మెయన్ ఫీచర్

‘అమరావతి’ నిర్మాణమే అసలు సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపార అనుభవశాలి, రాజకీయ చాణక్యుడు, ప్రతికూల పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకునే స్థితప్రజ్ఞుడు నారా చంద్రబాబునాయుడు నవ్యాం ధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ రెండేళ్ల కాలంలో మెరుపులెన్నో మరకలూ అన్ని. ఈ రెండేళ్లలో ఆయన ఎన్ని ప్రశంసలు పొందారో, విమర్శలూ, ఆరోపణలూ అదే స్థాయిలో మూట కట్టుకున్నారు.
అపార వనరులున్న ఆంధ్ర రాష్ట్రానికి, కష్టాల సమయంలో సీఎం అయిన బాబుకు అమరావతి నగర నిర్మాణమే అసలు సవాలు. పైకి ఎన్నిమాటలు చెబుతున్నా, చైనా-సింగపూర్ టెక్నాలజీ పదాలు వల్లిస్తున్నా రాజధాని నిర్మాణం అనుకున్నంత సులువు కాదు. రాజధాని నిర్మాణం కాదు ప్రజా రాజధాని ముఖ్యమని బాబు చెప్పే పదాల పటాటోపం పక్కకుపెడితే, ఆయన చెబుతున్న ప్రకారం దాని పూర్తి స్థాయి నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుంది. అప్పటివరకూ ఎవరు అవునన్నా, కాదన్నా వెలగపూడి రాజధాని. అది పేరుకు తాత్కాలికమైనా, అదే అసలు రాజధానయినా ఆశ్చర్యపోవలసింది లేదు. ఎందుకంటే దాదాపు 1200 కోట్లతో వెలగపూడి తాత్కాలిక సచివాలయం, అక్కడే అసెంబ్లీ, కౌన్సిల్ కూడా నిర్మాణమవుతోంది కాబట్టి!
రాజధానికి ఉద్యోగుల తరలింపుపై బాబు అనవసర ప్రతిష్టకు పోతున్నారన్న విమర్శ ఉంది. నిజానికి ఇప్పటి నిర్మాణాలను పరిశీలిస్తే ఉద్యోగుల తరలింపు డిసెంబరు నాటికిగానీ పూర్తయ్యేలా కనిపించడం లేదు. అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే తరలిస్తే మంచిదన్న భావన జనంలోనూ ఉంది. అయితే, ఇక్కడ మేం ఇన్ని కష్టాలు పడుతుంటే జీతాలు తీసుకుని పనిచేసేవాళ్లకు డిమాండ్లు ఏమిటన్న అభిప్రాయమూ అదే జనంలో లేకపోలేదు. దీనిపై బాబు పట్టు విడుపులు ప్రదర్శిస్తే మంచిది.
బాబు ఉన్న స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఈపాటికే కాడి కిందపడేసేవారు. అన్ని సమస్యలు తలకెత్తుకున్న బాబుకు- ఢిల్లీలో మోదీతో సఖ్యత కుదరడం లేదు. ఇద్దరివీ అనుమానపు చూపులే. వాజపేయి జమానాలో బాబు కత్తికి ఎదురులేని సమయంలో, గోద్రా అల్లర్లకు కారణమయిన అప్పటి గుజరాత్ సీఎం మోదీని తొలగించకపోతే, కేంద్రం నుంచి బయటకు వస్తామని బాబు చేసిన హెచ్చరిక, ఇప్పటి ప్రధా ని మోదీ మది నుంచి తొలగిపోయినట్లు లేదు. అక్కడికీ బాబు ఎంత నచ్చచెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పైగా బాబు ఢిల్లీకి వెళుతున్నప్పుడల్లా ఆయన వెంట వస్తున్న పారిశ్రామికవేత్తలయిన నేతలపై ప్రధానికి సదభిప్రాయం లేదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిని బాబు గ్రహించారో లేదో?!
ఇదంతా బాబు స్వయంకృతం. ఓటుకునోటు కేసు తర్వాతనే ఆయన పదేళ్ల ఉమ్మడి రాజధానిని, విడిచి విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. ఆ కేసు లేకపోతే కథ మరోలా ఉండేదేమో? ఇక బాబుకు ఢిల్లీలో మునుపటి ఇమేజ్ లేకపోవడానికి కారణం. ఢిల్లీ పొలిటికల్ పల్సు తెలిసిన వారెవరూ లేకపోవడమన్నది మరో అభిప్రాయం. ఎర్రన్నాయుడు మృతి తర్వాత టిడిపి ఢిల్లీలో దాదాపు అనాధ అయింది. ఇప్పుడున్న ఎంపీల్లో సగానికిపైగా పారిశ్రామికవేత్తలే. దానితో సహజంగా వారి దృష్టి ఎప్పుడూ వ్యాపార విస్తరణపైనే తప్ప, పార్టీ విస్తృతి మీద ఉండదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఢిల్లీ పొలిటికల్ పల్సు తెలిసిన వారెవరూ లేకుండా పోయారు.
మొహమాటం ఉంటే వారిని ఏదో రకం గా సంతృప్తిపరచవచ్చు. కానీ ఢిల్లీ ఎల్లలు కూడా తెలియని వారిని పంపిస్తున్న వైనం, సొంత పార్టీ వారికే రుచించడం లేదు. అందులోనూ ఇది ప్రయోగాలకు సమయం కాదు. రాజకీయ దౌత్యం నిర్వహించాల్సిన సమయం. గతంలో ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉన్న ఉమ్మారెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కంభంపాటి రామ్మోహన్‌రావు పాత్ర ప్రధానంగా ఇతర రాజకీయ పార్టీలతో రాయబారం నిర్వహించడం. అం దులో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధిగా పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టే బాధ్యత ఆయనదే. అయితే, ఢిల్లీ పల్సు తెలియడమంటే ఢిల్లీలో ఉండటమే కాదు. అక్కడ ఇతర పార్టీల్లో జరిగే కార్యకలాపాలు, వ్యూహాలు, వివిధ పార్టీ నేతలతో పూర్వ పరిచయాలున్న వారు అవసరం.
ఇప్పుడు బాబు దగ్గర అలాంటి వారిలో పరకాల ప్రభాకర్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన పివి ప్రధానిగా ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన పట్టారు. దేశ రాజకీయాలను దగ్గర నుంచి గమనించిన కొద్దిమంది తెలుగువారిలో ఆయనొకరు. ఢిల్లీలోనే చదువుకోవడం, పివి హయాంలో దేశ రాజకీయాలను దగ్గరుండి పరిశీలించడం వల్ల, ఢిల్లీ రాజకీయాలు ఆయనకు కొత్త అనిపించదు. పైగా ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలసి అనేక వేదికలు పంచుకున్న వ్యక్తి. రాష్ట్ర రాజకీయాల్లో విజయవంతం కాకపోయినప్పటికీ, దేశ రాజకీయాల్లో ప్రముఖులతో సంబంధాలున్న వ్యక్తి. దీన్ని బట్టి బాబు చంకలో బిడ్డను పెట్టుకుని దేశమంతా తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.
నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో ఇంకా చర్చ జరుగుతున్న సమయంలో బాబు ఒకడుగు ముందుకేసి, పట్టిసీమతో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి, ప్రధానిని సైతం విస్మయపరిచారు. అయితే, అందులో ముడుపులు ముట్టాయన్న ఆరోపణలు, గతంలో తాను వైఎస్ ఆత్మబంధువుదని ఆరోపించిన కంపెనీకే, ఆ ప్రాజెక్టు కట్టబెట్టారన్న విమర్శలు వేరే విషయం. అదొక్కటే కాదు, విపక్షనేతగా ఉన్నప్పుడు ఏ కంపెనీలనయితే వ్యతిరేకించారో ఇప్పుడు ఆ యజమానులంతా, బాబు దగ్గరే కనిపిస్తున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఇంత ఆర్ధిక సంక్షోభంలోనూ 43 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం, కాపులకు వెయ్యి కోట్లు, బ్రాహ్మణులకు 65 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేయడం బాబుకే చెల్లింది. అయితే, రుణమాఫీ బాబుకు రైతుల్లో మేలు చేయకపోగా అసంతృప్తి పెంచుతోంది. రూ.50 వేల రుణాలున్న వారి పెదవులపై చిరునవ్వులు పూయించిన బాబు, లక్షన్నర రూపాయల రుణగ్రస్తులను మాత్రం మెప్పించలేకపోతున్నారు. బాబు ఇస్తున్న నిధులు వడ్డీలకే సరిపోవడం లేదు. మరో మూడేళ్లలో ఈ సమస్య పరిష్కరించకపోతే రైతులు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.
బాబు రెండో ఏడాదిలో ప్రోత్సహించిన ఫిరాయింపులు ఆయన ప్రతిష్ఠను మసక బార్చింది. 19 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అనైతిక రాజకీయాలకు తెరలేపారు. నైతిక రాజకీయాల గురించి తరచూ వాపోయే బాబు, స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆయనను అభిమానించేవారిని మెప్పించలేదు. తగినంత మెజారిటీ ఉన్నప్పటికీ జగన్‌ను చూసి ఆయనెందుకు ఇంత వణికిపోతున్నారో, ఆయన అపార రాజకీయానుభవం ఏమయిపోయిందో అర్ధం కాని ప్రశ్న. బాబు సహచరుడు కరణం బలరాం చేసిన వ్యాఖ్యలు, బాబు చర్యలు సొంత పార్టీ వారినే మెప్పించలేకపోతున్నాయని స్పష్టం చేశాయి. ప్యాకేజీల కోసమే ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని, ఫిరాయింపులపై పార్లమెంటు కఠిన నిబంధనలు ఏర్పాటుచేయాలని బలరాం డిమాండ్ చేశారు. సరిగ్గా జగన్, ఆయన పార్టీ నేతలు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. అంటే, జగన్- బలరాం చెబుతున్నదీ ఒక్కటే. ఇది రాజకీయంగా బాబు వేసిన తప్పటడుగన్నది సుస్పష్టం. వైసీపీ ఎమ్మెల్యేలను జగన్‌కు దూరం చేయడమే ముందు బాబు ఎత్తుగడ. చేరిన తర్వాత వారెటు పోయినా అనవసరం. బాబు వ్యూహం ఎన్నికల ఏడాది ముందు వికటించి, పార్టీని ఏ దిశకు తీసుకువెళతాయన్న ఆందోళన లేకపోలేదు.
కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీల స్ఫూర్తితో బాబు వేసిన జన్మభూమి కమిటీలు అవినీతి కేంద్రాలయ్యాయి. నలుగురైదురు కార్యకర్తల కోసం, గ్రామ ప్రజలను దూరం చేసుకుంటున్నారన్న విమర్శలకు తెరదించే ప్రయత్నం చేయడం లేదు. ఆ కమిటీలను రద్దు చేసే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇది బాబు బలహీనత. కాంగ్రెస్ పాలన మార్కుకు టిడిపి పాలన భిన్నంగా ఉం టుందన్నది జనం భావన. కానీ టిడిపి కూ డా కాంగ్రెస్‌కు జిరాక్స్ అయితే, ప్రజలు టిడిపిని కూడా కాంగ్రెస్ సరసన చేరుస్తా రు. ఇసుక ఉచితంగా ఇచ్చి బాబు మంచిపని చేశారన్న పేరు సాధించారు. ఈ రెండూ వేర్వేరు కోణాల్లోనే చూడాలి.
ఇక బాబు తన రాజకీయ వారసుడు లోకేష్‌కు లైన్‌క్లియర్ ఇచ్చారు. ఆ ప్రకారంగా మరో నెల, రెండు నెలల్లో యువరాజును క్యాబినెట్‌లోకి తీసుకుని, ఉత్తరాధికారిపాత్రకు మెరుగులు దిద్దవచ్చు. కానీ, జననేతగా నిరూపించుకోవలసిన బాధ్యత లోకేష్‌దే. ఈ విషయంలో వైఎస్, కేసీఆర్ తమ వారసులకు లైన్‌క్లియర్ చేయడం వరకూ తండ్రి బాధ్యత విజయవంతంగా నిర్వర్తించారు. కానీ తర్వాత వారసులు తమను తాము నిరూపించుకున్నారు. అది లోకేష్‌కూ వర్తిస్తుంది. జనామోద నేతగా నిరూపించుకుంటేనే, లోకేష్ మిగిలిన యువనేతల్లా సక్సెస్ అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రుల వారసులంతా రాజకీయాల్లో ఆ స్థాయిలో రాణించలేకపోయారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల యుద్ధానికి సారథ్యం వహించింది ఆయనే. అయితే దరదృష్టవశాత్తూ తొలి యుద్ధంలోనే ప్రత్య ర్థి పార్టీ చేతిలో ముష్టిఘాతాల పాల యి, పరాజయం మూటకట్టుకున్నారు. రాజకీయాలంటే కేవలం నాలుగు గోడల మధ్య మంతనాలు, వ్యూహాలే కాదు. జనక్షేత్రంలో నిలబడి, ప్రత్యర్ధులను ఎదుర్కోవడం. వారసుడిని అందిస్తోన్న బాబు ఆశలను చినబాబు ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి. ఇక పార్టీ జెండా మోసిన కార్యకర్తల ఈ రెండేళ్లలో ఒరిగిందేలేదు. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు తెగబడుతున్నారు. కార్యకర్త మాత్రం అదే పాత్రలో ఉన్నాడు. ఇటీవల బాబును ఇదే ప్రశ్నిస్తే నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే నిజాలను జీర్ణించుకునే శక్తి నాయకత్వంలో లేనట్లు అర్ధమవుతోంది. నిజాలెప్పుడూ చేదుగానే ఉంటాయి. పొగడ్తలు ఆనందాన్నిస్తాయి. కానీ, అవి తర్వాత పతనానికి దారులు వేస్తాయి.

- మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144