మెయన్ ఫీచర్

స్వభావం మరచి, సరిహద్దును చెరచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చైనాకు ఇక్కడ చేతులేర్పడినాయి
రష్యాకు ఇక్కడ
రంగమేర్పడినాది..’’
అని క్రీస్తుశకం 1980వ దశకంలో ప్రముఖ జాతీయ విప్లవకవి యెల్దండ రఘుమారెడ్డి హెచ్చరించి ఉన్నాడు. ప్రస్తుతం చైనాకు మనదేశంలో చేతులు మాత్రమే కాదు, నోళ్లు, కడుపులు కూడ ఏర్పడిపోయాయి. చిన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ నోళ్ల ద్వారా చైనీస్ ఫుడ్ కడుపులలోకి చేరిపోతోంది. చైనీయ క్షిప్ర భోజనశాల-చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్-లేని నగరాలు, పట్టణాలు, పట్టణ వాటికలు లేని స్థితి దాపురించింది. చైనాపై మన జనానికి కల మమకారానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే. 1982లో చైనా మనదేశాన్ని దురాక్రమించి వెన్నుపోటు పొడిచింది. ‘‘వీపున కదా పోటు పడింది, దాని వల్ల కడుపు, నోరు, చేయి వంటివి చైనాపై ఎందుకని శత్రుత్వం వహించాలి?’’ అన్న వాదం ఉండనే ఉంది. అందువల్లనే అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల చైనాలో పర్యటించి వచ్చారట. కాళ్లకూ, వీపునకూ సంబంధం లేదు..పర్యటన జరిపేది కాళ్లతోనే మరి. ఒక చైనా మన గుండెలలో గునపం దింపినప్పటికీ కాళ్లకూ, చేతులకూ, నోటికీ బహుశా పట్టదు. భద్రత, ప్రాదేశిక సమగ్రత, జన సమైక్యత, వాణిజ్యం, వ్యవసాయం, ఆచారం, వ్యవహారం, విద్య, విజ్ఞానం, విచక్షణ, ఆలోచన, ఆలోకన-ఇలాంటి వన్నీ మాతృదేశ భౌతిక స్వరూపంలో భాగమన్న ధ్యాస సాంస్కృతిక స్వభావంలో అవిభాద్యమన్న తెలివి స్వాతంత్య్రానికి ప్రతీకలు. ఈ ధ్యాస, ఈ తెలివి లోపించడం బానిసత్వం. భారతీయులు బానిసత్వంలో మగ్గడానికి కారణం భారతీయులేనన్నది గతం. వర్తమానం గతానికి పునరావృత్తి అవుతోంది. గంధారంలోకి, సింధులోకి విదేశీయులు చొరబడినప్పుడు మాళవ ప్రాంతం పట్టించుకోలేదు. మగధ పట్టించుకోలేదు. ఫలితంగా విదేశీయులు మొత్తం దేశాన్ని కబళించారు. ఇది క్రీస్తుశకం 1947 వరకు సాగిన రెండు సహస్రాబ్దుల గతం. వర్తమానంలో కూడ ఇదే కథ నడుస్తోంది. చైనా మన సరిహద్దుల వీపును గాయపరచింది. రక్తసిక్తమై విలపిస్తున్న ఈ శరీర భాగాన్ని మిగిలిన భాగాలు పట్టించుకోవడం లేదు. గాయపడిన వీపును వాణిజ్యం పట్టించుకోవడం లేదు. చైనా పెట్టుబడులను బొక్కాలనుకుంటున్న నోళ్లు పట్టించుకోవడం లేదు. చంద్రబాబునాయుడు అమరావతిలో ఏర్పాటు చేయతలపెట్టిన, చైనీస్ ఫాస్ట్ఫుడ్ సెంటర్ ఇదీ...
పెట్టుబడి దారీ-క్యాపిటలిస్ట్-వ్యవస్థ కథాకథిత-సోకాల్డ్- సామ్యవాద-కమ్యూనిస్ట్-వ్యవస్థ రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాలు. కేంద్రీకరణ ఈ రెండింటికీ సామాన్య స్వభావం. రాజకీయ, ఆర్థిక, అధికార కేంద్రీకరణ రెండు వ్యవస్థలలోను సమానం. పెట్టుబడిదారులు వినియోగదారులను దోపిడీ చేయడం క్యాపిటలిజం. పాలకులు పాలితులను దోపిడీ చేయడం కమ్యూనిజం. ఇదీ భారతదేశం వెలుపలి ప్రాంతాల చరిత్ర నిరూపించిన నిజం. అందుకే అనాదిగా భారతదేశంలో క్యాపిటలిజం కాని, కమ్యూనిజం కాని లేదు. రాజకీయ, ఆర్థిక అధికారం వికేంద్రీకృతమైన మానవీయ వ్యవస్థ భారతదేశంలో నెలకొని ఉండేది. విదేశీయులు ఈ మానవీయ వ్యవస్థను ధ్వంసం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థను భారత్ నెత్తికెత్తిపోయారు. పెట్టుబడిదారీ వ్యవస్థను తొలగించి, విదేశీయ దురాక్రమణకుపూర్వం ఉండిన మానవీయ వ్యవస్థను, వికేంద్రీకృత స్వజాతీయ వ్యవస్థను పునరుద్ధరించడం స్వాతంత్య్రానికి చిహ్నం. కానీ ఈ పునరుద్ధరణ జరుగకుండా నిరోధించడానికి కమ్యూనిస్టులు విఫల ప్రయత్న పరంపరను కొనసాగించారు. అలా కొనసాగించిన సమయంలో చైనా ఇక్కడ చేతులు ఏర్పడినాయి. యెల్దండ వారు వివరించినట్టు చైనాకు చేతులు ఏర్పడిన చోటల్లా రష్యాకు రంగం ఏర్పడడం 1950 నుండి 1990 వరకు నడిచిన కథ. ఎందుకంటె చైనా, రష్యాలు అప్పుడు ప్రపంచ కమ్యూనిస్టుల పాలిట భూతల స్వర్గాలు.. ఈ భూతల స్వర్గాలు నిజానికి వికృతమైన భూతాలకు దుర్గాలు.. అందువల్లనే రష్యాలో 1991లో జనం తిరగబడి కమ్యూనిస్టు సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. చైనా పాలకులు కమ్యూనిస్టు ఆర్థిక సిద్ధాంతాన్ని వదిలించుకొని క్యాపిటలిస్ట్ వ్యవస్థగా తమ దేశాన్ని తీర్చిదిద్దారు.కమ్యూనిస్టు నియంతృత్వం పెట్టుబడిదారుల నియంతృత్వంగా రూపొందడం నవ చైనా కథలో వర్తమాన ఘట్టం. ఇదంతా ప్రపంచీకరణ ప్రభావం. మార్కెట్ ఎకానమీ-స్వేచ్ఛా విపణి- పేరుతో అంతర్జాతీయమైన పెట్టుబడిదారీ వ్యవస్థ ఏర్పడుతోంది. ఇదే ప్రపంచీకరణ...
గతంలో వలెనే ప్రస్తుతం కూడ చైనాకు చేతులు ఏర్పడిన చోటల్లా రష్యాకు రంగం ఏర్పడిపోవాలన్నది చంద్రబాబు వంటి వారికి స్ఫురించిన సహజ న్యాయం...అందువల్లనే అమరావతిలో చైనా పెట్టుబడుల చేతులను ఏర్పాటు చేసిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇటీవల రష్యాకు కూడ వెళ్లి వచ్చారు. అమరావతిలో రష్యాకు రంగం ఏర్పడడానికి రంగం సిద్ధం చేసి వచ్చారు. ఇలా అమరావతి నిర్మాణంలో వివిధ విదేశీయ సంస్థలకు ప్రభుత్వాలకు భాగస్వామ్యం ఏర్పడుతోంది...్భరతీయ సంస్థలకు మాత్రం భాగస్వామ్యం ఉండరాదన్నది అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్ష కావచ్చు...్భరతీయ సంస్థలు నిర్మించే భవనాలు కట్టడాలు మురికివాడల వలె ఉంటాయని ఆయన నిర్ధారించినట్టు, ప్రకటించినట్టు ప్రచారమైంది. అందువల్ల రష్యా రంగస్థలిపై చైనా చేతులతో ఆంధ్రుల నవరాజధానికి రూపకల్పన జరిగిపోవాలన్నది చంద్రబాబు ఆకాంక్ష. అందుకేమరి...ప్రాచీన ధాన్యకటకంతో కాని, విశ్వవిఖ్యాత విజయనగరం తోకాని, శ్రీకాకుళంతోకాని, ఓరుగల్లుతోకాని నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిని సరిపోల్చాలన్న ఊహ ముఖ్యమంత్రి మస్తిష్కంలో ఉదయించనే లేదు. న్యూయార్క్, టోకియో, సింగపూర్, మాస్కో, షాంఘయి, టింబక్టూ వంటి విదేశీయ నగరాలు మాత్రమే ఆయనకు జీవన స్వప్నాలుగా సాక్షాత్కరిస్తున్నాయి. బృహదీశ్వర ఆలయాన్ని, కీర్తి స్తంభాన్ని భారతీయులు నిర్మించడం గతం కావచ్చు. ప్రపంచ చరిత్ర కారులచే ఆదర్శ నగరంగా నిర్ధారితమైన హంపీ విజయనగరం విస్మృత సామ్రాజ్యపు రాజధాని కావచ్చు. ‘అంకురవడం లేదా ‘అంగారవటం’-అంగ్‌కార్‌వట్- వంటి అతిపెద్ద దేవాలయాలను భారతీయులు విదేశాలలో నిర్మించడం చరిత్ర కావచ్చు. కానీ వర్తమానంలో సైతం భారతీయ స్థపతులు, శిల్పులు అద్భుతమైన ప్రాకారాలకు ఆకారాన్ని ఇస్తున్నారు...అమరావతిని భారతీయులు నిర్మించలేదా? విదేశీయుల వ్యూహాత్మక దురాక్రమణకు అమరావతి శాశ్వత రంగస్థలం కావలసిందేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీక మాత్రమే. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ఇలా భారతీయతను కించపరచే రీతిలో సనాతన స్వజాతీయతను భంగపరచే రీతిలో విదేశీయమైన ప్రతి విషయాన్ని మెచ్చుకుంటున్నారు. ఇలా మెచ్చుకోవడం, మురిసిపోవడం సాధారణ జనజీవనంలో అనేక దశాబ్దులుగా భాగమైంది.
భావదాస్య మధువు క్రోలి
స్వభావాన్ని మరచి సోలి
విదేశీయ నాగరికపు
విపరీత సుఖాల తేలి
స్వభూమీయ మతి తప్పిన
స్వజాతీయ స్మృతి తప్పిన
తన సంతతి స్వాతంత్య్రం
వచ్చిందని వదరు చుంటె...
ఏదీ ఎక్కడ ఉందని
వెదకుతున్నదోయ్ భారతి!
విదేశీయమైన వస్తువులు కొంటున్నవారు తాము స్వయంగా ఆయా విదేశాలకు వెళ్లివచ్చినట్టు అనుభూతిని పొందుతున్నారు. అమెరికా వంటి అత్యాధునిక నాగరికత విషయంలో మాత్రం ఇలా కొంటున్నవారు తాము ఆయా నాగరికతకు వారసులమైనట్టు మురిసిపోతున్నారు. అమాయకులైన ఈ మధ్యతరగతి జనాల నెత్తికి ఈ భ్రాంతిని ఎక్కించడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మనదేశానికి వ్యతిరేకంగా జరుపుతున్న కుట్రలో భాగం. ‘‘ఐ లవ్ యు అమెరికా’’ అని ముద్రించి ఉన్న ‘‘లోడింగ్ బడంగ్’’ అంగీలను, చొక్కాలను ధరించిన భారతీయులు వీధులవెంట ఊరేగుతున్నారు.
వాణిజ్యం, సుంకాల సాధారణ ఒప్పందం-గాట్- ప్రపంచీకరణను నెలకొల్పుతుండిన 1990వ దశకంలో గొప్ప ప్రచారం జరిగింది..‘ప్రపంచీకరణ’వల్ల మన దేశం ఉత్పత్తులకు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా ఐరోపా దేశాలలో గొప్ప గిరాకీ పెరిగిపోగలదన్నది గొప్ప ప్రచారానికి ఇతివృత్తం...మన మామిడి పండ్లను ఒక్కొక్కటి రెండో మూడో డాలర్లకు అమ్మేయవచ్చునట-1990వ దశకంలో-ఇప్పుడైతే అదే పండు ఐదారు డాలర్లు పలికేది. మన మామిడి చెట్లకు పురుగుల మందులు కొట్టారన్న కారణంగా అమెరికా మన మామిడిపండ్లను దశాబ్దులపాటు నిషేధించింది. ఆ తరువాత నిషేధం ఎత్తివేసినప్పటికీ, మన మామిడి పండ్లకు బదులు డాలర్లు రాలేదు, అమెరికాలో అమ్ముడుపోని మోటారు సైకిళ్లను మనకు అంటగట్టారు. ఈలోగా అమెరికాలో మొక్కజొన్న కంకి ఖరీదు ఒక డాలర్ అని ప్రచారం జరిగింది. ప్రపంచీకరణ ఫలితంగా సరిహద్దులు చెరిగిపోయాయి కాబట్టి మనదేశపు వీధులలో కుంపట్లపై మొక్కజొన్న కంకులు కాల్చి అమ్మే ముసలమ్మల చెవులలో ఈ గొప్ప ప్రచారం మారుమోగింది. డాలర్ అంటే 1990వ దశకంలో దాదాపు ముప్పయి ఐదు రూపాయలు. వెంటనే మన ముసలమ్మలు కుంపట్లను నెత్తిమీద పెట్టుకొని, కంకులను చంకలోని సంచిలో పెట్టుకొని అమ్ముకోవడానికై అమెరికాకు బయలుదేరారట! బేగంపేట విమానాశ్రయంలోకి వారిని రానివ్వలేదు... ‘వీసా’లు లేవు మరి!
ఇనే్నళ్ల తరువాత అమెరికా మొక్కజొన్న కంకులను మన మోర్, మెగా, ఎక్స్‌ట్రా, వన్స్‌మోర్ వంటి దుకాణాలలో అమ్ముతున్నారు. ‘అమెరికానుండి విమానంలో వచ్చాయట..’ అని కొందరు ఇళ్లకు తెచ్చిన మధ్యతరగతి మహిళలు ఈ మొక్కజొన్న కంకుల గురించి పక్కింటి వారికి వివరిస్తున్నారు. ఈ మార్కెట్లలో యూనిఫారం ధరించి అమ్ముతున్న వారు సైతం ఈ కంకులు అమెరికానుంచి, అమెరికా పొలాలలో పండి, దిగుమతి అయ్యాయని విశ్వసిస్తున్నారు. మనదేశం పొలాలలో పండిన కంకుల కంటె అమెరికా పొలాలలో ఎదిగిన కంకులు గొప్పవన్నది వాణిజ్యపాఠం. అమెరికా, చైనా, పేర్ల పట్ల ఇంత వ్యామోహం మరి. పెంపుడు కుక్కలు సైతం విదేశాలనుంచి దిగుమతి అవుతున్నాయి..
chitram...
‘అమెరికా’ మొక్కజొన్న కంకుల గురించి
ఒక దుకాణంలో పెట్టిన ప్రకటన

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్:9951038352