మెయన్ ఫీచర్

సామాజిక సంస్కరణ సంస్థలేవీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సామాజిక సంస్కరణలకోసం కృషి చేసే సంస్థ లు ఏవైనా ఉన్నాయా అనే సందేహం కలుగుతున్నది. సంస్కరణలు అనడంలో ఉద్దేశం పేదలను ఆదుకోవడం, పిల్లలకు ఆశ్రమాలు నెలకొల్పి చదువులు చెప్పించడం, వృద్ధులకు సహాయపడడం, వంటివి కాదు. అవి దాతృత్వాలు, ధర్మకార్యాలవుతాయి. అవి అవసరమే. తగిన న్ని ఉన్నాయి కూడా. ఆ సంస్థలకు వివిధ దాతలనుంచి వ్యక్తిగతంగానో, ట్రస్ట్రుల నుంచో, ప్ర భుత్వాలనుంచో, విదేశాలనుంచో అందుతుండవచ్చు. వారి కార్యక్రమాలు సవ్యంగానో, అపసవ్యంగానో జరుగుతుండవచ్చు. కాని చర్చ వాటిగురించి కాదు. సామాజిక సంస్కరణలు అనగానే మనకు జాతీయస్థాయిలో రాజారామమోహనరాయ్, ప్రాంతీయంగా కందుకూరి వీరేశలింగం పేర్లు గుర్తుకువస్తాయి. వారి సంస్కరణల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే అటువంటివారు సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పాటుపడ్డారు. అందుకు కట్టుబడి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తట్టుకున్నారు. వారి కృషి ఫలితాలు క్రమంగా సమాజానికి అందుబాటులోకి వచ్చాయి. తమ సమకాలీన సమాజంతో పోల్చి చూసినట్లయితే అనంతర కాలపు సమా జం ఎంతో మెరుగుగా మారింది.
అప్పటి సంస్కర్తలు పోరాడిన సామాజిక దురాచారాలు ఇప్పుడు చాలావరకు లేవు. కాని దురాచారాలు అనండి, దుర్లక్షణాలు అనండి, అవాంఛనీయమైన వ్యవహరణలు అనండి అనేకం ఇంకా కొనసాగుతున్నాయి. లేదా ఇప్ప టి ఆధునిక కాలంలో కొత్తగా పుట్టుకువచ్చాయి. ఇవి కలిగిస్తున్న హాని, గతకాలపు దురాచారాల ప్రభావంతో పోలింది కాదు. కాని మరొక రూ పంలో ఉంటున్నది. అంతిమార్థంలో హాని అన్నది హానే అవుతుంది. జరుగుతున్న హాని వేర్వేరు విధాలుగా అందరూ గమనించి మాట్లాడుతున్నదే. అధిక సంఖ్యాకులకు అనుభవంలోకి వస్తున్నదే. కాని దానిని సంస్కరించేందుకు పూనుకొంటున్న సంస్థలేవీ కనిపించడంలేదు. ఉద్యమాలన్నవి అంతకన్నా లేవు. అనగా ఇటువంటి అవలక్షణాలు యథేచ్ఛగా కొనసాగేందుకు అవకాశం ఉండటమన్నమాట. అటువంటి స్థితిలో మునుముందు పరిస్థితులు ఇంకా ఏవిధంగా ఉండగలవోనని ఆందోళన కలుగుతున్నది.
ముందు ఒక ఉదాహరణను చూద్దాం. సమాజంలో సంపదలు పెరగడం సంతోషించదగ్గ విషయమే. కాని, సంపదల పెరుగుదలకు, సంస్కారవంతమైన ఆలోచనలూ వ్యవహరణకు మధ్య సమతులనం ఏర్పడకపోయినట్లయితే కేవలం సంపదల పెరుగుదల అనేక అవలక్షణాలకు దారితీయగలదు. ఆస్థితి కొంతకాలంగా కనిపిస్తున్నది కూడా. ఇటువంటి అవాంఛనీయ ప్రభావాలు సాధారణంగా యువతరంపైన, ముఖ్యంగా మగపిల్లలపైన, అదేవిధంగా పట్టణాలలో, సంపన్న వర్గాలలో ఉంటాయని భావిస్తాము. కాని వాస్తవాలు ఆవిధంగా లేవు. యువతరంతోపాటు వయసు మీరినవారిపైన, మగపిల్లలతోపాటు, ఆడపిల్లలపైన, పట్టణాలే గాక గ్రామాలలోనూ, సంపన్న వర్గాలకు పరిమితం గాక, మధ్యతరగతిలోనూ కనిపిస్తున్నాయి. శాతం లెక్కలలో కొంత తేడాలు ఉండవచ్చు. కాని ధోరణిలో తేడాలేదు.
ధనం, ధన సంస్కృతి అన్నది సర్వవ్యాపితమై చెప్పలేనంత చెడుకు దారితీయడం మొదలైపోయింది. ధనం, ధన సంస్కృతి ఇప్పుడు కొత్తగా సమాజంలోకి వచ్చాయనడంలేదు. వ్యవస్థలో ధనసంపదలన్నవి పుట్టినప్పటినుంచే ధన సంస్కృతి కూడా ఉంది. ఆ సం స్కృతి వికృత ప్రభావాలను సమాజం అనుభవించింది. కాని గతానికి ఇప్పటికి తేడా ఏమం టే క్రమంగా ధనసంపదలు, వాటితోపాటు ధన సంస్కృతి విస్తరిస్తున్నాయి. ఒక చిన్న వర్గానికి పరిమితమై లేవు. ప్రకృతి వనరులు శాస్త్ర- సాంకేతికాభివృద్ధి వల్ల ఎక్కువగా వినియోగంలోకి వచ్చి ఆ సంపదలు సామాజికులకు విస్తరించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ పరిణామం క్రమంగా ప్రపంచమంతటా కనిపిస్తున్నది. పేదరికం తగ్గుదల, మధ్యతరగతి పెరుగుదల, పట్టణీకరణ ఇందుకు తగిన దృష్టాంతాలు. కాని, పైన చెప్పుకున్నట్లు, ఈవిధంగా సంపదల పెరుగుదలకు, సంస్కారవంతమైన ఆలోచనలూ వ్యవహరణకు మధ్య సమతులనం ఉండటం లేదు. అందువల్ల సమస్య తలెత్తుతున్నది.
ఆ సమస్య ఏవిధంగా ప్రతిఫలిస్తున్నది? ఉదాహరణకు ఇటీవలి ఘటనలు కొన్నింటిని గమనించండి. ఆస్తులకోసం ఆడపిల్లలు తండ్రి నో, తల్లినో హత్య చేస్తున్నారు. ఇది గ్రామాలలోనూ కన్పిస్తున్నది. దిగువ మధ్యతరగతి లేదా పేద కుటుంబాలలోనూ చోటు చేసుకుంటున్నది. హత్యకు గురవుతున్నది వృద్ధులు. ఆడపిల్లలు తమ భర్తల చేతనో, మరొకరితోనో ఆపని చేయించడం గాక స్వయంగా కూడా అటువంటి దారుణానికి పాల్పడుతున్నారు. ఇవి నినేందుకే వళ్లు జలదరించే, ఊహించేందుకు కూడా కష్టమయే ఘటనలు. ధన సంస్కృతి అపసవ్యతలు అనేకానేకం ఉన్నాయి. అందుకు బహుశా ఇటువంటివి అతి తీవ్రమైన, అతి నికృష్టమైన దృష్టాంతాలవుతాయి. ఎందుకంటే ధనిక కుంటుంబాలు, పట్టణాలు, మగపిల్లల వంటి సందర్భాలలో ఇది ఆశ్చర్యాన్ని కలిగించేది కాదు. అవి ఎప్పటినుంచో ఉన్నవే. కాని పేద కుటుంబాలు, ఆడపిల్లలు, గ్రామాలకు ఇది విస్తరించడమన్నది దిగ్భ్రాంతిని కలిగిస్తున్న మార్పు. ఈ మార్పుకు కారణం పేదరికం కాదు. ధన సంస్కృతి, వినియోగ సంస్కృతి, పట్టణీకరణల వంటివి మాత్రమే కారణం.
పైన ఒక ఉదాహరణను పేర్కొన్నామంటే, ఈ సంస్కృతి సామాజికులను ఎంత ఊహించలేని స్థితికి పతనం చేసిందో చూపడానికే తప్ప అందుకు పరిమితమై మాట్లాడుకునేందుకు కాదు. సామాజిక సంస్కరణలనే ఆలోచన ఈ వర్గాలకో, ఇటువంటి ఘటనలకో పరిమితమని చెప్పేందుకూ కాదు. సంస్కరణ అనేది జరగవలసింది ఆ స్థాయిలో అంతకన్నా కాదు. మరొక ఉదాహరణను చూద్దాం. అది పట్టణాలలో రౌడీ డ్రైవింగ్ చేసే యువకుల గురించి. బైకులపై వారు డ్రయివింగ్ చేసే తీరు ప్రతిఫలించేది కేవ లం యవ్వన ధోరణిని కాదు. ఆ పిల్లలు సంప న్న కుంటుంబాలవారైతే ఆ సంపదల అహంకారం, ఏమి చేసినా నడుస్తుందనుకునే నిర్ల క్ష్యం, తాము ధనికులు అయినందున కేసులుండవనే ధీమా వంటివన్నీ అందులో ప్రతిఫలిస్తాయి. ఒకవేళ సంపన్నులు కాక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారైతే తమ తల్లిదండ్రులకు స్తోమత లేకపోయినా పీడించి బైకులు కొంటారు. లేదా దొంగతనాలు చేస్తారు. పేదవారైతే తాముకూడా కొనగల అవకాశాలకోసం వెతుకుతూ ఈలోగా తమ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మిత్రులతో కలిసి ఆ సంస్కృతిలోకి ప్రవేశిస్తారు. ఆ విధంగా వీరందరిని ఒకేవిధమైన సంస్కృతి ఆవహిస్తుంది. అది బాధ్యతారహితమైన, సమాజానికి హానికరమైన సంస్కృతి. అందుకు మూలం ధనసంస్కృతి. దానితో రోడ్లపై రౌడీ డ్రైవింగ్ చేస్తారు. రద్దీ ఉన్నా లెక్కచేయరు. వృద్ధులు, స్ర్తిలు, పిల్ల లు వారి కంటికి కనిపించరు. ట్రాఫిక్ నియమ నిబంధనలతో నిమిత్తంలేదు. అందరూ ఇంతేనని కాదు. అదే సమయంలో ఆతీరున వ్యవహరించేవారి సంఖ్య ఉపేక్షించదగినట్లు కూడా లేదు. గ్రామాలకు చెందిన పేద కుటుంబాలు ఆడపిల్లలు ఆస్తులకోసం ముదుసలి తల్లులను హత్యచేయడం గాని, యువకులు ఇంత బాధ్యతారహితంగా డ్రయివింగ్ చేయడంగాని ఒకప్పుడు లేనివి. కేవలం సంపదల విస్తరణ, సంస్కారాలు లుప్తం కావడం అనే రెండు జమిలిగా కనిపిస్తున్నందువల్లనే ఈ స్థితి ఏర్పడుతున్నది.
ఈ స్థితి కేంద్రీకృతమైనట్లు కనిపిస్తున్న ఒక సామాజిక వర్గం మధ్యతరగతి చిన్న పట్టణాలనుంచి మొదలుకొని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి నగరాల వరకు అంతటా మధ్య తరగతిలో ఒకవైపు సంపదల విస్తరణ, ధనసంస్కృతి, మరొకవైపు సంస్కార రాహిత్యం, స్వార్థం, అవినీతి, బాధ్యతలను గుర్తించి వ్యవహరించకపోవడం, వినియోగ సంస్కృతి, దురాశలు, అడుగడుగునా కపట ప్రవర్తన, నైతికతలు లేకపోవడం వంటి అవలక్షణ సంస్కృతి వేగంగా, బలంగా విస్తరిస్తున్నది. ఈ వివిధ లక్షణాలన్నీ ఇంత విస్తారంగా తమకన్నా పైవారిలో, కిందివారిలోనూ కనిపించవు. మధ్యతరగతి పెరుగుదల, పట్టణీకరణ ఆర్థికాభివృద్ధికి గుర్తులన్నది నిజం. ఆ పరిమితార్థంలో అవి ఆహ్వానించదగ్గవే. కాని పైన అనుకున్నట్టు ఈ మార్పులు సంస్కార వికాసంతో కలిసి సాగనందువల్ల పైన పేర్కొన్న అవలక్షణాలన్నీ ఆ తీరుగ, దాని అభివృద్ధికి విడదీయరాని భాగాలుగా మారుతున్నాయి. ఈ స్థితి భయం గొలుపుతున్నది.
ధన సంస్కృతితో పాటు, సాంస్కృతికాంశాలు అనబడేవి, చివరకు చదువులు కూడా ఇదే స్థితిని పెంపొందించేవిగా ఉంటున్నాయి. కొత్తగా ఆవిష్కారం అవుతున్నవి. మనవద్దకు నిరంతరం దిగుమతి అవుతున్నవి, వాటిని అనుకరిస్తూ సృష్టించుకుంటున్నవి, అన్నీ కూడా సంస్కారాలను, బాధ్యతాయుత వ్యవహారాలను దెబ్బతీసే విధంగానే ఉంటున్నాయి. పైన పేర్కొనవి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఇటువంటివి వివిధ జీవిత రంగాలలో పార్శ్వాలలో కోకొల్లలుగా కనిపిస్తాయి. చివరకు స్వచ్ఛ్భారత్ విషయమై ప్రజలు, విద్యావంతులమని, నాగరీకులమని తమకు తాము చెప్పుకునే మధ్యతరగతివారు ప్రవర్తిస్తున్న తీరును చూసినప్పుడు ఇటువంటి వారందరి ఆలోచనలను, పద్ధతులను సంస్కరించడం తప్పనిసరి అని తోస్తుంది.
సాధారణంగా సామాజికులను సంస్కారవంతులను చేసి, చెడుధోరణులను సంస్కరించేవి ఏవి? కుటుంబ వ్యవస్థ, సంప్రదాయాలు, సమాజ వ్యవస్థ, విద్య, స్వీయ వికాసం వంటివి. కాని దురదృష్టవశాత్తు, వీటిలో ఏ ఒక్కటి కూడా బలంగాలేని దశ వచ్చింది. పైగా అవన్నీ, ఈ కోణం నుండి క్రమంగా బలహీన పడుతున్నాయి. థార్మిక సంస్థలు, మతపరమైనవి, వాటితో ముడిపడివున్న ప్రముఖుల ప్రస్తావన ఇందులో చేయవచ్చునో లేదో స్పష్టంగా చెప్పలేము కాని, వారు ఈ కృషి చేయరాదని కూడా అనలేము. వారు దైవ సంబంధమైన విషయాలకు అతిరిక్తంగా సామాజిక, సంస్కరణలను చేపడితే ప్రయోజనం ఉండవచ్చు. చరిత్రలో మతం-్ధర్మం పరిధిలోగల బోధకులు సామాజిక సంస్కరణలు చేపట్టిన సందర్భాలు అనేకం. అందువల్ల అది సాధ్యమే. కాని ఆపని చేస్తున్నవారెవరైనా ఉన్నారేమో తెలియదు. ప్రముఖంగా మాత్రం కన్పించడంలేదు.
సమాజంలోని వివిధ అవాంఛనీయ ధోరణుల పట్ల, అవి క్రమంగా పెచ్చు పెరుగుతుండడం పట్ల విచారిస్తున్నావారు ప్రతిచోట కనిపిస్తున్నారు. ఈ దుస్థితిని అరికట్టేందుకు ఏమి చేయాలో వారికి తోస్తున్నట్టు లేదు. ఈ ప్రయత్నాలు రెండు స్థాయిలలో జరగాలి. ఒకటి దీనంతటికి మూలకారకమైన ధన సంస్కృతి గురించి సమాజానికి వివరిస్తూ ప్రజలపై ఏవిధంగా ఉండి ఎటువంటి హానికర ధోరణులకు, ప్రవర్తనలకు కారణమవుతున్నదో పరిశీలించి చెప్పడం. దానిని నిశితంగా విమర్శించడం. వీలైనన్ని విధాలుగా విరుగుడు కనుగొనడం. సామాజికులను ఆ దిశగా ఎక్కడికక్కడ కదిలించడం. అందుకు సంస్థలు ఏర్పడడం. వర్తమానంలో సామాజిక సంస్కరణలన్నవి ఇటువంటివే.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)