మెయన్ ఫీచర్

నమ్మించారన్నదే అతిపెద్ద సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కన్నా, ఇస్తామని నమ్మించి ఇవ్వడం లేదన్నది ప్రజల మనస్సులను ఎక్కువ గాయపరుస్తున్నది. సాధారణ జీవితంలోనైనా ఇంతే. ఇతరులు మనకు నష్టం కలిగించడం వల్ల కలిగే బాధకన్నా, నమ్మించి ద్రోహం చేయడం ఎ క్కువ బాధపెడుతుంది. అది మోసం వం టిది. నమ్మి మోసపోవడాన్ని మనిషి త్వరగా మరిచిపోలేడు.
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ వాసులకు మిణుకు మిణుకుమనే ఆశలు ఏవైనా ఇంకా మిగిలి ఉంటే, గతవారం రాజ్యసభలో జరిగిన దానితో ముగిసిపోయి ఉంటాయి. వాస్తవానికి హోదా సాధ్యంకాదని చాలామందికి కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు ప్రైవేటు బిల్లుకన్నా ముందే అర్థమై ఉండాలి. బిల్లు, దానిపై చర్చ, సభానాయకుడైన ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం. తర్వాత ఇక్కడ చంద్రబాబు మంత్రివర్గం వ్యాఖ్యలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ బంద్ పిలుపు, ఆ సందర్భంగా కాంగ్రెస్, వామపక్షాల హడావుడి అంతా కూడా కేవలం రాజకీయం. హోదా రాబోదని వీరందరికీ తెలుసు. కాని అట్లా రాకపోవటాన్ని ఉపయోగించుకొని రాజకీయ లబ్ది పొందాలన్నది ప్రతిపక్షాల ఆలోచన కాగా, ఆ నష్టాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు టిడిపి, బిజెపిలు ప్రయత్నించాయి.
హోదా ఎట్లాగూ రాదు గనుక తగినంత ఆర్థిక సహాయాన్ని సంపాదించగలిగితే గుడ్డిలో మెల్లలా ఉంటుందన్నది ప్రస్తుతం టిడిపి-బిజెపి మిత్ర కూటమి ఆలోచన అయినట్లు కనిపిస్తున్నది. సహాయం ఎట్లా చేయా లో చర్చిస్తున్నామని జైట్లీ ఒకటికి రెండు సార్లు అన్నందున అటువంటి ఆశలు కొంత కలుగుతున్నాయి. అదేసమయంలో, అటువంటిది వాస్తవంగా జరినప్పుడు గాని, దాని పరిణామం ఎంతో తెలిసిన మీదట గాని ఏమీ మాట్లాడలేము. ఎందుకంటే, బిల్లుపై చర్చలకు ఇచ్చిన సమాధానంలో ఆర్థికమంత్రి కొన్ని గమనించదగ్గ మాటలు చెప్పారు. కేంద్ర ఆదాయంలో 42 శాతాన్ని 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు అందజేస్తున్నందున కేంద్రం వద్ద ఎక్కువగా సొమ్ము మిగలడంలేదు. తమ వాటి 58 శాతంలో వివిధ రంగాలకు ఖర్చు చేయడం గాక, రాష్ట్రాలలో అమలయ్యే కేం ద్ర పథకాలపై పెద్ద మొత్తాలు వెచ్చించాల్సి వస్తున్నది. ఆవిధంగా రాష్ట్రాలకు లభిస్తున్నది 42 శాతానికి మించుతున్నది. రక్షణ, కమ్యూనికేషన్లు, సిబ్బంది జీత భత్యాలు, ఆయా అత్యవసర వ్యయాలుగాక మార్కెట్ రుణాల తిరిగి చెల్లింపులు భారమవుతున్నాయి. వీటన్నింటివల్ల కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పుచేయవలసి వస్తున్నది. ఇదంతా ఒకటి కాగా, ఆర్థికమంత్రి సభ దృష్టికి తెచ్చిన విషయం మరొకటి ఉన్నది. కేవలం టిడిపి తమ మిత్రపక్షం అయినందున నిబంధనలను విస్మరించి అదనపు నిధులు కేటాయించడం తేలిక కాదు. అప్పుడు వెంటనే తక్కిన రాష్ట్రాలు మామాట ఏమిటని నిలదీస్తాయి.
జైట్లీ మాటలు ఆంధ్రప్రదేశ్ పట్ల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు చెప్పిన స్వంత కష్టాలు అయినట్లు తోచవచ్చునుగాని, ప్రశాంతంగా ఆలోచిస్తే అందులోని వాస్తవం అర్థంకాకపోదు. దేశ ఆర్థిక స్థితి ఇటీవలి సంవత్సరాలలో పెద్దగా పుంజుకున్నది లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థికరంగాన్ని వీలైనంత సరళీకరించడం, మేక్ ఇన్ ఇండియా వంటి ఆకర్షణీయమైన నినాదాలివ్వడం, దేశదేశాలకు కాలికి బలపం కట్టుకున్నట్లు తిరగడం బాగానే చేస్తున్నారు గాని విదేశీ పెట్టుబడుల రాక పెద్ద ఆశావహంగా లేదు. దేశీయ ఉత్పత్తి రంగం, ఎగుమతులు పుంజుకుంటున్నదీ లేదు. దాని అర్థం కేంద్రం వద్ద సొమ్ము పోగుపడటం లేదన్న మాట. చమురు ధరలు గణనీయంగా తగ్గడం కొంత వెసులుబాటునిచ్చినా, చమురు దేశాల ఆర్థిక స్థితి దెబ్బతింటున్నందున అక్కడ పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు ఇంటిముఖం పట్టే ప్రమాదం భయపెడుతున్నది. విదేశాలలోని నల్లధనాన్ని వెనుకకు, స్వదేశంలోని నల్లధనాన్ని బయటకు తెప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలితాలనివ్వడంలేదు. విషయం ఏమంటే, ఈ పరిస్థితులన్నింటి మధ్య ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయం అనేది ఒకవేళ నిజంగా ప్రకటించినా, దాని పరిణామం ఎంతుండవచ్చునన్నది సందేహాస్పదమే. జవాబు సమయంలోనే జైట్లీ ముఖకవళికలలో చాలా కనిపించింది. దానినట్లుంచితే, ప్రత్యేక ప్యాకేజీలు అనే మాట విన్పించినప్పుడల్లా గత ప్యాకేజీల చరిత్ర గుర్తుకు వస్తుంది. లోగడ జమ్మూ-కశ్మీర్, బిహార్, ఈశాన్య భారతం వంటి ప్రాంతాలకు ఇటువంటి ప్యాకేజీ ప్రకటనల గురించి తెలిసిందే. ఆ ప్యాకేజీ మూటలు విప్పిచూసినప్పుడు, ఆ కొండనంతా తవ్వగా దొరికినవి ఎలుకపిల్లలు మాత్రమే అయ్యాయి. అప్పటికే పలు సంవత్సరాలుగా అమలు పరుస్తున్న పథకాల అంచనా వ్యయాల గురించి మొదలుకొని ఇంకా కేటాయింపులే జరగక భవిష్యత్తులో పరిశీలించగల వాటివరకు అన్నీ ఆ పురిటి మాటల్లో బయటపడ్డాయి. ప్రతి రాష్ట్రం విషయంలో ప్రతిసారి ఇదే జరుగుతూ వస్తున్నది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఒక ప్యాకేజీ అంటూ వస్తే అది ఈ ప్రహసనాలకు ఎంత భిన్నంగా ఉండగలదన్నది కళ్లు విప్పార్చుకొని చూడవలసిందే. సమస్య ఏమిటంటే, కేంద్రంవద్ద నిజంగానే అంతంత అదనపు నిధులు లేవు. ఉన్నా ఉదారంగా ఏదో ఒక రాష్ట్రానికి ఇచ్చేందుకు రాజకీయంగా కాని, పరిపాలనా పరంగా కాని వెసులుబాట్లు లేవు.
పోనీ ఇప్పటికే ఇచ్చిన ఒకటి రెండు పన్ను రాయితీల వంటివి మరిన్ని ఇవ్వగలిగినా ఉపయోగకరంగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి అది ఆకర్షణీయమవుతుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేతికి రాగల రెవెన్యూ లేకపోయినా దేశ విదేశాల నుంచి పరిశ్రమలు, వ్యాపారాల రాకకు అనువుగా మారుతుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి, విశాఖపట్టణానికి, తూర్పుతీర ప్రాంతానికి పెట్టుబడులను రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మనం వింటున్నదాన్ని బట్టి ఆ పెట్టుబడిదారులంతా ఆయనకు హామీలు చాలానే ఇస్తున్నారుగాని, పన్నుల పరంగా కేంద్రం ప్రకటించగల ప్రత్యేక రాయితీలు ఏమైనా ఉండగలవా అని వేచిచూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇవ్వజూపుతున్నవి కొన్ని ఉన్నాయికాని, వారికి అవి ఇంకా అయస్కాంతంగా మారుతున్నట్లు లేవు. అందువల్ల, ఒకవేళ కేంద్రం భారీ నిధులు ఇవ్వలేకపోయినా పన్ను రాయితీలు మరిన్ని ప్రకటించడం, తన దేశవ్యాప్త వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ అవకాశాలివ్వడం వంటివి చేయగలిగితే అందువల్ల నికర ప్రయోజనాలుంటాయి. కాని ఇందులో వౌలిక సదుపాయాల కల్పనకు కాకున్నా, పన్ను రాయితీలు మంజూరీకి పెద్ద సమస్య ఇతర రాష్ట్రాల నుంచి ఎదురవుతుంది. కేంద్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు రెండు విధాలైన పన్ను రాయితీలు ఇచ్చినట్టు తన సమాధానంలో పేర్కొన్న జైట్లీ, అటువంటిది ఒక పరిమితికి మించితే తమవద్దగల పరిశ్రమలు, వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోగవలనే ఫిర్యాదు ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలనుంచి వస్తున్నట్లు చెప్పారు. ఇది సమసిపోయేది కానందున అటువంటి రాయితీలకు ఎక్కువ అవకాశం కల్పించారు. ఇది ఒకవిధంగా ప్రత్యేక హోదా వంటి సమస్య. హోదాను ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే తమకూ ఇవ్వాలంటూ ఇతరులు పట్టుబట్టడం వంటిది. కనుక రెండూ కుదిరేవి కావు. అసలు హోదా విధానానే్న కేంద్రం ఇప్పుడు ఉపసంహరించుకుందన్నది వేరే విషయం. కనుక, ప్రత్యేక నిధులు అన్నది సొమ్ము రూపంలో ఉంటే, ఎంతమొత్తంలో, ఎంతకాలంలో అన్నవి గమనించదగినవవుతాయి.
రాజకీయంగా ఎవరెంత హడావిడి చేసినా, ప్రత్యేక హోదా మాత్రం ఇక వీలుపడనిదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించవలసి ఉంటుంది. ఈ నిర్ణయం కేవలం ఆంధ్రప్రదేశ్‌ను దృష్టిలో ఉంచుకొని జరిగింది కాదు. ఆంధ్రప్రదేశ్ కోసమని దానినిపుడు తిరగతోడటమూ సాధ్యమయ్యేది కాదు. ఎందువల్ల అనే ప్రశ్నపై కేంద్రం ఇప్పటికే వేర్వేరు సందర్భాల్లో చాలా వివరణలు ఇచ్చింది. రామచంద్రరావు బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని పార్టీల మద్దతునిచ్చాయని ఆంధ్రప్రదేశ్ పార్టీలు ఎంతైనా గుర్తు చేయవచ్చు. కాని అందులోని మర్మం తెలియనిది కాదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తే, ఆ వెంటనే ఇక తమకూ ఇవ్వాలంటూ కేంద్రాన్ని నిలదీసే అవకాశం లభిస్తుందనేది ఇతర రాష్ట్రాల పార్టీల ఎత్తుగడ. అంతేతప్ప, ఆసాధారణమైన రీతిలో లంచ్ అవర్ తర్వాత కూడా, రాత్రి అయినప్పటికీ ఓపికగా సభలో ఉం డేందుకు వారికి ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు. హోదా సాధ్యంకానిదంటూ ఇతరత్రా కూడా వ్యాఖ్యలు చాలానే వెలువడ్డాయి. అందువల్ల, ఈ పరిమితుల మధ్య వీలైనంత సాధించుకోవడం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ పార్టీలు చేయగలిగింది. అవి ఇతరులకు ఎంత అవసరమో అధికార పార్టీ అయిన టిడిపికి, దాని మిత్రపక్షమైన బిజెపికి కూడా అంతే అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి ప్రత్యామ్నాయంగా ఎదగ గోరుతున్న బిజెపికి ఇంకొంత ఎక్కువ అవసరం కావచ్చు.
మరొకవైపు రాష్ట్రంలో, ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా లబ్దిపొందేందుకు పోటాపోటీలు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సీపీ, వామపక్షాల మధ్య మొదలయ్యాయి. ఆ నష్టం నుంచి ఆత్మరక్షణకు టిడిపి, బిజెపి శ్రమపడుతున్నాయి. ఇరువురి మద్య హతాశులయ్యే స్థితి సాధారణ ప్రజలది. ఈ మొత్తం ఉదంతం కేవలం ఒక క్షణంపాటు తమను భ్రమ పెట్టిన రంగుల గాలిబుడగ అని కనీసం వారిలోని విజ్ఞులు గ్రహించకపోరు. హోదా కథ మొత్తాన్ని 2014 ఎన్నికల నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నిర్విరామంగా సమీక్షించుకుంటే, చివరకు రాజకీయ పార్టీలు బాగానే ఉండటం, సాధారణ ప్రజలు మాత్రం అడుగడుగునా ఆశపడి భంగపాటుకు గురికావడం కనిపిస్తున్నది. ఇందులోని పూర్తి రాజకీయం సామాన్యులలో ఎందరికి అర్థమయేది చెప్పలేము. వారికి సంబంధించినంతవరకు బహుశా హోదా రాకపోవడం కన్నా నమ్మించి వట్టిచేయి చూపడం ఎక్కువ బాధాకరం అవుతుండవచ్చునేమో.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)