మెయన్ ఫీచర్

‘హోదా’ క్రీడలు ఇకనైనా ఆపండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వీలుకాదని మొదట పరోక్ష సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రత్యక్షంగా చెప్పడం మొదలుపెట్టింది. ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఈమేరకు ఇచ్చిన లిఖిత పూర్వక వివరణ ఒకటి ఈనెల 4వ తేదీన వెలుగులోకి రావడం ఇందుకు తాజా దృష్టాంతం. వాస్తవానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదన్నది ఇప్పుడు కొత్తగా తేలిన విషయం కాదు. విభజన బిల్లు ముసాయిదాను కేంద్ర మంత్రివర్గం 2013, డిసెంబర్ 5న ఆమోదించటానికన్నా ముందే తెలిసినది. హోదా ఇవ్వలేమని ప్రణాళికా సంఘం అప్పటికే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు స్పష్టం చేసింది.
బిల్లు స్వరూపమేమిటో దాని ప్రతి అదే ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహింతికి, ఢిల్లీనుంచి చేరినప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. తర్వాత నాలుగు రోజులకు 16వ తేదీన బిల్లును పరిశీలనకోసం ఇక్కడ ఉభయసభలతో ప్రవేశపెట్టినపుడు మొత్తం సభ్యులకు తెలిసిపోయింది. ఆ వెనుక 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో బిల్లును ఆమోదించేవరకు కూడా అందులో సవరణలేవీ జరగలేదు. ప్రత్యేకహోదా ప్రస్తావనలు లేవు. రాజ్యసభలో మన్మోహన్‌సింగ్ విడిగా చేసిన ఒక ప్రకటనలో ఆ ప్రస్తావన ఉందిగాని అది బిల్లులో భాగం కాదు. కనుక, బిల్లుపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 1న సంతకం చేసి, అది మరునాడు, గెజెట్ ప్రకటనగా వెలువడినపుడు అందులో ప్రత్యేక హోదా మాటలేదు. చట్టం లో లేనిది ఏదైనా హామీ అవుతుంది తప్ప, చట్టబద్ధం కాబోదు. తప్పక అమలు చేయవలసింది కూడా కాబోదు. కనుక దానిపై కోర్టుకు వెళ్లలేరు. వాస్తవాలు ఇవి గనుకనే జయంత్ సిన్హా అంటున్నదేమీటో గమనించండి. విభజనచట్టం 2014 జూన్ 2న అమలుకు వచ్చినప్పుడు అందులో ప్రత్యేకహోదా ప్రస్తావన లేదన్నారు. రాజ్యసభ చర్చ సమయంలో అప్పటి ప్రధాని ఈమేరకు ప్రకటన చేసిన మాట నిజమేనని, కాని చట్టం వచ్చేసరికి అందులో ఏమీలేదని చెప్పడం గమనించదగ్గది. అనగా అమలుకు సంబంధించి చట్టం అనేది అసలు విషయమవుతుంది.
ఇదంతా మొదటినుంచీ తెలియనిది ఎవరికి? ఢిల్లీలో, ఇక్కడా అన్ని పార్టీలకు, అన్ని ప్రభుత్వాలకు తెలుసు. అయినా అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు, తద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుకునేందుకు రకరకాల క్రీడలు ఆడారు. ఇప్పటికీ ఆడజూస్తున్నారు. నాటకరంగంపై హీరోలు, విలన్లు, విదూషకులు అందరూ వారే. వేదిక ముందున్న ప్రజలు మాత్రం అమాయకంగా కళ్లు విప్పార్చుకొని ఏ చతుర్భుజుడో దీన జనవాళిని ఉద్ధరించకపోతాడా అన్నట్లు కూర్చున్నారు. ఇందులోని విషాదం ఏమంటే ఈ దశలో ప్రజలు వాస్తవాలు గ్రహించి ఈ నటులను నిలదీసినా ప్రయోజనం లేని స్థితి.
ప్రత్యేకహోదా రాదని అన్ని పార్టీలు క్రీడలాడుతున్నాయని, రాదన్న సంగతి వారికి తెలిసికూడా ప్రజలను మభ్యపెడుతున్నాయని సంవత్సరకాలంగా ఆంధ్రభూమిలో, ఇతరత్రా స్పష్టంగా రాస్తూ ఉన్నదే. (ఆంధ్రభూమి వ్యా సాలు: హోదాపై మొదటినుంచీ రాజకీయమే- 2015, మే 31, హోదాపై ఆగని రాజకీయ జూదం-2015, ఆగస్టు 30, మోదీ నిజంగా అన్యాయం చేశారా?- 2015, అక్టోబర్ 26, వల అల్లుకొని అందులో చిక్కారు- 2015, నవంబర్ 2) విభజన బిల్లు తయారవుతుండిన దశలో సీమాంధ్ర నాయకులు, మేధావుల లాబీలు పార్టీలకు అతీతంగా ఢిల్లీలో చాలా క్రియాశీలకంగా పనిచేశాయి. ఢిల్లీలోని అధికారపక్షాన్ని, ప్రతిపక్షాలనే గాక కేంద్ర బ్యురాక్రసీని నేరుగా ప్రభావితం చేసేందుకు వారట్లా ప్రయత్నించడం మెచ్చుకోదగిందే. అందుకు ప్రతిగా తెలంగాణ లాబీలు తమ ప్రయత్నాలు తాము చేసాయి. ఇదంతా ఇంతవరకు ఎవరికీ తెలియని తెరవెనుక డిప్లమసీ చరిత్ర. చాలా రసవత్తరమైనది. అందులో మనం తెలుసుకోవలసినవేగాక, నేర్చుకోదగినవీ ఉంటాయి. ఈ ప్రయత్నాలలో రెండు ప్రాంతాల తెరవెనుక లాబీలు ఎంత సఫలమయ్యాయి? ఎంత విఫలమయ్యాయి? అనేది అట్లుంచితే, సీమాంధ్ర లాబీ ప్రత్యేక హోదా విషయంలో మాత్రం ఏమీ చేయలేకపోయింది. అందుకు కారణం తమ ప్రయత్నలోపం కాదు. కాని హోదా ఇచ్చేందుకు కావలసిన అర్హతలు సీమాంధ్రకు లేవుగాక లేవు. ఆ నిబంధన ఉల్లంఘించేందుకు కేంద్రానికి అధికారం లేదు. వాటిని తోసిరాజంటే ఎవరైనా కోర్టుకు వెళ్లగలరు. అది చాలదన్నట్లు రాజకీయ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ప్రత్యేకహోదా తమకివ్వాలని అప్పటికే కొన్ని సంవత్సరాలుగా ఇతర రాష్ట్రాలు కొన్ని కోరుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారంతో నిమిత్తం లేకుండా అంతుకుముందునుంచీ వచ్చిన డిమాండ్ అది. ఏదో ఒక పద్ధతిలో, నిబంధనలను మా ర్చి అయినా సరే ఆ రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించినట్లయితే క్రమం గా దాన్ని అన్ని రాష్ట్రాలకు (అనగా మొత్తం దేశానికి) ఆ హోదా ఇవ్వవలసిన పరిస్థితి వస్తుంది.
యథాతథంగా హోదాను కోరడంలో ఆం ధ్రప్రదేశ్ నాయకులు చేసిన తప్పేమీ లేదు. రాష్ట్రానికి విభజన జరిగిన దరిమిలా అదనపు అవసరాలు ఏర్పడిన మాట నిజం. అవి ఆర్థిక వనరుల రూపంలో, కేంద్రం నుంచి వౌలిక సదుపాయాల పద్ధతిలో, ఇతర వెసులుబాట్లుగా లనించాలి. హోదావల్ల ఆర్థిక వనరులు, అంతకన్న ముఖ్యంగా వెసులుబాట్లు మామూలు కన్న ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. కనుక అందుకోసం తమ ప్రయత్నాలు తాము చేశారు. హోదా వీలయ్యేది కాదని తెలిసి కూడా, బహుశా ఆ పేరిట వత్తిడి తెచ్చినట్లయితే కేంద్రం ఇతరత్రా వనరులను, సంస్థలను అందుకు పరిహారంగా ఇవ్వగలదనే ఆలోచన ఉన్నదేమో కూడా తెలియదు. తెరవెనుక అవగాహనలను బట్టి అది జరుగుతుందని తెలిసిందే. మరి అటువంటి ఏమైనా సాధించగలరేమో తెలియదు కాని ఇంతవరకు పైకి కన్పిస్తున్నవి అంతగాలేవు. పైగా మనం ఢిల్లీ నుంచి వింటున్న దానిని బట్టి, కేంద్రానికి ఆ ఉద్దేశం పెద్దగా లేదు. పీత కష్టాలు పీతవి కావచ్చు. అవి ఆర్థిక కష్టాలు, రాజకీయ కష్టాలు కూడా కావచ్చు.
దీనినే జయంత్ సిన్హా చెప్పిన ఇతర మాటలలోనూ గమనించవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విభజనవల్ల హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో రెవెన్యూను కోల్పోయి, ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం లోటు కావడం వల్ల ఆ లోటును కేంద్రం పూర్తి స్థాయిలో భర్తీచేయాలని అంటున్నారు. హోదా ప్రశ్న తర్వాత ఇదే ప్రధానాంశమైం ది. అట్లా భర్తీ చేయాలని తాను కేంద్రాన్ని పదేపదే కోరడమే గాక, భర్తీకి కేంద్రం అంగీకరించిందనే భావం వచ్చేట్టు కూడా మాట్లాడుతున్నారు. కాని అది నిజమా? ఆంధ్రప్రదేశ్ లోటు రూ.1500 నుంచి రూ.1600 కోట్ల మధ్యలో ఉన్నట్లు అంచనా. కానీ ఆ స్థాయిలో భర్తీ చేయగలని కేంద్రప్రభుత్వం ఏ దశలోనూ అంగీకరించినట్లు కనిపించదు. అంగీకరించి ఉండదు కూడా. ఎందుకంటే లోగడ కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అటువంటి ‘పూర్తి భర్తీలు’ జరగలేదు. జరగాలనే నిబంధనల సవరణ ఆ తర్వాత చేయలేదు. అటువంటి నిబంధన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనూ లేదని జయంత్ సిన్హా ఎత్తిచూపుతున్నారు. మరి పరిష్కారమేంటి?
చంద్రబాబు అంటున్న పద్ధతిలోనైతే లేనేలేదు. జయంత్ సిన్హా వివరంగా చెప్పిన దాని ప్రకారం, విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింత ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సహాయం చేయాలో పరిశీలించవలసింది నీతీ ఆయోగ్. పరిశీలించి సిఫారసులు పం పాలి. కాని సహాయం ఆ సిఫారసుల మేరకు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కేంద్రం వద్ద గల నిధులపై ఆధారపడి, ఆ సిఫారసులలోని ప్రాధాన్యతలు ఏమిటో చూసి, ఆ ప్రకారం ‘‘ప్రత్యేక సాయం’’ అనేది చేస్తారు. అయితే ఇక్కడ ఒకటుంది ఇటువంటి విషయాల్లో రాజకీయాలు రిమోట్ కంట్రోల్ వలె పనిచేయవని చెప్పలేము. పోనీ అటువంటిదేమైనా జరిగి సంతృప్తికరమైన విధంగా ఆర్థిక సహాయాలు అదనంగా లభిస్తున్నాయా? ముఖ్యమంత్రి కాదంటున్నారు. కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకులు అవునంటున్నారు.
ఉదాహరణకు సిన్హా చెబుతున్న దాన్ని బట్టి కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న వాటా గతంలో ఎన్నడూ లేని విధంగా 42 శాతానికి పెంచారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేస్తున్నారో శే్వతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర భాజపా డిమాండ్ చేస్తున్నది. ఇం దులో కొంత రాజకీయం ఉండటమూ తెలిసిందే. కేంద్ర ‘‘ఇస్తున్నది కాని తగినంత ఇవ్వ డం లేదు, హామీ ప్రకారం ఇవ్వటంలే’’ దంటూ ప్రజలను తనవెంట ఉంచుకోవడం చంద్రబాబు ఉద్దేశం కాగా, ‘‘ఇవ్వడం బాగానే జరుగుతోంది, ఖర్చులో పద్ధతిలే’’దని చెప్పి ఓటర్లను తనవైపు తిప్పుకోవడం భాజపా ఆలోచన. ఇదేవిధమైన వివాదాలు మునుముందు రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల విషయంలో తలెత్తగలవని భావించవచ్చు. ప్రత్యేక హోదా విషయంలో వలెనే అన్నీ రాజకీయమవుతున్నాయి. అందువల్ల, రాజధానికి కేంద్రం ‘సహాయం’ అనే మాటకు గల నిర్దిష్టమైన అర్థం ఏమిటి? అది ‘‘100 శాతం సహాయం’’ అనే అభిప్రాయం ప్రజలకు కలిగేట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు యత్నిస్తుండగా, ‘‘నిబంధనల ప్రకారం’’ అనే సూచనలను కేంద్రం చేస్తున్నది. కాని దేశభక్త మీడియా కేంద్రం చెప్పేదానిని అశ్వత్థామ హతః కుంజర చేస్తుంది గనుక ప్రలకు వాస్తవాలు తెలియదు.
మొత్తానికి అందరి మధ్య అయోమయానికి గురవుతున్నది, ఆశ పెంచుకుంటున్నది, ఆశోపహతలు అవుతున్నది, రాజకీయ సినిమాలను నేల టికెట్ తీసుకుని చూస్తున్నది, ఉత్సాహం వచ్చినప్పుడు అలసట కలిగినప్పుడు బీడీల దమ్ము తాగుతున్నది సామాన్య ప్రజలు. హోదా గురించి ఒక టిడిపి సభ్యుడు అడిగిన ప్రశ్నకు, జయంత్ సిన్హా ఏప్రిల్ 25న ఇచ్చిన సమాధానం తొమ్మిది రోజుల తర్వాత మే నాలుగున ఎందువల్ల వెలుగులోకి వచ్చిందో తెలియదు కాని, అప్పుడే మళ్లీ రాజకీయాల మొదలయ్యాయి. హోదా తమ జన్మహక్కు అని అప్పుడే మళ్లీ రాజకీయ మాయలు మొదలయ్యాయి. హోదా తమ జన్మహక్కు అని, అందుకోసం డిమాండ్ చేస్తూనే ఉంటామని అధికారపక్షం ఉద్ఘాటించగా ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ మేధావులు అయినా తీసుకోవడంలేదు. బహుశా ఇది అన్నింటికి మించిన విషాదం కావచ్చు.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)