మెయన్ ఫీచర్

మైమరపిస్తున్న చైనా ‘మాధుర్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూన్ నెల 26వ తేదీ నుంచి జూలై ఒకటవ తేదీ వరకు చైనాలో జరిపిన వాణిజ్య పర్యటన గొప్ప చారిత్రక సంఘటన! ఈ ‘వాణిజ్యం’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి, అవశేష ఆంధ్రప్రదేశ్ నుండి దశాబ్దులుగా చైనాకు దొంగగా ఎగుమతి అవుతున్న ఎర్రచందనం కలపతో ముడివడి ఉంది. ఈ ‘వాణిజ్యం’ ఏళ్లతరబడి చైనీయ ‘సంప్రదాయ వైద్యచికిత్స’ భోంచేస్తున్న మన పులులతో ముడివడి ఉంది. ఈ దొంగ రవాణాను చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడం మన ప్రభుత్వాలు పట్టించుకోని మహావిషయం. దాదాపు ఆరేళ్ల క్రిందట మన ప్రభుత్వం మన పులులను హత్యచేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించవద్దని చైనా ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. చైనా సమాధానం చెప్పలేదు. ఆ తరువాత ఈ పులుల హననం గురించి మన ప్రభుత్వం ప్రస్తావించిన జాడ లేదు. చైనా చేస్తున్న ఈ పులుల ఫలహారం ఆగిపోయింది కాబట్టి మన ప్రభుత్వం మళ్లీ ప్రస్తావించలేదని భ్రమించడానికి అవకాశం ఉంది. కానీ మన దేశంలో శార్దూల హననం యథావిధిగా జరిగిపోతోంది. గత జనవరి నుండి మన దేశంలోని వివిధ ప్రాంతాలలోని అడవులలో డెబ్బయినాలుగు పులులు అకాల మరణం పాలయినాయట! అడవులలోను వన్యమృగ సంరక్షణ కేంద్రాలలోని ఈ పులులలో అత్యధికం ‘హత్య’కు గురయ్యాయి. విష ప్రయోగంవల్ల, విద్యుదాఘాతం- ఎలక్ట్రొక్యూషన్‌వల్ల కొన్నింటిని ‘దొంగ రవాణా’ ముఠాలవారు చంపేశారట. మరి కొన్నింటిని కాల్చి చంపేశారు. పులి చర్మాలు, పులి గోళ్లు, పులి ఎముకలు, పులి వెంట్రుకలు వంటివి చైనావారి సంప్రదాయ వైద్యానికి పనికివచ్చే ఔషధాలను తయారుచేయడానికి పనికి వస్తాయట! తమ దేశంలోని పులులను జాగ్రత్తగా కాపాడుకుంటున్న చైనా మన దేశం నుండి ఆగ్నేయ ఆసియా దేశాలనుండి పులుల విడిభాగాలను తరలించుకొని పోతోంది. మన దేశంలోని పులుల సంఖ్య రెండు వేల రెండువందల యాబయి లోపేనని 2014లో వెల్లడైంది. చైనాలో మన దేశంలో కంటే ఐదారు రెట్లు అధికంగా పులులు ఉండడానికి ఇదీ కారణం. చైనాలోని పులుల కళ్లాల- టైగర్ హార్వెస్టింగ్ సెంటర్స్‌లో శుద్ధిప్రక్రియకు గురవుతున్నవి ప్రధానంగా విదేశాలలోని పులుల శరీర అవయవాలే! మన దేశంనుండి, ఆగ్నేయ ఆసియా దేశాల నుండి కూడ చైనా పులులను సజీవంగా తరలించి అక్కడ ఈ ‘కళ్లాల’లో వధిస్తున్నారన్నది కూడ ధ్రువపడని రహస్యం. ‘పులుల కళ్లం’అన్నది చైనాలోని ఈ ‘‘సంప్రదాయ వైద్యచికిత్స’కు పనికివచ్చే ఔషధాల తయారీ కేంద్రమట! చంద్రబాబునాయుడు వంటి మన దేశానికి చెందిన ప్రముఖులు బహుశా ఈ ‘టైగర్ హార్వెస్టింగ్ సెంటర్స్’ను సందర్శించి ఉండరు. చైనావారు చూపించరు!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం దుంగలను వేలం ద్వారా విదేశీ సంస్థలకు విక్రయిస్తోంది! ఈ చందనం కలపను ప్రధానంగా చైనాకు ఎగుమతి చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారి విధానం. కానీ సక్రమమైన ఈ మార్గంలోకంటే అక్రమంగా రహస్యంగా ఈ ‘గంధం’ చైనాకు ప్రధానంగా తరలిపోతోంది. చైనాకు ఎక్కువగా ఈ చందనం కలపను విక్రయించాలన్న వాణిజ్య విధానానికి చైనాకు బయలుదేరి వెళ్లడానికి ముందు, జూన్ 23న ముఖ్యమంత్రి చంద్రబాబు పునరంకితమయ్యాడు. నిజానికి ఇలా చైనాతో వాణిజ్యం పెంపొందించుకోవాలన్న విధానానికి 1988లో మన కేంద్ర ప్రభుత్వమే పునరంకితమైంది. అంతవరకు 1962నుండి మన ప్రభుత్వం పయనించిన ‘బాట’ను అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ‘్భగ్నం’చేశాడు. 1962లో దురాక్రమణ జరిపిన చైనా మన దేశపు సరిహద్దును వెన్నుపోటు పొడిచింది. గాయపడిన సరిహద్దులనుండి కాలువలు కట్టిన రక్తం చరిత్ర పుటలలో ఇప్పటికీ సాక్షాత్కరిస్తూనే ఉంది. అందువల్ల దురాక్రమించిన మన సీమలనుండి వైదొలగేవరకూ చైనాతో వాణిజ్య తదితర సంబంధాలను పెంపొందించుకోరాదన్నది 1988 వరకు మన విదేశాంగ విధానం. 1960వ దశకంలో అప్పటి ప్రధానమంత్రులు లాల్‌బహదూర్‌శాస్ర్తీ, ఇందిరాగాంధీ రూపొందించిన ఈ ‘బాట’వెంట మురార్జీదేశాయ్ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా నడిచింది. 1988లో చైనాకు వెళ్లి వచ్చిన రాజీవ్‌గాంధీ ఈ ‘బాట’ను పగులకొట్టాడు. సరిహద్దుల వివాదంతో నిమిత్తం లేకుండా మిగిలిన అన్నిరంగాలలోను చైనాతో సంబంధాలను, స్నేహాన్ని పెంపొందించుకోవాలన్నది రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రూపొందించిన ‘పథభగ్న’- పాత్ బ్రేకింగ్- విధానం. ఈ విధానాన్ని అప్పటినుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు అతి ఉత్సాహంగా అమలు జరుపుతున్నారు. అందువల్ల ‘వాణిజ్యం’ భారత చైనా మైత్రికి కైంద్ర బిందువైంది. ఈ వాణిజ్యం ఫలితంగా చైనా మనకు అతిపెద్ద విదేశీ భాగస్వామిగా అవతరించింది. మన దేశం మాత్రం చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాదు. ఈ వాణిజ్యం ఫలితంగా మన దేశానికి ఏటా సగటున దాదాపు రెండున్నర లక్షల కోట్లు రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఎందుకంటే మన దేశంనుండి చైనాకు ఎగుమతి అవుతున్న వస్తుసామగ్రి పరిమాణం కంటే చైనానుండి మన దేశానికి దిగుమతి అవుతున్న ‘పదార్థ పరంపర’ పరిమాణం దాదాపు రెండున్నర లక్షల కోట్లుమేర ఎక్కువ. అందువల్ల ఈ వాణిజ్యం లోటును మన దేశం ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- రూపంలో చెల్లించవలసి వస్తోంది.
ఇలా శత్రుదేశంలో వాణిజ్యాన్ని పెంపొందించుకొని తమ డబ్బును వాణిజ్యం లోటు రూపంలో శత్రు దేశానికి అప్పగిస్తున్న మరో దేశం ప్రపంచంలో లేదు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తమ దేశానికి వ్యతిరేకంగా జిహాదీ బీభత్సకాండను కొనసాగిస్తున్న ఇరుగుపొరుగు దేశాలతో వాణిజ్య మైత్రిని పెంపొందించుకొనడం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమ దేశాన్ని ఆక్రమించిన జపాన్ తమకు క్షమాపణ చేయవలసిందేనని చైనా ప్రభుత్వం పదే పదే కోరింది. 2005లో జపాన్ గత ‘‘దురాక్రమణ’’కు విచారం వ్యక్తం చేసినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ జపాన్‌ను పదే పదే నీచమైన పదజాలంతో నిందిస్తూనే ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్‌లో పర్యటించిన సందర్భంగా కూడ చైనా ఈ ‘జపాన్ దూషణ’ను పునరుద్ఘాటించింది. ‘‘చైనాను చూసి మనం నేర్చుకోవలసి ఎంతో ఉంది...’’అని గతంలో చైనాకు వెళ్లి వచ్చిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిఉద్ఘాటించడం చరిత్ర... ప్రస్తుతం రెండుసార్లు చైనాకు వెళ్లి వచ్చిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడ ఇదే ప్రశంసా గీతాన్ని వినిపిస్తున్నాడు... ఏమిటి మనం చైనాను చూసి నేర్చుకోవలసింది?? అత్యంత జాతీయతా నిష్ఠ, మాతృదేశ సరిహద్దుల పరిరక్షణ పట్ల మాత్రమేకాక విస్తరణ పట్ల కూడ శ్రద్ధ.. చైనా విదేశాంగ విధానానికి సడలని ప్రాతిపదిక... దీన్ని చైనానుండి మనం నేర్చుకోవద్దా??
నేర్చుకొని ఉండినట్టయితే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాణిజ్యం మత్తులోపడి పెట్టుబడుల లాభంతో మన సరిహద్దుల భద్రతను, భౌగోళిక సమగ్రతా పునరుద్ధరణను దశాబ్దుల తరబడి మరచిపోయి ఉండేవి కాదు. చైనాను మనం ప్రస్తుతం యుద్ధంలో జయించలేకపోవచ్చు, కానీ చైనా కూడ మనలను యుద్ధంలో జయించలేదు. చైనా ప్రభుత్వం గత రెండేళ్లుగా ఈ వాస్తవాన్ని గ్రహిస్తోంది. గ్రహిస్తోంది కనుకనే గత రెండేళ్లుగా లడక్‌లోని అరుణాచల్‌లోని చైనా దళాలు 2014 మే 26వ తేదీకి పూర్వంవలె పదే పదే చొరబడడం లేదు. రెండుమూడుసార్లు చొరబడిన చైనా సైనికులను మన భద్రతాదళాలవారు మెడలు పట్టుకొని నెట్టుకొంటూ వెళ్లి ‘రేఖ’ను దాటించారు. మన దళాలు బర్మాలోకి వెళ్లి అక్కడ నక్కిన చైనా ప్రేరిత బీభత్సకారులను మట్టుపెట్టినప్పుడు కూడ చైనా ‘‘తేలుకుట్టిన దొంగ’’వలె వౌనం వహించింది. చైనా గ్రహించిన ఈ వాస్తవాన్ని మన ప్రభుత్వం ఎందుకని గ్రహించడం లేదు? గ్రహించలేదనడానికి సాక్ష్యం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల చైనాకు వాణిజ్య పర్యటన జరపడం... దక్షిణ కొరియాలో జరిగిన సమావేశం సందర్భంగా, ‘అణు సరఫరాల దేశాల కూటమి’- న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్-లో మనకు సభ్యత్వం లభించకుండా చైనా నిరోధించింది. అయినప్పటికీ అరుణ్‌జైట్లీ చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకునే చర్చలు జరిపి వచ్చాడు... చైనావారి ‘బుల్లెట్’రైలు గురించి చంద్రబాబు మురుసిపోవడం ఈ పొగడ్తల పర్వంలో ప్రస్తుత ఘట్టం! తాత్కాలిక రాజధాని ప్రారంభ శుభ సమయంలో అమరావతి ప్రాంగణంలో ఉండకుండా ‘బుల్లెట్’ రైలులో బీజింగ్ వైపు దూసుకొనిపోవడం చంద్రబాబునాయుడు చైనా పర్యటనకు ఇచ్చిన చారిత్రక ప్రాధాన్యానికి నిదర్శనం. పర్యటన, ప్రారంభోత్సవం పూర్వ నిర్ధారిత కార్యక్రమాలే! ఎర్రచందనం అమ్మడానికి వీలుగా చైనాలో ‘గిడ్డంగి’కి ప్రారంభోత్సవం చేయడం రాజధాని ఆరంభం కంటే ప్రాధాన్యం సంతరించుకున్న మహా విషయం!!
బుల్లెట్ రైలులో చంద్రబాబు బీజింగ్‌వైపు పరుగులు తీసిన సమయంలోనే చైనా పత్రికలు మన దేశాన్ని నీచమైన పదజాలంతో నిందించాయి! అదీ చంద్రబాబుకు లభించిన ప్రతిఫలం... చైనా పత్రికలు, దృశ్యశ్రవణ మాధ్యమాలు మన దేశంలోవలె స్వతంత్రమైనవి కావు, అవి చైనా ప్రభుత్వ విభాగాలు!! నిజానికి చైనా ప్రభుత్వ పత్రికలు మన దేశానికి ఆపాదించిన ఆరోపణలు చైనాకు మాత్రమే వర్తిస్తాయి. టాంజానియా దేశంనుంచి 2014లో తన విమానంలోనే ఏనుగు దంతాలను దొంగగా తరలించుకొని వచ్చిన ‘ఘనత’ చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్‌కు మాత్రమే లభించింది!!

- హెబ్బార్ నాగేశ్వరరావు 09951038352