మెయన్ ఫీచర్

భారత్-అమెరికా సంబంధాల్లో నూతన శకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతర దేశాలతో మొండివైఖరితో వ్యవహరిస్తున్న దుందుడుకు చైనాను నియంత్రించడానికి భారత్‌ను సాధనంగా అమెరికా గుర్తించింది. దాదాపు దశాబ్దకాలంగా కొనసాగిన చర్చోపచర్చల అనంతంరం ఎట్టకేలకు ఇటీవల లాజిస్టిక్స్ ఎక్స్‌ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (లెమోవా)పై వాషింగ్టన్ డిసిలో ఇరుదేశాలు సంతకాలు చేశాయి. రెండు దేశాలు పరస్పరం తమ సైనిక, వైమానిక, నౌకా స్థావరాలను వినియోగించుకోవడాని ఈ ఒప్పం దం వీలు కల్పిస్తున్నది. అయితే ఇంధనాన్ని నింపుకోవడానికి, సైనిక దళాలను భర్తీ చేయడానికి కూడా ఈ ఒప్పందం వల్ల వీలవుతుంది.
మరి ఈ ఒప్పందం భారత్-అమెరికాల మధ్య సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేపిందా? ఈ దశలో దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. ముఖ్యంగా రెండు దేశాలు తమ సంబంధాల్లో నూతన శకాన్ని ప్రారంభించాలంటే ప్రచ్ఛన్నయుద్ధం నాటి నీలినీడలు ఇంకా వెన్నాడుతున్నాయన్నది సత్యం. ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి అనుభవాలు, తమ వైఖరులనే ఈ నీలినీడలనుంచి పూర్తి వెలుగులోకి రావడానికి ఇరుదేశాలకు మరికొంత కాలం పట్టవచ్చు. ఎందుకంటే ప్రచ్ఛన్నయుద్ధకాలంలో నాటి సోవియట్ యూనియన్‌తో భారత్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల అంశం, అమెరికా మదిలో ఇంకా చెరిగిలేదనేది సత్యం. అక్కడి చాలామంది రాజకీయ నేతల్లో భారత్ అంటే నాటి ప్రచ్ఛన్నయుద్ధకాలమే గుర్తుకు రావ చ్చు. ఇదే సమయంలో భారత్‌లో కూడా చాలామంది, నాటి ద్విధ్రువ ప్రపంచం కొనసాగిన కాలంలో అమెరికా, మన బద్ధ శత్రువైన పాకిస్తాన్‌కు ఇచ్చిన మద్దతు విషయాన్ని మరచిపోలేకున్నమాట కూడా వాస్తవమే. నాటికాలంలో అడుగడుగునా మనల్ని వ్యతిరేకించిన అమెరికా ఇప్పుడు సన్నిహితంగా వస్తున్నదంటే తన స్వప్రయోజనాలకోసం, మనదేశాన్ని పావుగా వాడుకోవడానికి తప్ప మరోటి కాదనేది వారి వాదన కావచ్చు.
అందువల్ల రెండు దేశామధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడటానికి కొన్ని అడ్డంకులు ఇంకా మిగిలే ఉన్నాయన్న సంగతి మరువలేం. అయితే భవిష్యత్తు, గతంమాదిరిగా ఉండకపోవచ్చని చెప్పడానికి ఎన్నో కారణాలను ఉదహరించవచ్చు. మనదేశం నెరపుతున్న అంతర్జాతీయ సంబంధాలను అధ్యయనం చేస్తే రెండు చిన్న భావనలు మనకు ఉపయుక్తమైన రెం డు సంకేతాలనిస్తాయి. ‘‘నిర్మాణం’’, ‘‘ఏజెన్సీ’’ అనేవే ఆ రెండు భావనలు. వీటిల్లో అంతర్జాతీయ క్రమంలో అధికారం ఏవిధంగా పంపిణీ అయివున్నది, అది దేశాల వ్యవహారశైకిని చోదకశక్తిగా లేదా అడ్డంకిగా ఎట్లా కొనసాగుతున్నదనేది మొదటిది. ఇక రెండవది వివిధ దేశాల జాతీయ నాయకుల వ్యవహారశైలి, వారు ఎంచుకునే ఐచ్ఛికాలు. వీరిమధ్య కొనసాగే పరస్పర అన్యోన్య చర్యలే విధానం కొనసాగడం లేదా మార్పునకు గురికావడమనే అంశాలను నిర్ధారిస్తాయి. అంటే ఆయా రాజకీయ నేతల వ్యవహారశైలిని, ఉద్దేశాలను బట్టి అప్పటివరకు అనుసరిస్తున్న విధానాల్లో సమూల మార్పులు రానూవచ్చు లేదా యథాతథ స్థితి కొనసాగనూ వచ్చు.
ప్రస్తుతం ఆసియాలో రాజకీయ అస్థిరత నెలకొని వున్నదనేది భారత్ నిశ్చితాభిప్రాయం. ఆసియా ప్రాంతంలో చైనా తనకు బద్ధ విరోధిగా భారత్ భావిస్తోంది. ముఖ్యంగా తన విస్తరణవాదం, వ్యూహాత్మక వ్యవహారశైలిలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చైనా తన పలుకుబడిని పెంచుకుంటూ ముందుకెళుతోంది. ఇది తన భద్రతకు పెనుముప్పుగా భారత్ పరిగణిస్తోంది. అన్ని రంగాల్లో ఆసియాపై ఆధిపత్యం వహించాలనే దృక్పథంతో దూకుడుగా ముందుకు సాగుతున్న చైనా వైఖరి భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే ఈ ప్రాంతంలో నెలకొన్న రాజకీయ క్రమంపై పీపుల్స్ రిపబ్లిక్ చైనాకున్న అభిప్రాయం మరోలా ఉంది. తనకున్న లక్ష్యాలమేరకు తాను ముందుకుపోతున్నానన్న అభిప్రాయం చైనాకు ఉండవచ్చు. ఆసియాలోముఖ్యంగా ఉపఖండంలో చైనా తన కార్యాచరణ ప్రణాళిక మేరకు అనుసరిస్తున్న దృఢ వైఖరి, భారత్‌కు ఆగ్రహం తెప్పిస్తోంది.
ఆసియా ప్రాంతంలో నిర్మాణాత్మక అధికార పంపిణీలో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటుండటం, భారత్ భద్రతకు ప్రమాదకరంగా మారింది. ఇదేసమయంలో దుందుడుకు చైనాను నిరోధించాలంటే ఈ ప్రాంతంలో తగిన దేశం భారత్ మాత్రమేనన్న అంశాన్ని అమెరికా గుర్తించింది. ఈ పరిస్థితుల్లో అనుసరించడానికి భారత్ ముందు రెండు అంశాలు ఉన్నాయి. దేశీయంగా సైనిక శక్తిని మరింత పటిష్టం చేయడం, కొత్త రిక్రూట్‌మెంట్లు చేపట్టడం. అయితే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సైన్యాన్ని మరింత పటిష్టం చేసే ప్రక్రియ కొద్దికాలంగా కొనసాగుతున్నదనేది మాత్రం వాస్తవం. దేశీయంగా సైన్యాన్ని మరొక చోటికి తరలించడం వల్ల, ప్రస్తుతం భారత్‌కు అత్యవసరమైన జాతీయభద్రతావసరాలను ఎంతమాత్రం తీరబోవన్న సత్యాన్ని కూడా న్యూఢిల్లీలోని రాజకీయ వర్గాలు గ్రహిస్తున్నాయి.
రెండవది మరో అగ్రరాజ్యం సహకారం తీసుకోవడం. ప్రస్తుత భారత రాజకీయ సంస్కృతి దాన్ని సాధించగలిగినా, పూర్తిగా ఆ దేశ కూటమిలో చేరడం దుస్సాధ్యం. సరీగ్గా ఈ సమయంలోనే ‘‘ఏజెన్సీ’’ అనేది ముందుకు వస్తోంది. తమదేశ సామర్ధ్యాన్ని మరింత వేగంగా పెంచుకునేందుకోసం, నాయకులు, అగ్రరాజ్యంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి యత్నించవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయంగా అనుసరిస్తూ వస్తున్న విధానాలనుంచి ఒక్కసారి విడిపోయి, కొత్త పుంతలు తొక్కుతున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం (యుపిఎ) అధికారంలో ఉన్నప్పుడే అమెరికాతో మంచి సంబంధాలకు బీజాలు పడినప్పటికీ, అతి కొన్ని పరిమితుల్లోనే ఉండిపోయింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. కాంగ్రెస్‌లోని చాలామంది నాయకులు ఇప్పటికీ అమెరికా వ్యతిరేక భావజాలం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అందువల్ల వారు తమలో నరనరాన జీర్ణిచుకొనిపోయిన అమెరికా వ్యతిరేకతనుంచి బయటపడం కూడా కష్టసాధ్యమైన పనే! అమెరికా అనుసరించే దక్షిణాసియా విధానంలోని లోపాలను వారు ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ రావడానికి ప్రధాన కారణమిదే. ఈ విధానం వల్ల కలిగే నష్టాన్ని వారు ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తూ, అమెరికాతో నెరపే సంబంధాలకు ఒక పరిమితి ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. ఇటువంటి సైద్ధాంతికత నరేంద్రమోదీ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్లేవారికి ఎంతమాత్రం పొసగనిది. వర్తమాన పరిస్థితుల్లో అటువంటి వాదనలవల్ల భారత్‌కు ఏవిధమైన ప్రయోజనం లేదనేదే వారి నిశ్చితాభిప్రాయం. దేశభద్రత ప్రశ్నార్థకమైనప్పుడు, ఇంకా సిద్ధాంతాలను వల్లెవేస్తూ, వాస్తవిక కార్యాచరణను విస్మరించడం ఎంతమాత్రం సరికాదన్నది మోదీ అభిప్రాయం. అందువల్లనే మారుతున్న ప్రపంచ పరిస్థితులు, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయన ఇప్పటి వరకు దేశం అనుసరిస్తూ వచ్చిన విధానాల్లో సమూల మార్పులు తీసుకొస్తేకాని రోగానికి తగిన చికిత్స లభించదన్న ఉద్దేశంతో ముందడుగులు వేస్తున్నారు. ఇందులో భాగమే అమెరికా పట్ల సానుకూలత కలిగివుండే రీతిలో మన విధానాల రూపకల్పన చేయడం, అనుసరించడం.
నిజంగా అమెరికా వ్యతిరేకతను నిలువెల్లా నింపుకున్న వారి మాటలకు తలొగ్గినట్లయితే నరేంద్ర మోదీ 2015, జనవరి 26న గణతంత్ర వేడుకులకు ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఉండేవారు కాదు. ఇక్కడే మోదీ వ్యవహారశైలి సుస్పష్టమైంది. ఆయన ఏదిశగా ముందడుగు వేయబోతున్నారనేది కూడా సూక్ష్మబుద్ధి కలవారికి ఇట్టే అవగాహనకు వచ్చి వుంటుంది. అమెరికా వ్యతిరేకులను ఆయన పెద్దగా లెక్కలోకి తీసుకోరనేది కూడా తేలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్-అమెరికాల మధ్య కుదిరిన ఒప్పందం సాంకేతికంగా కనిపిస్తున్నప్పటికీ అది కేవలం సాంకేతికతకే పరిమితం కాదు. రెండు దేశాల మధ్య సరికొత్త అధ్యాయానికి తెరతీయడానికి ఉపకరించే సాధనం కూడా. ఇకముందు ఇరుదేశాలు మరింత సన్నిహితంగా ముందుకెళ్లడానికి దోహదం చేసే ముఖ్యమైన అడుగు కూడా!
తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా ఆయుధాలకు అతిపెద్ద దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. ముఖ్యంగా యుద్ధవిమానవాహక నౌకను ఉమ్మడిగా నిర్మించే అంశంపై రెండు దేశాల మధ్య చర్చలు మరింత వేగంగా జరుగవచ్చు. అంతేకాదు పోరాట విమానాలు ఉమ్మడి ఉత్పత్తి విషయంలో కూడా మరింత పురోగతి సాధించవచ్చు. అయితే ఇప్పటివరకు జరిగిన చర్చలు ఫలప్రదమవుతాయని చెప్పడం తొందరపాటే అవుతుంది. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే భారత్‌కు, ప్రస్తుతం తన భద్రత రీత్యా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు అత్యవసరం. అమెరికాతో సాన్నిహిత్యం ఆ అవసరాన్ని తీర్చగలదు. ఈ నేపథ్యంలోనే రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో సరికొత్త దశ ప్రారంభమైందనేది మాత్రం సుస్పష్టం. ప్రస్తుత వాతావరణం కూడా రెండు దేశాలను మరింత సన్నిహితం చేసేందుకు దోహదం చేయడానికే అనుకూలంగా ఉంటోంది. అయితే అటు వాషింగ్టన్ డిసిలోను, ఇటు న్యూఢిల్లీలోను ఉన్న ముఖ్యమైన ‘‘ఏజెంట్లు’’గా పరిగణింపబడుతున్నవారు, రెండు దేశాల సంబంధాలను మరింత సన్నిహితం చేయడానికి అవసరమైన సంక్లిష్టమైన అంశాలపట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ, పరస్పర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొనే ముందడుగులు వేస్తున్నారా అనేది అత్యంత కీలకమైన ప్రశ్న.

- సుమిత్ గంగూలీ