సంపాదకీయం

హోదా అసాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయం, అభినయం ఒకే నాణేనికి రెండు ముఖాలన్నది మరోమారు స్పష్టమైంది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిపోతోందని ఆర్భాటం చేస్తున్నవారు, జరుగుతున్న అన్యాయానికి ఇతరులెవరో కారకులని నిర్ధారించడానికి మాత్రమే తీవ్రంగా కృషి చేస్తున్నారు. తాము కారకులు కాదని నవ్యాంధ్ర ప్రజలను నమ్మించడం మాత్రమే వారి లక్ష్యం. అంతేకాని అన్యాయాన్ని తొలగించడానికి న్యాయం చేయడానికి అందరితో కలిసి పనిచేయాలన్న చిత్తశుద్ధి ఆవేదనను అభినయిస్తున్న రాజకీయవేత్తలకు లేదని ప్రజలకెప్పుడో తెలిసిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ ప్రత్యేక తరగతి ప్రతిపత్తి సాధించుకోవాలన్న పట్టుదల ప్రధానంగా ఉండవలసింది రాష్ట్రాన్ని పాలిస్తున్న, రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రికి..కానీ ‘‘ఒకవేళ ప్రత్యేక తరగతి ప్రతిపత్తి ఇవ్వనట్టయితే భారీగా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేయాలని’’ కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గతంలో కోరి ఉన్నారు. అందువల్ల స్టేటస్ కాకపోతే ప్యాకేజీ చాలునన్న స్థాయికి ముఖ్యమంత్రి అప్పుడే బెట్టు సడలించారన్న మాట. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి నవ్యాంధ్రప్రదేశ్ లోకువ అయిపోయింది. ‘ప్రతిపత్తిని ఇచ్చి తీరాలి, ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ఫలనా సమయంలోగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి, లేనట్టయితే..’’ అని అవశేష ఆంధ్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పుడైనా హెచ్చరించిందా? హెచ్చరించిన దాఖలా లేదు. వివిధ- రాజకీయ, ఆర్థిక, సామాజిక-రకాల ప్రత్యేక ప్రతిపత్తులను వివిధ రాష్ట్రాలకు కట్టబెట్టడానికి రాజ్యాంగాన్ని సవరించడం అనివార్యమన్నది ఉమ్మడి రాష్ట్రాన్ని పునర్‌వ్యవస్థీకరించిననాడే తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లు కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిననాడే స్పష్టమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు నవ్యాంధ్రప్రదేశ్‌ను నడుపుతున్న నారావారి ఏకైక కార్యక్రమం రాజధాని నిర్మాణానికి భూమిని సేకరించడం. విదేశీయ సంస్థలను పిలుచుకొని రావడానికై విదేశాలకు వెళ్లి రావడం. కందకులేని దురద కత్తిపీటకు ఎందుకుంటుంది?
ఉద్యమాలు, ఆందోళనలు జరగకుండా లక్ష్యాలు నెరవేరబోవన్నది మనదేశంలోని విచిత్ర వాస్తవం. ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షంవారు ఉద్యమాలు జరపరు. అందువల్ల ప్రజలు పూనుకొని ఉద్యమాలు జరపాలి. ప్రజలు జరిపే ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వాలు నిర్వహ్తిస్తున్నవారు మద్దతునిస్తారన్న విశ్వాసం కూడ లేదు. అందువల్ల ప్రత్యేక తరగతి ప్రతిపత్తికోసం గత రెండేళ్లుగా అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజా ఉద్యమం అంకురించలేదు. ఇతరేతర కోరికల సాధన కోసం గొప్పగా ఉద్యమించిన ప్రాంతీయ రాజకీయవేత్తలకు మొత్తం రాష్ట్ర ప్రజల హితం కోసం ఉద్యమించాలన్న ధ్యాస కలగడంలేదు. సామాజిక వర్గాల ఆకాంక్షలు సాకారం కావడానికి, ప్రాంతీయ ఆకాంక్షలు ప్రత్యేక రాష్ట్రాలుగా వాస్తవం కావడానికి, ఇతరేతర సామాజిక సమస్యల పరిష్కారానికి ప్రజలు ఉద్యమిస్తే కాని ప్రభుత్వ నిర్వాహకులు-అధికార రోగపూరిత బధిరాంధక ప్రవృత్తి నిండిన వారు-కదలరు...అనధికార బిల్లులను ప్రతిపాదించడం వల్ల రాజ్యసభలో వాటిపై చర్చలు జరగడం వల్ల ప్రత్యేక హోదా రావడం అసంభవం. అసంభవమని తెలిసికూడ కాంగ్రెస్‌వారు రాజ్యసభలో అనధికార బిల్లును ప్రతిపాదించడం అభినయ ప్రహసనంలో భాగం మాత్రమే. చర్చ పూర్తికాకుండానే సభ నుంచి వెళ్లిపోయిన వారు ‘‘ఆరంభించి పరిత్యజించినవారు..’’ మరి ‘‘ఆరంభించని’’ వారి సంగతి ఏమిటి? మొత్తం వ్యవహారంలో అసలు ఆరంభించని వారు కేంద్ర ప్రభుత్వ నిర్వాహక ప్రధాన రాజకీయపక్షం వారు.
రాష్ట్ర పునర్‌విభజన తరువాత అవశేషమైన నవ్యాంధ్రప్రదేశ్ ఒట్టిపోయిన ఆవు. దీన్ని మళ్లీ క్షీరప్రదాతగా మార్చగల అవకాశం భారతీయ జనతాపార్టీకి మాత్రమే ఉంది. అన్ని మంచిపనులూ అభివృద్ధి కలాపాలు తన ద్వారానే జరిగిపోతున్నాయన్న ఘనతను, గురుతర బాధ్యతను ‘ఘటోత్కచుని’లా నెత్తికెత్తుకున్న కేంద్రమంత్రి ఎమ్. వెంకయ్యనాయుడు సొంత రాష్ట్రానికి, ఆర్థికంగా దివాలాతీసి ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక తరగతి ప్రతిపత్తిని సాధించి పెట్టడం న్యాయం. రాజ్యాంగంలోని 371వ అధికరణం కింద వివిధ రాష్ట్రాలకు ఇదివరకే ఈ ఆర్థిక పరమైన ప్రతిపత్తిని శాశ్వత ప్రాతిపదికపై కట్టబెట్టి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేవలం పదేళ్లు ఈ ప్రతిపత్తిని ఎందుకని ప్రసాదించలేదు? కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే వచ్చేవారమే లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదాను ప్రసాదించే బిల్లును ప్రతిపాదించవచ్చు. భాజపా అధిష్టానం నిర్ణయిస్తే చాలు. అధికార కూటమికి చెందిన ఉభయ సభల పార్లమెంటు సభ్యులు బిల్లును బల పరుస్తారు. కాంగ్రెస్ పార్టీ బలపరచక తప్పదు. ఈ రెండు పరిణామాలు సంభవించినప్పుడు లోక్‌సభలో రాజ్యాంగ సవరణబిల్లు ఆమోదం పొందడం అసాధ్యం కాదు. అలా జరిగితే రాజ్యసభలో, లోక్‌సభలో సైతం మిగిలిన రాజకీయ పక్షాలను ఒప్పించవచ్చు. అందువల్ల పూనుకోవలసింది భాజపా అధిష్ఠానం. భాజపా అధిష్ఠానంలో కీలక సభ్యుడుగా ఉన్న వెంకయ్యనాయుడు ఈ రెండేళ్లలో ఈ దిశగా కృషి చేశారా? ప్రస్తుత రాజ్యాంగపు నిబంధనల ప్రకారం ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం సాధ్యం కాదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేయడం ఇప్పు డు కొత్త సంగతి కాదు. రద్దయిన ప్రణాళికాసంఘం వారు, నీతి ఆయోగ్‌వారు, కేంద్ర మంత్రులు అనేకసార్లు స్పష్టం చేసి ఉన్నారు. ప్రత్యేక తరగతి హోదా అంత సులభం కాదని ముప్పవరపు వారు సైతం పలుసార్లు స్పష్టం చేసి ఉన్నారు. అందువల్ల రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక తరగతి హోదాను కల్పిస్తారా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది కేంద్ర ప్రభుత్వం. చెప్పించవలసింది వెంకయ్యనాయుడు వంటి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాతీయ నాయకులు..ఆంధ్రలో అడ్రస్ లేని కాంగ్రెస్ వారు కాదు.
ప్రత్యేక తరగతి హోదాను అవశేష ఆంధ్రప్రదేశ్‌కు కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర పునర్ విభజన చట్టంలో చేర్చి ఉంటే సమస్య అప్పుడే పరిష్కారం అయి ఉండేదని వెంకయ్యనాయుడు ఇప్పుడు చెబుతున్నారు. మరి అప్పుడే ఎందుకని చేర్పించలేదు? రాజ్యసభలో పునర్‌విభజన బిల్లు ఆమోదం పొందిన రోజున, క్రీస్తుశకం 2014, ఫిబ్రవరి 20వ తేదీన వెంకయ్య నాయుడి క్రియాశీలత్వంవల్ల మాత్రమే బిల్లు గట్టెక్కిందన్న భావం దృశ్యమాధ్యమాలలో ఆవిష్కృతమైన వాస్తవం. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేయడంతోపాటు, అవశేష ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేవిధంగా భాజపా సవరణలను ప్రతిపాదించింది. ఈ సవరణలకు కాంగ్రెస్ అంగీకరించిన తరువాతనే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. అలాంటప్పుడు నోటిమాటల హామీద్వారా కాక బిల్లులోనే ప్రత్యేక తరగతిని పొందుపరచాలని భాజపా ప్రత్యేకించి వెంకయ్యనాయుడు ఎందుకని పట్టుపట్టలేదు? మళ్లీ లోక్‌సభకు పంపి ఆమోదింపచేసి ఉండవచ్చు. అందువల్ల దివాలా తీసి ఉన్న కాంగ్రెస్‌ను పక్కనపెట్టి న్యాయం చేయడానికి భాజపా ఇప్పుడైనా పూనుకోవాలి..