ఉత్తరాయణం

ఇదేం సెక్యులరిజం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులను రోజూ ఒక గంట ముందే ప్రార్థనలకోసం వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రతి శుక్రవారం వారు ఒకటి లేదా రెండు గంటల ముందే కార్యాలయాలనుంచి వెళ్లిపోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. మరి ఇదే సదుపాయం ఇతర మతాలకు ఇవ్వడంలేదు. ఇది కేవలం బుజ్జగింపు చర్య మాత్రమే. భారత రాజ్యాంగం ప్రసాదించిన సర్వమత సమభావ వ్యవస్థకు ఇది పూర్తి భిన్నం. కేవలం ఒక మతం వారికే ఇటువంటి సదుపాయం కల్పిస్తూ, మిగిలిన మతాలవారిని పట్టించుకోకపోడం దారుణం. ఈ సందర్భంగా ఒక సంగతి గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా జె.సి. ఛాగ్లా పనిచేసిన రోజుల్లో ఆయన మలేసియాకు అధికారిక పర్యటన నిమిత్తం వెళ్లడం తటస్థించింది. నాటి మలేసియా ప్రధాని మహతీర్ మహమ్మద్‌తో చర్చలు జరుపుతుండగా ప్రార్థన సమయం కావడంతో, ‘ఇద్దరం మసీదుకు వెళ్లి ప్రార్థనలు జరిపి వద్దాం’ అని మహతీర్ ప్రతిపాదించారు. అందుకు ఛాగ్లా సమాధానమిస్తూ,‘నేను ప్రభుత్వ కార్యంపై ఇక్కడికి వచ్చాను. అందువల్ల ఈ పనికి అంతరాయం కలగడం నాకిష్టం లేదు’ అని స్పష్టంగా సమాధానమిచ్చారు. మహతీర్ ప్రార్థనలకు వెళ్లిపోయారు. విధి నిర్వహణను గౌరవించే భారతీయుల పనితీరు అట్లా ఉంటుంది. ‘తాను మతపరంగా ముస్లింను అయినప్పటికీ సాంస్కృతికంగా హిందువునని, ఆవిధంగా చెప్పుకోవడం తనకు గర్వకారణమ’ని కూడా ఆయన అన్నారు. మరి అదేవిధంగా చైనా ప్రభుత్వం ముస్లింలు అధికంగా ఉండే జిన్ జియాంగ్‌లో రంజాన్ సందర్భంగా ఉపవాసాలను నిషేధించింది. అది సాధారణ ముస్లింలకే కాదు అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
- డా.టి.హెచ్. హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్
అంతా సమానమే
ఈ మధ్య భూమిలో బ్రాహ్మణులు వేదం చదువుకోవడంతో పాటు సేద్యం కూడ చేసేవారని ఒక వ్యాసం వచ్చింది. అంటే వ్యవసాయం, ఇతర పనులు చేసేవారిని శూద్రులంటారని, అది కించపరచే మాటగా ఉన్నదని భావించడం కద్దు. బ్రహ్మ పుట్టించిన వారంతా బ్రాహ్మణులేననే వాదన ఉన్నది. అందులో తెల్ల రంగుగల వారు బ్రహ్మనోటి నుంచి ఉద్భవించడం వల్ల వారిని బ్రాహ్మణులని, భుజాలనుంచి వచ్చిన ఎర్ర రంగు గల వారిని క్షత్రియులని, ఉరువులనుంచి వచ్చిన పసుపురంగు గల వారిని వైశ్యులని, ఇక పాదములనుండి వచ్చిన నల్లరంగు వారిని శూద్రులని వ్రాతప్రతులున్నాయి. శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమైనవే. అందరూ అన్నిరంగుల్లోనూ ఉన్నారు. ఎక్కువ తక్కువలు మనిషి సృష్టించినవే. భగవద్గీత కూడా వృత్తులను బట్టి కుల విభజన చేయడం జరిగింది కాని ఎవరిని చిన్నచూపు చూడలేదు. అందరి కృషివల్లనే వేదకాలం నుండి ఈనాటి వరకు, ఏనాటివరకైనా సమాజం పరిఢవిల్లుతున్నది.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి
2017లో కొత్త విద్యాసంవత్సరం 10వ తరగతులకు మార్చి 21 నుండే ప్రారంభం అవుతుందని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అయితే మార్చి 21 నాటికి కొత్త పాఠ్యపుస్తకాలు విద్యార్థుల చేతికి అందేలా చర్యలు తీసుకోవాలి. అందుకు పాఠ్య పుస్తకాల ముద్రణకై ముందు నుండే శ్రద్ధ వహించాలి. అలా జరిగితేనే విద్యార్థులు కొత్త తరగతికి వెళ్లగానే పాఠ్యాంశాలు మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పాఠ్యపుస్తకాలు సకాలంలో అందక, పాఠ్యాంశాలు మొదలు కాకుండానే విద్యార్థుల గైర్హాజరు ఎక్కువవుతుంది.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ప్రజాసమస్యలపై దృష్టి పెట్టండి
కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. కాని ఇప్పటి వరకు, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, వ్యవసాయరంగ అభివృద్ధి, మధ్యతరగతి ప్రజల ఆశలు మొదలగు అంశాలలో ఆశించిన విజయాలు సాధించలేదు. ఆహార పదార్ధాల ధరలు ముఖ్యంగా, పప్పుదినుసులు, నూనెలు మున్నగు నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీల్లో కొన్ని కూడా నెరవేరలేదు. పంటరుణాల మాఫీలేదు. కరెంటు చార్జీలు, ఇతర చార్జీలు రోజురోజుకు పెంచుతూ స్వర్ణాధ్రప్రదేశ్ అంటూ అనవసర విలాసాలకు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి.
-ఈశ్వర్, ప్రొద్దుటూరు
సమష్టి కృషితోనే విజయ సాధన
అసోంలో గెలుపునకు సంఘ్‌పరివార్ సమష్టి కృషి ప్రధాన కారణం. తరుణ్ గోగోయ్ ప్రభుత్వ పనితీరుకి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారు. సేవాభారతి, విద్యాభారతి, ఆరోగ్య భారతి, వనవాసి కళ్యాణ ఆశ్రమ్ సంస్థల పనితీరు ప్రజాసంక్షేమానికి అద్దం పట్టింది. ముఖ్యంగా ఆరోగ్య భారతి సేవాకార్యక్రమాలు ఆరోగ్యమిత్ర, అసోంలో పలు సంవత్సరాలుగా హోమియో వైద్యాన్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లాయి. ఈ సంస్థ ప్రజలకు ఉచిత వైద్యసేవలందించింది. అసోంలోని బెంగాల్, బిహార్ తదితర ఉత్తర భారతీయుల ఓటర్లు కూడా భాజపా గెలుపునకు దోహదం చేశారు. ముందుముందు ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు సాధించేందుకు భాజపాకు అసోం గెలుపు మార్గం సుగమం చేయగలదు.
- దండు కృష్ణశర్మ, మల్కాజ్‌గిరి