సంపాదకీయం

సల్మాన్ నిర్దోషిత్వం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ చలనచిత్ర నటుడు సల్మాన్ ఖాన్ నల్ల జింకను హత్య చేసినట్టు నిరూపించడానికి తగినన్ని ఆధారాలు లేవన్నది రాజస్థాన్ ఉన్నత న్యాయస్థానం సోమవారం చెప్పిన తీర్పు. నల్లజింకలను ఆయన హత్యచేసినట్టు ఆరోపించిన ప్రభుత్వం-పోలీసులు-ప్రాసిక్యూషన్-వారు ఈ అభియోగాన్ని ధ్రువీకరించడానికి మద్దతుగా నివేదించిన సాక్ష్యాధారాలు తీవ్రమైన తక్కువస్థాయి-గ్రాస్ ఇనెడిక్వేట్-లో ఉన్నట్టు నేరం జరిగిన తరువాత పద్ధెనిమిదేళ్లకు రాజస్థాన్ ఉన్నత న్యాయస్థాన ప్రధాన పీఠానికి చెందిన న్యాయమూర్తి నిర్మల జిల్‌కౌర్ నిర్ధారించారు. ఈ ప్రధాన పీఠం జోధ్‌పూర్‌లో ఉంది. నిందితుడు నేరస్థుడని విచక్షణాయుత సందేహాలు లేకుండా -బియాండ్ ఆల్ రీజనబుల్ డవుట్స్-ధ్రువపడితే తప్ప అతగాడిని శిక్షించరాదని నిర్దోషిగా భావించి వదలిపెట్టాలని న్యాయసూత్రాలు నిర్దేశిస్తున్నాయి. ఈ న్యాయ సూత్రాలకు అనుగుణంగానే ‘‘తగినన్ని ఆధారాలు లేవు కాబట్టి’’ సల్మాన్ ఖాన్ నేరంపై హైకోర్టుకు సందేహం ప్రస్ఫుటించింది. సందేహం కొద్దిగా తలెత్తినప్పటికీ ఆ సందేహం లేశం ప్రాతిపదికగా నిందితుడు నిర్దోషిగా ధ్రువపడిపోవడం న్యాయశాస్త్ర సంప్రదాయం. ఎందుకంటె సందేహ ప్రయోజనం-బెనిఫిట్ ఆఫ్ డౌట్- బాధితులకు కాని, ప్రాసిక్యూషన్‌కు కాని చెందరాదని నిందితునికి మాత్రమే ఆ సందేహ ప్రయోజనం దక్కితీరాలని కూడా న్యాయం నిర్దేశిస్తోంది. ఎందుకంటె వందమంది నేరస్థులు నిర్దోషులుగా ఋజువైపోయి శిక్షలు తప్పించుకున్నప్పటికీ న్యాయానికి కలిగే భంగం లేదు, కానీ ఒక్క నిర్దోషి కూడ నేరస్థుడిగా చిత్రీకరణకు గురికారాదు. న్యాయస్థానాలలో దోషిగా నిర్ధారణ అయి శిక్షను పొందరాదు. ఇది కూడ ప్రసిద్ధంగా న్యాయ వ్యవస్థలో ప్రచారం పొందిన సూత్రం. అందువల్ల ఆ ఒక్క నిర్దోషి సల్మాన్ ఖాన్ అని మనం విశ్వసించి తీరాలి. ఎందుకంటె న్యాయస్థానం తీర్పు మనకు శిరోధార్యం. సల్మాన్ ఖాన్‌ను మొదట విచారించిన న్యాయస్థానం ఆ తర్వాత అతగాడి అప్పీలును విన్న న్యాయస్థానం అతగాడు నేరం చేసినట్టు ధ్రువీకరించాయి. అయినప్పటికీ ఉన్నత న్యాయస్థానం ఆయనపై అభియోగాలను రద్దు చేసింది. అందువల్ల సల్మాన్‌ఖాన్ నిర్దోషి. ఉన్నత న్యాయస్థానం తీర్పును సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించవచ్చు, నిరాకరించవచ్చు. అంగీకరించినట్టయితే సల్మాన్‌ఖాన్ నిర్దోషిగా చరిత్ర పుటలలో శాశ్వత స్థానం పొందగలడు. నిరాకరించినట్టయితే మళ్లీ దోషిగా మిగిలిపోతాడు. అయినప్పటికీ ఈ తీర్పునకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు కావాలి కదా. ప్రస్తుతానికి మాత్రం సల్మాన్ ఖాన్ నిర్దోషి.
ఆరెండు నల్ల జింకల-కృష్ణసార మృగాలు-నూ సల్మాన్ ఖాన్ చంపలేదని హైకోర్టు నిర్ధారించింది కాబట్టి చంపిందెవరన్న ప్రశ్న సహజంగానే పరిశీలకులకు కలుగుతుంది. కానీ చట్టాలలో ఇలాంటి ప్రశ్నకు స్థానం లేదు. నిందితుడు నేరస్థుడా కాదా అని తేల్చడం వరకే బ్రిటన్ వారు మనకు ప్రసాదించి వెళ్లిన చట్టాల పని. అంతే కాని నిందితుడు నేరస్థుడు కాకపోయినట్టయితే మరి నేరం చేసినవాడు ఎవరు? అన్న ప్రశ్న పుట్టనే పుట్టదు. పుట్టినప్పటికీ ‘‘్ఫలానా నేరాన్ని ఫలానా సమయంలోపలనే పరిశోధించాలి’’ అన్న నిబంధనలున్నాయి. అందువల్ల గడువు -లిమిటేషన్-ముగిసేలోగానే పరిశోధన ఆరంభం కావాలి. అనేకానేక నేరాల విషయంలో దర్యాప్తు పూర్తయిన తరువాత ఒకరిపైన కాని అనేకమందికి వ్యతిరేకంగా గాని అభియోగాలను ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానాలలో దాఖలు చేస్తారు. అన్ని న్యాయస్థానాలలోను-మేజిస్ట్రేటు, సెషన్స్ జడ్జి కోర్టులు మొదలు సుప్రీంకోర్టు వరకు-విచారణ వాద ప్రతివాదాలు ముగిసే సరికి కనీసం దశాబ్దికాలం గడిచిపోతుంది. ఇంకా ఎక్కువ కాలం పట్టవచ్చు. నిందితుడు నేరస్థుడిగా చిట్టచివరికి ధ్రువపడితే మళ్లీ దర్యాప్తు అక్కరలేదు. కానీ నిందితుడు నిర్దోషిగా నిగ్గు తేలిన తరువాత అసలు నేరస్థుడిని పట్టుకొనేందుకు దర్యాప్తు జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటె గడువు ముగిసిపోయి ఉంటుంది. హత్య తదితర భయంకర నేరాల విషయంలో దర్యాప్తు ఆరంభం కావడానికి గడువులేదు. ఎనే్నళ్ల తరువాతనైనా ఎన్నిసార్లయినా దర్యాప్తులు మొదలు కావచ్చు. హత్యల సమయంలో సైతం ఒక నిందితుడు నిర్దోషిగా నిగ్గు తేలిన తరువాత మరోసారి దర్యాప్తులు జరగడంలేదు. లక్షలలో ఒకసారి జరిగిందేమో? మానవ హత్యలకే దిక్కులేనప్పుడు ఈ నల్ల జింకల అసలు హంతకులను పట్టుకొనడానికి ఎవరు పూనుకుంటారు? అదీ..నేరాలు జరిగి పద్ధెనిమిదేళ్లు జరిగిపోయిన తరువాత!
అందువల్ల రాజస్థాన్ ప్రభుత్వం అత్యంత అపురూపంగా పెంచుకున్న ఆ రెండు కృష్ణసార మృగాలను చంపిందెవరన్న రహస్యం శాశ్వతంగా చరిత్ర పుటలలో సమాధి అయిపోవలసిందే. మనదేశంలో మాత్రమే ఈ నల్లచార జింకలు పుట్టి పెరిగి జీవిస్తున్నాయట. కృష్ణసార మృగం సంచరిచే భూమి కర్మభూమి అని, యజ్ఞ్భూమి అని, పవిత్రమైనదని శుభంకరమైనదని తరతరాల భారతీయుల విశ్వాసం. ఈ విశ్వాసాన్ని విదేశీయ దురాక్రమణ దారులు చెరిచారు. కృష్ణమృగాలను చూసి నోరూరిన బ్రిటన్ వారు, అంతకు పూర్వం మనదేశంలోకి చొరబడిన విదేశీయులు ఈ వన్యప్రాణులను యదేచ్ఛగా చంపి భోంచేసి వెళ్లారు. ఈ విదేశీయ క్రౌర్యం వంటబట్టిన మనదేశం వారు, ప్రధానంగా ప్రముఖులు, ఇలాంటి అపురూప జంతువులను నెమళ్లను ఇతర అపురూప పక్షులను హత్యచేసి ఆరగిస్తున్నారు. జోధ్ ప్రాంతంలోని రక్షిత వనాలలో రెండు నల్ల జింకలను చంపడం ఈ విపరీత భక్షణ ప్రవృత్తిలో భాగం. 1998లో సినిమా చిత్రీకరణ కోసం ఆప్రాంతాలకు వెళ్లిన సల్మాన్ ఖాన్ రెండు వేఱు వేఱు స్థలాలలో ఈ జింకలను కాల్చి చంపాడన్నది ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలు. 1998 సెప్టెంబరు 26వ,27వ తేదీలలో భవాడు గ్రామం సమీపంలో సంచరించిన సల్మాన్‌ఖాన్ ఒక జింకను చంపి తన వాహనంలో వేసుకొని వెళ్లాడట. మళ్లీ 28వ 29వ తేదీలలో మథానియా అన్న చోట మరో జింకను పొట్టన పెట్టుకున్నాడట. పోలీసులు చేసిన ఈ అభియోగాలు మొదటి న్యాయస్థానంలో ధ్రువపడినాయి. జోధ్‌పూర్ నగర ప్రధాన నేర విచారణ న్యాయమూర్తి సల్మాన్‌కు మొదటి అభియోగంలో ఒక సంవత్సరంపాటు, రెండవ అభియోగంలో ఐదేళ్లు కారాగృహ నిర్బంధ శిక్షను విధించారు. ఈ తీర్పులపై సల్మాన్ చేసిన అప్పీళ్లను జిల్లా న్యాయస్థానం తోసిపుచ్చింది. అందువల్ల ఆయన హైకోర్టుకెక్కాడు.
సల్మాన్‌ఖాన్ హైకోర్టు నిర్ధారణ ప్రకారం నిర్దోషి కాబట్టి రాజస్థాన్ పోలీసులు, ప్రభుత్వం వారు పనికట్టుకొని ఆయన్ను ఈ అభియోగాలలో ఇరికించి ఉండాలి. ఇరికించారని ఆయన తరపున వాదించిన న్యాయవాది ఆరోపించాడు కూడ. ఏమయినప్పటికీ ముంబయిలో అర్థరాత్రి తప్పతాగి కారునడిపి గుద్ది ఒక కార్మికుడిని చంపినాడన్న అభియోగం నుండి గత ఏడాది డిసెంబర్‌లో సల్మాన్‌ఖాన్‌ను ముంబయి హైకోర్టు విముక్తుడిని చేసింది. ఈ అభియోగం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. ఇప్పుడు ఈ అభియోగాలు ఇలా రద్దయ్యాయి. 1998 అక్టోబర్‌లో మరో రెండు జింకలను చంపిన అభియోగం కూడ ఖాన్‌పై దాఖలై ఉంది. విచారణ పూర్తి చేయాలట!