మెయన్ ఫీచర్

‘మీమాంస’ ధ్యాసలేని న్యాయప్రక్రియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయవ్యవస్థ-జ్యుడిషియరీ-మంత్రివర్గాల-ఎగ్జిక్యూటివ్-అధికార పరిధిలోకి చొచ్చుకొని వస్తోందన్నది ప్రభుత్వ నిర్వాహక రాజకీయ వేత్తలు చేస్తున్న ఆరోపణ. మంత్రివర్గాలు న్యాయ వ్యవస్థకు అన్యాయం చేస్తున్నాయన్నది ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులు ఇటీవల మోపిన అభియోగం. ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వారు ప్రాధాన్యం ఇవ్వని వౌలిక సమస్య ఒకటుంది. బ్రిటిష్ దురాక్రమణ దారులు మన నెత్తికెత్తిపోయిన భావదాస్యం ఈ వౌలిక సమస్య. అన్ని రంగాలనూ ఆవహించి భారతీయులను స్వభావాత్మకంగా విదేశీయులుగా తీర్చిదిద్దుతున్న ఈ బ్రిటిష్ భావదాస్య వారసత్వం న్యాయవ్యవస్థను కూడ ప్రభావితం చేస్తోంది.
మనదేశంలో అనాదిగా న్యాయవిచారణ సువ్యవస్థితమైంది. ఈ సంగతి మనకు తెలియదు. ఉన్నత విద్యావంతులకు, న్యాయవాదులకు, ఉన్నత సర్వోన్నత న్యాయమూర్తులలో అత్యధికులకు సైతం తెలియదు. తెలిసినవారు వెక్కిరించే వ్యవస్థ ఏర్పడివుంది. మీమాంస శాస్త్రంలోని సూత్రాలను ఆధునిక న్యాయపద్ధతులలో అన్వయించాలని సర్వోన్నత న్యాయమూర్తులు ఆ మధ్య ఒక వివాదం విచారణ సందర్భంగా సలహా ఇచ్చారు. ఎంతమంది న్యాయమూర్తులకు న్యాయవాదులకు సనాతన వైదిక వాఙ్మయంలో భాగమైన మీమాంస శాస్త్రం మంచి తెలుసు? సాంఖ్య, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అన్నవి వేద వాఙ్మయంలోని అరు దర్శన శాస్త్రాలన్నది మనలో కొందరికి తెలుసు..ఈ పేర్లు తెలిసినవారిలో ఒకశాతం మందికో, అర్థశాతం మందికో ఆ శాస్త్రాలలో ఏముందో స్థూలంగా పరిచయం ఉండవచ్చు. ఆ శాస్త్రాలను అధ్యయనం చేసిన వారు ఆధునిక న్యాయకోవిదులలో ఎంతమంది? అందువల్ల ప్రిన్సిపుల్స్ ఆఫ్ మీమాంస-మీమాంస సూత్రాలను ఆ సర్వోన్నత న్యాయమూర్తి ప్రస్తావించడం న్యాయవాదులకు, ఇతర న్యాయమూర్తులకు విచిత్రమనిపించి ఉండవచ్చు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు భారతీయ న్యాయశాస్త్రాన్ని హత్యచేసి కొత్త న్యాయశాస్త్రాన్ని మప్పిపోడం ఈ వైచిత్రికి కారణం. కల్హణుని రాజతరంగిణిలోను, కౌటిల్యుని అర్థశాస్త్రంలోను ప్రాచీన భారతీయ న్యాయవ్యవస్థ గురించి ఉంది. వేదవ్యాసుని మహాభారతంలో ఉంది. శుంగ, పుష్యమిత్రుని కాలంలో ఉంది. ఛత్రపతి శివాజీ అమలు జరిపించాడు-‘‘అట..’’ అని అనికొని మురిసిపోవడం మినహా చదివిన విద్యావంతులు లేరు...ఎందుకంటె బ్రిటిష్‌వారు మన సంస్కృత భాషను భూస్థాపితం చేసి దాని స్థానంలో ఆంగ్లభాషను ప్రతిష్ఠించి వెళ్లారు. అందువల్ల తొడకోసి ఇమ్మన్న ‘షైలాక్’ అనే పాశ్చాత్యుని న్యాయం మనకు తెలుసు..తొడ కోసి ఇచ్చి ‘నితాంతాపార భూతదయ’ను నిలబెట్టిన భారతీయుడైన ‘శిబి’ గురించి మనకు తెలియదు. ఆంగ్లభాష వచ్చు గనుక మర్చెంట్ ఆఫ్ వెనిస్-వెనిస్ నగర వర్తకుడు-గురించి మనలోని విద్యావంతులకు తెలుసు. సంస్కృత భాషరాదు కనుక మనకు మహాభారత ఇతిహాసం తెలీదు. ఇదీ బ్రిటిష్ న్యాయవారసత్వం...
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన నవలల్లోను, అడివి బాపిరాజు రచనలలోను మనకు ప్రాచీన న్యాయవ్యవస్థ అవశేషాలు కనిపిస్తాయి. ఆ వ్యవస్థలోని ప్రాడ్వివాకులు-న్యాయకోవిదులు-శే్వతాంబరధారులు. ఈ తెల్ల బట్టలు సత్త్వగుణానికి ప్రతీకలు. తెల్లటి హృదయమున్న ధవళ వస్తధ్రారులు ప్రాడ్వివాకులు. అందువల్ల న్యాయం కోసం వాదించిన వారు, న్యాయం చెప్పినవారు, ధనార్జన లక్ష్యంతోకాక సామాజిక న్యాయసాధనకోసం కృషి చేయడం చరిత్ర. ఈ తెల్లని బట్టలపై బ్రిటిష్ వారు నల్లని మరకలు అంటించిపోయారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, నల్లనికోట్లు, ఇంకా నల్లని గౌన్లు వేసుకోవాలన్న నియమం పెట్టారు. ఇప్పుడు తెల్ల బట్టలు తొలగిపోయి కేవలం నల్లని కోట్లు, గౌన్లు మిగిలి ఉన్నాయి. ఇది స్వరూప సాంకర్యం. ‘గజదొంగలు’ ఇంటిలో తిష్ఠవేసి ఇంటివారి పద్ధతులను పరిమార్చారు. తమ పద్ధతులను వెలయించారు. గజదొంగలు నిష్క్రమించిన తరువాత ఇంటిలోని వారు దొంగల పద్ధతికి స్వస్తి చెప్పి తమ పద్ధతులను పునరుద్ధరించుకోవడం సహజం. కానీ క్రీస్తుశకం 1947 ఆగస్టు 15వ తేదీ తరువాత ఈ జాతీయ గృహంలోని వారు అలా పునరుద్ధరించుకోలేదు. ఎందుకంటె బ్రిటిష్ గజదొంగల దురాక్రమణకు పూర్వం మన న్యాయవ్యవస్థ ఎలా ఉండేదో మనకు తెలియదు. మరచిపోయాము. ఈ మరపునకు కారణం సంస్కృ త భాష అనుసంధాన భాషగా, ఉన్నత విద్యాబోధన మాధ్యమంగా, అధికార భాషగా ఉండిన వ్యవస్థను బ్రటిష్ వారు కూల్చిపారేశారు. నామరూపాలు లేకుండా నశింపజేశారు. సంస్కృత భాష ద్వారా జరిగినవన్నీ, ఆంగ్ల భాష ద్వారా జరగడం మొదలైంది. అందుకే మన న్యాయకోవిదులకు మీమాంసాశాస్త్రం తెలియదు.
బ్రిటిష్ వారు తయారు చేసిన చట్టాలతోనే తొలిసారిగా న్యాయచరిత్ర మొదలైందని తెలుసు. ఇదీ బ్రిటిష్ న్యాయవారసత్వం. కార్యనిర్వాహక శాఖ-మంత్రివర్గం-అధికార పరిధిలోని న్యాయవ్యవస్థ చొరబడుతోందా? లేదా? అన్నది ఉపాఖ్యానం మాత్రమే. శివపూజలోకి చొరబడిన భల్లూకం వలె లేదా వన వరాహం వలె బ్రిటిష్ వారసత్వం మన మూడు రాజ్యాంగ విభాగాలనూ ఆవహించి ఉండడం ప్రధాన నాటకం..న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక విభాగం, శాసన నిర్మాణ విభాగం- ఈ మూడూ ఆ తెల్ల దొరల ‘నల్ల’వారసత్వాన్ని వదిలించుకోవడం లేదు. బ్రిటిష్ వారి వారసత్వపు పట్టీలు- బ్యాండ్లు-మన న్యాయ వ్యవస్థ గొంతు చుట్టూ బిగిసి ఉన్నాయి. ఆర్యా అన్న భారతీయ సంబోధనను బ్రిటిష్ వారి ‘‘యువరానర్’’ మింగేసింది. ఈ వారసత్వమే ‘‘నా ప్రభువు’’, ‘‘మిలార్డ్.’’
సర్వోన్నత న్యాయమూర్తులు మార్కండేయ కట్జూ, ఎ.కె. గంగూలీ క్రీస్తుశకం 2009, ఆగస్టు 20వ తేదీన, ‘మీమాంసా సూత్ర విశే్లషణ’-మీమాంసా ప్రిన్స్‌పుల్స్ ఆఫ్ ఇంటర్ ప్రిటేషన్- ఎమ్‌పిటి-ను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘మీమాంసా సూత్ర విశే్లషణ రెండువేల ఐదువందల ఏళ్లకు పైగా మన సంప్రదాయ న్యాయవ్యవస్థలో ఉపయోగపడింది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన న్యాయస్థానాలలో మీమాంస సూత్రా ల ధ్యాస లోపించింది. మన న్యాయవాదులు ‘మాక్స్‌వెల్’ను, ‘క్రెయిరీస్’ను ప్రస్తావిస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడ మీమాంస సూత్రాలను ఉదహరించడం లేదు. మీమాంసా సూత్రాలు ఉన్నట్టు అధికాధిక న్యాయవాదులు బహుశా విని ఉండరు. మన పూర్వీకులు సాధించిన విజ్ఞాన విజయాల గురించి కాని, వారు మనకు ప్రసాదించిన మేధావారసత్వ సంపదను గురించి కాని, మన తథాకథిత-సోకాల్డ్- విద్యావంతులకు తెలియదు.’’ అని ఈ న్యాయమూర్తులు విచారం వెలిబుచ్చారు. మీమాంసా నియమాలు మన న్యాయగ్రంథాలను వ్యవహారానికి అనువర్తింపచేసుకొనడానికి తరతరాలుగా ఉపయోగపడినాయి...వేదాంత, వ్యాకరణ శాస్త్రాలను అర్థం చేసుకొనాడానికి కూడ మీమాంసా శాస్త్రాలు దోహదం చేశాయి. ‘‘వేదాంత శాస్త్రానికి తాను రచించిన భాష్యాలలో ఆది శంకరాచార్యుడు మీమాంస అధికరణాలను ఉటంకించాడు. మీమాంస శాస్త్రంపై సంస్కృత భాషలో వందలాది వివరణ గ్రంథాలు వెలిశాయి. కాల వైపరీత్యాలు కబళించినవి పోగా కొన్ని డజన్ల గ్రంథాలు ఇప్పటికే ఉన్నాయి. మన పూర్వులు న్యాయ భాష్యాలను చెప్పడంలో ఎంతటి లోతులను తరచి చూడగలిగారో ధ్రువపరచడానికి ఈ ‘మిగిలి ఉన్న గ్రంథాలు’ చాలు!’’అని న్యాయమూర్తులు కట్జూ, గంగూలీ స్పష్టం చేయడం గురించి పెద్దగా ప్రచారం కాలేదు. అప్పుడు అమలులో ఉండిన క్రీస్తుశకం 1890వ సంవత్సరం నాటి భూమి సేకరణ చట్టం కింద ఏర్పడిన ఒక వివాదాన్ని మీమాసం సూత్రాల ప్రాతిపదికగా ఈ ఇద్దరు న్యాయమూర్తులు 2009లో పరిష్కరించారు.
మీమాంస శాస్త్రం రెండు వేల ఐదువందల ఏళ్లు మాత్రమే న్యాయ ప్రక్రియలో ఉపయోగపడిందని సర్వోన్నత న్యాయమూర్తులు చెప్పడం బ్రిటిష్‌వారు మనకు నేర్పిన చరిత్ర ప్రభావం. బ్రిటిష్ వారు పనికట్టుకొని మన చరిత్ర ప్రాచీనతను తగ్గించారు. వేద వాఙ్మయ సనాతన తత్వాన్ని వక్రీకరించారు. నిజానికి వేద వాఙ్మయంలో భాగమైన మీమాంస వయస్సు అనేక యుగాలు..అది వేరే కథ. కానీ సంస్కృత భాషను తొలగించి దాని స్థానంలో ఆంగ్లభాషను ప్రవేశపెట్టిన బ్రిటిష్ వారి లక్ష్యం భారతీయ విజ్ఞాన సంపత్తి భారతీయులకు దక్కరాదన్నది న్యాయమూర్తుల నాటి మాటలలో స్పష్టంగా ధ్వనించింది. విదేశీయులు గెలిచినప్పుడు స్వజాతీయ భాషను తొలగించి విదేశీయ భాషను నెలకొల్పారు. స్వదేశీయులు మళ్లీ గెలిచినప్పుడు విదేశీయ భాషను తొలగించి మన జీవన వ్యవహారంలో మళ్లీ స్వజాతీయ భాషను ప్రవేశపెట్టాలన్నది సహజమైన చారిత్రక పాఠం. ఈ పాఠం మనం నేర్చుకొనకపోవడం మన న్యాయవ్యవస్థలో కొనసాగుతున్న బ్రిటిష్ చొరబాటునకు కారణం. భారత రాజ్యాంగ పరిషత్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ మాట చెల్లుబడి కాకపోవడం మొదటి వైపరీత్యం. చెల్లుబడి అయి ఉండినట్లయితే సంస్కృత భాష మనకు అధికార భాష అయి ఉండేది. హిందీ జాతీయ అధికార భాష అయింది. హిందూ సంస్కృత రూపాంతరం కాబట్టి హిందీని ఏకైక జాతీయ అధికార భాషగా అమలు జరిపి ఉండవచ్చు. అదికూడ జరుగకపోవడం రెండవ వైపరీత్యం.
రాజ్యాంగంలో 343వ అధికరణ ప్రకారం, హిందీ కేంద్ర ప్రభుత్వపు అధికార భాష! కానీ ఇంగ్లీషును మాత్రమే సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాలో ఉపయోగించాలని 348వ అధికరణంలో నిర్దేశించారు. ఫలితంగా ఉన్నత న్యాయవ్యవస్థలో బ్రిటిష్ వారి వారసత్వపు చొరబాటు కొనసాగుతూ ఉంది. హిందీకి ప్రవేశం లభించలేదు. ఇప్పటికైనా హిందీ ఏకైక అధికార భాష కావాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి ఇలా ఆరంభంలోనే విఘాతం ఏర్పడింది. కనీసం ఆంగ్లంతో పాటు హిందీ భాషను కూడ సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాలలో ఉపయోగించడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని పార్లమెంటరీ ఉపసంఘం వారు 2008లో సిఫారసు చేశారు. అయితే ఈ ప్రతిపాదనను న్యాయ వ్యవహారాల అధికార మండలి-2008 డిసెంబరులో తోసిపుచ్చింది. ఎవరిది చొరబాటు? ఎవరి పరిధిని ఎవరు అతిక్రమించారు?

-హెబ్బార్ నాగేశ్వరరావు