మెయన్ ఫీచర్

గెలవక తప్పని మల్లన్నసాగర్ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ ప్రభుత్వానికి మల్లన్నసాగర్ గెలవక తప్పని యుద్ధం. ఒకవైపు తెలంగాణ అభివృద్ధికి, మరొకవైపు అభివృద్ధిని ఆటంకపరచే శక్తులను నిలువరించేందుకు అదొక ప్రతీకగా మారిపోయింది. యథాతథంగా కొత్త రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో చేయవలసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని సజావుగా సాగుతుండగా, కొన్ని ప్రతిపక్షాలనుంచి, ఇతర వర్గాలనుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఇదీ సహజం గా జరిగేదే. కాని తెలంగాణ వంటి ప్రాంతానికి సంక్షేమం, పరిశ్రమలు మొదలైన వాటికన్నింటికన్న కీలకమైనది, ప్రాథమికమైనది వ్యవసాయాభివృద్ధి. జనాభాలో ముప్పాతిక మేరగల బలహీన వర్గాలవారు బాగుపడాలంటే వ్యవసాయం, దానితోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వృత్తిపనుల రంగాలు మెరుగుపడాలి. అందుకు ప్రధానమైన ఆధారాలు భూమి, నీరు. ఈ రెండింటి అభివృద్ధి మొదటినుంచి సవ్యంగా జరగనందువల్లనే తెలంగాణ ఇంత వెనుకబడి ఇన్నిన్ని ఉద్యమాలకు కేంద్రమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి వనరులను వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రభుత్వం తలపెట్టిన నీటి పథకాలు అనేకం ఉండగా వాటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది కాళేశ్వరం. ఆ ముఖ్యమైన పథకానికి మల్లన్నసాగర్ జలాశయ నిర్మా ణం ఆయువుపట్టు వంటిది. అందువల్ల దాన్ని నిర్మించితీరవలసిందే. ఒకవేళ నిర్మాణ వ్యవహారం ఒక యుద్ధంగా మారి తే ఆ యుద్ధాన్ని గెలవవలసిందే.
వాస్తవానికి ఇది ఇంత వివాదంగా మారవలసిన అవసరం లేదు. జలాశయం వల్ల కొన్ని గ్రామాలు నీట మునగనుండటం నిజమే అయినా, అది పరిష్కారానికి అతీతమైంది కాదు. జలాశయాలు, ఇతర ప్రాజెక్టులు ఎక్కడ ఎవరు చేపట్టినా కొంత ముంపు తప్పదు. ఇది అందరికీ తెలిసిందే. నిర్వాసితులయ్యే వారికి ఆర్థిక రూపంలో, మానసిక భావనల రూపంలో రెండు విధాలైన సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యను పరిష్కారం, పునరావాసం పద్ధతులతో, ఎంత తీర్చగలిగితే అంత మంచిది. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందనడం నిర్వివాదం. ఈ పరిష్కారం ఎంత బాగా జరిగితే నిర్వాసితుల మనోవేదనా సమస్య అంతగా పరిష్కారమవుతుంది. ఈ విషయమై మన నాయకత్వాలు స్వాతంత్య్రం లభించినప్పటి నుంచి కూడా తగిన శ్రద్ధ వహించలేదన్నది నిజం. ఈ విమర్శకు సోషలిజం అంటూ మాట్లాడిన మొదటి ప్రధాని నెహ్రూ సైతం అతీతులు కాదన్నది గమనించదగిన విషయం. నాగార్జునసాగర్ ఇందుకొక ప్రముఖ ఉదాహరణ. ఉమ్మడి రాష్ట్రంలో ఇందుకు ఉదాహరణలు అనేకం ఉన్నాయి. పరిహారం తక్కువ కావడం, అదికూడా సరిగా అందక నిర్వాసితులు కోర్టులకు వెళ్లడం, కోర్టు తీర్పులు సైతం అమలుకాకపోవడం, పునరావాస పథకాలు అమలుకాని స్థితి, మొత్తం ప్రక్రియలో అవినీతి, నిర్వాసితులలో పలువురు దిక్కుమాలిన వారిగా మారడం వంటి పరిస్థితులపై అధ్యయనాలు చాలానే ఉన్నాయి. ఈ పరిస్థితులు ఎవరిపాలనలో ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటువంటి అనుభవాల దృష్ట్యా మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒకధర, ఒక పునరావాస ప్యాకేజీ అంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. అది 2013 భూసేకరణ చట్టానికన్నా మెరుగైనదని, దాన్ని తూ.చ. తప్పకుండా, అతివేగంగా అమలు పరచగలమని చెబుతున్నది.
దీనిపై భిన్నాభిప్రాయాలకు తప్పక ఆస్కారం ఉంటుంది. పరిహారం, పునరావాసం 123 జి.ఒ. ప్రకారమా, లేక 2013 చట్టం ప్రకారమా, ఈ రెండింటికి అదనంగా మరేమైనా కోరుతూ అడిగే హక్కు నిర్వాసితులకు ఉంటుంది. అది ఎవరూ కాదనలేనిది. అదేవిధంగా, మనది ప్రజాస్వామ్యం అయినందున వారి పక్షాన వాదనలు చేసే హక్కు కూడా ప్రతిపక్షాలకు, ఇతరులకు ఉంటుంది. ఆవిధంగా చర్చలు, లేదా ఆందోళనల ద్వారా ప్రజలకోసం వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని చేకూర్చడంలో ఆక్షేపించవలసిందేమీ ఉండదు. ఇదంతా ప్రజాస్వామిక ప్రక్రియలో భాగమై పాజిటివ్ కార్యక్రమం అవుతుంది. ఒకవేళ మల్లన్న సాగర్ పరిణామాలు ఈ పరిధిలోనే సాగి ఉంటే, విషయానికి యుద్ధ స్వభావం వచ్చి ఉండేది కాదు. ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులు పాజిటివ్ వైఖరితో ఈ పరిధికి పరిమితమై ఉంటే, ప్రభుత్వం కూడా అదేవిధంగా పాజిటివ్‌గా వ్యవహరిస్తున్నాదా లేదా అని సాధారణ ప్రజలు గమనించేవారు. ప్రభుత్వం ఆవిధంగా ఉండకపోతే విమర్శలకు గురయ్యేది. నైతికంగా బలహీనమయ్యేది. ప్రభుత్వ విశ్వసనీయత తగ్గి ప్రతిపక్షాలది పెరిగేది.
కాని గత సుమారు రెండు మాసాల పరిణామాలను పరిశీలించినప్పుడు, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకులలో పలువురు ఈ పాజిటివ్ పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్టు తోస్తున్నది. ఇందులోకి రాజకీయాలతోపాటు వ్యక్తిగత కోణాలు వచ్చి చేరాయి. దానితో నిర్వాసితులకు పరిహారాలు, పునరావాసాలనే చర్చతోపాటు ఇతర ప్రశ్నలు కూడా వారిద్వారా ముందుకొస్తున్నాయి. ఉదాహరణకు అసలు మల్లన్న సాగర్ అవసరమే లేదనడం. ఇటువంటివే మరికొన్ని. అవేమిటో తర్వాత చూద్దాం. సరిగా ఇటువంటి వాదన వల్లనే ఆ వర్గాల ఉద్దేశాలు నిర్వాసితుల క్షేమానికి పరిమితమైనవి కావని, వారికి రాజకీయమైన, వ్యక్తిగతమైన అజెండాలు ఉన్నాయనే సందేహాలు బలంగా కలుగుతున్నాయి. మల్లన్నసాగర్ వద్దనడం ఒకవేళ తర్కబద్ధమైన సాంకేతిక కారణాలపై జరుగతున్నదయితే దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ తార్కికతతో ఏకీభవించకపోయినా కనీసం ఆ వాదం వెనుక దురుద్దేశాలు లేవని భావించవచ్చు. కాని ఆ జలాశయం అసలు వద్దేవద్దని వీరు చెబుతున్న వాదనలలో అటువంటి తార్కికత అయినా కన్పించడం లేదు. కనుకనే మల్లన్నసాగర్ కావాలని ఒకసారి, వద్దని మరోసారి, పరిమాణం తగ్గించాలని ఇంకొకసారి, అందుకు ప్రత్యామ్నాయం ఇదని ఒకసారి, కాదు అదని మరోసారి ఒక స్థిరత్వం లేకుండా మాట్లాతున్నారు. కొం దరు నిన్న ఒకమాట, నేడు మరొక మాట చెబుతున్నారు. ఎప్పుడు చెప్పిన ఏ మాటకు కూడా తగిన వివరణ ఇవ్వలేకపోతున్నారు.
మనసులో ఉన్నది నిర్వాసితుల సంక్షే మం, రాష్ట్ర అభివృద్ధి కాకుండా స్వప్రయోజనాలు అయినప్పుడు ఇంతే జరుగుతుంది. కనుకనే పైన అనుకున్నట్లు మల్లన్న సాగర్ అసలు వద్దేవద్దనడంతోపాటు, అందుకు ప్రత్యామ్నాయంగా ఆచరణలో ఉపయోగించలేనివి కొన్ని చెబుతున్నారు. నీళ్లను పైపుల ద్వారా ఇవ్వండి, హర్యానాలో వలె లిఫ్ట్‌లు ఏర్పాటు చేయండి, మల్లన్నసాగర్ నీటి నిలువ సామర్ధ్యం 50 టిఎంసిలు గాక రెండో మూడో ఉంటే సరిపోతుంది అనడం వాటిల్లో కొన్ని. గోదావరిలో నీరులేని మాసాల్లో, లేదా వర్షాలు కురియని సంవత్సరాల్లో పైపులు ఏం పనిచేస్తాయి? లిఫ్టులవల్ల ఉపయోగం ఏమిటి? రెండు మూడు టిఎంసిల నీటితో ఎన్ని భూములకు నీరివ్వగలరు? ఇచ్చినచోటనైనా ఒక పంటకు మించి ఇవ్వవచ్చునా? ఇటువంటి ప్రశ్నలతో ప్రతిపక్షాలకు నిమిత్తం లేదు.
అందువల్ల వారు చేస్తున్నదంతా ఏదో ఒకవిధంగా మల్లన్నసాగర్‌ను ఆపుచేయించడం, ఆవిధంగా మొత్తం కాళేశ్వరం పథకాన్ని భంగపరచడం. ఇది తప్పకుండా యుద్ధస్థితి అవుతుంది. అటువంటప్పుడు అందుకు తగిన నీతినే ప్రభుత్వం కూడ అనుసరించవలసి ఉంటుంది. ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దృష్టి మల్లన్నసాగర్‌కు పరిమితమై లేదన్నది గమనార్హమైన మరొక విషయం. ఒకవైపు అక్కడి తమ ఆందోళన ఇంకా ముగియక ముందే అదే తరహాలో తమకు కలిసిరాగల అంశాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా అని అనే్వషించడం ఆరంభించారు వారు. ఒకరోజు పాలమూరు ఎత్తిపోతలను వివాదం చేసి, మరొకరోజు కొడంగల్‌పై దృష్టి సారించారు. మరొకరేమో ఇంకొకదాని ఎత్తు తగ్గించాలంటే, మరొకరు ఎప్పుడో పదిహేను సంవత్సరాలనాడు హైకోర్టు ద్వారా అవార్డు అయిపోయి న పథకంకింద భూములు కోల్పోయిన వారికి ఇప్పుడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం 2013 చట్ట ప్రకారం పరిహారాన్ని పెంచి ఇవ్వాలంటారు.
ఈరోజున మల్లన్న సాగర్ ఒక పరీక్ష అన్నమాట. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రజలను మెప్పించి తమ బలాన్ని పెంచుకోలేమని తేల్చుకున్నట్లున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలను మరిచినా, ఆ తర్వాత ఇతర ఎన్నికలు, ఉప ఎన్నికలలో అంతకు మించిన భంగపాటు ఎదురైన తర్వాత వారికి ఇక దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దాంతో మరొక విధమైన యుద్ధనీతిని ఎంచుకున్నారనుకోవాలి. సహేతుకం అయి నా లేక నిర్హేతుకం అయినాసరే ప్రభుత్వ పథకాలకు అడుగడుగునా అడ్డుపడాలి. కదలని మెదలని పరిస్థితిని సృష్టించాలి. ప్రభుత్వానికి ఇప్పటికే దాదాపు సగకాలం గడిచినందున మిగిలిన కాలంలో ఇదేవిధంగా సతమతం చేసినట్లయితే అపుడు 2019లో ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందనే ప్రచారం చేయవచ్చు. ఇటువంటి పరిస్థితుల సృష్టి వల్ల తెలంగాణ అభివృద్ధి కుంటుపడితే వారికి కలిగే నష్టమేమీ లేదు. సరికదా రాజకీయంగా లాభం ఉంటుందని వారు భ్రమపడుతున్నారు.
సూటిగా చెప్పాలంటే ఇది తెలంగాణకు హాని చేసే దుష్టనీతి. ప్రజలు ఒక పార్టీకి అధికారం అప్పగించారంటే సాధారణమైన అర్థంలో అభివృద్ధిని సాధించాలని చెప్పడమే కాదు. అందుకు అడ్డురాగల శక్తులను నిలువరించాలని ఆదేశించడం కూడా అవుతుంది. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకన్న ప్రజలు తామెన్నుకున్న మొదటి ప్రభుత్వానికి అటువంటి ఆదేశం కూడా ఇచ్చినట్లు భావించవలసి ఉంటుంది. మల్లన్నసాగర్ రూపంలో ఎదురవుతున్న అటువంటి మొదటి పరీక్షను, యుద్ధాన్ని ప్రభుత్వం గెలవక తప్పదు. అదే తెలంగాణ ప్రజలకు, అభివృద్ధిని, భవిష్యత్తుకు సంబంధించిన భరోసా ఇస్తుంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)