైన సైనికులపై దాడులు చేయాలన్నది జిహాదీల వ్యూహం! సైనిక స్థావరాలపై దాడులు చేయడం నిరాయుధులైన ప్రజలపై హత్యాకాండ సాగించడం వలె సులభం కాదు! అందువల్ల బీభత్స ఘటనల సంఖ్య గతంలో కంటె తగ్గింది, కానీ మన దేశాన్ని బద్దలు కొట్టాలన్న పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ పన్నాగం మాత్రమే విష పన్నగంవలె బుసలు కొడుతూనే ఉంది! ‘అధీనరేఖ’ వద్ద పాకిస్తాన్ ప్రభుత్వ దళాలు సైతం బీభత్సకాండ కొనసాగిస్తుండం నాలుగేళ్లకు పైగా నడుస్తున్న కథ! 2003లో కుదిరిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ దళాలు పదే పదే దొంగచాటుగా మన జవానులపైకి, ప్రజలపైకి కాల్పులు జరుపుతున్నాయి! ఇది ప్రచ్ఛన్న బీభత్సకాండ! దొంగచాటుగా మన సైనికులను హత్య చేయడమే కాదు, మృతదేహాలను ముక్కలుగా నరికివేయడం, మృత దేహాల తలలను ఖండించి తమ దేశంలో ఊరేగించడం వంటి పైశాచిక చర్యలు ఈ ప్రచ్ఛన్న బీభత్సకాండలో భాగం! మైత్రి భ్రాంతికి గురి అవుతున్న మన ప్రభుత్వాలు ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని మరచిపోతున్నాయి!
జిహాదీ ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదన్నది పాకిస్తాన్ ప్రభుత్వం వారి దశాబ్దుల బుకాయింపు! పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ-వారి ప్రధాన కార్యక్రమం భారత వ్యతిరేక ఉగ్రవాదం. ఉగ్రవాద జిహాదీ ముఠాలన్నింటినీ అనుసంధానం చేసి సమగ్ర పైశాచిక వ్యవస్థను విస్తరింప చేస్తున్నది ‘ఐఎస్‌ఐ’ ముఠా! పాతికేళ్లకు పైగా ‘ఐఎస్‌ఐ’ మన దేశంలో బీభత్స కలాపాలను కొనసాగిస్తోంది! లష్కర్ ఎ తయ్యబా, జమాత్ ఉద్ దావా, హుజి, సిమి, ఇండియన్ ముజాహిదీన్, హిజ్‌బుల్ వంటి ముఠాల పేర్లు వేరుకావచ్చు కానీ స్వభావం ఒక్కటే, కార్యక్రమం ఒకటే, లక్ష్యం ఒక్కటే! భారత వ్యతిరేకత స్వభావం, పైశాచిక కాండ కార్యక్రమం, భారత్‌ను బద్దలుకొట్టడం లక్ష్యం! ఊఫాలో మన ప్రధాని పాకిస్తాన్ ప్రధానిని పలుకరించడానికి ముందుకాని, తరువాత కానీ ‘ఐఎస్‌ఐ’ కలాపాలలో మార్పు రాలేదు. ఉద్ధృతి తగ్గలేదు! ‘ఐఎస్‌ఐ’ ఏజెంట్లు మన సైనిక దళాలలోకి సైతం చొరబడి ఉండడం మన ప్రభుత్వం వారి మైత్రీ భ్రాంతికి నేపథ్యం! డిసెంబర్ ఆరవ తేదీన డార్జిలింగ్‌లోని ఫరీద్‌ఖాన్ అనే సైనికుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసారు. ఇతగాడు ఐఎస్‌ఐ దళారీగా మారిపోయాడన్నది అభియోగం! అంతకు ముందు రోజు ఇదే అభియోగంపై విశ్రాంత సైనికోద్యోగి మున్వర్ అహ్మద్ మీర్ అనే వాడ్ని కూడ పోలీసులు అరెస్టు చేసారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన అబ్దుల్ రషీద్, మరో అనుబంధ సైనికుడు కఫైతుల్లాఖాన్ ఐఎస్‌ఐ దళారీలని పోలీసులు ఇప్పటికే నిగ్గుతేల్చారు. ఈ నలుగురు కాక జమ్ము కశ్మీర్‌లోని ఒక ప్రభుత్వ అధ్యాపకుడు సఫార్‌ఖాన్ అనేవాడు కూడ ఐఎస్‌ఐ తొత్తుగా మారాడట! ఇలా మన సైనిక దళాలలోకి సైతం ఐఎస్‌ఐ చొరబడిపోతుండడం మన మైత్రీభ్రాంతికి నేపధ్య వైపరీత్యం!!
అఫ్ఘానిస్తాన్ శాంతి సమ్మేళనంలో పాల్గొనడానికి సుషమా స్వరాజ్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు వెళ్లడం వేరు. ఆ సదస్సులో పాల్గొని తిరిగి రావచ్చు. పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వంతో మాటలేమిటి? పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ ఉగ్రవాదులను మన పైకి ఉసిగొల్పడం నిజంగా మానుకున్నట్టయితే ఆ దేశంతో మనం మైత్రిని పెంపొందించుకోవచ్చు! కానీ వెన్నున బాకుతో పొడిచి గాయపరుస్తున్న వంచన పరుడిని, గాయపడినవాడు కౌగలించుకుని కబుర్లు చెప్పడం ఏమిటి? వంచన క్రీడ మానని పాకిస్తాన్ పెత్తందార్లతో మాటలను, ముచ్చట్లను మన దేశ ప్రజలు మెచ్చుకుంటారా??