మెయన్ ఫీచర్

నయా ఉదారవాదులకు బ్రెగ్జిట్ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంతో పోలిస్తే ప్రపంచం మొత్తం మరింత దౌర్భాగ్య స్థితిలోకి నెట్టివేతకు గురవుతోందా? లేక సరికొత్త సమతుల్యం వైపునకు ప్రయాణిస్తోందా? ‘బ్రెగ్జిట్’ ప్రజాభిప్రాయసేకరణ పుణ్యమాని బ్రిటన్ ఐరోపా సమాజం నుంచి వైదొలగుతున్నది. ఇదే సమయంలో బ్రిటన్ పరిణామాలు ఫ్రాన్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ‘‘ఫ్రెగ్జిట్’’కోరుకునే వారు తమ గళాలను సవరించుకుంటున్నా రు. వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఆస్ట్రియాలో ‘‘ఆగ్జిట్’’, నెదర్లాండ్స్‌లో ‘‘నెగ్జిట్’’ హెచ్చరికలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఐరోపా సమాజం కుప్పకూలబోతున్నదనడానికి సంకేతాలు. అన్నిరకాల కష్టాలు ఒకేసారి చుట్టుముట్టి ఒకపక్క యూరప్ తల్లడిల్లుతుంటే, మరోపక్క అమెరికా అధ్యక్షపదవికి పోటీలో ఉన్న, డోనాల్డ్ ట్రంప్ తన సహజసిద్ధ విపరీత ధోరణి మనస్తత్వంతో, ప్రచ్ఛన్నయుద్ధాంతరం కొనసాగుతున్న ఉదారవిధానాలను మంటగలిపే రీతిలో వ్యవహరిస్తున్నారు.
ఈయూ నుంచి బయటకు రావాలని కోరుకునేవారు బ్రిటన్‌లో విజయం సాధించిన నేపథ్యంలో, ‘‘అన్ని చోట్లా ప్రజలు తమ తమ దేశాలను గ్రూపులనుంచి బయటకు తీసుకొని రావాలని కోరుకుంటున్నారు’’ అంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంక్షోభాన్ని మరింతగా రాజేసేవిగా ఉన్నాయి. ఉపసంహరించుకోవాలని కోరడం ద్వారా తమ జాతి ఆధిక్యతను ప్రదర్శించవచ్చు. ప్రపంచ దేశాలతో కొనసాగుతున్న పరస్పర సహకారాన్ని తన్ని తగలేయవచ్చు. ప్రచ్ఛన్నయుద్ధానంతరం ఆధిపత్యం వహిస్తున్న ఉదారవిధానాన్ని తిరస్కరిస్తూ, ఏకాకితనాన్ని క్రమంగా ఆహ్వానించవచ్చు. గత పదేళ్ల కాలంనుంచి ఈ వైఖరి క్రమంగా పెరుగుతూ రావడం గమనార్హం.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛి న్నం తరువాత, పశ్చిమ దేశాలు ప్రపంచం మొత్తాన్ని ఒకే ఛత్రం కిందికి తీసుకొని రావాలని తలంచాయి. ఇందుకోసం సరిహద్దులతో పనిలేని ‘ప్రపంచీకరణ’ను ప్రవేశపెట్టాయి. ప్రాంతీయ ఆర్థిక, రాజకీయ ఏకీకరణే విశ్వశాంతి, సౌభాగ్య సాధనకు సర్వరోగ నివారిణిలా పనిచేసే ఔషధమంటూ అంటూ పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు, కార్పొరేట్ గ్రూపులు చెవులు అదిరిపోయేవిధంగా ప్రచారం చేశారు. 1989లో బెర్లిన్ గోడను కూల్చివేయడం ద్వారా ఉభయ జర్మనీలు ఏకమయ్యాయన్న సిద్ధాంతం.. ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని అనుసంధానం చేసి ఒకే ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థగా మార్చాలనే భావనగా రూపవిక్రియ పొందింది. ఈ వ్యవస్థలో దేశాలు, ప్రభుత్వాలు ఉంటాయి. స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో వస్తువులు, ద్రవ్యం, అప్పుడప్పుడు మనుషులు యదేచ్ఛగా అన్ని దేశాల్లో తిరగడానికి వీలవుతుంది.
ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు ప్రతిపాదించిన సరికొత్త ప్రాజెక్టులో..గత కాలపు విలువలైన దేశభక్తి, తన సంబంధీకులు, జాతివారికి సమీపంలో నివాసం ఉండటం వంటి విలువల స్థానాన్ని, విస్తృత, సహనంతోకూడిన, ‘పరహితమనే’సరికొత్త నిర్వచనం ఆక్రమించింది. మరి సంప్రదాయంగా వస్తున్న సరిహద్దులను చెరిపేయాలంటే, ఇటువంటి కాస్మోపాలిటన్ గుర్తింపునకు సంబంధించిన సరికొత్త సిద్ధాంతానికి రూపకల్పన చేస్తే తప్ప సరళీకృత పెట్టుబడిదారి వ్యవస్థ విజయవంతం కాదు మరి! సరిహద్దుల వల్ల వివిధ దేశాల ప్రజలు తమ దేశాలకు మాత్రమే పరిమితం కావడం, మార్కెట్లు విసిరేసినట్టుగా ఉండిపోవడం కొత్త సరళీకృత పెట్టుబడిదారి వ్యవస్థకు విరుద్ధం. ఎందుకంటే వినియోగదారుడు నలుపు, పసుపు, హిస్పానిక్, కాకేసియన్ లేదా స్లావిక్..ఏ జాతివాడైనా ఒక్కటే. ఏ దేశ పౌరుడైనా తాను అందుకునే సేవలకు లేదా కొనుగోలు చేసిన ఉత్పత్తికి తగిన మూల్యం చెల్లించేవాడే వినియోగదారుడు.
కార్పొరేట్ ప్రపంచీకరణకు ఒకే అభిరుచి కలిగిన ప్రమాణీకృత కొనుగోలుదార్లు విస్తృత రీతిలో అవసరం. తద్వారా తమ మార్కెట్ వాటాలను మరింత విస్తృతం చేసుకొని, వ్యాపారాన్ని అపరిమితంగా వృద్ధి చేసుకోవాలన్నదే కార్పొరేట్ ప్రపంచీకరణ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభాను ఒకే జాతిగా పరిగణించే నయా-సరళీకృత అజెండా ప్రారంభమైంది. ముఖ్యంగా వీరందరిని ప్రత్యేకించలేని విధంగా రూపొందించి, కేవలం వారి ఇష్టాలు, అయిష్టాలపైనే దృష్టి కేంద్రీకరించడం. ప్రాంతీయ సమీకృత ఆర్థిక, రాజకీయ విధానాల ద్వారా సరిహద్దులను వేగంగా చెరిపేసి, వర్తకం, పెట్టుబడుల ప్రవాహం నిరాటంకంగా ప్రవహించేలా చూడటం కార్పొరేట్ ప్రపంచీకరణ ప్రధాన ఉద్దేశం. సరీగ్గా ఇటువంటి ప్రామాణీకృత, ఆధునిక పథకం ద్వారానే 1993లో ఐరోపా సమాజం (ఈయూ) ఏర్పడింది. ఇదేమాదిరిగా అట్లాంటిక్ ప్రాంతంలో, ‘నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్’ (నాఫ్టా) కూడా ఏర్పడినా, ఈయూకు ఉన్నంత అత్యాశ దీనికి లేదు. దీని ప్రధాన లక్ష్యం కూడా సరిహద్దుల అడ్డంకులు లేకుండా సరకు, పెట్టుబడుల రవాణా మరింత స్వేచ్ఛగా కొనసాగి, వాణిజ్యవేత్తలకు మరిన్ని లాభాలు వచ్చేవిధంగా చూడటం.
అయితే ఈయూ, అమెరికాల్లోని ప్రపంచీకరణ సమర్ధక వాదులు, ప్రజలు తాము రూపకల్పన చేసిన మార్గానే్న అనుసరిస్తారని, విస్తృత వ్యూహ రచన సమయంలో పొరపాటుపడ్డారు. సరికొత్త మిలియనియం ప్రారంభం నుంచీ ప్రపంచ వ్యాప్తంగా..ప్రపంచీకరణ, ‘సింగిల్ మార్కెట్లు’ వంటి దాని సాహస ప్రయోగాలపై క్రమంగా అసంతృప్తి ప్రారంభమైంది. ముఖ్యంగా సరికొత్త అంతర్జాతీయ పెట్టుబడిదారీ క్రమంలో లాభాలు సమానంగా పంపిణీ కాకపోవడం ఈ అసంతృప్తికి ప్రధాన కారణం. అమెరికా, ఈయూల్లోని నియో లిబరల్స్ వారి చెప్పుచేతల్లో పనిచేసే బహుపాక్షిక ఆర్థిక సంస్థలైన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు, స్వేచ్ఛామార్కెట్ సిద్ధాంతంపై కఠినంగా వ్యవహరిస్తూ, ప్రపంచీకరణ ఫలాలు అందని వారిలో క్రమంగా గూడుకట్టుకుంటున్న అసంతృప్తిని గుర్తించలేకపోయారు.
ఇదే సమయంలో ప్రపంచీకరణ పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పశ్చిమ దేశాలు అపహాస్యం చేశాయి. మైనారిటీలుగా ఉన్న సోషలిస్టులు, కమ్యూనిస్టులు తమ పరాజయాన్ని జీర్ణిచుకోలేకమాత్రమే ఈవిధమైన వ్యతిరేకతను ప్రోత్సహిస్తున్నాయన్న అభిప్రాయంలో ఉండిపోయాయి. తమ మానాన తాము ప్రపంచీకరణ అవసరమంటూ తమ ప్రచారాన్ని యధావిధిగా కొనసాగిస్తూ వెళ్లాయి. ఇదేసమయంలో, ఈ సరళీకృత ‘కెరటం’ ఎంతకాలం ఉండబోదని గ్రహించిన వారు కూడా తప్పనిసరిగా దీన్ని అనుసరించడమా లేక పర్యవసానం అనుభవించడమా అన్నది నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అయితే 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం గొప్ప పాఠాలనే నేర్పింది. ముఖ్యంగా సరిహద్దులులేని ఈ సమీకృత విధానం ఎల్లవేళలా సురక్షితం కాదన్నది సుస్పష్టమైపోయింది. అంతేకాదు ఇన్నాళ్లుగా అనుసరిస్తూ వస్తున్న ప్రపంచీకరణ విధానంపై భ్రమలు విడిపోయాయి. ఇప్పటికీ అనేకమంది ప్రజలు ఎప్పటిలాగే పేదరికంలో మగ్గుతున్నారు తప్ప వారికి ఒరిగిందేమీ లేదు. ప్రఖ్యాత ఆర్థిక వేత్త బ్రాంకో మిలనోవిక్..గత 25 సంవత్సరాలుగా ప్రపంచీకరణ వల్ల నష్టపోయిన వారి సంఖ్య, లాభపడిన వారికంటే ఏవిధంగా పెరిగిపోతున్నదో కళ్లకు కట్టినట్టు వివరించారు.
మరి ఇందులో విపరీతంగా నష్టపోయినవారిలో ఆఫ్రికాదేశాలకు చెందిన నిరుపేదలతో సహా వర్ధమానదేశాలకు చెందిన ప్రజలున్నారు. ఈ ప్రపంచీకరణ కాలంలో వీరి ఆదాయాల్లో ఏవిధమైన మార్పు రాలేదు. ఇక యూరప్, ఉత్తర అమెరికాల్లోని మధ్యతరగతి, శ్రామికుల ఆదాయాల్లో ప్రతిష్ఠంభన నెలకొంది. మరి ఈ ప్రపంచీకరణ వల్ల లాభపడిందెవరంటే, ఉద్గమిస్తున్న మార్కెట్లయిన చైనా, భారత్‌లకు చెందిన మధ్యతరగతి ప్రజలు. అంతేకాదు పశ్చిమ దేశాలకు చెందిన మిలియనీర్లు, బిలియనీర్లు అదేవిధంగా వర్ధమాన దేశాల్లోని క్రిమీలేయర్ ప్రజలు కూడా ఈ ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకున్నారు. మిలనోవిక్ ‘‘92-8’’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనర్ధమేమంటే, ప్రపంచ ఆదాయంలో సగం వరకు కేవలం ఎనిమిది శాతం మంది గుప్పిట్లో ఉండగా మిగిలిన 92 శాతం మిగిలినవారి మధ్యన పంపిణీ అయి ఉంది. ‘బ్రెగ్జిట్’ ఎందుకు సంభవించిందనే అంశాన్ని ఆయన సిద్ధాంతం చక్కగా వివరించింది. మరి ఈ 92 శాతం మందిలో, ఈయూ నుంచి బయటకు రావాలని ఓటు చేసిన 52 శాతం మంది బ్రిటన్ పౌరులు, అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చే ఓటర్లు కూడా ఉన్నారు. వీరంతా ప్రపంచీకరణ ఫలాలు అందక తీవ్ర అసంతృప్తితో మగ్గుతున్నవారే.
సరళ నిర్మాణంతో కూడిన ఈయూ వంటి కుళ్లిపోయిన వ్యవస్థలపై పోరాటం చేయడమనేది కమ్యూనిస్టులకు ఎంతోకాలం కొనసాగదు. ఎందుకంటె యుకె ఇండిపెండెన్స్ పార్టీకి చెందిన నైజెల్ ఫరాజె, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ వంటి, సెమి ఫాసిస్ట్, రేసిస్ట్, పాపులిస్ట్, రైట్ వింగర్స్ అయిన వారికి అది ప్రధానాంశం కానున్నది. అయితే వామపక్షాల మాదిరిగా కాకుండా వీరు, ఆర్థిక పరమైన అన్యాయం, అవినీతి, ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వారు పశ్చిమ దేశాల్లో బలాధిక్యతను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. వీరు తమ ప్రచారంలో ప్రపంచీకరణకు వ్యతిరేకతను, సంస్కృతి, గుర్తింపు అనే అంశాలతో కలగలిపి తమ పోరాటం కొనసాగిస్తుండటంవల్ల వలస వచ్చినవారు, జాతిపరమైన మైనారిటీలు తీవ్ర ఇబ్బందును ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది. ఈ పరిణామాల రీత్యా, పశ్చిమ దేశాల్లో హిట్లర్ మరోరూపంలో పుట్టుకొస్తున్నాడని, మేడిపండు మాదిరి ప్రజాస్వామ్యం గుట్టు బయటపడిందని అనుకుంటే పొరపాటే. మరి సంబంధితులను ఏమాత్రం సంప్రదించకుండా ప్రాంతీయ ఏకీకరణకు పాల్పడటం వల్ల ఏర్పడిన పంపిణీ అసమానతలను రూపుమాపేం దుకు, వివిధ జాతుల ప్రజల సామాజిక-మానసిక సర్దుబాట్లకు కృషి చేస్తామని ఇచ్చిన హామీలను లిబరల్స్ బహుకాలంగా విస్మరించి ఉండాల్సింది కాదు. ఈ నిర్లక్ష్యానికి తగిన గుణపాఠాన్ని ప్రస్తుతం నయా లిబరల్స్ నేర్చుకుంటున్నారు.

- శ్రీరామ్ చౌలియా