మెయన్ ఫీచర్

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం (నేడు ఒంటిమిట్టలో కల్యాణం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామసంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగ రక్షణకు తీసుకెళ్తాడు. 27వ రోజు, అంటే శుక్ల త్రయోదశి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతా కల్యాణం జరిగింది. మరి 27వ రోజు నవమి అని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఎందుకు మనవాళ్లందరూ వివాహం జరిగిన తిథి నాడు కాకుండా శ్రీరానవమి నాడు సీతారాముల కల్యాణం జరుపుతున్నారో సామాన్యులకు అర్థం కాదు-అర్థం చేసుకొని అడగాలని కూడా ఎవరూ అనుకోరు. అలాగే ఒంటిమిట్టలో నవమినాడు కాకుండా మరో ఐదు రోజుల తరువాత కల్యాణం జరిపించడానికి కారణం కూడా ప్రత్యేకంగా ఏదీ లేదు. ఇది దైవకార్యం. ఎప్పుడైనా చేయొచ్చు. తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణం. ప్రతి రోజూ కల్యాణమే.
వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా పూర్వకాండలతో సహా ఉత్తర కాండను కూడా ప్రపథమంగా తెనిగించిన ‘‘ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ’’ వావిలకొలను సుబ్బారావు (వాసుదాసు) గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండలో సీతా కల్యాణ ఘట్టం అపురూపంగా వర్ణించబడింది. వివాహం పూర్వరంగం, వివా హ ఘట్టం చదువుతుంటే ఆసక్తికరంగా ఉం టుంది. స్వాయంభువ మనువు, పూర్వం గోమతీ తీరాన ఉండే నైమిశారణ్యంలో, వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపించాడు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే, మూడు జన్మల్లో నారాయణుడు తనకు పుత్రుడుగా వుండాలని అడుగుతాడు. అంగీకరించిన భగవంతుడు, మనువు దశరథుడిగా పుట్టినప్పుడు ‘శ్రీరాముడు’గా పుత్రుడయ్యాడు. యదువంశంలో వసుదేవుడిగా మనువు పుట్టినప్పుడు ‘శ్రీకృష్ణుడు’గా ఆయనకు పుత్రుడయ్యాడు. మూడో జన్మలో ‘శంబళ గ్రామం’లో కలియుగంలో నాలుగోపాదంలో, హరివ్రతుడనే బ్రాహ్మణునికి ‘కల్కి’గా పుట్టగలడు. మనువు భార్య సుశీల, కౌసల్య పేరుతో దశరథుడికి, దేవకి పేరుతో వసుదేవుడికి, దేవప్రభ పేరుతో హరివ్రతుడికి భార్యగా ఉండి మూడు జన్మల్లో విష్ణుమూర్తికి తల్లి అవుతుంది.
దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా అగ్నిహోత్రం మధ్య నుంచి వచ్చిన ప్రాజాపత్య మూర్తి దివ్య పరమాన్నం దశరథుడికిచ్చి, నలుగురు భార్యలకు పంచమంటాడు., అలా చేస్తే దశరథుడు కోరినట్లే కొడుకులు పుడతారని అంటాడు. ప్రాజాపత్య పురుషుడిచ్చింది భగవంతుడి తేజస్సు. మనుష్య స్ర్తి గర్భంలో ప్రవేశించేందుకు మంత్రవంతమైన హవిస్సులాంటి భగవత్తేజఃపూరితమైన పాయసాన్నం. అందుకే, శ్రీరామాది జననాలు ‘రేతస్సర్గం’ కారణం కాదు. వారి దేహాలు ప్రాకృతాలు. శుక్ల రక్త సంయోగాల వలన ఏర్పడే దేహాలకు స్ర్తి గర్భవతి అవశ్యం కాని, దివ్య దేజస్సుతో ఏర్పడేవాటికి స్ర్తి గర్భ సంచితో పనిలేదు. ఇందు క్షేత్రం ప్రధానం కాదు- గర్భస్థ జీవుడే తన తపోబలంతో, స్వేచ్ఛాత్తశరీరుడవుతాడు. వీరి దేహాలకు తల్లితినే ఆహారంతో కాని- తల్లి సంకల్పంతో కాని సంబంధం లేదు.అంటే తల్లిదండ్రుల జాతికి, బిడ్డల జాతికి సంబంధం లేదక్కడ.
కొడుకులు కలిగేందుకు దశరథుడు పాయసం పంచితే, రాజపత్నులు సంతోషించారు. పాయసం తాగిన కౌసల్య-సుమిత్ర-కైకేయిలు గర్భాలు ధరించారు. ఆరు ఋతువుల తర్వాత, పనె్నండో నెలలో, చైత్రమాసం-శుక్ల పక్షం-నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిత్-కర్కాటక లగ్నంలో చండ్రిని కూడిన బృహస్పతి కలిగిన (గురుడు కర్కాకట రాశిలో చంద్రుడితో చేరి ఉండడం-చైత్రంలో సూ ర్యుడు మేషరాశిలో ప్రవేశించడం కూడా ఉచ్ఛస్థానాలే), సూర్యుడితో సహా ఐదు గ్రహాలు (అం గారక, సూర్య, గురు, శని, శుక్ర) వాటి- వాటి ఉచ్ఛ స్థలాల్లో (సూర్యుడికి మేషరాశి-గురువుకు కర్కాటకం-శనికి తుల- శుక్రుడికి మీనరాశి- అంగారకుడికి మకరరాశి ఉచ్ఛస్థానాలు) వుండగా, కౌసల్యాదేవి జగత్ పాలకుడైన శ్రీమహావిష్ణువు యొక్క అర్థాంశ మూర్తి రాముడిని కనింది. శ్రీరామావతారానికి ముఖ్య కారణం కౌసల్య తపఃప్రభావమేనని అనవచ్చు. ఆమె నవమీవ్రతాన్ని చేసినందువల్ల భగవంతుడు నవమి నాడు జన్మించాడు.
విశ్వామిత్రుడి యాగం పరిసమాప్తమైన తర్వాత, మిథిలకు తీసుకెళ్లాడు వారిని. అక్కడ శివధనుస్సును గురించి వివరించాడు. విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివధనుస్సును అరచేత్తో పట్టుకొని అల్లెతాటిని బిగువుగా లాగుతుండగానే, విల్లు ఫెళ్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడం వల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించి పెట్టినట్లైందని అంటాడు. విశ్వామిత్రుడితో ‘‘నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణం కంటె ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామ చంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను,’’ అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని అంటాడు రాముడు. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ-వశిష్ఠాదులను మంత్రులను పిలిపించి, ‘‘మన శ్రీరామ చంద్రుడి బల పరాక్రమం చూసి మెచ్చిన జనకుడు, తన కూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం,’’ అనగా మంత్రులందరూ ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనన్నారు.
మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు-వశిష్ఠుడు-జాబాలి-కశ్యపుడు- మార్కండేయుడు-కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి ఐదవ రోజు పగటి పూట కల్లా విదేహ నగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, ‘‘నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్యమాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల , మా వంశం అతి పూజ్యమైంది’’, అంటాడు..వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకున్న దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్ఠుడిని చూపించి, ఇక్ష్వాకు వంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్నీ చెబుతాడని అంటాడు.
జనకుడికి వశిష్టుడు సూర్యవంశ క్రమాన్ని వివరించాడు. ‘అవ్యక్త సంభవుడు- నిత్యుడు- అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య’’ అంటూ మొదలుపెట్టి, చివరిలో అంబరీషుడికి నహుషుడు అతడికి యయాతి, అతడికి అభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకుగా పుట్టారు’’ అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియజేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులనీ, వీరి వంశం ఆది నుంచి పరిశుద్ధమైనదని, వీరందరూ అసమాన ధర్మనిరతులు-వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణునికి సరితూగే గుణగణాలు గల తన ఇరువురు పుత్రికలను ప్రేమ పూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.
ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్ఠునితో జనక మహారాజు తన వంశక్రమాన్ని కూడా వినిపించాడు. తన వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన ‘‘నిమి’’ అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలాపురాన్ని కట్టించానీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో ‘జనకుడు’ అని రాసాగిందని, అదే వంశ నామం అయిందని అంటాడు. మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు: హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికీ తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తరఫల్గుణి నక్షత్రం వస్తుందని, ఆ రోజున వివాహం చేద్దామని అంటాడు. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరామచంద్రమూర్తికి శుభకరమే కాని సీతకు జన్మ నక్షత్రం. అయినాగాని, తిథి,వార, నక్షత్ర దోష శాస్త్రం ప్రకారం, అభిజిత్సర్వదోషఘ్నం అయినందున, ఆ లగ్నమే మంచిది. అదే నక్షత్రంలో మొదటి పాదం తర్వాత ఆమెది కన్యారాశి అయినందున, తృతీయ ఏకాదశి రూప నక్షత్రం కూడ శుద్ధి కావడంతో నక్షత్ర దోషం లేదు. అయినా, భార్యాభర్తలిద్దరికీ ఏకనాడి అయినందున వియోగ ప్రాప్తమంటారు.
ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాలకృత్యాలు తీర్చుకొని పెళ్లి జరిపించేందుకై ఏర్పాటు చేసిన ఉత్సవశాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలు ధరించి, కంకణం కట్టుకొని రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు-ఇతర మునీంద్రులు ముందుం డి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్ఠుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి ఉన్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట ఉన్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్ఠుడు జనకుడికి తెలియజేశాడు.
వశిష్టుడితో జనకుడు, ఇతర ఋషీశ్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అన్నమాట ప్రకారం సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతుంది. అదేరీతిలో సాంప్రదాయబద్ధంగా ఈ కల్యాణాన్ని కడప, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలతో సహా ముత్తారం లాంటి కుగ్రామాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నాం.
(ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారి రామాయణం మందరం ఆధారంగా)

-వనం జ్వాలా నరసింహారావు సెల్: 08008137012