సంపాదకీయం

తగిన శిక్ష తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యావజ్జీవ కారాగారవాస శిక్షను గురించి మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టీకరణ నేర విచారణ ప్రగతికి మరో దిశా నిర్దేశనం. ఈ ఆజీవన నిర్బంధ శిక్ష స్వభావం గురించి, స్వరూపం గురించి ఆవశ్యకత గురించి గతంలో సైతం సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించి ఉంది, విశే్లషించి ఉంది, పథ నిర్దేశనం చేసి ఉంది. అయినప్పటికీ దేశంలోని వివిధ ఉన్నత న్యాయస్థానాలు జిల్లా న్యాయస్థానాలు జీవన పర్యంతం జైలుశిక్షను విధించడంపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడం మంగళవారం నాడు సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయానికి నేపథ్యం. యావజ్జీవ నిర్బంధమంటే నేరస్థుడు మరణించేవరకు అతనిని కారాగార గృహంలో ఉంచవలసిందేనన్నది తీర్పు చెప్పిన సర్వోన్నత న్యాయమూర్తులు ఎఫ్‌ఎమ్‌ఐ ఖలీఫుల్లా, ఏకే సిక్రీ, ఎస్‌ఏ బాబ్డే, ఆర్ వసుమతి చేసిన నిర్ధారణ. ఘోరమైన నేరాలకు ఒడిగట్టిన దుండగులకు యావజ్జీవ గారాగృహవాసం సముచితమేనని కూడ రాజ్యాంగ ధర్మపీఠం న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఒకే నేరస్థునికి వివిధ అభియోగ ధ్రువీకరణ ప్రాతిపదికగా ఒకటి కంటె ఎక్కువ యావజ్జీవ కారాగార శిక్షలను న్యాయస్థానాలు విధించవచ్చు. ఒకే న్యాయస్థానం విధించవచ్చు. ఒకటికంటె ఎక్కువ న్యాయస్థానాలు విధించవచ్చు. అలాంటి సందర్భాలలో యావజ్జీవ కారాగార శిక్షలన్నింటినీ నేరస్థుడు ఒకేసారి అనుభవించాలన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయంలోని మరో ప్రధానమైన అంశం. ఇలా కరడుకట్టిన నేరస్థులు జీవన పర్యంత నిర్బంధ శిక్షను ఏకకాలంలో కాక ఒకదాని తరవాత మరొకటిగా అనుభవించాలని జిల్లా న్యాయస్థానాలు తీర్పులు చెప్పడం విచిత్రమైన వ్యవహారం. నిర్ణీత కాల వ్యవధిలో కారాగృహ శిక్షను అనుభవించేవారు ఒకదాని తరువాత మరొకటిగా అనుభవించడానికి కొంతమేరకు అవకాశం ఉంది. అమెరికా వంటి దేశాలలో హంతకులకు, తదితర హీనమైన కలాపాలకు పాల్పడిన నేరస్థురకు ఒకటికంటె ఎక్కువ నేరాలకు శిక్షలను విధించిన సందర్భాలలో ఒకదాని తరువాత మరొక శిక్షను అనుభవించాలని నిర్దేశిస్తున్నారు. కానీ మనదేశంలో మాత్రం ఒకే నేరస్థుడిని ఒకటి కంటె ఎక్కువ శిక్షలు పడినప్పుడు అన్నీ ఒకేసారి అనుభవించాలని న్యాయస్థానాలు నిర్దేశించడం సంప్రదాయమైంది. అంటే అతి దీర్ఘకాలపు శిక్షను అనుభవించిన నేరస్థుడు మిగిలిన శిక్షలను అనుభవిస్తున్నట్టుగానే పరిగణిస్తున్నాము. ఒకదానిని వివిధ అభియోగాలలో మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, ఏళ్ల జైలు శిక్షలు పడినప్పుడు ఒకదాని తరువాత ఒకటిగా ఈ శిక్షలను అనుభవించినప్పుడు ఇరవై నాలుగేళ్లు జైలులో ఉండాలి. కాని శిక్షలన్నింటినీ ఒకేసారి అనుభవిస్తే తొమ్మిదేళ్లు మాత్రమే అతగాడు నిర్బంధవాసంలో గడుపుతాడు. ఇదీ తేడా...
అందువల్ల ఇలాంటి శిక్షల విషయంలో ఒకేసారి అనుభవిచాలని కాని, ఒకదాని తరువాత ఒకటి అనుభవించాలని కానీ న్యాయ సాథనాలు నిర్దేశించడంలో ఔచిత్యం ఉంది. అమెరికా వంటి దేశాలలో రెండు మూడు పాతికేళ్ల జైలుశిక్షలను ఒకదాని తరువాత ఒకటి అనుభవించాలని నిర్దేశిస్తున్నారు. మనదేశంలో ఒకేసారి అనుభవించాలని నిర్దేశించడం న్యాయ సంప్రదాయమై ఉంది. ఒకదాని తరువాత మరొక శిక్షను అనుభవించాలని న్యాయస్థానాలు మనదేశంలో నిర్దేశించిన సందర్భాలు లేకపోలేదు. కానీ యావజ్జీవ కారాగార శిక్షల విషయం ఒకదాని తరువాత ఒకటి అనుభవించడానికి అవకాశం లేదు. అవకాశం ఉందని భావించడం అతార్కికం. సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వారు వ్యాఖ్యానించినట్టు ‘‘మనుషులకు మిగిలిన జీవజాలం వలెనే ఒకే జీవితం ఉంది. ఒకేసారి జీవిస్తున్నారు..’’ అందువల్ల ఒక అజీవన కారాగృహ నిర్బంధం పూర్తయ్యేసరికి నేరస్థుడు సహజంగానే మరణిస్తాడు. అందువల్ల రెండవసారి అతగాడు జీవన పర్యంత నిర్బంధ శిక్షను అనుభవించే అవకాశం లేదు. ‘‘ఉందని భావించడం అతార్కికం, అర్థరహితం..’’ అని కూడ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అందువల్ల నేరస్థునికి వివిధ ఘోర నేరాలు చేసినందుకు రెండు లేదా ఎక్కువసార్లు యావజ్జీవ నిర్బంధం నిర్ణయించిన సందర్భాలలో అన్నింటినీ ఒకే సారి అనుభవించాలని న్యాయస్థానాలు నిర్దేశించాలని, సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం తీర్పు చెప్పింది.
విచక్షణ ఇలా నిర్దేశిస్తున్నప్పటికీ తమిళనాడులోని ఒక న్యాయస్థానం నేరస్థులు కొందరు ఒకదాని తరువాత మరొకటిగా జీవన నిర్బంధ శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చిందట! ఈ నేరస్థులు అనేక హత్యలు చేసినట్టు ధ్రువపడినందున వారికి అనేక జీవన నిర్భంధ శిక్షలను న్యాయస్థానం విధించింది. మదరాసు హైకోర్టు సైతం ఈ తీర్పును సమర్ధించడమే విడ్డూరం. సుప్రీంకోర్టు ఇప్పుడీ కింది తీర్పులను సవరించి నేరస్థులు ఆ జీవన కారాగృహ శిక్షలన్నింటినీ ఏకకాలంలో అనుభవించాలని నిర్దేశించింది! అయితే యావజ్జీవ నిర్బంధ శిక్షలకు గురి అయిన నేరస్థులను పదునాలుగేళ్లు నిర్బంధించేయాలన్న న్యా య భ్రాంతి దేశమంతటా నెలకొని ఉంది. అందువల్ల రెండు యావజ్జీవ కారాగార శిక్షలను ఏకకాలం- కంకరెంట్-లో కాక ఒకదాని తరవాత ఒకటి-కాన్సిక్యూటివ్-గా అనుభవించినప్పటికీ ఇరవై ఎనిమిదేళ్ల నిర్బంధం తరువాత నేరస్థుడు బయటికి వస్తాడు. నిర్బంధం ఆరంభమయ్యే నాటికి నేరస్థుని వయసు ముప్పయి సంవత్సరాలయితే యాబయి ఎనిమిదేళ్లకు అతగాడు రెండు యావజ్జీవ జైలు శిక్షలను పూర్తి చేసి బయటికి వచ్చేస్తాడు, డెబ్బయి రెండేళ్లకు మూడు జీవిత ఖైదులను, ఎనబయి ఆరు ఏళ్లకు నాలుగు జీవిత ఖైదీలను సైతం ఈ ముప్పయి ఏళ్ల నేరస్థుడు పూర్తి చేయవచ్చు! తమిళనాడులోని న్యాయస్థానం వారి తీర్పునకు ఈ న్యాయభ్రాంతి కారణం కావచ్చు! అందువల్లనే సర్వోన్నత రాజ్యాంగ పీఠం ఇప్పుడు ఈ న్యాయ భ్రాంతిని తొలగించింది! యావజ్జీవ నిర్బంధ శిక్షకు గురి అయిన నేరస్థుడు మరణించే వరకు కారాగృహంలోనే ఉండాలన్నది సర్వోన్నత న్యాయ నిర్ణయం!
పదునాలుగేళ్ల కారాగార వాసం తరువాత యావజ్జీవ నిర్బంధితుడిని జైలునుండి విడుదల చేసి స్వేచ్ఛను ప్రసాదించాలన్న నిబంధన ఏ చట్టంలో కూడ లేదని గతంలో కూడ సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఆ నిర్ధారణలకు ఇప్పటి తీర్పు ధ్రువీకరణ. జీవిత ఖైదును అనుభవిస్తున్న వారందరు పదునాలుగేళ్ల తరువాత విడుదలకు అర్హులు కారని, అబలలపై లైంగిక అత్యాచారం జరిపి హత్య చేసిన వారు మరణించేవరకు నిర్బంధంలో ఉండవలసిందేనని గత ఏడాది జూలైలో కూడ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరం తీవ్రతకు అనుగుణంగా శిక్ష ఉండాలని కూడ 2007లో సుప్రీంకోర్టు నిర్దేశించింది. ప్రభుత్వాలు నేరస్థులకు క్షమాబిక్షను ప్రసాదించినప్పుడు, శిక్షను తగ్గించినప్పుడు ఆ నిర్ణయాలను సమీక్షించే అధికారం తమకుందని 2006లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామ క్రమంలో మంగళవారంనాటి తీర్పు మరింత వెలుగునకు చిహ్నం.