సంపాదకీయం

స్వాతంత్య్ర సంస్కారం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం జాతీయ జీవన స్వభావం. బానిసత్వం ఈ జీవన స్వభావాన్ని దిగమింగే గ్రహణం. స్వాతంత్య్రం కోల్పోయిన జాతి రాహుగ్రస్తమైన సూర్యుని వంటిది. స్వాతం త్య్రం వెలుగు, బానిసత్వం, చీకటి ‘‘్భయంకర ఖేద తమాల వాటిక..!’’ స్వాతంత్య్రం కోల్పోయిన సనాతన భరతజాతి మళ్లీ స్వతంత్రం పొందడానికి శతాబ్దుల పాటు పోరాటం జరిపింది. సంఘర్షణ సాగించింది. ఈ శతాబ్దుల సంఘర్షణలో చివరి ఘట్టం బ్రిటన్‌తో జరిగిన పోరాటం. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది ప్రారంభంలో బిచ్చగాళ్ల వలె మనదేశానికి వచ్చిన బ్రిటన్‌వాసులు వ్యాపారులై, దోపిడీదారులై వంచన క్రీడ సాగించారు. పద్ధెనిమిదవ శతాబ్ది నడికొనేనాటికి మన దేశాన్ని మొత్తం బ్రిటన్ కబళించింది. దాదాపు రెండు వందల ఏళ్ల పాటు మనదేశ ప్రజలను సాంస్కృతిక, రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక బీభత్సకాండకు బలిచేసింది. మనదేశం మళ్లీ రాజకీయ స్వాతంత్య్రాన్ని పొంది అరవై తొమ్మిదేళ్లయింది. రాజకీయ స్వాతం త్య్రం, సాంస్కృతిక స్వాతంత్య్రం మన సనాతన జాతీయ ప్రస్థాన రథానికి రెండు చక్రాలు. రాజకీయ స్వాతంత్య్రం ప్రగతి, సాంస్కృతిక స్వాతంత్య్రం సుగతి. శతాబ్దులపాటు రాజకీయ స్వాతంత్య్రం కోల్పోయిన భరతజాతి దాన్ని మళ్లీ సాధించుకొనడానికి జరిపిన సంఘర్షణ నేడు చారిత్రక స్మృతి. ఇలా రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించుకున్న జాతి సాంస్కృతిక స్వాతంత్య్రాన్ని సైతం పునరుద్ధరించుకొనడానికి జరుపుతున్న సంఘర్షణ అరవైతొమ్మిదేళ్ల చరిత్ర. ఈ చారిత్రక సంఘర్షణ నేడు డెబ్బయవ ఏట అడుగుపెట్టింది. అందువల్ల ఈ స్వాతంత్య్ర ప్రస్థాన క్రమా న్ని సమీక్షించుకోవడం సహ జం. వైయక్తిక జీవనంలో డెబ్బయి ఏళ్ల సుదీర్ఘకాల ఖండం. కానీ యుగాలుగా కొనసాగుతున్న భారత జాతీ య జీవనంలో ఏడు దశాబ్దుల సమయం అనంతమైన సాగరంలోని చిన్న జలకణం... అయినప్పటికీ మన నడక మన నడత మన జాతి వౌలిక స్వభావానికి అనుగుణంగా ఉన్నదా అన్నది సమీక్షకు ఇతివృత్తం..
క్రీస్తుశకం 1947, అగస్టు 14వ, 15వ తేదీల మధ్యరాత్రి బ్రిటన్ దురాక్రమణదారులు మనదేశం నుండి నిష్క్రమించవలసి వచ్చిన నాటికి మనదేశం వట్టిపోయిన ఆవు...బ్రిటన్‌వారు, అంతకుపూర్వ, బుడతకీచులు-పోర్చుగీసువారు- ప్రాంచీలు-ఫ్రాన్స్ దేశీయులు, పరంగీలు-డచ్ జాతీయులు-వంటి ఐరోపా దుండగులు ‘‘పయోధరీ భూత గోరూపమైన’’ భారత ధరణిని పితికేశారు. మహాకవి చిలకమర్తి లక్ష్మీనరసింహం వర్ణించినట్టు ‘‘హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ’’, ‘‘మూతులు బిగియకట్టి’’ ఆవును పితికి పాలను ఐరోపాకు తరలించారు. అంతకుపూర్వం కూడ తురుష్కులు, అరబ్బులు, శకులు, యవనులు, హూణులు, గ్రీకులు వంటి దొంగలు పైశాచిక జాతులవారు భరతఖండంబు అనే చక్కటి పాడి ఆవును పితికి పితికి స్వజాతీయులకు చుక్క దక్కకుండా పాలను దోచుకున్నారు. ఈ పాలు తరతరాల భారతీయ సముత్కర్ష సంపద. అలా ఒట్టిపోయిన ఆవును మళ్లీ కామధేనువుగా మార్చడానికి మనం జరిపిన కృషి విజయవంతం కావడం ఈ ఏడు దశాబ్దుల సముజ్వల దృశ్యం. మనదేశాన్ని దోచుకుపోయిన గజదొంగల వద్ద పంచదార, పాలపొడి, బియ్యం, గోధుమలు వంటి పదార్థాలకోసం చేయి చాచవలసిన దుస్థితి స్వాతంత్య్ర అవతరణకు నేపథ్యం...్భరత్ మళ్లీ అన్నపూర్ణగా పూర్వరూపాన్ని సంతరించుకొంది. అహార సమృద్ధిని సాధించడమే కాక ఇతర దేశాలకు సైతం సమకూర్చగల స్థాయికి ఎదిగింది.. ఈ ఎదుగుదల తరతరాల భారత జాతీయ స్వభావ నిహితమైన ప్రగతిశీలం...‘‘ఆకలితో అలమటిస్తున్న జాతి అవనిని శాసించడానికి యత్నిస్తుండడం హాస్యాస్పదం..’’ అని 1974లో మనం అణుపాటవ పరీక్షలు జరిపినప్పుడు అమెరికా పత్రికలు యద్దేవా చేశాయి. 1998లో మరోసారి మనం అణుపాటవ పరీక్షలు జరిపిన నాటికి అపహాస్యం చేసిన వారి ముఖాలపై భయం తాండవించింది. 1998 నాటి భారత్ మళ్లీ అన్నపూర్ణ, కామధేనువు. ఈ ఇరవై ఏళ్లలో భారతీయుల భౌతిక సంపద ఇబ్బడి ముబ్బడిగా విస్తరించింది. బహుళ జాతీయ వాణిజ్యపు దళారీలకు తమ పదార్థాలను అమ్మి సొమ్ము చేసుకొనడానకి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ‘‘బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్..’’ అన్న మహాకవి కరుణశ్రీ మాటలకు సాకార పునరావృత్తం స్వతంత్ర భారత ప్రగతి చిత్రం. ‘‘కొంటున్న’’ భారతీయులు అమెరికా, చైనా వంటి అనేక దేశాల ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తున్నారు.
భారతదేశం అణ్వస్త్ర శక్తిగా ఎదగడం ఏడు దశాబ్దుల ప్రగతి గతికి మరో ప్రతీక..దేశ విభజన జరిగిన కారణంగా మతోన్మాదపు జిహాదీ భూమికపై ఏర్పడి ఉన్న పాకిస్తాన్ మనదేశ భద్రతా కుడ్యానికి కన్నాలు పెట్టడానికి యత్నిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో మూడవవంతు భూభాగం పాకిస్తాన్ దురాక్రమణలో సాగుతుండడం ప్రధానమైన కన్నం..ఇప్పటికే అనేక మన భూభాగాలను దురాక్రమించి తిష్ఠవేసిన చైనాకు దురాక్రమణ దుర్వాంఛ తీరలేదు. మరోసారి పెద్ద ఎత్తున మనపై దురాక్రమించడం చైనా లక్ష్యమన్నది స్పష్టమైపోయిన వాస్తవం. పాకిస్తాన్, చైనాల ఉమ్మడి దాడిని ఎదుర్కోగల అణ్వస్త్ర శక్తిగా మనదేశం ఎదగడం ఏడు దశాబ్దుల మరో విజయం. భద్రత ప్రగతికి ప్రాతిపదిక..సాంస్కృతిక సుగతికి దారి చూపగల దీపకళిక. మన అంతర్గత భద్రతను సైతం ఛిద్రం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ ఉగ్రవాదులను, చైనా ప్రభు త్వం మావోయిస్టు బీభత్సకారులను నిరంతరం ఉసిగొల్పుతుండడం నడుస్తున్న చరిత్ర..ఇలా బాహ్య ప్రమాదాలు, అంతర్గత కల్లోలాలు మాటువేసి ఉండడం ఎదుగుతున్న భారత్‌ను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగం...ఈ కుట్ర ఫలించబోదన్న వాస్తవాన్ని ధ్రువపరచడానికే మనదేశం అణుశక్తిగా ఎదిగింది. ఈ ఎదుగుదలను చూసి భయపడవలసిన పని విదేశాలకు లేదు. ఎందుకంటె ఇతర దేశాలపై దురాక్రమణ జరపడం, కొల్లగొట్టడం, ధ్వంసం చేయడం అనాదిగా హైందవ జాతి స్వభావం కాదు. ఈ సనాతన స్వభావం కారణంగానే మనదేశం విశ్వవిజేత కావాలన్న దురహంకార ప్రవృత్తికి లోనుకాలేదు. విశ్వవిజేత కావాలన్న దుర్వాంఛ గ్రీకులది, అరబ్బులది, చైనాది, అమెరికాది, ఐరోపాది..ఇందుకు భిన్నంగా అనాదిగా ప్రపంచ హితాన్ని కోరిన జాతి హైందవజాతి...అన్నం పెట్టిన జాతి, ఆశ్రయమిచ్చిన జాతి. హత్యలు చేయని జాతి. ఈ జాతీయ సంస్కారం అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేయడం సహస్రాబ్దుల చరిత్ర..అందుకే భారత్ సహజంగానే సంస్కార పథంలో దారి చూపింది, విశ్వగురువైంది.
ఇదీ మన స్వాతంత్య్ర సంస్కారం, పారతంత్రంలో లభించే పరమాన్నం కంటె స్వేచ్ఛా జీవనులై గంజితాగడం మేలన్న సంస్కారాన్ని ప్రపంచానికి ప్రసాదించిన పంచతంత్రం పుట్టిన గడ్డ ఇది. ఈ సంస్కారం గ్రహణ విముక్తమైంది. ప్రపంచాన్ని మళ్లీ ప్రభావితం చేస్తోంది. మన ప్రభావం ఆధిపత్యం కాదు. సమగ్రజీవన యోగం..యోగవిద్య వికసించిన సంస్కార భూమి భారత ధరిత్రి...అంతర్జాతీయ యోగ దినోత్సవం మన విశ్వహిత ప్రభావ విస్తృతికి మరో ప్రతీక...సనాతన భారత జాతీయ జీవన పథంలో మరో పతాక. స్వాతంత్య్రం మనకు మాధ్యమం...నిరంతర సంస్కార ప్రస్థానం మన శాశ్వత లక్ష్యం..ఈ సంస్కారం విశ్వహితం.