మెయన్ ఫీచర్

భవిష్య ధోరణికి సంకేత ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల 19వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాలను మూడు ముక్కలలో ఈవిధంగా చెప్పుకోవచ్చు: ఒకటి, అవి బిజెపికి నికర లాభం. రెండు, కాంగ్రెస్‌కు, వామపక్షాలకు నికర నష్టం. మూడు, ఈ రెండు ధోరణులను తట్టుకుని నిలిచినవి ప్రాంతీయ పార్టీలు. ఈ పరిస్థితి రాగల కాలంలో దేశ రాజకీయాలకు సంకేత ప్రాయమవుతున్నది. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? స్వల్పకాలమా లేక సుదీర్ఘ కాలమా? అన్న ప్రశ్నలకు జవాబుగా అంచనాలు వేయబూనితే పొరపాటు అవుతుంది. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఒడిదుడుకులు, అనూహ్యమైన మార్పులు 1970 ల నుంచే ఒక ‘్ధర్మం’గా మారాయన్నది అం దరికీ తెలిసిందే. అటువంటి ఒడిదుడుకులకు కారణమైన సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులలో ఒక స్థిరత్వం ఇప్పటికీ రావడం లేదు. కనుక ఒడిదుడుకులు మునుముందు అనివార్యమవుతాయి. ఈనెల 19 నాటి ఫలితాలు రా గల కాలపు రాజకీయాలకు సంకేత ప్రాయమని అంటూనే, ఆ సంకేతాలు ఎంత కాలవ్యవధికి వర్తించగలదీ చెప్పలేమని అనడం అందువల్లనే.
ఫలితాలకు సంబంధించి ముందుగా భాజపా విషయం చూద్దాం. వారు అస్సాం వంటి ఒక పెద్ద రాష్ట్రాన్ని, అందులోను కీలకమైన ఈశాన్య భారతంలో గెలవటాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. దానికదిగా ఒక నికరలాభమే. అదేవిధంగా అదే తూర్పున గల పశ్చిమ బెంగాల్‌లో, ఓట్లు, సీట్లు పెంచుకోవడం కేరళలో మొదటిసారి ఒక సీటుతో పాటు ఓట్లు పెరగడం, తమిళనాట సీటు రాకున్నా ఓట్ల పెరుగుదల వంటివన్నీ నికర లాభాలే. ఈ విషయాన్ని మరోవైపునుంచి చెప్పాలంటే మొత్తం మీద పార్టీకి, నికర నష్టమన్నది ఒక్కటీ లేదు. అయితే కూడికలు-తీసివేతలు అకౌంటెన్సీ లెక్కలకు మించిన రాజకీయ ప్రాముఖ్యత గల అంశాలు మూడున్నాయి. వాటిలో మొదటిది ఇది: భాజపా ఒకజాతీయ పార్టీ. దానికి ఎప్పుడైనా సవాలు ఉండేది ఇతర జాతీయ పార్టీల నుంచి. ప్రాం తీయ పార్టీలు అక్కడక్కడ తట్టుకొని నిలిచినా, వాటికి జాతీయ స్థాయి లక్ష్యాలుండవు. వాటిలో అనేక ఏదో ఒక జాతీయస్థాయి పార్టీతోనో, కూటమితోనో చేరుతూ విడిపోతూ ఉంటాయి. అది కూడా మన ఒడిదుడుకుల రాజకీయాలలో ఒక ‘్ధర్మం’గా మారింది. వాటికి ‘సిద్ధాంతం’ వంటిది ఏదో ఉన్నట్టు తొలిదశలో భ్రమలుండేవి గాని, తర్వాత ప్రాంతీయ హక్కులు,స్వీయ ప్రయోజనాల ఫెడరల్ తత్వానికి మించి మరే సైద్ధాంతికత లేనట్లు తేలింది. అనగా అవి జాతీయ పార్టీలకు ఆ స్థాయిలో సవాలు కాగల అవకాశం లేదన్నమాట.
దీన్ని బట్టిఅర్థమయ్యేది భాజపా అనే జాతీయ పార్టీకి నిజమైన అర్థంలో సవాలు కాగలవి సూత్రరీత్యా కాంగ్రెస్, కమ్యూనిస్టుల (వారెంత బలహీనంగా ఉన్నా) వంటి ఇతర జాతీయ పార్టీలు మాత్రమే. మధ్యలో కొంతకాలం జనతా, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ వంటి ఇతర జాతీయ ప్రత్యామ్నాయాలు ముందుకొచ్చాయి గాని, కారణాలు ఏవైతేనేమి విఫలమయ్యాయి. మిగిలింది కాంగ్రెస్, కమ్యూనిస్టులు. ఈ పరిస్థితి వెలుగులో ఇప్పటి అసెంబ్లీ ఎన్నికలను చూద్దాం. జాతీయ పార్టీలకు ఏ ఎన్నికలలోనైనా తాము బలపడడం ఎంతటి లక్ష్యమవుతుందో ఇతర జాతీయ పార్టీలను బలహీన పరచడం అంత లక్ష్యమవుతుంది. అందుకోసం ఒక వ్యూహం, రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి రకరకాల ఎత్తుగడలు ఏమిటన్నది అట్లుంచితే, చివరకు నికరంగా తేలింది తాను అన్ని విధాలుగా లాభపడటంతో పాటు, తన జాతీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలహీన పడటం. కమ్యూనిస్టులు కేరళలో గెలవడం అక్కడ ఆనవాయితీగా జరిగే అధికార మార్పిడికి మించిన అర్థం దానికి లేదు.కనుక ప్రత్యర్థులంతా బలహీనపడినట్లే.
భాజపా విజయానికి సంబంధించి రాజకీయ ప్రాముఖ్యత గల మూడు అంశాలలో ఇది ఒకటి కాగా, రెండవది ఈ ఎన్నికలకు ముందుండిన ప్రశార్థకాలు కొన్ని ఈ ఫలితాలతో తనకు అనుకూలంగా తేలడం. 2014 తర్వాత కొన్ని జయాలు, కొన్ని అపజయాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలుగులు తగ్గుతున్నాయనే భావనా, బిహార్ గెలుపుతో ఊపిరి తీసుకున్న ప్రతిపక్షాలు 2019 లక్ష్యం గా ఒక్కటయ్యేందుకు ఆరంభించిన యత్నా లు వంటివి ఆ ప్రశార్థకాలను లేవనెత్తాయి. అవి ఈ ఫలితాలతో పూర్తిగా అంతర్థానం కాకున్నా, వాటి తీవ్రత తగ్గింది. 2019లోగా బిజెపికి ఇంతకన్నా కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు యుపి, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ వెనుకటి జోరు తగ్గవచ్చునన్నది ప్రస్తుతపు అంచనాలు. అదెట్లున్నా, ఇప్పటి ఫలితాల వల్ల ఆ ఎన్నికలలోగా ఊపిరి పీల్చుకునే అవకాశం బిజెపికి లభిస్తున్నది. ఇవి అనుకూలం కాకపోయి ఉంటే పరిస్థితి మరొక విధంగా ఉండేది. ఇది మొదటి అంశం కాగా, మోదీ పాలనపై సామాన్యుల స్థాయిలో విమర్శల మాట నిజమే అయినా, అందువల్ల పరిస్థితి తల్లక్రిందులయ్యే ప్రమాదమేమీ పార్టీకి లేదని, ప్రస్తుతానికి తేలింది. ప్రజలు మోదీని విమర్శిస్తుండవచ్చు. కాని వ్యతిరేకంగా లేరన్నమాట. అట్లాగే, ప్రజలు ఒక నాయకుడిని వ్యతిరేకించి తొలగించదలచినప్పుడు ప్రత్యామ్నాయమెవరని ఆలోచిస్తారు. అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయమేమిటని చూడక తమపై గల అప్పటి బరువును తోసివేయడమే ప్రధానమనుకుంటారు. ఇప్పుడిటువంటి అసాధారణ పరిస్థితులు లేవు. మోదీకి ప్రత్యామ్నాయంగా మరొకరు కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని గమనించినప్పుడు మోదీకి బోనస్ మార్కులు వేస్తున్నారు. ఇక మూడవది, ఎన్‌డిఎకు ప్రత్యామ్నాయం కోసం నితిష్‌కుమార్ ప్రారంభించిన యత్నా లు నెరవేరడం అంత తేలిక కాదని అసెంబ్లీ ఫలితాలు చూపుతున్నాయి. దీనిపై వేరే వివరణ అక్కరలేదు. ఈవిధంగా తేలడం బిజెపికి కలసివచ్చే అంశమని చెప్పుకోవాలి.
బిజెపికి కీలకమైన మరొక సానుకూల విషయం ఈశాన్య భారతంలో అడుగుమోపగలగడం. ఆ పార్టీకి మొదటినుంచి ఉత్తరాది పార్టీ, హిందీ బెల్ట్ పార్టీ, కౌ బెల్ట్ పార్టీ అనే ప్రతిష్ట ఉండేది. పశ్చిమాన గల మహారాష్ట్ర, గోవా వశమైన తర్వాత కూడా అది పోలేదు. ఆ స్థితిలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌తో కూడిన తూర్పున, ఆ వెనుకగల ఈశాన్య, దక్షిణ భారతాన విస్తరించేందుకు నాయకత్వం ఎప్పటినుంచో యత్నించడం తెలిసిందే. ఈశాన్యం ఒక సున్నితమైన సరిహద్దు ప్రాంతం కావడం, అక్కడ అన్యమతస్థుల ప్రాబల్యాలుండటం వల్ల వారి శ్రద్ధకు మరొక ముఖ్య కారణమైంది. అరుణాచల్ తమ ఆధీనంలోకి పరోక్ష పద్ధతిలో రావడం, ఇప్పుడు అస్సాం ప్రత్యక్షంగా ఎన్నికల్లో స్వాధీనం కావడం భాజపాకు సాధారణ రాజకీయాధికారానికి మించిన వ్యూహాత్మక విజయమవుతున్నది. ఆ ప్రభావం ఇటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై ఉండే అవకాశం లేదుగాని, ఈశాన్యంలో స్థావరం లభించడం ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోని ఆరు రాష్ట్రాలలో మూడు (మేఘాలయ, మిజోరాం, మణిపూర్) అక్కడివి అయినందున ఆ వత్తిడి ఏవిధంగా ఉండేదీ ఊహించుకోవచ్చు. ఇక మిగిలిన దక్షిణ దేశం జైత్రయాత్ర అన్నది బిజెపికి దీర్ఘకాలంపాట పెద్ద సవాలుగా మిగులుతుంది. ఆ చర్చ అప్రస్తుతం.
ఇంతవరకు విశే్లషించినవన్నీ బిజెపికి నికర లాభాలు. ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టుల నికర నష్టాలను చూద్దాం. పుదుచ్చేరికి రాజకీయ ప్రాముఖ్యత లేదు కనుక పక్కన ఉంచితే, కాంగ్రెస్‌కు అసోం, కేరళలు ప్రధానమైన నష్టాలు. తమ 2019 అంచనాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మొత్తం ఈశాన్యాన్ని అనేక దశాబ్దాల పాటు ఎదురులేకుండా పాలించిన తర్వాత ఇప్పుడా ప్రాంతాన్నంతా చేజారిపోయేట్లు చేయగలవు. అసోంలో మామూలుగా కాక భారీగా ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో రెండు సీట్లు పెరగడం, వామపక్ష కూటమిని దాటి ప్రధాన ప్రతిపక్షం కావడం చిన్నపాటి ఊరటలు మాత్రమే. తమిళనాట ఆశాభంగం వల్ల స్థానికంగా కలిగే నష్టం కన్నా, అక్కడి డిఎంకె కూటమి విజయం 2019లోక్ సభకు ఉపయోగపడగలదనే అంచనాలు చెదరిపోవడం అసలు నష్టమవుతున్నది. ఈ మొత్తం ఫలితాలు పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, రాహుల్ గాంధీ నాయకత్వంపట్ల భవిష్యత్తు ఆశలుమరింత బలహీన పడటం ఇతర నికరమైన నష్టాలు.
వామపక్షాలు నికర నష్టాలు కూడా ఇంతే తీవ్రమైనవి. పైన అన్నట్లు కేరళలో ఆనవాయితీ అధికార మార్పిడిని అట్లుంచితే, వారికి నిజమైన స్థావరంగా పరిగణించే పశ్చిమ బెంగాల్‌లో ఓట్లు, సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. 34 ఏళ్ల రికార్డు పాలన చేజారి ఒక విడత గడిచే సరికి ఎంతో కొంత పుంజుకోవడం అట్లుంచి మూడవ స్థానానికి పడిపోయారు. బహుశా ఇంతకన్నా ముఖ్యంగా, మమతా బెనర్జీకూడా ఎత్తి చూపినట్లు, సైద్ధాంతిక వ్రత భంగానికి పాల్పడ్డారు. కాంగ్రెస్‌తో పొత్తుతో వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. పరువూ మంటకలిసింది. బూర్జువా పార్టీలతో పొత్తువల్ల ఎంతో నష్టపోయామని, ఇకనుంచి అది ఎంతమాత్రం ఉండదని సుమారు 14 మాసాల క్రితం విశాఖపట్టణం సమావేశాలలో చేసిన భీషణ ప్రతిజ్ఞ తామే విలువలేకుండా చేసుకున్నారు. వామపక్షాల పట్ల దేశంలో గౌరవ మర్యాదలు, రాజకీయ విశ్వాసం, ఎన్నికల జయాపజయాలతో నిమిత్తం లేకుండా కూడా కొంతకాలంగా తగ్గుతున్నాయి. ఆ తగ్గుదల వేగం ఈ ఫలితాలతో మరింత పెరుగుతుంది. వారిపట్ల హాస్యాస్పద దృష్టి ఎక్కువవుతుంది. ఇది ఓట్లు, సీట్లు లెక్కలకు మించిన వౌలికమైన నికర నష్టం.
బిజెపి, కాంగ్రెస్, వామపక్షాల ఈ గెలుపు ఓటముల ధోరణులను తట్టుకొని నిలిచినవి ప్రాంతీయ పార్టీలు. గెలిచిన తృణమూల్, అన్నాడిఎంకెలతో పాటు, ఓడిపోయిన డిఎంకెకు కూడా ఈ ఖ్యాతి లభిస్తుంది. కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ డిఎంకెకు జూనియర్ భాగస్వామిగా మిగలక తప్పని స్థితి ఏర్పడింది కనుక. నిన్నటి బీహార్, ఢిల్లీ ఫలితాలను వీటి తో కలిపి చూసినప్పుడు కనిపించే ధోరణి ఒకటున్నది. జాతీయ పార్టీలను తట్టుకొని నిలువగలుగుతున్నవి ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఈ స్థితి లోగడ కాంగ్రెస్ ఒక వెలుగు వెలిగినంతకాలం ఉంది. ఇప్పు డూ ఉంటున్నది. అయి తే ఇందుకు ఒక పెద్ద షరతు ఉంది. ప్రాంతీయ పార్టీలు తాము అధికారంలో ఉన్నప్పుడు జనరంజకంగా పాలించాలి. ఫెడరల్ ఆకాంక్షలకు తోడు సుపరిపాల తోడైతేనే వారికి ఏ ప్రమాదం ఉండదు. ఒకవైపు కాంగ్రెస్ స్థానాన్ని, భాజపా క్రమంగా ఆక్రమిస్తున్న స్థితిలో, ప్రాంతీయ పార్టీలు రాగల కాలంలో ఏవిధంగా వ్యవహరించగలవన్నది ఆసక్తిగల ప్రశ్న అవుతున్నది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)