మెయన్ ఫీచర్

చట్ట సభలకు సమాంతర సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగపు వ్యవహారాలకు రాజకీయాలను పులమడం, రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగపు ముసుగును తొడగడం దశాబ్దులుగా నడిచిపోతున్న తతంగం. అందువల్లనే రాజ్యాంగ సంస్కరణల గురించి ఏకాభిప్రాయం కుదరలేదు..లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి వీలైన పద్ధతులను సూచించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధ్యయన సంఘాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఏకాభిప్రాయం గురించి మళ్లీ ధ్యాస కలుగుతోంది. ఏకాభిప్రాయ రాహిత్యం గతంలో కూడ రాజ్యాంగ సమీక్షను నిలదీసింది. ఇప్పుడు న్యాయవ్యవహారాల మంత్రిత్వశాఖ అధ్యయన సంఘం వారు రాజ్యాంగ సమీక్షను ఈ సమాంతరమైన ఎన్నికల ప్రక్రియకు పరిమితం చేశారట. సమాంతరంగా ఎన్నికలు జరపడం గురించి ఎన్నికల సంఘం కూడ సముఖంగా ఉందట. ప్రభుత్వం వారు అఖిలపక్ష సమావేశాలను చర్చలను నిర్వహించి అందరి ఆమోదంతో రాజ్యాంగ సవరణను చేయనున్నారట. అలాంటి సవరణ జరిగితే లోక్‌సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు సమాంతరంగా ఎన్నికలు జరుగుతాయన్నది ప్రచారం.
ఇతర అన్ని రాష్ట్రాల శాసనసభలకు లోక్‌సభ ఎన్నికలతోపాటు ఐదేళ్లకోసారి ఈ సమాంతర ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించడం సంగతి ఎలా ఉన్నప్పటికీ, జమ్మూ-కశ్మీర్ శాసనసభకు మాత్రం లోక్‌సభ ఎన్నికలతోపాటు సమాంతరంగా ఎన్నికలను నిర్వహించడం వీలుకాదు. లోక్‌సభ కాలవ్యవధి ఆరేళ్లకైనా పొడిగించాలి, లేదా జమ్మూ-కశ్మీర్ శాసనసభ కాలవ్యవధిని ఐదేళ్లకైనా కుదించాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ కాక అదనంగా మరో రాజ్యాంగ సవరణ జరుగవలసి ఉంటుంది. ఆ సవరణ జరుగవలసింది జమ్మూ-కశ్మీర్ రాజ్యాంగానికి... క్రీస్తుశకం 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితి-ఇంటర్నల్ ఎమర్జెన్సీ-ని విధింపజేసింది. జమ్మూ-కశ్మీర్ శాసనసభకు ఆరేళ్లకోసారి ఎన్నికలు జరగడం అలనాటి అత్యవసర పరిస్థితికి వారసత్వ అవశేషం. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం జరిపించిన నలబయి రెండవ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ, శాసనసభల కాలవ్యవధిని ఆరేళ్లకు పొడిగించారు. అంతకు పూర్వం ఈ వ్యవధి ఐదేళ్లు మాత్రమే. నలబయి రెండవ రాజ్యాంగ సవరణ వల్ల ప్రతినిధులకు మరో ఏడాదిపాటు ప్రజలకు ముఖం చాటేయడానికి గొప్ప అవకాశం లభించింది. అంతకుమించి ఈ సవరణ వల్ల ప్రజలకు ఒరిగింది లేదు. కేంద్ర ప్రభుత్వంతో పదే పదే విభేదించే జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం ఈ పొడిగింపు విషయంలో మాత్రం ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పదవీకాలం ఏడాదిపాటు పెరగడం ఎవరికైనా ఆనందదాయకమే మరి. అందువల్ల జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తమ ప్రాంతీయ రాజ్యాంగంలోని యాబయి రెండవ అధికరణాన్ని సవరించింది. ఫలితంగా జమ్మూ-కశ్మీర్ శాసనసభ కాలవ్యవధి కూడ ఐదు నుంచి ఆరేళ్లకు పెరిగింది. దేశానికంతటికీ వర్తించే జాతీయ రాజ్యాంగం ఉన్నప్పుడు జమ్మూ-కశ్మీర్‌కు మాత్రం ఈ రెండవ రాజ్యాంగం ఎందుకుంది? ఒకే దేశంలోని ఒక ప్రాంతానికి మాత్రమే ఇలా రెండు రాజ్యాంగాలు ఎందుకున్నాయి? మిగిలిన ప్రాంతాలలో ఇలా రెండు రాజ్యాంగాలు ఎందుకు లేవు?-ఇలాంటి ప్రశ్నలకు సమాధానం జాతీయ రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయవ అధికరణ.
ఇలా పెరిగిన చట్ట సభల కాలవ్యవధి ఎమర్జెన్సీ పీడ విరగడ అయిన తరువాత మళ్లీ ఐదేళ్లకు కుదించుకొని పోయింది. 1977 నాటి లోక్‌సభ ఎన్నికల తరువాత మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన నాయకత్వంలోని జనతాపార్టీ ప్రభుత్వం మళ్లీ రాజ్యాంగాన్ని సవరించింది. 1979 జూన్‌లో అమలులోకి వచ్చిన ఈ నలబయి నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్‌సభ శాసనసభల కాలవ్యవధి యథాపూర్వంగా ఐదేళ్లకు పరిమితమై పోయింది. అందువల్ల ఈ చట్ట సభలకు ఐదేళ్లకోసారి కాక, ఆరేళ్లకోసారి ఎన్నికలు జరిపించాలన్న ఇందిరాగాంధీ ఆకాంక్ష సాకారం కాలేదు. కానీ జమ్మూ-కశ్మీర్‌లో మాత్రం ఆమె కల నిజమైంది. ఎందుకంటె నలబయి రెండవ జాతీయ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా తమ ప్రాంతీయ రాజ్యాంగాన్ని సవరించిన జమ్మూ-కశ్మీర్ పెత్తందారులు నలబయి నాలుగవ జాతీయ రాజ్యాంగ సవరణను మాత్రం గౌరవించలేదు, పాటించలేదు. ఫలితంగా జమ్మూ-కశ్మీర్ శాసనసభ కాలవ్యవధిని- మిగిలిన రాష్ట్రాల కాలవ్యవధివలె-ఐదేళ్లకు తగ్గిస్తూ తమ ప్రాంతీయ రాజ్యాంగాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరించలేదు. దేశమంతటా లోక్‌సభకు శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే విధంగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కానీ జమ్మూ-కశ్మీర్ శాసనసభ మాట ఏమిటి? ఈ ప్రాంతీయ రాజ్యాంగాన్ని కూడ సవరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయనున్నదా? జమ్మూ-కశ్మీర్‌లో భారతీయ జనతాపార్టీ వారు, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ- పిడిపి-తో కలిసి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. అందువల్ల జమ్మూ కశ్మీర్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు. జమ్మూ-కశ్మీర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రానికి మిగిలిన రాష్ట్రాలతో సమాన ప్రతిపత్తిని కల్పించడం మరింత అభిలషణీయం. లోక్‌సభకు రాష్ట్రాల శాసన సభలకు సమాంతరంగా ఎన్నికలు జరపాలంటే ఈ సభలన్నింటి కాలవ్యవధి సమాంతరంగా ఉండవద్దా..?
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత 1952లో లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత ఇలా సమాంతరంగా ఎన్నికలు జరిగిన చరిత్ర లేదు. 1952లో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో భాగంగా ఎన్నికైన ఆంధ్ర శాసనసభ అర్థాంతరంగా రద్దయింది. 1955లో ఆంధ్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయట. లోక్‌సభతో పాటు కాక ఇతర సమయాలలో రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగే విడివిడి విన్యాసాలకు అది శ్రీకారం...1957లో ఎన్నికైన కేరళ శాసనసభ కూడ ఐదేళ్లపాటు కొనసాగలేదు. 1957వ, 1972వ సంవత్సరాల మధ్య లోక్‌సభ ఎన్నికలతో పాటు అధికాధిక రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. కానీ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 1972లో గడువు ముగియనున్న లోక్‌సభను 1970 చివరిలోనే రద్దు చేయించారు. ఫలితంగా 1971 మార్చిలోనే నిర్ణీత వ్యవధికంటె దాదాపు ఏడాది ముందుగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితంగా 1972లో వ్యవధి ముగిసిన శాసనసభల ఎన్నికలకు లోక్‌సభ ఎన్నికలతో సమాంతర సంబంధం తెగిపోయింది. 1989లో జాతీయ రాజకీయాలలో సంకీర్ణ శకం ఆరంభం కావడంతో సమాంతరంగా ఎన్నికలు జరిగే పద్ధతి దాదాపు గతమైపోయింది. ప్రతి సంవత్సరం ఏవో కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం మళ్లీ ఈ సమాంతర ప్రజాస్వామ్య విన్యాసాన్ని పునరుద్ధరించడానకి అధ్యయన బృందాన్ని నియమించడానికి ఇదంతా నేపథ్యం...
జాతీయ ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రభావవంతమైన గొప్ప నాయకుడు ఏర్పడినప్పుడు, ఆ నాయకత్వం రాష్ట్రాల సమర గతిని కూడ నిర్దేశించగలరన్నది రాజకీయ విశ్వా సం... జాతీయ నాయకుని పలుకుబడి ప్రాంతీయ బలహీనతలను అధిగమించడం మన ప్రజాస్వామ్య చరిత్ర కూడ. ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ను నడిపిన కాలంలో కాంగ్రెస్ గెలిచిన ఏ ప్రధాన రాష్ట్రంలోను గొప్ప నాయకులు లేరు. ఇందిరమ్మ పేరుతో ఏ బొమ్మను నిలబెట్టినప్పటికీ ఆయా శాసన సభ నియోజకవర్గాలలో తమ గెలుపు ఖాయమన్న ధీమా కాంగ్రెస్‌కు 1970వ, 1980వ దశకాలలో ఆవహించి ఉండడం చరిత్ర. అందువల్ల 1989లో ఓడిపోయే వరకు కాంగ్రెస్‌ను నడిపించింది 1984లో ఇందిరమ్మ ప్రభావమే. లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభల ఎన్నికలు కూడ జరగాలని ఆ రోజులలో కాంగ్రెస్ వారు భావించిన దాఖలాలున్నాయి. కాంగ్రెస్ బలహీనపడి కుప్పకూలి పోవడానకి కూడ ఈ వైయక్తిక ఆరాధన ఆర్భాటం కారణం. మెట్టుమెట్టుగా నిర్మాణమయ్యే రాజకీయ పార్టీలో కార్యకర్తలు సభ్యులు పునాదుల, మెట్లు, వరుసలు... శ్రేణులు! పై మెట్టు పడిపోయినా మిగిలిన మెట్లు పదిలంగానే ఉంటాయి. పునాదులు పదిలంగానే ఉంటాయి. ఒకే నాయకుని పలుకుబడి, ఆకర్షణల మీద ఆధారపడి అలరారే పార్టీలు ఇంటి పైకప్పు నుండి కొక్కెం కిందికి వేలాడే నిచ్చెనలవంటివి. ‘కొక్కెం’ అధినాయకుడు. కొక్కెం ఊడిపోతే నిచ్చెన మొత్తం అథఃపతనమైపోతుంది. కాంగ్రెస్ చరిత్ర ప్రగతి, పతనం ఇలాంటి నిచ్చెన వంటివి...అందువల్లనే ఇందిరమ్మ వంటి కొక్కెం ఊడిన తరువాత కాంగ్రెస్ శాసనసభల ఎన్నికలలో కూడ పరాజయం బాటను పట్టింది.
భారతీయ జనతాపార్టీ నిచ్చెన వలె కాక కింది నుండి మెట్టుమెట్టుగా నిర్మితమైన సిద్ధాంత ప్రధాన సంస్థ. అందువల్ల కొక్కెం వంటి అధినాయకునితో నిమిత్తం లేదన్నది దశాబ్దుల ప్రచారం. అధినాయకుడు మెట్ల వరుసలోని పై అంతస్థు మాత్రమే. అందువల్ల లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభల ఎన్నికలు జరిగినా విడివిడిగా జరిగినా పార్టీ జయాపజయాలలో అంతరం ఉండదన్నది, ఉండరాదన్నది సిద్ధాంతం..అందువల్ల సమాంతరంగా లోక్‌సభకు శాసనసభలకు ఎన్నికలు జరిపించాలని భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎందుకని భావిస్తున్నట్టు? ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ మరింత పరిణతి చెందాలన్న జాతీయ లక్ష్యమే ఇందుకు ప్రేరేపకమా? గతంలో శాసనసభలకు, లోక్‌సభకు, నిర్దిష్ట కాల వ్యవధిని నిర్ణయించాలని లాల్‌కృష్ణ అద్వానీ వంటి వరిష్ఠనేత వాక్రుచ్చి ఉన్నాడు. అంటే ఐదేళ్లపాటు లోక్‌సభ, శాసనసభలు కొనసాగి తీరాలన్న మాట. మధ్యలో రద్దు కారాదు. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యాంగ సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం అధ్యయన బృందాన్ని నియమించినప్పుడు కూడ ఈ రెండు కోర్కెలూ ప్రధానంగా వినిపించాయి. మొదటిది ఏకకాలంలో ఎన్నికలు, రెండవది నిర్దిష్ట కాలవ్యవధి కంటె ముందు సభలు రద్దుకాకపోవడం.
ఇలాంటి వ్యవస్థ అమెరికా వంటి అధ్యక్ష ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే ప్రస్తుతం ఏర్పడి ఉండి, బ్రిటన్ జపాన్ వంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో లేదు...మనది కూడ పార్లమెంటరీ ప్రజస్వామ్యం. ఏరోజుకారోజు కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాలు చట్టసభలలో తమ బలాన్ని నిరూపించుకోవడం ఉంది. ఈ వ్యవస్థలో మార్పు రాకుండా సమాంతరం, నిర్దిష్టం, ఎలా సాధ్యం?

- హెబ్బార్ నాగేశ్వరరావు e-mail: 2013hebbar@gmail.com