సంపాదకీయం

స్వచ్ఛ గంగకు శ్రీకారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమామి గంగే-గంగానదీ నీకు నమస్కరిస్తున్నాను- అన్నది నినాదం కాదు, సనాతన భారత జాతీయ జీవన స్వభావం! నమామి గంగే అన్న విస్తృత ప్రక్షాళన కార్యక్రమం గురువారం ఆరంభం కావడం గ్రహణగ్రస్తమై ఉన్న ఈ స్వభావ విముక్తికి మరో శ్రీకారం. గంగానది కేవలం భౌతికమైన జల ప్రవాహం కాదు, యుగయుగాల జాతీయ సాంస్కృతిక స్రోతస్విని...్ధర్మక్షేత్రాన్ని నిరంతరం పండిస్తున్న కర్మయోగ శ్రమ జలాలు నిండివున్న దివ్యధుని...గంగానదీ జలాలు కాలుష్య గ్రస్తం కావడం దశాబ్దుల పాటు ఈ జాతీయ స్వభావాన్ని ఆవహించిన వికృతికి నిదర్శనం... ఈ వికృతి కారణంగానే వందల వేల రకాల కాలుష్యాలు దుర్గంధ పూరిత జలాలు గంగలో కలసిపోయాయి. పుడమిని పరిశుభ్రం చేయగల జిల్లాలు అపరిశుభ్రంగా మారడం గంగానది విషాదగాధ. గంగానదీ జలం పానయోగ్యం కాకుండా పోయింది. స్నానయోగ్యం కాకుండా పోయింది. స్పృశించడానికి సైతం సందేహించవలసిన దుస్థితి దాపురించడం ఈ దేశపు విషాదం. గంగానది భారతదేశానికి ప్రతీక. అందువల్ల గంగానదీ జలాలను పునఃపరిశుభ్రం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆరంభించిన నమామి గంగే పథకం జాతీయ స్వభావాన్ని వికృతినుంచి విముక్తం చేసి సంస్కృతి నిబద్ధం చేయగల చారిత్రక శుభ సంకల్పం. ఐదు రాష్ట్రాలలోని నూట నాలుగు ప్రదేశాలలో ఒకే రోజున , కలియుగాబ్ది 5118వ సంవత్సరం ఆషాఢ శుద్ధ తదియనాడు రెండువందల ముప్పయి ఒక్క ప్రక్షాళన కార్యక్రమాలు ఆరంభం కావడం అభూతపూర్వమైన అత్యద్భుత పరిణామం. శ్రీకారం సాకారమయినప్పుడు పరిశుద్ధమైన పరమ పావనమైన జలదర్పణం వంటి గంగానది మళ్లీ అవతరించగలదు. ప్రవాహ నిత్యత్వానికి ప్రతీకగా రెండు వేల ఐదువందల కిలోమీటర్ల మేర ప్రస్ఫుటించే ఈ జలదర్పణంలో యుగ యుగాల జాతీయ జీవనం మరోసారి తన సాంస్కృతిక సౌందర్య శోభలను దిద్దుకోగలదు. ఈ పరిశుద్ధ పారదర్శక జలం గంగ ఆకాశంలో మందాకినిగా పొంగులెత్తిన నాటిది, పరమశివుని జటాజూటంలోకి దూకి నర్తించిన నాటిది, గంగోత్రి వద్ద పుడమితల్లి ఒడిలో చేరి అభంగ తరంగాలతో ఆటలాడిన నాటిది. భగీరధుని వెంట పరుగులు తీసి భరత భూమిని పండించిన నాటిది. ప్రగతి ఫలాలను సుగతి సుంగంధాల సభలను తీర్చిననాటి, అలకనందగా, భాగీరథిగా, హుగ్లీగా గంగానది నిరంతరం జలకమాడించింది. అందువల్ల కాలుష్య గంగ భరత మాతృనయనాల విషాద జలతరంగ. కాలుష్యం లేని గంగాజలం మాతృదేవి నేత్రాల హర్షజలం...
పర్యావరం పరిరక్షణ స్వచ్ఛమైన నీటి వల్లనే సాధ్యవౌతోంది. వర్షం నేలను పరిశుభ్రం చేస్తోంది. వారాల తరబడి, నెలల తరబడి పుడమిపై పేరుకొని పోయిన అనేకానేక వ్యర్థ పదార్థాలు వర్షం నీటి ధాటికి కొట్టుకొనిపోతున్నాయి. అందువల్లనే వర్షం కురిసిన ప్రతిచోట భూమి పరిశుభ్రమై స్వచ్ఛమైన మట్టి పరిమళాలు ప్రకృతిని పరవశింపజేస్తాయి. వర్షపు నీరు స్వచ్ఛతకు ప్రతీక...అందువల్లనే ‘నీరు నేలను పరిశుభ్రం చేయాలి. పరిశుభ్రమైన నేల మమ్ములను పరిశుభ్రం చేయాలి..’’ అని వేద ద్రష్టలు ఆకాంక్షించారు. ‘‘ఆపః పునన్తు పృథివీం, ఫృథివీ పూతాపునాతుమామ్..’’ ఇది తరతరాల జాతీయ ఆకాంక్ష. అందువల్ల ఈ దేశ ప్రజలు నీటిని పవిత్రతా సాధనకు మాధ్యమంగా చేసుకున్నారు. నీరులేని ఎడారులలో గుడారాలు వేసుకొని జీవించిన వారు, మంచుగడ్డలమీద పుట్టిపెరిగి నీరంటే భయపడినవారు భారతదేశపు సరిహద్దులకు ఆవల ఉన్నారు. నీరు లేక స్నానం చేయని విదేశీయులు, నీరున్నా స్నానం చేయలేని విదేశీయులు అనాగరిక ప్రపంచాన్ని సృష్టించుకొన్నారు. నీరు మానవ జీవనంలో సంస్కారాలను వికసింపజేసింది. ఈ సంస్కారాల సమాహారం సంస్కృతి. ‘‘ఎప్పుడు ఎడతెగక పారు ఏరు..’’ ఉన్నచోటు మాత్రమే జీవించాలని సుమతీ శతకకారుడు చెప్పడానికి ఇదీ నేపథ్యం. నీరు ఇలా భౌతిక మానసిక బౌద్ధిక స్వచ్ఛతను పెంపొందిస్తోంది. కానీ నీరు స్వయంగా స్వచ్ఛతను కోల్పోతే ఏమవుతుంది? భూమిని భూమిపై ఉన్న మానవులను జీవజాలాన్ని స్వచ్ఛంగా ఉంచేదెవరు?
అందువల్లనే నీటి స్వచ్ఛతను కాపాడటం పరిసరాల స్వచ్ఛతను మన ఆరోగ్యాన్నిలా కాపాడడానికి వౌలికమైన కర్తవ్యం. ఈ కర్తవ్య నిర్వహణకు ఆలస్యంగానైనా ప్రభుత్వం పూనుకొంది. గంగానదిని యమునానదిని పరిశుభ్రంగా మార్చడం ప్రతీక మాత్రమే. దేశంలోని అన్ని నదులను చెరువులను, బావులను ఇతరేతర జలాశయాలు శుభ్రం చేయడం వాస్తవమైన లక్ష్యం. నదుల సమీపంలోను, జలాశయాల సమీపంలోను మలమూత్ర విసర్జన చేయరాదని మన పూర్వులు నిబంధన విధించారు. పవిత్ర నదీ జలాలలో స్నానం చేయడానికి ముందు ఒడ్డున కొంత దూరంలో ‘మలాపర్షక’ స్నానం చేయాలి. శరీరంపై ఉండే మురికి తొలగే విధంగా స్నానం చేయడం ‘మలాపర్షక’ స్నానం. దీని తరువాతనే నదులలో మంగళస్నానం చేయాలి. ఈ సూత్రాన్ని ప్రస్తుతం వాణిజ్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తున్న ఈత కొలనుల-స్విమ్మింగ్ పూల్స్-లో మాత్రం పాటిస్తున్నారు. బయట స్నానం చేసిన తరువాతనే స్విమ్మింగ్‌పూల్‌లో దిగాలన్నది నిబంధన. నదుల విషయంలోను ఇతర సహజ జలాశయాల విషయంలోను మనం ఈ నిబంధనను మరచిపోయి శతాబ్దులు దాటింది. ఈ దేశంపై, ఈ మట్టిపై, ఈ నీటిపై ఈ సమాజ హితంపై మమకారం లేని విదేశాల దోపిడీదారులు మనపై వందల ఏళ్లు పెత్తనం సాగించిన ఫలితమిది. మనవన్నీ మనం మరచిపోయాము. గంగానదిని మాత్రమే కాదు దేశంలోని నీటిని మొత్తం మనం క్రమంగా కాలుష్య భరితం చేశాం. భూగర్భ జలాన్ని సైతం నిర్దాక్షిణ్యంగా మలిన పరచిన మన జీవన విధానం ఇప్పటికైనా మారాలి.
పారిశ్రామిక ప్రగతి పేరుతో జరుగుతన్న కేంద్రీకరణ, మన సమష్టి జీవనాన్ని కాలుష్యంతో నింపుతోంది. గంగానది నీరు మురికి నీరుగా మారడానికి నదీ తీరం పొడవునా ఇరువైపులా వెలసిన పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలు కారణం. ఉపనదులు కలసిన రీతిలో వందల వేల ఈ మురికినీటి ప్రవాహాలు, రసాయన విష జలాలు నదిలో కలిసిపోతున్నాయి. ప్లాస్టిక్ పదార్ధాలను విచ్చలవిడిగా విసిరివేయడం వల్ల గంగానది మాత్రమే కాదు, గంగకూ ఇతర నదులకూ జన్మస్థానమైన హిమాలయ పర్వత ప్రాంగణం సైతం కాలుష్యం కాటునకు గురి అయివుంది. ఐదు రాష్ట్రాలలోని వందచోట్ల సమాంతరంగా ఆరంభమైన గంగా ప్రక్షాళనా కార్యక్రమం పూర్తి కావడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. కేటాయించిన రెండున్నర వేల కోట్ల రూపాయలతో పాటు మరిన్ని నిధులు సమకూడవచ్చు. కానీ నాగరికత పేరుతో నడచిపోతున్న మన జీవన శైలి మారడం స్వచ్ఛతకు ప్రధాన సూత్రం..