మెయన్ ఫీచర్

తిరుగుబాటు..ఎర్డొగాన్‌కు హెచ్చరిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టర్కీ ప్రభుత్వంపై జరిగిన ఇటీవలి తిరుగుబాటు, గతంలో జరిగిన వాటి మాదిరిది కాదు. కాకపోతే ప్రస్తుత దేశాధ్యక్షుడు రీసిప్ తయ్యిప్ ఎర్డొగాన్‌కు ఒక హెచ్చరిక! తానొక 21వ శతాబ్దపు ఆధునిక అటుటుర్క్‌గా భావించుకుంటూ, అనుసరిస్తున్న అహంకార పూరిత వ్యవహారశైలి కారణంగా ఆయన వ్యతిరేకుల సంఖ్య తానూహించిన దానికంటే విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో భద్రతా దళాల్లో ఒక వర్గం ఆయన పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇదే అదను అనుకున్న ఆ వర్గాలు తమకు తెలిసిన ఒకే ఒక మార్గం తిరుగుబాటుతో ప్రభుత్వాన్ని పడగొట్టాలని తలంచాయి. కేవలం ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే ఈ తిరుగుబాటు చేశామని, కుట్ర అనంతరం రేడియో ప్రసంగంలో సైన్యంలోని తిరుగుబాటువర్గం పేర్కొంది. అయితే ఈ కుట్రను చాలా వేగంగా అణచివేసినప్పటికీ, రాజధాని అంకారాలో దాదాపు 265 మంది ప్రజలు మరణించగా, మరో 1400 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు.
దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్య వ్యవస్థగా మార్పుచేయాలని ఎర్డొగాన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ యత్నాలు దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కాగా ఇదే.. దేశంలో ఆఖరి సైనిక కుట్ర కావాలని టర్కీ మిత్ర దేశాలు గాఢంగా కోరుకుంటున్నా యి. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో కాస్తోకూస్తో సుస్థిరంగాన్న దేశమేదైనా ఉన్నదంటే అది టర్కీ మాత్రమే. కానీ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో టర్కీ చురుగ్గా కలుగజేసుకుంటోంది. ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద గ్రూపులతో కలిసి యుద్ధం చేసేందుకు వెళ్లే జిహాదిస్టులకు టర్కీ ప్రవేశ ద్వారంగా మారిపోయింది. నేడు టర్కీలో అత్యధిక సంఖ్యలో సిరియా శరణార్థులు తలదాచుకుంటున్నారు.
ఇటీవలికాలంలో టర్కీ ప్రభుత్వం తన సరిహద్దుల భద్రతను మరింత కఠినతరం చేసింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా వైమానిక దాడులు జరిపేందుకు వీలుగా అమెరికాకు, తన ఇన్‌సిర్లిక్ వైమానిక స్థావరాన్ని వాడుకోవడానికి అనుమతించింది. ఇదే సమయంలో ఇజ్రాయిల్, రష్యాలతో శాంతిని కోరుకోవడం ద్వారా ప్రాంతీయంగా శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి కృషి చేస్తోంది. అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ సమస్యలు ప్రధానంగా దేశీయమైనవి. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మతబోధకుడు ఫెతుల్లాహ్ గులెన్ గతంలో ఎర్డొగాన్‌కు అత్యంత సన్నిహితుడు. కానీ వీరిద్దరికీ చెడడంతో ఫెతుల్లాహ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆయనకు సైన్యం, ఇతర ప్రభుత్వ శాఖల్లో అనుయాయులున్నారు. ప్రస్తుత సైనిక కుట్ర వెనుక ఫెతుల్లాహ్ గులెన్ ఉన్నాడని, అధ్యక్షుడు ఎర్డొగాన్ గట్టిగా విశ్వసిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫెతుల్లాహ్ గులెన్‌ను తమ దేశానికి తిప్పి పంపాలని ఎర్డొగాన్ అమెరికాను కోరుతున్నాడు. కుట్ర తర్వాత మొత్తం 2,750 మంది న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటుపడింది.
గులెన్ తప్పుకున్న తర్వాత, ప్రభుత్వంలో ఉన్న గులెన్ అనుకూలురను ఆయా పదవులనుంచి తొలగించే కార్యక్రమం మొదలైంది. ఇదే సమయంలో దేశ ఆగ్నేయప్రాంతంలో కుర్దిష్ తీవ్రవాదులపై పోరాటం కొనసాగించడం మరో భారంగా పరిణమించింది. ఒకప్పుడు వీళ్లతో శాం తిని నెలకొల్పుకోవడానికి ఎర్డొగాన్ కృషి సలిపాడు. ఇక యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం చేసిన యత్నాలు ఇప్పటికే మసకబారాయి. ఐరోపాదేశాల్లోకి వెల్లువెత్తుతున్న శరణార్థులకు తమ దేశం లో ఆశ్రయం కల్పించినందుకు ప్రతిగా ఆర్థిక సహకారాన్ని పొందే ఒప్పందం ఆదేశాలతో కుదుర్చుకున్నాడు.
అయితే వివిధ విరోధ గ్రూపులతో రాజీ కుదుర్చుకోవడానికి ఎర్డొగాన్ చేస్తున్న యత్నాలు ఒకవేళ సానుకూల ఫలితాలిచ్చినప్పటికీ ఆయన ప్రాథమిక సమస్యకు మాత్రం పరిష్కారం లభించబోదు. ఒట్టమాన్ రాజుల శైలిలో తనకోసం అంకారాలో నిర్మించుకున్న వెయ్యి గదుల రాజప్రాసాదం, దేశ రాజకీయాలు, వనరులపై ప్రభావం చూపడం మొదలైంది. ఎర్డొగాన్ ఏ కొద్ది అసమ్మతిని కూడా సహించబోడు. గులెన్ సామ్రాజ్యం గురించి కథనాలను ప్రచురిస్తున్న మీడియాపై అక్కసు వెళ్లబోస్తున్నాడు. ఇక రాజకీయ పత్యర్థులతో కఠినంగా వ్యవహరిస్తున్న తీరు కూడా అపహాస్యం పాలవుతోంది. తన పదమూడేళ్ల పరిపాలనా కాలంలో-అత్యధికంగా ప్రధానిగా-ఎర్డొగాన్ సాధించింది మాత్రం ఒక్కటుంది. ఇంతటి సుదీర్ఘకాలం సైనిక కుట్రలు లేకుండా సుస్థిర పాలన అందించడం.
కానీ ప్రస్తుత కుట్ర యత్నం పెరుగుతున్న అసమ్మతికి సంకేతం. ఇందుకు ముందుగా చెప్పుకోవలసిన కారణం మొ త్తం దేశాన్ని ఇస్లామీకరించాలని రాజకీయంగా ఎర్డొగాన్ చేస్తున్న యత్నాలు టర్కీలోని సెక్యులర్ వాదులకు ఎంతమాత్రం రుచించకపోవడం. రెండవది ప్రజాస్వామ్య స్వేచ్ఛపై కఠిన నిబంధనల విధింపు. ఎర్డొగాన్ విశ్రాంతి యాత్రలో ఉన్న సమయంలో సైనిక కుట్ర జరిగింది. కుట్ర సంగతి తెలియగానే ఆయన హుటాహుటిన స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే కుట్రలో పాల్గొన్నది సైన్యంలోని కొన్ని వర్గాలు మాత్రమే. కొందరు జనరల్స్, కల్నల్స్ ఈ కుట్రలో భాగస్వాములైనప్పటికీ, యువ సైనికులు వేగంగా లొంగిపోవడం వారిలో నెలకొన్న భయానికి చిహ్నం. సైన్యాధిపతిని తక్షణమే విధుల్లోనుంచి తొలగించారు. ఈ కుట్ర సందర్భంగా అధికారికంగా 265 మంది మరణించారు. 1400 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు మూడువేల మంది సైనికులను నిర్బంధంలోకి తీసుకున్నారు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ తన రాజకీయ జీవితంలో ఎన్నో మార్పులను చవిచూశారు. ఇస్తాంబుల్ మేయర్‌గా ఆయన ఒక తిరుగుబాటుదారుగా వ్యవహరించా రు. ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత తానొక ప్రజాస్వామ్యవాది, ఉదార స్వభా వం కలిగిన వాడిగా తనను తాను ప్రదర్శించుకున్నారు. దేశాన్ని యూరోపియన్ యూ నియన్‌లో సభ్యురాలిగా చేర్చే లక్ష్యంతో తన కృషిని కొనసాగించారు. ఎప్పుడైతే ఐరోపా సమాజంలో సభ్యత్వం రావడం దుర్లభమని తేలిందో ఇక తనను తాను ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించే వాడిగా, తనను తాను ప్రదర్శించుకొని తన విజయానికి కారకులైన మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నించాడు. తర్వాతికాలంలో జరిగిన ఎన్నికల్లో చేకూరిన వరుస విజయాలు కూడా ఎర్డొగాన్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. తాను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నట్టు భావించుకునేలా చేశాయి. ముఖ్యంగా తానొక ఆధునిక అటాటుర్క్‌గాను, ఒట్టమాన్ సామ్రాజ్య శిథిలాలనుంచి అత్యంత ఆధునిక దేశాన్ని నిర్మించిన ఆధునికుడిగాను తనను తాను పరిగణించుకున్నాడు. దీని ఫలితం ఏమం టే అటటుర్క్ ముసుగులో దేశాన్ని తిరిగి మత ఛాందస వాదంవైపునకు తీసికెళ్లడం ప్రారంభమైంది.
తాను అత్యంత ప్రమాదకరమైన ప్రాం తంలో ఉన్నానన్న సంగతి ఎర్డొగాన్‌కు బాగా తెలుసు. సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసాద్‌ను పదవీ భ్రష్టుడిని చేసేందుకు, జిహాదిస్టులతో తొలినాళ్లలో డబుల్‌గేమ్ ఆడాడు. అప్పట్లో టర్కీని ఇస్లామిక్ స్టేట్ మద్దతుదార్లు సానుకూల దృష్టితో చూశారు. తర్వాత తన పంథాను మార్చుకోవడంతో దేశంలో భయంకరమైన ఉగ్రవాద దాడులు చోటుచేసుకొని వందలాది మంది టర్కీ పౌరులు అసువులు బాసారు. మరి ఈ దాడులు ఎవరు చేసి ఉంటారనేదానిపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు లేదా కుర్దు తిరుగుబాటు దార్లు! వీటికితోడు ఎర్డొగాన్ అనుసరించిన అహంకార వైఖరి తోడైంది.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమూలంగా మార్చివేసి, అధ్యక్ష తరహా ప్రజస్వామ్య వ్యవస్థను నెలకొల్పాలన్నది ఎర్డొగాన్ లక్ష్యం. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. దీనికి కావలసిన పూర్తి మెజారిటీ కోసం ఆయన యత్నాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ ఎర్డొగాన్ సర్వంసహా అధికారాలకు ఎటువంటి ఢోకాలేదు. స్వతంత్ర భావాలున్న ప్రధాని అహమెట్ డవుటోగ్లు, బినాలీ ఎల్‌డ్రిమ్‌ల సంపూర్ణ మద్దతు ఎర్డొగాన్‌కు కొనసాగుతోంది. ఒకవైపు జిహాదిస్టులతో సత్సంబంధాలు కొనసాగించినా ఇక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో (నాటో) టర్కీ అతిముఖ్యమైన సభ్యురాలు. అయితే ఎర్డొగాన్ నేతృత్వంలో టర్కీ అనుసరించిన వైరివర్గాలను సమతుల్యం చేస్తూ అనుసరించిన విధానా లు ఒక్కొక్కసారి తప్పిదాలుగా మారి, ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలివ్వడం ప్రారంభించాయి. ఒక దశలో పొరుగు దేశాలతో ఏవిధమైన సమస్యలు లేకుండా ఉండటం అనేది టర్కీ విధానంగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్, రష్యాలతో ఏదోవిధంగా మైత్రిని అనుసరించినా, శత్రువులైన పొరుగువారు మిగిలే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో చోటు చేసుకున్న సైనిక కుట్ర తర్వాత, ఎర్డొగాన్ వైఖరి ఏవిధంగా ఉంటుందనేది దేశీయంగా, ప్రాంతీయంగా ఎంతో ఆసక్తికరంగా మారింది.

- ఎస్. నిహాల్ సింగ్